రోట్లో దంచిన పచ్చి కొబ్బరి కారం..
ఇది పలస్త్రం పోయే జీవులకు.. పలస్త్రం అంటే ఇండ్లు వదలి గొర్లను, మ్యాకలను మేపుకుంటూ ఊర్లు దాటుకుంటూ నెలల, నెలల పర్యంతం పోయే వాళ్లకు గొప్ప ఆదరువు.
రాయలసీమ లో ఏ ద్యావలం కాడ సూడు పోండి..
ద్యావలం బయట ఒక రోలు, రోకలి ఉంటుంది..
రోలును,రోకలిని దానం సెయ్యడం అనేది ఒక పుణ్య కార్యక్రమం గా భావించి అట్లా ద్యావలాల దగ్గర రోలును, రోకలిని ఉంచుతారు..
అట్లా కొంప,గోడు లేని జీవులు తిరిగి తిరిగి డస్సిపోయి ద్యావలాల కాడికి వొచ్చి ఇన్ని నీళ్లు తాగి అట్లా సెట్ల నీడన పండుకుందాం అనే జీవులకు..
ద్యాలం లో వుండే దేవునికి మొక్కి టెంకాయ కొట్టి పోయే జనాలు ఒక కొబ్బరి గిన్నెను అడనే వదలి పెట్టిపోతారు.
రోన్ని ఎర్రగడ్డలు, రోన్త ఉప్పు, రోన్ని ఒట్టి మిరపకాయలు గూడా దాండ్ల దాపులో పెట్టే వాళ్ళు వుంటారు..
ఇంగా కొంతమంది కణిక్యరం తో రోన్ని బియ్యాన్నో,
ఇన్ని నూకలను గూడా చిన్న యూరియా సంచుల్లో పోసి ద్యాలం లో ఒక మూలన పెట్టేవాళ్ళు గూడా ల్యాకపోలేదు..
ఎక్కువగా పుట్టు ఎంటికలు. తీపిచ్చుకునే వాళ్ళు.. సుట్టాలతో వొచ్చి అడనే బువ్వలు సేసుకుని
తిని మిగిలిన వాటిని అడనే ఇడిసి పెట్టి పోతారు
రాయలసీమ వాళ్లకు ఆకలి గొన్నోళ్ల మీద అలవిగాని ప్రేమ
కరువు కొంపల్లో
వానలు రాక
జొన్నలు గూడా పండక,
సావల్యాక.. ఎండిపోయిన కండ్లల్లో నీళ్లు గూడా ల్యాక
జొన్నలు గూడా దొరొక్క తుంగభద్ర డ్యాం కాడికి పనులు కు పోయి ఇన్ని రూకలు సంపాయిచ్చుకొని వొచ్చి బతుకులు ఎళ్లదీసిన వాళ్ళు గదా.
ఇంత గంజి పోసి జీవాలను నిలబెట్టిన వాళ్ళను
పాటలతో, కతలతో సెరిత్ర లో భాగం సేసినారు.
ఆయప్ప అది నారాయణడు బ్బా…
టయానికి ఇంత గంజి పొసే వాడు అని పొగుడు కుంటామతికి తెచ్చుకుని పిల్లొళ్లకు కతలు కతలు గా సెప్పుకుంటారు.
ఇప్పుడంటే కాశీ నాయన అన్నదాన సత్రాలు కట్టి..
వడ్డీ యాపారాలు సేసి
జనాల నెత్తురు ను తాగినోళ్లు
ఎర్ర సెంధనం యాపారం సేసి కోట్లు కోట్లు సంపాయిచ్చి నోళ్లు
ఏర్ల ను కొల్లగొట్టి ఇసుక తో యాపారం సేసేటోళ్లు
ఇట్లా జనాల మీద పడి సంపాయిచ్చి నోళ్లు
పాప భీతి తోనో..
అన్నదానం సేసిన మహానుభావునిగా సెరిత్ర లో నిలబడి పోవాలన్య తాపత్రయం ఏందో గానీ
అన్నదానాలు సేచ్చా వుండారు..
కొబ్బరి కారం సెయ్యడం ఇప్పుడోళ్లకు రాదు.
ఒకప్పుడు జనాలకు ఆ కూరే ప్రాణాధారం గాబట్టి..
వాళ్లకు సెయ్యడం సేత కావచ్చు
ఏందిబ్బా.. ఇసిత్రoగా సెబుతా వుండావే అనుకున్యా రా.. ఒకసారి చేసి చూడండి
పచ్చి కొబ్బరి పూర్తిగా నలిగిపోకుండా
వొట్టి మిరపకాయలను పూర్తిగా నలిగి
సింత పండు పులుపు
అట్లా రోట్లో దంచడం తగిలే తగలకుండా ఉండి
ఎర్ర గడ్డ పూర్తిగా నలిగి పోకుండా..
రోన్త సింత పండును నీళ్ళల్లో నానబెట్టుకుని,
పెనం మీదనో, నిప్పుల మిందనో దోరగా వేయించిన వొట్టి మిరప కాయలు
పిడికెడు కొబ్యర…పిడికెడు కాకుంటే దోసెడు
రోన్త ఉప్పు
వొట్టి మిరపకాయలను, ఉప్పును రోట్లో దంచి
కొబ్బరి ముక్కలను ఒక్కోటిగా రోట్లో వేస్తూ.. రోకలి తో దంచుతూ..
నీళ్ళల్లో నానబెట్టిన చింత పండును మాత్రమే… ఆ నానిన నీళ్లు అవసరం లేదు
నాలుగు లేదా ఆరు ముక్కలుగా కోసిన ఎర్ర గడ్డలను
రోట్లో దంచుతూ ఉంన్యప్పుడు …
ఎర్రగడ్డ ముక్కల్లోని ఘాటు
వొట్టి మిరపకాయలల్లోని కారం
చింతపండు లోని పులుపు
ఒకానొక మాధుర్యం..వాసన
ఆ రంగే మీకు ఆకలి తెప్పిస్తుందా..
ఎందుకో తెలియని ఒకానొక స్థితి..
పేరిన ఎనుము నెయ్యి… ఉంటే..
ఉంటే.. గింటే..మీరెంత బువ్వ తింటారో తెలియదు కానీ… మూడు రెట్ల బువ్వ జాచ్చి తింటారని..
వదల లేక.. వదల లేక బువ్వ పళ్లెం కాడ నుంచి లేసి పోతారని.. హామీ ఇవ్వగలను
నిజంగా మీరు అట్లా చెయ్యగలిగితే ఆ కొబ్బరి కారేన్ని. దంచేటప్పుడే మీకు ఆకలి బేయ్యడం మొదలు అవుతుంది
కాలే కాలే స్టోర్ బియ్యపు బువ్వ లో మీరు చేసిన ఆ కూరను కలుపు కుని తిన్యప్పుడు గదా… మీ జీవితం ధన్యం అవుతుంది..
chilekampalli Kondareddy