టైటిల్ చూసి ఇదేదో కోవిడ్ 19 లాక్ డౌన్ స్టోరీ అనుకుంటే తప్పులో కాలేసినట్టే
నిజ జీవితంలో లాక్ డౌన్ కాలంలో తనకు తెలియకుండా జరిగిన తప్పుకు ఓ యువతి పడిన సంఘర్షణే లాక్ డౌన్ కథ
ఆమె సంఘర్షణకు , లాక్ డౌన్ కు సంబంధం లేకపోయినా సన్నివేశాలను కథలో భాగంగా నడిపించారు
నిజానికి తమిళనాడులో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా కథను రాసుకున్నట్టు దర్శకుడు చెప్పారు
అయితే సాధారణంగా చాలామంది దర్శకులు యధార్థ సంఘటనకు కొంత సినిమాటిక్ లిబర్టీ జోడించి మూవీ తీస్తారు
కానీ ఈ దర్శకుడు జీవా మాత్రం అటువంటి కల్పనల జోలికి పోకుండా జరిగిన సంఘటనను సాధ్యమైనంతవరకు ఉన్నది ఉన్నట్టుగా చూపించటానికి ప్రయత్నం చేశారు
అందుకే ఇది సినిమాలా ఉండదు
ఓ అమ్మాయి జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన డాక్యుమెంటరీలా ఉంటుంది
కమర్షియల్ సినిమాల మాదిరి రివెంజ్ తీసుకునే హీరోయిన్ ఛాయలు ఇందులో కనిపించవు
ఆమె పడిన సంఘర్షణే చూపించాడు
పరిష్కారాలు ప్రేక్షకులకు వదిలేశాడు
ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందంటే అందుకు అనుపమ పరమేశ్వరన్ నటనే ప్రధాన కారణం
కథేంటి?
అనిత ( అనుపమ పరమేశ్వరన్) ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి
చెల్లి, బామ్మ తల్లితండ్రులతో కలిసి ఉంటుంది
తండ్రి (చార్లీ) వెల్డింగ్ షాపులో పని చేస్తుంటాడు
అనిత చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం వెతుకుతూ ఉంటుంది
ఎక్కడా జాబ్ దొరక్కపోవడంతో ఒక స్నేహితురాలిని సాయం అడుగుతుంది
ఆమె తనకు తెలిసిన వ్యక్తి ద్వారా జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఒక పార్టీకి రమ్మని పిలుస్తుంది
ఆ పార్టీలో అనిత తన స్నేహితుల బలవంతం మీద వైన్ తాగి మత్తులో పడిపోవడంతో ఆ రాత్రి ఆమె అక్కడే రూమ్ లో ఉండాల్సి వస్తుంది
ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ వేడుకలో డాన్స్ చేస్తూ స్పృహ తప్పి పడిపోయిన అనితను ఆమె స్నేహితురాలు హస్పిటల్ కు తీసుకెళ్తే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది
దానితో తనకు తెలియకుండా జరిగిన తప్పుకు అనితలో సంఘర్షణ బయలుదేరుతుంది
సరిగ్గా ఈ సమయంలోనే దేశంలో కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ విధిస్తారు
మరి అనిత ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటుంది ?
పరువుకోసం పాకులాడే కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియకుండా ఆమె ఎటువంటి సంఘర్షణ పడింది?
తన సమస్య పరిష్కారం కోసం సమాజంతో అనిత పడిన కష్టాలు ఏంటి? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది
ఎలా ఉంది?
లాక్ డౌన్ మూవీ కథ తమిళనాడులో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా రాసుకున్నదే
అయినప్పటికీ దర్శకుడు రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా ఆ యువతి పడిన సంఘర్షణను యధాతధంగా కళ్ళముందుంచాడు
దానికి తోడు అనుపమా పరమేశ్వరన్ తన పాత్రలో జీవించి సినిమాను ఒక మెట్టు పైకి తీసుకెళ్లింది
నిజానికి ఇటువంటి పాత్ర చేయడానికి అనుపమ గట్టి సాహసమే చేసిందని చెప్పాలి
రొటీన్ గ్లామర్ రోల్ లో కాకుండా యధార్థంగా జరిగిన పాత్రలో ఒదిగిపోవాలంటే మనసు పెట్టి పనిచేయాలి
ఈ సినిమా కోసం అనుపమ పడిన కష్టం కనిపిస్తుంది
ఒకపక్క తనకు తెలియకుండా జరిగిన తప్పు నుంచి బయటపడటానికి స్నేహితురాలి సాయంతో ప్రయత్నిస్తూనే , ఇంకోపక్క తనవల్ల కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని సంఘర్షణ పడే యువతిగా పరమేశ్వరన్ నటన కళ్లకు కట్టింది
అబార్షన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అడుగడుగునా ఆమె పడే అవమానాలు, ఎదురయ్యే మోసాలను చూస్తే ఎంతటివారికైనా అయ్యో అనిపించకమానదు
పాపం అమాయకురాలు తెలియక జరిగిన తప్పుకు ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో అని ఎమోషన్ అవుతాం
ఒక ఆడపిల్ల తన సమస్యని పరిష్కరించుకోవడం కోసం సమాజంలోకి వస్తే, ఆమె సమస్యని లోకువగా తీసుకుని అడుగడుగునా ఆకలిగా చూసే మనుషుల మనస్తత్వాలను కూడా దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు
చిన్నపనికి ముప్పై వేలు అడిగిన డాక్టర్, పదివేలకే వైద్యం చేయిస్తానని డబ్బులు తీసుకుని ఉడాయించిన కంపౌండర్ , 50 వేల ఫీజుతో పాటు తనతో పడుకోవాలని కండిషన్ పెట్టిన మరో డాక్టర్.. ఇలా ప్రతి ఒకరూ ఆమె జీవితంతో ఆడుకున్నవారే
ఈ మూవీలో ఎక్కడా అనుపమ పరమేశ్వరన్ కనిపించదు
అంతటా అనితే కనిపిస్తుంది
బేలగా దిక్కులు చూస్తున్న అనిత కనిపిస్తుంది
తన సమస్యని ఇంట్లో చెప్పుకోలేదు
అలా అని బయట కూడా అందరికీ చెప్పుకోలేదు
తను ప్రెగ్నెంట్ అని తల్లికి తెలియకుండా ఉండటం కోసం పీరియడ్స్ వచ్చినట్టు తల్లిని శానిటరీ నాప్కిన్ అడగటం, వాష్ రూమ్ లో తన పొట్టను చూసుకుంటూ చేతులతో బాదుకునే సన్నివేశాల్లో అనుపమ ప్రేక్షకుల కంట తడి పెట్టిస్తుంది
ఆఖరికి తల్లికి తెలియకుండా ఆమె గాజులు తాకట్టు పెట్టి తీసుకున్న యాభై వేలు డాక్టర్ చేతిలో పెట్టి తనకు అబార్షన్ చేయమని ప్రాధేయపడినప్పుడు డాక్టర్ పెట్టిన కండిషన్ కు ఒప్పుకుని బయటకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చే సన్నివేశంలో అనుపమ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది
అందుకే ఈ మూవీకి అనుపమ నటనే ప్రాణం
అయితే రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఆమె తనకు జరిగిన అన్యాయానికి రివెంజ్ తీసుకోవడం లాంటి విషయాల జోలికి దర్శకుడు పోకపోవడంతో ముగింపు అసంపూర్తిగా అనిపిస్తుంది
సినిమాలో ప్రధానంగా ఆమె సమస్య మీదే ఫోకస్ పెట్టారు కానీ పరిష్కారాలు కూడా చూపించి ఉంటే బాగుండేది
ఇక ఎంత లాక్ డౌన్ కాలం అయినా లేడీ డాక్టర్లు లేకుండా ఉండరు కదా?
కానీ అనిత తన అబార్షన్ కోసం మేల్ డాక్టర్ల చుట్టూనే తిరుగుతుంది
లాక్ డౌన్ కాలం అంటే మరీ పురాతన కాలం ఏమీ కాదు కదా?
అందులో మొబైల్ ఫోన్ తరచూ వాడే అనితకు బయటి ప్రపంచం తెలియనట్టు చూపించడం సింక్ కాలేదు
కథనంలో చిన్న చిన్న లోపాలు ఉన్నపటికీ అనుపమ నటనలో అవన్నీ పెద్దగా కనిపించవు
ఎవరెలా చేశారు?
ఈ మూవీకి వన్ మ్యాన్ ఆర్మీ అనుపమ పరమేశ్వరనే
మొత్తం సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించింది
ముఖ్యంగా వాష్ రూమ్ లో కడుపును చూసుకుంటూ కుమిలిపోయే సన్నివేశంలోనూ , క్లైమాక్స్ సన్నివేశంలోనూ ఆమె ప్రదర్శించిన నటనకు పూర్తి మార్కులు పడతాయి
ఇక అనుపమ తల్లిగా ఒకప్పటి కథానాయిక నీరోషా నటించి మెప్పించింది
సాంకేతికత
ఈ మూవీలో హీరో లేడు కాబట్టి డ్యూయెట్లు కూడా లేవు
బ్యాక్ గ్రౌండ్ డ్రాప్ లో వచ్చిన సాంగులు మాత్రం ఓ మూడు ఉన్నాయి
నేపథ్య సంగీతం వరకు పర్లేదు
ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లాక్ డౌన్ కాలం నాటి విజువల్స్ ను కళ్లముందు ఉంచారు
ముఖ్యంగా డార్క్ మోడ్ లో నైట్ విజువల్స్ సహజంగా చిత్రీకరించారు
నిర్మాణ విలువల గురించి చెప్పుకోవాలంటే భారీ బడ్జెట్ సినిమాలు తీసే లైకా వంటి నిర్మాణ సంస్థల నుంచి ఇంత సింపుల్ బడ్జెట్లో సినిమా రావడం విశేషమే
ఈ మూవీలో ఖర్చు పెద్దగా కనిపించదు కానీ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి
విశ్లేషణ
తనకు జరిగిన అన్యాయం మీద ప్రతీకారం తీర్చుకునే హీరోయిన్ ఓరియెంటెడ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.. తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఓ యువతి పడిన సంఘర్షణ మాత్రమే ఇందులో కనిపిస్తుంది. అందుకే పరిష్కారం ప్రేక్షకుల ఊహకే వదిలేస్తూ దర్శకుడు హడావుడి ముగింపు ఎంచుకున్నాడు. ముగింపు చూసినవారికి ఇదేంటి సినిమా అయిపోయిందా? అనిపిస్తుంది. అవన్నీ పక్కనబెట్టి కథలో సంఘర్షణను గమనిస్తే చివరివరకు చూడాలనిపిస్తుంది . సినిమా అంతా అనిత కష్టాల చుట్టూనే తిరిగినా కడవలకు కడవలు కన్నీరు కార్చే ఏడ్పులు ఉండవు. జస్ట్ ఒక సంఘర్షణ నుంచి ఎమోషన్ పుట్టించారు . ఇందులో మోతాదును మించి అశ్లీలత, అసభ్యత సన్నివేశాలు ఏమీ లేవు కాబట్టి ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో నిక్షేపంగా చూడొచ్చు
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, నీరోషా, చార్లీ తదితరులు
సంగీతం: ఎన్ ఆర్ రఘునాధన్
సినిమాటోగ్రఫీ : శ్రీగిరిష్
దర్శకత్వం: ఏ ఆర్ జీవా
విడుదల: 11 -3 -2026 ( అమెజాన్ ప్రైమ్ )
రేటింగ్: 2.75 / 5
