కనుమరుగైపోతున్న పురాతన కళాఖండాల జాబితాలో మడత మంచాలు కూడా చేరుతున్నాయి
ఒకప్పుడు మహరాజులా వెలిగిన మడత మంచాలు ఇప్పుడు సామంత రాజులా ఓ మూల పడుంటున్నాయి
కొన్నిచోట్ల అదీ లేదు
అసలు మంచాల్లో మడత మంచం యెంత శ్రేష్టమనీ .. యెంత హాయనీ ..
మడత మంచాల్లో ఉన్న సుఖం డబుల్ కాట్ బెడ్డుల్లో ఏముందనీ? గాడిద గుడ్డూ
పోలోమంటూ ఇంటికి జనాలు వస్తే ఇద్దరు ముగ్గుర్నీ కలిపి ఒకే బెడ్డు మీద కుక్కే పని లేదు
మడత విప్పితే ఆ మంచానికి మనమే ఏకైక మహా రాజులమ్
గది మొత్తం ఆక్రమిస్తుందనే భయం లేదు
కావాల్సినప్పుడు హాయిగా కిటికీ పక్కన వేసుకుని పడుకుంటే చెప్పలేని ఆ హాయీ ఎంతో గొప్పగ ఉంటుందోయి
పొద్దున్న లేచి ఎవడికీ అడ్డం లేకుండా మడత బెట్టి ఏ గొడకో తగిలిస్తే ఎంత ప్లేసు కలిసొస్తుందనీ
అంతెందుకు ,
ఎండా కాలం మడత మంచం డాబాపైకి తీసుకెళ్ళి నక్షత్రాలను లెక్కపెడుతూ చందమామతో ముచ్చట్లు చెబుతూ వెన్నెల్లో హాయ్ హాయ్ అని పాటలు పాడుకునేవాళ్ళం కాదూ
మధ్యలో వాన పడితే శ్రమ లేకుండా అలా మడత బెట్టి కిందకొచ్చి కిటికీ పక్కన వేసుకుని పాటలు కంటిన్యూ చేసేవాళ్ళం కదూ
మడత మంచాలు మెయింటేనెన్స్ కూడా తక్కువే
ఎప్పుడైనా మహా అయితే పట్టాలు చిరిగేవి
అది కూడా హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైషన్లు ఎవరైనా ఎక్కితేనే
ఇక మన పర్శనాలిటీకి మడత మంచం కుక్కిన పేనులా ఎన్నేళ్లయినా కదలకుండా పడి ఉండేది అనుకోండి..అది వేరే విషయం
అలా అప్పట్లో ఇంట్లో మడత మంచానికీ.. మనకీ బోలెడు ఫ్రెండ్ షిప్ నడిచింది
అంతెందుకు ,
నా చిన్నప్పుడు లాడ్జీల బయట మడత మంచాలు అద్దెకివ్వబడును అనే బోర్డులు ఉండేవి
ఎవరైనా లాడ్జీలు అద్దెకు ఇస్తారు కానీ మడత మంచాలు అద్దెకివ్వడం ఏంటో అని స్వాతి ముత్యం కమాలసన్ లా అప్పట్లో తెగ ఫీల్ అయ్యేవాడ్ని
అలా బాల్యమంతా మడత మంచాలు వేస్తూ.. సారీ..చూస్తూ పెరిగినవాడ్ని హఠాత్తుగా అవి మాయం అవడంతో భలే బాధగా ఉందిలే
ఇప్పుడు సడెన్గా మడత మంచాలు ఎందుకు గుర్తొచ్చాయా అనే కదా మీ సందేహం
ఏం లేదూ
ఇందాక మహేష్ బాబు’ కుర్చీ మడత బెట్టి ‘ సాంగ్ చూశా
ఇదే మా మడత మంచాల రోజులైతేనా
‘మంచం మడత బెట్టీ ‘అని పాడుకునేవాళ్లం గాదూ అని గుర్తొచ్చింది !
హంతే
పరేష్ తుర్లపాటి