నిన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రయాణీకులు అందరూ మరణించగా ఇద్దరు మాత్రం చావు అంచులదాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు
గుజరాత్ కు చెందిన 30 ఏళ్ళ భూమిక చౌహాన్ ఇదే విమానంలో లండన్ వెళ్లాల్సి ఉంది .. ఈమె సొంత ఊరు గుజరాత్ దగ్గరలోని అంకాళేశ్వర్
పెళ్లయి రెండేళ్లు అయ్యింది
లండన్ లో చదువుకుంటూ అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తుంది .. సెలవలు దొరకడంతో ఇండియా వచ్చి నెలన్నరగా సొంత ఊరు అంకాళేశ్వర్ లోనే ఉంటుంది
సెలవలు పూర్తి కావడంతో నిన్న లండన్ తిరుగు ప్రయాణానికి ఇదే ఫ్లయిట్ లో టికెట్లు బుక్ చేసుకుని అంకాళేశ్వర్ నుంచి రోడ్డు మార్గం మీదుగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరింది
అయితే అహ్మదాబాద్ లో విపరీతమైన ట్రాఫిక్ ఉండటంతో ఆమె ఎయిర్ పోర్ట్ చేరుకోవడానికి పది నిముషాల ఆలస్యం అయ్యింది
ఆ ఆలస్యమే ప్రాణాలు కాపాడింది ఆ క్షణాన ఆమెకు తెలీదు
ఆలస్యంగా రావడంతో విమానాశ్రయ అధికారులు ఆమె బోర్డింగ్ కు ఒప్పుకోలేదు
అధికారులు తనను మృత్యువుకు దూరంగా నెడుతున్నారని కూడా భూమికకు ఆ క్షణాన తెలీదు
భూమిక అక్కడి అధికారులను అందర్నీ కలిసి బతిమాలుకుంది
అప్పటికే బోర్డింగ్ టైం మించిపోవడంతో అధికారులు ఆమెను లోనికి పంపలేదు
ఈ ఫ్లయిట్ క్యాన్సిల్ అయితే టికెట్ డబ్బులు పోవడంతో పాటు ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉండటంతో భూమిక అక్కడే ఎయిర్పోర్ట్ బయట భోరుమని ఏడవటం మొదలుపెట్టింది
ఆవిడ అలా ఏడుస్తుండగానే విమానం కూలిపోయిందని వార్త వచ్చింది
అంతే జరిగినదంతా ఆమెకు కళ్ళ ముందు రీలులా గిర్రున తిరిగింది
అహ్మదాబాద్ లో ట్రాఫిక్ ఝాము లో ఇరుక్కుని ఎయిర్ పోర్టుకు రావడం ఒక్క పది నిమిషాలు ఆలస్యం కావడం వల్లనే ఈ రోజు తాను ప్రాణాలతో ఉండగలిగానని వణుకుతున్న గొంతుతో చెప్పారు .. అసలు ఊహించుకోవడానికే ఒళ్ళంతా షివరింగ్ అవుతుందని .. జీవితంలో ఈ సంఘటన మర్చిపోలేనని భూమిక ఏడుస్తూ చెప్పారు
ఏదిఏమైనా అహ్మదాబాద్ లో ట్రాఫిక్ ఝాము అవడమే భూమిక ప్రాణాలు కాపాడింది .. లేకపోతె లిస్టులో ఆవిడ పేరు కూడా ఉండేది
అలా చావుకు కొద్ది నిమిషాల దూరంలో భూమిక ప్రాణాలతో బయటపడింది
ఇక చావును జయించిన రెండో వ్యక్తి 38 ఏళ్ళ రమేష్ విశ్వాస్ కుమార్
ఈయన లండన్ లో ఉద్యోగం చేస్తుంటారు
విమానం క్రాష్ అవుతుందని ముందే గుర్తించి కిందకి దూకేసాడు
గాయాలు అయితే అయ్యాయి కానీ సెకెన్ల వ్యవధిలో ప్రాణాలతో బయటపడ్డాడు
చావు తప్పి కన్ను లొట్టబోవడం అంటే ఇదేనేమో ?
ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు
ఈయన పూర్తిస్థాయిలో కోలుకుంటే విమాన ప్రమాద దుర్ఘటన గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి
ఎందుకంటె విమానంలో ప్రాణాలతో మిగిలిన ఏకైక ప్రత్యక్ష సాక్షి ఈయనొక్కరే !
పరేష్ తుర్లపాటి