ఈ సినిమా చూస్తేనేమో మళయాళ జయ జయ జయహే మూవీకి రిమేక్
టైటిల్ చూస్తేనేమో ఓం శాంతి శాంతి శాంతిః
దీన్నిబట్టి అర్థమైంది ఏంటంటే జయ జయహే సినిమాకి తెలుగు వెర్షన్ తీయడానికి దర్శకుడు సిద్దపడ్డప్పుడే మళయాళ ముద్ర ఇందులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుంది
అనుకున్నట్టుగానే దర్శకుడు సినిమాని మలిచాడు
టైటిల్ మార్చడంతో మొదలుపెట్టి గోదావరి అందాలను కళ్ళముందు నిలపడం దాకా పూర్తి అచ్చతెనుగు నేటివిటీని తీసుకొచ్చేసాడు
ఓం శాంతి మూవీ చూస్తే ఇది మళయాళ జయ జయహే మూవీకి రీమేక్ అని ఎవరూ అనుకోలేరు
ఇదంతా బాగానే ఉంది కానీ టైటిల్ మార్చకుండా అదే ఉంచితే బాగుండేది
ఎందుకంటే జయ జయహే అనే టైటిల్ తెలుగులో కూడా ఫెమిలియరే
మళయాళంలో కథానాయిక పేరు జయ
కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల అత్తింటిలో సమస్యలను సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్న పాయింట్ ఆధారంగా మూవీ ఉంటుంది
నిజానికి మూవీ టైటిల్ కి జయ జయహే అన్న పేరే చాలా యాప్ట్ గా ఉంటుంది
దాన్ని తీసి తెలుగులో కధానాయిక పేరు శాంతి చేసి ఓం శాంతి శాంతి శాంతిః అని పెట్టడంతో సోషల్ మీడియా భాషలో ఇంకో రకంగా అనిపిస్తుంది
సరే ఈ టైటిల్ సంగతి అలా ఉంచితే ఆహా ఓటిటీ లోకి వచ్చిన ఈ ఓం శాంతి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం
కధేంటి ?
ప్రశాంతి అలియాస్ శాంతి ( ఈషా రెబ్బా ) స్వతంత్ర భావాలు ఉన్న ఆడపిల్ల
బాగా చదువుకుని ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్ళమీద తాను నిలబడాలని ఆలోచిస్తూ ఉంటుంది
మరోపక్క శాంతి తండ్రి , తమ్ముడు , మేనమామ ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ పెళ్లి చేసి పంపేస్తే తమకు భారం దిగిపోతుందని ఆలోచిస్తుంటారు
ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల కుటుంబ సభ్యులు శాంతి చేత చదువు మాన్పించి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు
కానీ తొలుత శాంతి ఇందుకు ఒప్పుకోదు
పెళ్ళిచూపులకు వచ్చిన చేపల వ్యాపారి ఓంకార నాయుడు (తరుణ్ భాస్కర్ ) పెళ్లి తర్వాత కూడా ఆమెను చదివించటానికి ఒప్పుకోవడంతో పెళ్ళికి శాంతి ఓకే అంటుంది
బోలెడు ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన శాంతికి ఎటువంటి అనుభవాలు ఎదురౌతాయి ?
ఇచ్చిన మాట ప్రకారం ఓంకార నాయుడు శాంతిని చదివిస్తాడా ?
ఓంకార నాయుడి పురుషాహంకార పైత్యాన్ని శాంతి ఎలా ఎదుర్కొంటుంది ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
ముందు నుంచీ శాంతి క్యారక్టర్ ను పర్ఫెక్ట్ గా డిజైన్ చేసారు
స్వతంత్ర భావాలు కలిగిన ఆడపిల్లగా ఆమెను ప్రొజెక్ట్ చేయడంలో దర్శకుడు విజయం సాధించారు
చదువు విషయంలోనూ , పెళ్లి విషయంలోనూ తన ఆలోచనలను ఆమె కుటుంబ సభ్యులకు స్పృష్టంగా చెప్తుంది
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారుగా ,
అలాగే శాంతి పుట్టింట్లో కూడా తండ్రికి , తమ్ముడికి , మేనమామకు తన ఐడియాలజీని ధైర్యంగా చెప్తుంది
ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నప్పుడు ఇంట్లో అందరూ ఏడుస్తారు కానీ శాంతి ఏడవదు
ధైర్యంగా అత్తారింట్లో అడుగుపెడుతుంది
అప్పుడు ఆమె ముఖంలో తాను ఎక్కడైనా బతకగలననే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది
కొత్త ప్లేసుకు వచ్చింది
రకరకాల మనస్తత్వాలు ఉంటాయి
అక్కడి వాతావరణం అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని తెలుసు కాబట్టి ఖాళీగా ఉండకుండా ముందు ఇంటిని తీర్చి దిద్దడం మొదలుపెడుతుంది
పాత కర్టెన్లు మార్చడం , ఎంబ్రాయిడరీ అల్లికలతో చేసిన పూసల దండలతో గుమ్మాలను అలంకరించి కుటుంబ సభ్యుల మనసులలో స్థానం సంపాదించుకుంటుంది
ఇదిలా ఉండగా ఓంకార నాయుడుకు తెల్లవారు ఝామున నాలుగు గంటలకే రెండు ఇడ్లీలు తిని చేపల చెరువుకి వెళ్లే అలవాటు ఎప్పట్నుంచో ఉంది
అతడికి చేసి పెట్టడం కోసం అత్తా , ఆడపడుచు తెల్లారి మూడింటికే లేచి పిండి రుబ్బి ఇడ్లీలు వేసి పంపడం గమనిస్తుంది
శాంతి ఆ ఇంట్లో కొత్తగా అడుగుపెట్టింది కాబట్టి భర్తకు ఇష్టమైన పదార్దాలను చేసి పెడుతుంది
శాంతి చేసే పదార్దాలు అందరికీ నచ్చుతాయి కానీ ఓంకార నాయుడికి నచ్చవు
కారణం పురుషాహంకారం
దాంతో తన ఇష్టాలతో పని లేకుండా శాంతి వ్యవహరిస్తుందని ఆమెను కొడతాడు
అంతిమంగా వారి కాపురంలో కలహాలు చెలరేగుతాయి
ఇంతవరకు పర్ఫెక్ట్
కొత్తగా పెళ్ళైన చాలామంది ఆడపిల్లలకు చాలామందికి అత్తింట్లో ఇటువంటి అనుభవాలు ఉండి ఉండొచ్చు
కొందరు పరిస్థితుల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కొని తట్టుకుని నిలబడతారు
మరికొందరు తట్టుకోలేక రాజీ పడి బతుకుతారు
శాంతి మొదటి మార్గం ఎంచుకుంది
సరే భర్త అహంకారి అని తెలిసిపోయింది
పుట్టింట్లో చెబితే మీరే పరిష్కరించుకోండి అంటారు
కాబట్టి సమస్యను ఆడపిల్లే పరిష్కరించుకోవాలి
ఇంతవరకు ఓకే
భర్త తన చెంప మీద కొట్టాడు కాబట్టి శాంతి యూ ట్యూబ్ లో కరాటే నేర్చుకుని మరీ అతడ్ని పొట్టు పొట్టున కాలితో కొడితే ఎలా ఉంటుంది ?
కొంచెం ఓవర్ గా అనిపించదూ ?
సీరియస్ గా సాగిపోతున్న కధనంలో భార్యా ,భర్తలు కరాటేతో ఒకరినొకరు ఎగిరెగిరి కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది ?
పోనీ కామెడీగా అనుకుందామా ?
కామెడీకి కూడా ఎక్కడైనా భార్యా , భర్తలు ఇలా కరాటే నేర్చుకుని తన్నుకుంటూ ఇంట్లో సామాన్లు గుల్ల చేసుకునే విధంగా తన్నుకుంటారా ?
ఇద్దరూ ముక్కులు , మూతి పగిలేలా కొట్టుకుని మళ్ళీ ఏమీ ఎరగనట్టు మాములుగా సంసారం చేయడం కొంచెం ఎబ్బెట్టుగా ఉంది
శాంతి చదువుకున్న పిల్ల
అందుకే క్లైమాక్సుకి వచ్చేసరికి ఆత్మవిశ్వాసంతో తన కాళ్ళ మీద తాను నిలబడి భర్త అహంకారాన్ని ఎదురిస్తుంది
సినిమాలో ఫోకస్ పెట్టాల్సింది ఈ పాయింట్ మీద కదా ?
మధ్యలో ఆ ముష్టిఘాతాలు ఎందుకు ?
అనవసరమైన కామెడీ కోసమూ , ల్యాగ్ కోసం తప్ప ఆ సన్నివేశాలు పెట్టి ఏం సందేశం ఇద్దామనుకున్నారో అర్ధం కాదు
భార్యా భర్తల మధ్య ఈ కరాటే సన్నివేశాలు లేకపోతే సినిమా ఆలోచింపచేసేలా , హాయిగా సాగిపోతుంది
అంతగా కామెడీ కావాలనుకుంటే బ్రహ్మాజీకి మరికొంత సమయం ఇచ్చి ఉండాల్సింది
కనిపించినంతసేపూ చక్కటి కామెడీని పండించాడు
ఇకపోతే సినిమా మళయాళ రీమేక్ అయినప్పటికీ అక్కడి ప్రాంతాల జోలికి పోకుండా గోదావరి అందాలను చూపిస్తూ ఇక్కడి యాసను పరిచయం చేసిన తీరు బాగుంది
ఎవరెలా చేసారు ?
చేపల వ్యాపారి ఓంకార నాయుడి పాత్రలో తరుణ్ భాస్కర్ న్యాయం చేసాడు
సీరియస్ షేడ్ లోనూ , కామెడీ షేడ్ లోనూ సన్నివేశాలకు తగినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో విజయం సాధించాడు
గోదావరి యాస కూడా బాగా పలికాడు
ఇక శాంతి పాత్ర పోషించిన ఈషా రెబ్బా కూడా పర్ఫెక్ట్ గా నటించింది
పాత్ర స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని ముఖంలో ఆ గంభీరతను చక్కగా ప్రదర్శించింది
బ్రహ్మాజీతో కామెడీ చేయించడం మంచి ఛాయిస్
కనిపించినప్పుడల్లా చక్కటి కామెడీ పండించి నవ్వులు పూయించాడు
సాంకేతికత :
సినిమాలో బీజీఎమ్ బాగానే ఉంది
పాటలు పర్లేదు
గోదావరి నేపథ్యంలో తీసిన సన్నివేశాలు అందంగా ఉన్నాయి
సినిమాటోగ్రఫీ బాగుంది
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి
విశ్లేషణ :
కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అత్తిళ్లలో ఎదుర్కునే కొన్ని అనుభవాలను ఇందులో చూపించారు . చాలామంది ఆడపిల్లలకు ఇది తమ కథేనేమో అన్న అనుమానం వచ్చేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి . సమస్యను శాంతి ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంది అనే సందేశంతో సినిమా ముగించారు . భార్యా , భర్తల కరాటే ముష్టి యుద్దాలు కొంచం ఓవర్ గా అనిపించడం మినహా మిగిలిన కధనం మనకి ఎక్కడా బోర్ కొట్టించదు . కుటుంబ సభ్యులతో కలిసి ఆహా ఓటిటిలో చూడొచ్చు
నటీనటులు : తరుణ్ భాస్కర్ , ఈషా రెబ్బా , బ్రహ్మాజీ తదితరులు
నిర్మాత : సృజన్ ఎరబోలు
దర్శకుడు : ఏ .ఆర్ .సజీవ్
విడుదల : మార్చి 4 (ఆహా ఓటిటీ )
రేటింగ్ : 2.75 / 5
