పాన్ ఇండియా మూవీ !
“గురూ గారూ.. ఓ మాంచి పాన్ ఇండియా మూవీ తీద్దామనుకుంటున్నా.. మీ సలహా కావాలి “
“శుభం నాయనా.. అన్నట్టు అదేదో పాన్ అంటున్నావ్.. జాగ్రత్త.. సున్నం ఎక్కువైతే నోరు మండుద్ది.. ఆనక నువ్వే సున్నం అయిపోతావ్ “
” మీరు మరీ భయపెడుతున్నారు గురు గారు “
“కాదు నాయనా.. జాగ్రత్త పడమని చెప్తున్నా.. ఇంతకీ నాదగ్గరకెందుకొచ్చావ్ నాయనా ?”
“మాంచి స్టోరీ ఏవన్నా చెప్తారేమో అని గురు గారు”
“ఇంకేం మంచి స్టోరీలు నా తలకాయ్ .. ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లతోపాటే ఎప్పుడో పైకెళ్ళిపోయాయి కద నాయనా”
“మరి నా సినిమాకి స్టోరీ ఎలా గురు గారూ?”
“స్టోరీ గురించి తర్వాత ఆలోచిద్దాం నాయనా.. ముందు సినిమా గురించి ఆలోచిద్దాం.. ఏదో పాన్ ఇండియా మూవీ అన్నావ్ కదా.. అంచేత ముందు ఓ పన్చెయ్యి “
“ఏంటి గురు గారు?”
“బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, నా తలకాయి వుడ్ లనుంచి మనవళ్ళతో ఆడుకుంటున్న సీనియర్ హీరోలకు తలా ఓ జర్దా పాన్ ఇచ్చి సినిమాలో దింపు.. అప్పుడు టైటిల్ కి న్యాయం జరుగుతుంది నాయనా”
“అలాగే గురు గారు. తర్వాత?”
“మన సందు చివర మందాకినీ జెరాక్స్ అండ్ ఇంటర్నెట్ సెంటర్ ఉంటుంది.. అందులో చిడతల అప్పారావు ఉంటాడు.. నా పేరు చెప్పి వాడ్ని కలువు నాయనా?”
“ఎందుకు? స్టోరీ జెరాక్స్ ఏవన్నా తీపించాలా గురు గారు?”
“కాదు నాయనా. వాడు చిన్నప్పట్నుంచి వీడియో గేములవీ బాగా ఆడేవాడు.. పెద్దలు వాడి ఆర్ట్ చూసి పెద్దయ్యాక వాడు అంతరిక్షంలోకి వెళ్తాడు అనుకునేవారు.. ఆఖరికి నాలుగు రోడ్ల సెంటర్లో నెట్ సెంటర్ పెట్టుకుని సెటిల్ అయ్యాడు”
“అది సరే గురూ గారూ.. ఇప్పుడు అప్పారావుతో మనకి పనేంటి?”
“మన సినిమాలో గుర్రాలనూ.. పులులను పరిగెత్తించేది వాడే నాయనా”
“అర్థమైంది గురు గారూ అప్పారావు గ్రాఫిక్స్ కింగ్ కదూ “
“క్యాచ్ చేశావు నాయనా “
“ఇంతకీ కథ ఏంటో చెప్పలేదు గురు గారూ?”
“కథదేముంది నాయనా.. అన్ని వుడ్ లనుంచి ఏరుకొచ్చిన జర్దా పాన్ నటులతో ఒక్కడితో ఒక్కో డైలాగ్ చెప్పించు.. వాళ్లేం చెప్తున్నారో ఒక్కడికీ అర్థమై చావదు.. మిగతాదంతా అప్పారావు చూసుకుంటాడు.. ఇక కథ అంటావా?”
“చెప్పండి.. చెప్పండి గురు గారూ.. కథేంటి?”
“రెండో పార్టులో ఆలోచిద్దాం నాయనా “
“అర్థమైంది.. ప్రేక్షకుల జేబులకు రెండుసార్లు కన్నం వేసే మీ ఐడియా అర్థమైంది.. వెళ్ళొస్తా గురూ గారూ”
“శుభం..ఆ హుండీలో దక్షిణ వేసి వెనక్కి చూడకుండా ఉత్తరం వైపు వెళ్ళు నాయనా “
పరేష్ తుర్లపాటి