కాకా హోటల్ వెర్సెస్ రిచ్ కేఫ్ – సరదా కబుర్లు !

Spread the love

మా ఇంటికి లెఫ్ట్ సైడ్ రోడ్ కార్నర్ లో ఓ కాకా హోటల్ ఉంది
రైట్ సైడ్ కార్నర్ లో ఓ ఏసీ కేఫ్ ఉంది

ఎప్పుడు చూసినా రెండూ కిటకిటలాడుతూ ఉంటాయి

కాకా హోటల్లో తిన్నంత చికెన్ బిర్యానీ 120 రూపాయలు మాత్రమే

అంచేత దారినపోయే దానయ్యలతో పాటు కారుల్లో వెళ్ళేవాళ్ళు కూడా అక్కడ స్టూలు మీద కూర్చుని తిన్నంత బిర్యానీ తినేసి బ్రేవ్ మని త్రేనుస్తూ బిల్ పే చేసి నోట్లో పుల్ల పెట్టుకుని కెలుక్కుంటూ వెళ్ళిపోతారు

రైట్ సైడ్ కార్నర్ లో ఏసీ కేఫ్ ఉందని చెప్పాగా
బాగా రిచ్ గా కట్టాడులే

లోపల ఓపెన్ లాన్ లో LED స్క్రీన్ లో సినిమా వేస్తుంటాడు కాలక్షేపానికి

ఇంకా లోపల విశాలమైన ఏసీ హాల్లో రౌండ్ టేబుల్స్.. ఆర్డర్ తీసుకోవటానికి పక్కనే సూటు బూటు వేసుకుని ఓ బిళ్ళ భటుడు ఉంటాడు

అక్కడ పెద్దగా ఫుడ్ ఏమీ ఉండదు

బర్గర్లు.. పిజ్జాలు.. శాండ్ విచ్ లు..ఇంకా మన్నూమషాణం ఏవో ఉంటాయి

ఒక పాట్ లో ఇచ్చే కాఫీ కేవలం 169 + GST మాత్రమే
అయినా కార్లలో వచ్చే జనంతో కిటకిట లాడుతూ ఉంటుంది

ఒకే వీధిలో రెండు వేరు వేరు బిజినెస్ పార్శ్వాలు

సంగతేంటో తెలుసుకోమని నాలోని పాత జర్నలిస్ట్ నా వీపు గోకాడు

సరే అని లంచ్ హవర్స్ అయిపోయిన తర్వాత ముందు కాకా హోటల్ కు పోయి పక్కనే బీడీ తాగుతూ కనిపించిన వంట వాడ్ని గిల్లా
నా గిచ్చుడికి వాడు ఉలిక్కిపడి నా వంక అనుమానంగా చూసాడు

” నీ పేరెంటోయ్?” అంటూ వాడితో మాట కలిపా

“ఈరయ్య అండి “

“వీరయ్యా ?”

“అవునండి.. ఈరయ్య “

“ఓరయ్య.. ఏదోక అయ్యలే కానీ ఇక్కడ వంట చేసేది నువ్వేనా?”

” అవునండి “

“ఓనరు?”

“నెల్లూరండి “

“ఇక్కడుండడా?”

“ఇక్కడే ఉంటాడండీ “

“సరే హోటల్ బానే నడుస్తుంది కదా “

“అవునండి “

“అవునూ నాకో డౌట్.. తిన్నంత చికెన్ బిర్యానీ బగారా రైస్ తో 120 రూపాయలకు ఎలా ఇస్తున్నారంటావ్? గిట్టుబాటు అవుతుందంటావా ?”

“ఎవరికండి?”

“మీ ఓనర్ కి”

“ఆడికేందుకు గిట్టుబాటు కాదండీ.. బోలెడు అవ్వుద్ది.. మాకే పైసలు ఇవ్వడానికి ఏడ్చి చస్తాడు “అని మనసులో ఉన్న పగని బయటపెట్టాడు

మళ్ళీ వాడికే డౌట్ వచ్చినట్టుంది.. నేను ఓనర్ తాలూకూ సీక్రెట్ ఏజెంట్ గోపీనేమో అని ,

“అది సరే గానీ ఇంతకీ తమరెవరండి? నా మొబైల్ లో రికార్డ్ చేస్తున్నానేమో అని అనుమానంగా చూస్తూ అడిగాడు

వీడు కూడా సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్నాడని అర్థమైంది

“భయపడకు.. మీ ఓనర్ నీకు పైసలు సరిగా ఇవ్వడం లేదని అర్థమైంది.. ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఓనర్లందరూ అంతే.. కార్మికుల శ్రమను దోచుకుని మేడలు కట్టుకుంటారు” కారల్ మార్క్స్ టైపులో ఆవేశంగా అన్నా

వాడు నాలో లెనిన్ నో ..మార్క్స్ నో చూసినట్టున్నాడు

“ఇందాక ఏమన్నారూ.. గిట్టుబాటు అన్నారుగా.. చెప్తాను.. కేజీ చికెన్ 175 నుంచి 350 దాకా ఉంది కదండీ.. ఇక బగారా రైసు.. నా తలకాయి అన్నీ కలిపి తిన్నంత బిర్యానీ 120 కి ఏడ నుంచి వస్తుందీ ?”

“మరి చికెన్ బిర్యానీ పెడుతున్నారుగా?”

వాడు నా వంక చూసి జైలర్ లో రజనీకాంత్ నవ్వినట్టు నవ్వాడు

“మనలో మాట ఎవరితో అనమాకండి.. మార్కెట్లో కుళ్ళిపోయిన కోడి మాంసాన్ని బయట పడేస్తారు .. అది ఇటొచ్చేస్తుంది.. దాని మీద అంత మసాలా కారం కొట్టేసి దాన్నే గ్రేవీ లో వేసేసి వేడి వేడిగా కలియ తిప్పేసి పొగలు కక్కుతుండగా ప్లేట్లో వేసి ఇచ్చామనుకో సారూ.. లొట్టలేసుకుంటూ తినేస్తారు కాదూ.. ఇక అది కోడో.. మేకో.. కుక్కో ఎవడు చూడొచ్చాడు “

“అంటే???”

నాకు తిప్పింది

వాడికో దణ్ణం పెట్టి లేచి వచ్చేసి ఇటు కార్నర్ లో ఉన్న ఏసీ కేఫ్ లో వెయిటర్ ను కదిలించా

“మీ కేఫ్ లో ఇంతంత రేట్లు ఉంటాయి కదా? అయినా జనం కార్లలో వస్తుంటారు.. సీక్రెట్ ఏంటి?”
“ఏవుంది సార్.. మా సారుకు జూబ్లీ హిల్స్.. బంజారాహిల్స్.. మాదాపూర్ లాంటి చోట్ల ఇలాంటి కేఫ్ లు ఇంకో పది ఉన్నాయి.. బాగా బలిసిన ఖాతాలు ఉన్నాయి.. కుర్రాళ్ళు అమ్మాయిలతో కూర్చుని టైమ్ పాస్ చెయ్యాలి.. ఓ మూడు నాలుగు గంటలు ఏసీలో కూర్చుని కార్డ్ గీకి పోతారు.. వాళ్లకి రేట్లతో పనేముంది సారూ ” అని కమలాసన్ లా నవ్వాడు

వీడితో ఇంకాసేపు మాట్లాడితే నన్ను వంద రూపాయలు టిప్పు అడుగుతాడేమో అని భయపడి కేఫ్ లోనుంచి బయటపడ్డా

కొంత సరదాగా రాసినా ఇదంతా యదార్ధమే
అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు అన్నట్టు ఇది యాపారం బాసూ!!

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!