Home » అదీ సంగతి !

అదీ సంగతి !

Spread the love

“ఏమైనా మన మల్లోజుల ఉద్యమానికి ద్రోహం చేశాడు కామ్రేడ్ “

మూడో రౌండ్ పూర్తయి నాలుగో రౌండుకి సోడా కలుపుతూ ఆవేదన చెందాడు ఓ అర్బన్ నక్సల్

అవును.. నా అభిప్రాయం కూడా ఇదే కామ్రేడ్..రాజ్యం చేతికి తుపాకీ అప్పగించి ఉద్యమాన్ని బొంద పెట్టాడు “సిగరెట్ ఆఖరి దమ్ము లాగుతూ ఆవేశపడ్డాడు ఇంకో అర్బన్ మేధావి

టైమ్ అయిపోయింది బార్ క్లోజ్ చేస్తున్నారని వెయిటర్ చెప్పడంతో తమ’ రెగ్యులర్ కస్టమర్ ‘ పరపతిని ఉపయోగించి ఫైనల్ ఆర్డర్ చెప్పాడు అర్బన్ నక్సల్

“కొన్ని రోజుల బట్టి నాకు నిద్ర కరువైంది కామ్రేడ్.. ఒక పక్క రాజ్యం కగార్ ఆపరేషన్.. మరోపక్క మన కామ్రేడ్స్ లొంగిపోవడం.. అసలు ఉద్యమం ఏమైపోతుందో అని ఆందోళనగా ఉంది కామ్రేడ్” తన్నుకొస్తున్న అవలింతలను ఆపుకుంటూ అన్నాడు అర్బన్ నక్సల్

“నాదీ ఇదే అభిప్రాయం కామ్రేడ్.. మనమే ఏదో ఒకటి చెయ్యాలి” ఆవేశంగా పిడికిలి బిగించాడు అర్బన్ మేధావి

“ఎస్ కామ్రేడ్.. మనమే ఏదో ఒకటి చెయ్యాలి.. ఉద్యమం ఆగకూడదు.. ఎన్కౌంటర్లు ఆగకూడదు.. ఇన్ఫార్మర్లను లేపేయడం ఆగకూడదు.. ఉద్యమంలో అశువులు బాసిన అమరుల శవాల మీద ఎర్ర జెండాలు కప్పి ఎర్రెన్నియల్లో ఎర్రెరెన్నియల్లో అని పాడుకుంటూ సంఘాల తరపున మనం అశ్రు నివాళులు అర్పించడం ఆగకూడదు ” మైకంతో కళ్ళు మూతలు పడుతుండగా ఆవేశపడ్డాడు అర్బన్ నక్సల్

“అవును.. ఆగకూడదు.. ఏం చేద్దాం అంటావ్?”

“ఓ పని చేద్దాం.. మన ఆవేశాన్నంతా ఓ పోస్ట్ రాసి ఎఫ్బీ లో పడేద్దాం.. నా పోస్టును నువ్వు షేర్ చెయ్.. నీ పోస్టును నేను షేర్ చేస్తా.. ఎలా ఉంది ఐడియా?”

“సూపర్ ఐడియా కామ్రేడ్.. ఇంతకీ పోస్ట్ ఎప్పుడు పెడదాం?”

“ఇప్పుడే.. ఇప్పుడైతేనే మన పోస్టుకి కిక్కు వస్తుంది కామ్రేడ్ “లాస్ట్ పెగ్ ఖాళీ చేస్తూ ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు అర్బన్ నక్సల్

అక్షరాలు మత్తెక్కి ఫేస్ బుక్ లోకి ఎక్కాయి

ఇద్దరూ భావోద్వేగంతో కౌగిలించుకున్నారు

” అన్నట్టు ఉద్యమం ధ్యాసలో పడి నీ విషయాలు అడగటం మర్చిపోయాను కామ్రేడ్.. ఫ్యామిలీ సంగతులేంటి?”

“ఏవుంది కామ్రేడ్.. ఆ భగవంతుడి దయ వల్ల పిల్లలు సెటిల్ అయ్యారు.. అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు.. అమ్మాయికి ‘ మావాళ్ళ ‘ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేశా.. ఇక నా సంగతంటావా? రచయితల సంఘం పెట్టా కదా.. ఏదో కాలక్షేపం అయిపోతుందిలే.. అప్పుడప్పుడు సినిమాలకి రివ్యూలు అవీ రాస్తుంటానులే “

“నైస్ కామ్రేడ్.. అన్నట్టు నేను పెట్టిన పోస్టుకి అప్పుడే ఎవడో లైక్ కొట్టాడు కామ్రేడ్ “

“ఆ లైక్ కొట్టింది నేనే కామ్రేడ్.. నా పోస్టుకు కూడా నువ్వు లైక్ కొట్టు “

అలా చెరో లైకు వేసుకుని పాక్కుంటూ ఇళ్లకు చేరుకున్నారు అర్బన్స్

***

పీఎస్: సమాజానికి అడవుల్లో ఉన్న నక్సల్స్ కన్నా అర్బన్ నక్సల్స్ తోనే ప్రమాదం ఎక్కువ.. వీళ్లది సేఫ్ గేమ్.. రిస్క్ లేని జీవితం.. సిద్ధాంతాలు మాత్రం కమ్యూనిజానికి దగ్గరగా ఉంటాయి..ఆచరణలు మాత్రం అందనంత దూరంలో ఉంటాయి

వీళ్లు నాటక సంఘం పేరుతోనో.. రచయితల సంఘం పేరుతోనో.. మేధావి గ్రూపుల పేరుతోనో సంఘంలో చెల్లుబాటు అయిపోతారు

తుపాకులు పట్టుకుని అడవుల్లో పోరాడుతున్న అన్నల పట్ల సానుభూతి చూపిస్తారు.. అదే తుపాకి పట్టుకుని అడవుల్లోకి వెళ్లడానికి మాత్రం సాహసించరు

మేధావి తనం చూపిస్తారు.. అంతోఇంతో చదువుకుని పత్రికలకు ఏవో నాలుగు వ్యాసాలు రాసో.. రెండు పుస్తకాలు రాసో స్వయం ప్రకటిత మేధావుల సంఘంలో సభ్యత్వం పుచ్చుకుంటారు

అడవుల్లో ఉద్యమ బాట పట్టిన చాలామంది నక్సలైట్లకు ఉద్యమ ఆశయాలు కూడా తెలియవు.. నిరుద్యోగ సమస్యో.. నిరక్షరాస్యతో.. కుటుంబ నేపథ్యమో వాళ్ళని ఉద్యమ బాట పట్టిస్తాయి.. వాళ్ళు ఉద్యమ బాట పట్టడానికి ఇటువంటి అర్బన్ నక్సల్స్ ప్రేరేపూరిత ప్రసంగాలు కూడా ఒక కారణం

నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా

కొన్ని వేల ప్రాణాలు కోల్పోవడం మినహా బుల్లెట్ ద్వారా నక్సల్స్ సాధించింది ఏమన్నా ఉందా?

అడవుల్లో ఎటునుంచి ఏ బుల్లెట్ గుండెల్లో దిగుతుందో తెలియక కంటికి నిద్ర లేక జీవితాలకు గ్యారంటీ లేక దిన దిన గండంలా ఇంకెన్నాళ్ళు బ్రతకాలి?

ఎవరికోసం జీవితాలను త్యాగం చెయ్యాలి?

బ్యాలెట్ ద్వారా దర్జాగా చట్ట సభల్లోకి ప్రవేశించి ఆశయాలను సాధించుకునే అవకాశం ఉండగా ఎందుకీ మారణ హోమాలు?

ఇప్పటికైనా మావో అగ్ర నాయకులు నిజాలు గ్రహిస్తున్నారు

మావోయిస్టు నాయకుడు మల్లోజుల తుపాకీ రాజ్యానికి అప్పగించి రాజ్యాంగాన్ని చేతబట్టడం మంచి పరిణామం

అతడి లొంగుబాటును ఎగతాళి చేస్తున్న అర్బన్ నక్సల్స్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు

ఏమో రేపు ఇదే మల్లోజుల చట్ట సభల్లోకి ప్రవేశించి పీడిత తాడిత వర్గాల ఆశయాల సాధన కోసం రాజ్యాంగ బద్దంగా పోరాడుతాడేమో ?

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *