హిమాచల్ ప్రదేశ్ సిమ్లా జిల్లా రోహాసిల్ తాలూకా మారుమూల కొండప్రాంతంలో ఉన్న పర్సా గ్రామానికి చెందిన కేహార్ సింగ్ ఠాకూర్ క్రికెట్ ప్రేమికుడు
ఎంతలా అంటే పెద్దయ్యాక తన కొడుకు కూడా గొప్ప క్రికెటర్ అవ్వాలని కోరుకుంటూ తన కొడుక్కి స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు పెట్టుకున్నాడు
కానీ ఆయన కలను పెద్దయ్యాక కొడుకు బదులు కూతురు నెరవేర్చింది
ఆ కూతురే సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్ ఆడి క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న భారత మహిళా జట్టులో ఒకరైన రేణుకా సింగ్ ఠాకూర్
ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు
తన తండ్రి క్రికెట్ మీద ప్రేమతోనే అన్నకి వినోద్ కాంబ్లీ పేరు పెట్టుకున్నాడని తెలిసింది
పెద్దయ్యాక ఎలాగైనా గొప్ప క్రికెటర్ అయి తండ్రి కల నెరవేర్చాలని చిన్ననాడే రేణుక నిశ్చయించుకుంది
కానీ అప్పట్లో మహిళలకు క్రికెట్లో పెద్దగా అవకాశాలు ఉండేవి కావు
అయినా రేణుక పట్టుదలగా పాత బట్టలనే బంతిగా చేసుకుని చెక్క నే బ్యాటులా మలుచుకుని ఇంటిముందు ఆడుతూ ఉండేది
రేణుకలో ఉన్న ఆసక్తిని ఆమె బాబాయ్ పీఈటీ టీచర్ అయిన భూపిందర్ సింగ్ ఠాకూర్ గుర్తించాడు
రేణుకకు సరైన శిక్షణ ఇస్తే గొప్ప క్రికెటర్ అవుతుందని అతను రేణుక తల్లికి చెప్పాడు
ఆడపిల్ల క్రికెట్ నేర్చుకుని ఎదగడం సాధ్యమయ్యే పనేనా అని రేణుక తల్లి సందేహించింది
ఎందుకు సాధ్యం కాదు .. నేను సాధించి చూపుతా అంది రేణుక
బాబాయ్ కూడా రేణుకను ప్రోత్సహించి ధర్మశాలలో క్రికెట్ కోచింగ్ అకాడెమీలో రేణుకను చేర్పించాడు
ధర్మశాల కోచింగ్ అకాడెమీ లో చేరిన రేణుక అనతికాలంలోనే గొప్ప పేరు తెచ్చుకుంది
క్రికెట్ మీద ఆమెకున్న మక్కువ చూసి కోచ్ లే ఆశర్యపోయారు
ఆ రోజే రేణుక బాబాయ్ ఆమె ఎప్పటికైనా గొప్ప క్రికెటర్ అవుతుందని గ్రామస్తులు అందరికీ చెప్పాడు
ఆయన ఊహించిన విధంగానే రేణుక అత్యంత వేగంగా శిక్షణ పూర్తి చేసుకుని వరల్డ్ ఉమెన్స్ క్రికెట్ పోటీల్లో భారత్ తరపున ఆడేందుకు ఓపెనింగ్ బౌలర్ గా సెలెక్ట్ అయ్యింది
ఇది రేణుక జీవితంలో గొప్ప ముందడుగు
తండ్రి కల నెరవేర్చటానికి దొరికిన చక్కటి అవకాశం
అమ్మాయిలు పట్టుదలతో ప్రయత్నిస్తే అబ్బాయిలతో సమానంగా సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించుకునే రోజు
రేణుక క్రికెట్ ఆడటానికి గ్రౌండ్లోకి వెళ్లే ముందు తల్లి ఆమెతో మాట్లాడుతూ ” నీ తండ్రి క్రికెట్ మీద ప్రేమతో పెద్దయ్యాక నీ అన్న కూడా గొప్ప క్రికెటర్ అవ్వాలని వాడికి స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు పెట్టుకున్నాడు .. అయితే నీ తండ్రి కలను నెరవేర్చే అవకాశం వాడికి బదులు నీకు వచ్చింది .. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇండియాకి కప్ సాధించి నీ తండ్రి ఆశయాన్ని నిలబెట్టు ” అని చెప్పింది
గ్రౌండ్లోకి వెళ్తూ రేణుక తండ్రికి మనసులోనే నమస్కరించుకుంటూ చేతి వంక చూసుకుంది
ఆమె మోచేయి మీద తండ్రి పేరు ‘ కేహార్ సింగ్ ఠాకూర్ ‘ అనే పచ్చబొట్టు ఉంది
నిజంగా రేణుక ఠాకూర్ సింగ్ జీవితం భవిష్యత్ క్రీడాకారులకు గొప్ప ఇన్స్పిరేషన్
తల్లితండ్రుల కోరికలను కొడుకులే కాదు కూతుళ్లు కూడా నెరవేర్చగలరు అని కప్ సాధించి మరీ నిరూపించింది !
