సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలకు టైటిల్ అనేది ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది
రేపు ఉదయం పది గంటలకు అనే టైటిల్ చూడగానే అసలు ఏం జరిగి ఉంటుందా అనే కుతూహలం ప్రేక్షకులకు కలుగుతుంది
థియేటర్ల సంగతి పక్కనబెడితే ఓటిటీ ల్లో చూసేవారికి టైటిల్ చూడగానే ఒకసారి చూస్తే పోలా అనిపిస్తుంది
అలా అని కేవలం గట్టి టైటిల్ పెట్టడం వల్లనే సినిమాలు ఆడతాయని అర్ధం కాదు
ఆ తర్వాత పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే అనేది మూవీ విజయాన్ని డిసైడ్ చేస్తుంది
రేపు ఉదయం పది గంటలకు టైటిల్ పరంగా ఆసక్తి కలిగించినా మూవీ పరంగా ఎలాంటి విజయం సాధించింది అనేది ఇప్పుడు చూద్దాం
ఈ సినిమా గురించి చెప్పుకునేముందు ఇదే దర్శకుడు తీసిన ఓ పిట్టకథ మూవీ గురించి చెప్పుకోవాలి
దాదాపు కొత్త నటీనటులతో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో డిఫరెంట్ ప్రయోగం చేసి చందు ముద్దు దర్శకత్వం వహించిన ఓ పిట్టకథ పేరుతో మూవీ ఆ జానర్ ను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంది
దానితో సహజంగా ఆ దర్శకుడి సినిమాల మీద ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి
ఇదిగో ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రేపు ఉదయం పది గంటలకు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు
మార్చిలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కొద్దిరోజులకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది
ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం
కధేంటంటే ?
నలుగురు వేరు వేరు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో ఒకే సమయానికి రాత్రికి హైదరాబాద్ నుంచి బయలుదేరి రేపు ఉదయం పది గంటలకు కాకినాడ చేరుకునేలోపు జరిగిన సంఘటనల నేపధ్యం చుట్టూ కథ అల్లుకుని సస్పెన్స్ డ్రామా తెరకెక్కించారు
సినిమా ప్రారంభమే 2022 నాటి కాలాన్ని గుర్తుచేస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా అని దర్శకుడు హింట్ ఇస్తాడు
హైద్రాబాదులో కార్డియాక్ అరెస్టుతో మరణించిన తన అన్న డెడ్ బాడీని రేపు ఉదయం పదిగంటలకల్లా కాకినాడ చేర్చాలని తన మేనేజర్ కు పురమాయించి అతడి తమ్ముడు వెళ్ళిపోతాడు
ఓ ప్రైవేట్ అంబులెన్సులో డెడ్ బాడీని కాకినాడ తరలించడానికి ఆ మేనేజర్ ఓ డాక్టర్ సాయంతో డ్రైవర్ మల్లేశం ( అభినవ్ గోమఠం) తో మాట్లాడుకుంటాడు
అక్కడ్నుంచి వాళ్ళు అంబులెన్సు లో డెడ్ బాడీతో కాకినాడ బయలుదేరతారు
ఇదిలా ఉండగా పెళ్ళికి ముందు అనుభవం కోసం రఘు ( చైతన్య రావు ) దివ్య (హెబ్బా పటేల్ ) అనే వేశ్యతో మాట్లాడుకుంటాడు
కానీ అనుకోని పరిస్థితుల్లో దివ్య మర్నాడు ఉదయం పది గంటలకల్లా కాకినాడ వెళ్లాల్సి రావడంతో తనను కారులో దింపమని రఘు సాయం అడుగుతుంది
దాంతో రఘు ఆమెను తీసుకుని కారులో కాకినాడ బయలుదేరతాడు
మరోపక్క ఇద్దరు ప్రేమికులు ప్రసాద్ , కీర్తి పెళ్లిచేసుకుందామని పెద్దలకు తెలియకుండా పారిపోతుండగా అతడి బైక్ ఆగిపోవడంతో దారిలో వెళ్తున్న మల్లేశం అంబులెన్సుని ఆపి లిఫ్ట్ అడిగి అందులో కాకినాడ బయలుదేరతారు
కీర్తి తండ్రి ఓ రాజకీయ నాయకుడు కావడం ,మర్నాడు ఉదయం పది గంటలకు అతడి నామినేషన్ కార్యక్రమం ఉండటంతో అతడు తమను చంపుతాడేమో అన్న భయంతో వీళ్ళు కూడా కాకినాడ బయలుదేరతారు
మరోపక్క జానీ ( ఇమ్మాన్యుయల్ ) ,కనకరాజు (దామరాజు కిరీటి ) డ్రగ్స్ ముఠానుంచి ,పోలీసుల నుంచి తప్పించుకుని కాకినాడ వెళ్లే దారిలో పారిపోతూ ఉంటారు
ఇంకోపక్క ఆర్ముగం అనే పోలీస్ ఆఫీసర్ దివ్యను పట్టుకోవడానికి వెంటపడుతూ ఉంటాడు
అందరి గమ్యం మర్నాడు ఉదయం పదిగంటలకల్లా కాకినాడ చేరుకోవడమే
అసలు అందరూ కాకినాడ బయలుదేరటానికి కారణం ఏంటి ?
దివ్య అనే వేశ్యను పట్టుకోవడానికి ఆర్ముగం అనే పోలీస్ ఆఫీసర్ ఎందుకు వెంటపడతుంటాడు
రవీందర్ ( శ్రీకాంత్ అయ్యంగార్ ) ఆమెను చంపాలని ఎందుకు అనుకుంటాడు ?
తండ్రినుంచి ప్రాణభయం ఉందని కీర్తి ఎందుకు భయపడుతుంది ?
డ్రగ్స్ ముఠానుంచి తప్పించుకున్న జానీ , కనకరాజులు కాకినాడ వెళ్లి ఏం చేసారు ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
సినిమా ప్రారంభమే డ్రైవర్ మల్లేశం అంబులెన్సులో డెడ్ బాడీని కాకినాడ తీసుకెళ్లడానికి బయలుదేరటంతో మొదలౌతుంది
అభినవ్ గోమఠం కామెడీ టైమింగుతో నవ్విస్తాడు
దాంతో ఇది కామెడీ మూవీనేమో అన్న అనుమానం వస్తుంది
డ్రైవర్ మల్లేశం , మేనేజర్ ల మధ్య సంభాషణలతో సరదాగా సాగిపోతుంది
ఎప్పుడైతే ఆర్ముగం అనే పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడో అప్పుడు కధనంలో సీరియస్నెస్ వస్తుంది
కథ కామెడీనుంచి క్రైమ్ థ్రిల్లర్ మార్గంలో టర్న్ అవుతుంది
దివ్య అనే వేశ్యని పట్టుకోమని రవీందర్ పోలీస్ అధికారి అయిన ఆర్ముగం ను కోరడం , తండ్రినుంచి ప్రాణభయంతో ప్రియుడితో కలిసి కీర్తి ఇంట్లోనుంచి పారిపోవడం , పోలీసుల నుంచి జానీ , కనకరాజులు తప్పించుకుని పారిపోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ కధనం చకచకా పరుగులు పెడుతుంది
ఇక సెకండాఫ్ లోకి వచ్చేసరికి కధనంలో వేగం తగ్గి సాగతీతలు ఎక్కువగా కనిపిస్తుంది
ఈ అనవసరమైన సాగతీత సన్నివేశాలను కత్తిరించే పని పెట్టి ఉంటే బాగుండేది
అభినవ్ గోమఠం తో కామెడీని పండిస్తూనే కొన్ని జీవిత సత్యాలను సంభాషణల ద్వారా చెప్పించడం బాగుంది
మధ్యలో డ్రగ్స్ ఎపిసోడ్లు ఎక్కువ కావడం బోర్ కొట్టిస్తుంది
ఇమ్మాన్యుయేల్ , దామరాజు కిరీటీల మధ్య కామెడీ ట్రాక్ సరిగా కుదరలేదు
జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వులు పూయించే ఇమ్మాన్యుయేల్ ఇందులో పేలవంగా నటించినట్టు అనిపిస్తుంది
ఒకేసారి నలుగురు వేరు వేరు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో మర్నాడు ఉదయం పదిగంటలకు కాకినాడ చేరుకునేలోపు జరిగిన సంఘటనలను పేర్చుకుంటూ పోయిన సందర్భంలో కొంత గందరగోళం నెలకొంటుంది
అందరికీ కాకినాడతో ఉండే కనెక్షన్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు
ఈ విషయంలో దర్శకుడు సెకండాఫ్ లో కొద్దిగా తడబడ్డాడు
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆర్ముగానికి మొదట్లో భారీ ఎలివేషన్లు ఇస్తారు
అతనో పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనీ ,కనిపిస్తే కాల్చేస్తాడు అని బిల్డప్ ఇస్తూ ఓ ఎన్కౌంటర్ సీన్ చూపిస్తారు
తరువాతి సన్నివేశంలో ఒక వేశ్య అతడ్ని పాంటూ చొక్కా లేకుండా జీపుకి బేడీలు వేసి పోతుంది
అంతటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా ఆమె ముందు బేలగా మారిపోతాడు
ఈ సన్నివేశాలు కొంత అసహజంగా ఉన్నాయి
దర్శకుడు మూవీని నిజంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మలచాలి అనుకుంటే ఆర్ముగం వంటి పోలీస్ ఆఫీసర్ తో కొంత సీరియస్ కథ నడిపి ఉంటే బాగుండేది
ఎప్పుడైతే పోలీస్ అధికారిని జోకర్ చేసారో అప్పుడే కధనంలో సీరియస్నెస్ పోయింది
అంతేకాదు స్క్రీన్ ప్లే లో గ్రిప్పింగ్ కూడా తగ్గింది
ఇక క్లైమాక్స్ వరకు రొటీన్ సస్పెన్స్ సినిమాల తరహాలో సాగింది
తిరిగి చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఒక్కటే కాస్త ఆశ్చర్యపరుస్తుంది
ఆ ట్విస్ట్ మినహా సెకండాఫ్ లో చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏమీ లేవు
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో కాస్తోకూస్తో అభినవ్ గోమఠం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు
సీరియస్ గా సాగిపోతున్న మూవీలో అతడి పాత్ర రిలాక్స్ ఇస్తుంది
దానికి తోడు అతడికి మంచి పంచ్ డైలాగులు పడ్డాయి
ఆటో డ్రైవరుకి ,అంబులెన్సు డ్రైవరుకు ఉన్న తేడాలు చెప్పడం నవ్విస్తుంది
ఆఖర్లో అతడి చేతిలో యాభై లక్షలు పెట్టి ఈ డబ్బుతో ఏం చేస్తామంటే అమెరికా వెళ్తా అంటాడు
కానీ అమెరికా వెళ్లినా అతడు అంబులెన్సు వదలడు
ఇలా మూవీలో అతడి పాత్ర బాగా సెట్ అయ్యింది
ఇక రఘు పాత్రలో మొహమాటపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చైతన్యరావు మెప్పించాడు
పాత్ర పరిధి మేరకు అతడి హావభావాలు సరిపోయాయి
దివ్య అనే వేశ్య పాత్రలో హెబ్బా పటేల్ కూడా చాలా సహజంగా నటించింది
ఒకరకంగా ఆమె ఆ పాత్రకు ప్రాణం పోషించింది
ఇమ్మాన్యుయేల్ , దామరాజు కిరీటీల ట్రాక్ గాడి తప్పింది
శ్రీకాంత్ అయ్యంగార్ నటన పర్లేదు
సాంకేతికత
సాంకేతికత గురించి చెప్పుకోవాలంటే నేపధ్య సంగీతం ,సినిమాటోగ్రఫీ యావరేజుగా ఉన్నాయి
హీరో హీరోయిన్ల డ్యూయెట్లు వంటివి లేవు కాబట్టి సంగీతం గురించి పెద్దగా చెప్పుకునేది కూడా ఏమీ లేదు
నిర్మాణ విలువలు పర్లేదు
ఫస్టాఫ్ లో కధనాన్ని చకచకా పరుగులు పెట్టించిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం తడబడ్డాడు
విశ్లేషణ :
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారు ఒకసారి ఓటిటీ లో చూడటానికి ప్రయత్నించవచ్చు ..అక్కడక్కడా కొద్దిగా బోర్ అనిపించినా అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ బావుంటుంది కాబట్టి కాస్త ఎంటర్టైన్ అవ్వొచ్చు.. హెబ్బా పటేల్ వేశ్య పాత్రలో నటించినా మరీ మోతాదును మించిన అశ్లీలం ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీతో నిరభ్యరంతంగా చూడొచ్చు ..అలాగే మోతాదును మించిన వయొలెన్స్ కూడా ఏమీ ఉండదు ..ఇదే దర్శకుడి గత సినిమా ఓ పిట్ట కథ మాదిరి డిఫరెంట్ మేకింగ్ ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం నిరాశ చెందుతారు .. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా చూస్తే డిజప్పాయింట్ అవ్వరు
నటీనటులు : చైతన్య రావు , హెబ్బా పటేల్ , అభినవ్ గోమఠం ,శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం : ప్రిన్స్ హెన్రి
సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్ నామా
దర్శకత్వం :చెందు ముద్దు
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 1.5 / 5
