రోమాంచమ్ అంటే గూస్ బంప్స్ అని అర్ధం
తెలుగులో రోమాలు నిక్కబొడుచుకోవడం అంటారే అది
నిజమే సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి
అందుకే మూవీకి ఈ టైటిల్ పెట్టినట్టున్నారు
అలా అని మూవీ మొత్తం రోమాలు నిక్కబొడుచుకోవడాలు ఉంటాయనుకుంటున్నారేమో ?
మధ్యలో పొట్ట పగిలిపోయే కామెడీ కూడా ఉంటుంది
ఒక రకంగా చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ కామెడీలను మిక్సీ లో వేసి రుబ్బితే రోమాంచమ్ అవుతుంది
థియేటరిక్ రిలీజుల కాలం నుంచి ఓటిటీ రిలీజుల కాలంలోకి వచ్చిన తర్వాత పర భాషా చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది
అందులోనూ మళయాళ మూవీలకు క్రేజు పెరుగుతుంది
ఓటిటీ ప్లాట్ ఫార్మ్స్ లో గాలించాలే కానీ ఇతర భాషల్లో అద్భుతమైన సినిమాలు మనకి కనిపిస్తాయి
లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా లేకుండా తెలుగు డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉండటంతో కుదిరినప్పుడు హాయిగా ఇంట్లోనే బోలెడు మంచి సినిమాలు చూడొచ్చు
అలాంటి ఓ చూడదగ్గ సినిమానే రోమాంచమ్
2023 లోనే మళయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబట్టుకుంది
సింపుల్ గా ఓ రెండు కోట్లు ఖర్చు పెట్టి 75 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకున్నారు
ఇదే సినిమా జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతూ మంచి రేటింగ్ సాధించింది
ఈ మధ్య కాలంలో సౌబిన్ సాహిర్ అనే ఓ చక్కటి మళయాళ నటుడు తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంటున్నాడు
కుంబ లంగి నైట్స్ , మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాల్లో గొప్ప నటుడిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు
రజనీకాంత్ కూలీ మూవీలో విలక్షణ పాత్ర పోషించి , ఓ పాటలో హీరోయిన్ పూజాతో కలిసి అదిరేటి రేంజులో స్టెప్పులు కూడా వేసి పాన్ ఇండియా నటుడుగా చక్కటి ఇమేజ్ తెచ్చుకున్నాడు
ఈ మధ్య చాలామంది ఇతడు నటించిన సినిమాలను ఓటీటీల్లో వెతుక్కుని మరీ చూస్తున్నారు
ఇప్పుడు ఈ రోమాంచమ్ కధేంటో చూద్దాం
2007 లో ఓ హాస్పిటల్లో జీవన్ (సౌబిన్ సాహిర్ ) అనే ఓ పేషేంట్ కోమాలోనుంచి బయటపడిన సన్నివేశంతో మూవీ మొదలౌతుంది
అతడికి మెలుకువ రాగానే తనని ఐసియు నుంచి రూమ్ కి షిఫ్ట్ చేయమని డాక్టర్ని అడుగుతాడు
తన స్నేహితులతో అత్యవసరంగా మాట్లాడాలి కాబట్టి వెంటనే రూమ్ కి షిఫ్ట్ చేయమని కోరతాడు
కానీ జీవన్ పూర్తిగా రికవరీ కాలేదు కాబట్టి రూమ్ కి షిఫ్ట్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోడు
అప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్న నర్స్ ‘ అతడు స్నేహితులతో ఏం మాట్లాడదల్చుకున్నాడు ? అతడి గతం ఏంటి ? అని ప్రశ్నించడంతో జీవన్ తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టడంతో అసలు కథ మొదలౌతుంది
బెంగుళూరు శివార్లలో జీవన్ ,నీరజ్ ,రవి ,హరి లతో కలిపి మొత్తం ఏడుగురు ఫ్రెండ్స్ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని రెంట్ షేరింగ్ బేసిస్ మీద కలిసి ఉంటారు
ఈ ఏడుగురిలో ఒకడే జాబ్ చేస్తూ ఉంటాడు
నీరజ్ స్మాల్ బిజినెస్ చేస్తుండగా మిగతావాళ్ళు సెటిల్ అవడానికి ప్రయత్నిస్తుంటారు
మిత్రులు సాయంత్రాలు వాలీబాల్ ఆడుకోవడం , ఇంట్లోనే ఏదో ఒకటి ఒండుకుని తాగి తందనాలు ఆడటం లాంటి బ్యాచిలర్ లైఫ్ జాలీగా లీడ్ చేస్తుంటారు
ఓ రోజు జీవన్ ఇంకో స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఓయిజా బోర్డు గురించి తెలుసుకుంటాడు
ఓయిజా బోర్డు ద్వారా ఆత్మలను రప్పించవచ్చని తెలియడంతో జీవన్ రూమ్ కి వచ్చి ఇంట్లో ఉన్న క్యారం బోర్డుతో ఓయిజా బోర్డు తయారుచేసి ఆత్మలను రప్పించటానికి మిత్రులతో కలిసి సరదాగా ప్రయత్నిస్తాడు
నిజానికి అతడు ఇలాంటి గేమ్ ఆడటం వల్ల దయ్యాలు వస్తాయని నమ్మడు
కానీ సరదాగా మొదలెట్టిన ఆటలో అనామిక అనే దయ్యం నిజంగా వచ్చి చేరడంతో షాక్ అవుతాడు
ఇంతకీ ఈ ఓయిజా బోర్డు ద్వారా దయ్యాలను రప్పించడం సాధ్యమేనా ?
జీవన్ ఇంట్లో ఓయిజా బోర్డు లో వచ్చిన అనామిక అనే దయ్యం ఎవరు ?
అనామిక రాకతో మిత్రులు పడిన అవస్థలు ఏంటి ? అనేవి మిగిలిన కథనంలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
చదువు పూర్తి అయిన తర్వాత కొంతమంది మిత్రులు రూమ్ షేరింగ్ చేసుకుని ఉద్యోగాల వేటలో ఉండటం నిజ జీవితంలో కూడా జరిగేదే
బ్యాచిలర్ లైఫ్ లో తిండి ,మందు షేరింగ్ చేసుకోవడం , అల్లరి చేయడం , కలిసిపోవడం సాధారణంగా జరిగేదే
నిజానికి నిజ జీవితంలో బెంగుళూరులో అద్దె ఇంటిలో ఉంటున్న కొంతమంది మిత్రుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ మూవీ రూపుదిద్దుకుంది
అక్కడక్కడా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా ఓయిజా బోర్డు ద్వారా ఆత్మలను రప్పించడం అనే కాన్సెప్ట్ ఆ మిత్రుల ద్వారానే తెలిసిందని దర్శకుడు చెప్పాడు
సినిమా ప్రారంభం చూస్తే చాలామందికి తమ బ్యాచిలర్ లైఫ్ గుర్తుకొస్తుంది
రూములో డీజేలు పెట్టుకోవడం ,డాన్సులు చేయడం , మందు తాగడం , అల్లరి చేయడం , ఆడుకోవడం ఇలా సోలోగా సాగిపోతున్న మిత్రుల జీవితాలను చూపిస్తాడు
మిత్రుల అల్లరి వల్ల ఇంట్లో క్రమశిక్షణ గాడి తప్పుతుందని భావించి నీరజ్ మిగిలినవాళ్ళకి తలా ఒక పని అప్పచెబుతాడు
ఒకడు వంట చేస్తే ,ఇంకోడు అంట్లు తోమాలి
ఇల్లు శుభ్రం చేయడం ఒకడి పని , సరుకులు తేవడం ఇంకోడి పని అంటూ వర్క్ డివైడ్ చేయడం చాలా సహజంగా ఉంది
ఇంతవరకు సరదాగా సాగిపోతున్న కధనంలోకి ఓయిజా బోర్డు రావడంతో స్టోరీ సడెన్గా టర్న్ తీసుకుంటుంది
జీవన్ సరదాగా మొదలెట్టిన ఓయిజా బోర్డు ఆటలో నిజంగానే అనామిక అనే దయ్యం రావడంతో మిత్రులు పడే అవస్థ కడుపుబ్బ నవ్విస్తుంది
ఇదిలా కొనసాగుతుండగానే ద్వితీయార్థంలో శీను అనే క్యారక్టర్ ఆ ఇంట్లో ప్రవేశించడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది
శీను విచిత్ర ప్రవర్తనతో మిత్రులకు కొత్త తలనొప్పులు మొదలవడం , అతడితో వీళ్ళు పడే ఇబ్బందులు ప్రేక్షకలకు నవ్వు తెప్పించడంతో పాటు క్యూరియాసిటీని కూడా కలిగిస్తాయి
కాకపోతే జీవన్ సరదాగా మొదలెట్టిన ఈ గేమ్ చూసి ఊళ్ళో వాళ్లంతా ఎగబడి రావడం , ప్రశ్నలు అడగడం , ఆ ప్రశ్నలకు అనామిక చెప్పిన సమాధానాలు కాకతాళీయంగా నిజాలు కావడం కొంత అసహజంగా అనిపిస్తుంది
ఆ బోర్డులో ఏమీ లేదని జీవన్ కూడా నమ్ముతాడు
కానీ ఆ బోర్డు ద్వారా నిజంగానే దయ్యం వస్తుంది ? అనే విధంగా కొన్ని సన్నివేశాలు నడుస్తాయి
ఈ సన్నివేశాలకు దర్శకుడు కొంత జస్టిఫికేషన్ చూపించి ఉంటే బాగుండేది
శీను విచిత్ర ప్రవర్తనకు కూడా ఇంకాస్త బలమైన కారణాన్ని చూపించి ఉండాల్సింది
మొదటినుంచి స్టోరీని సన్నివేశాలకు తగినట్టుగా ఇంట్రెస్టింగ్ గా మలిచి క్లైమాక్సుకు వచ్చేసరికి హడావుడిగా ముగించినట్టు అనిపించింది
ముగింపు సింపుల్ గా తేల్చడం బాలేదు
బహుశా పార్ట్ 2 లో చెప్తారేమో?
ఎవరెలా చేసారు ?
సినిమా మొత్తం దాదాపు ఈ ఏడుగురు మిత్రులే కనిపిస్తారు
ఎవరి పరిధిలో వాళ్ళు అందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు
కాకపోతే వీరిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జీవన్ పాత్ర పోషించిన సౌబిన్ సాహిర్ నటన గురించి
ఎప్పటిలానే పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు
సౌబిన్ తర్వాత నీరజ్ పాత్ర పోషించిన సజిన్ గోపు చక్కగా నటించాడు
అల్లరి చిల్లరి ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటి బాధ్యతగా ఉండేవాడు ఒకడుంటాడు అనుకునేలా నటించాడు
ఇక శీను పాత్రలో నటించిన అర్జున్ అశోకన్ కు కథను మలుపుతిప్పే పాత్ర లభించింది
చిత్రవిచిత్రమైన హావభావాలతో అయినదానికీ ,కానిదానికీ నవ్వుతూ కామెడీని పండించాడు
సాంకేతికత :
హీరో హీరోయిన్లు పాటలూ గట్రాలు లేవు కాబట్టి నేపధ్య సంగీతానికి సగం పని తగ్గిపోయినట్టే
ఓవరాల్ గా సినిమాలో నేపధ్య సంగీతం బాగానే ఉంది
సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ మూవీలో కెమెరాకు కూడా పని తక్కువే
సినిమా మొత్తం దాదాపు ఒక చిన్న ఇంట్లోనే సాగుతుంది
తీసినంతవరకు ఛాయాగ్రహణం బాగానే ఉంది
ఇక నిర్మాణ విలువల గురించి చెప్పుకోవాలంటే ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఆ రెండు కోట్లు కూడా ఖర్చు అయ్యేవి కావేమో అనిపిస్తుంది
విశ్లేషణ
సాధారణంగా మనం మూవీల్లో ఒక్కో జానర్ ఇష్టపడతాం. కొందరు సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడితే ,మరికొందరు హర్రర్ ,ఇంకొందరు కామెడీ ఇష్టపడతారు . కానీ అన్నీ కలిపి ఒకే పాత్రలో కలిపి వడ్డిస్తే ఫుల్ మీల్స్ అవుతుంది .రోమాంచితం ఫుల్ మీల్స్ లాంటిదే . ఎక్కడా బోర్ కొట్టదు .కధనం సీరియస్ గా సాగిపోతుంది అనుకున్నంతలోనే కడుపుబ్బ నవ్విస్తుంది. అలా అని వెకిలి కామెడీ ఎక్కడా ఉండదు . చాలా సహజంగా ఉంటుంది . ముగింపు మీద కొంత అసంతృప్తి ఉన్నా రెండో భాగం ఉందన్నారు కాబట్టి అనామిక సంగతి అందులో తేలవచ్చు .అసభ్యతా ,అశ్లీలతకు తావు లేదు కాబట్టి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు
నటీనటులు : సౌబిన్ సాహిర్ , సజిన్ గోపు , అర్జున్ అశోకన్ తదితరులు
సంగీతం : సుషీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ : షాను తాహిర్
నిర్మాత : జాన్ పాల్ జార్జి ,గిరీష్
దర్శకత్వం : జీతూ మాధవన్
విడుదల : జియో హాట్ స్టార్
రేటింగ్ : 3.5 /5
