సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో సైకలాజికల్ థ్రిల్లర్ రూటే సెపరేటు
ఇటువంటి జానర్లో కథ కుదిరి మాంచి స్క్రీన్ ప్లే పడితే హిట్టు కొట్టడం ఖాయం అవుతుంది
ఈ జానర్లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి
ఒక్కో దర్శకుడు ఒక్కో సైకలాజికల్ కథాంశాలను తీసుకుని చిత్రాలను తెరకెక్కించారు
అయితే సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో తీసుకునే అంశం మెడికల్ టెర్మినాలజీకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ రంగంలో దర్శకుడికి అవగాహన ఉండటం ముఖ్యం
లేకపోతే ఏదో వేక్ గా సృష్టించినట్టు ఉంటుంది
సైకో కిల్లర్ కథలలో చాలా భాగం మెంటల్ డిజార్డర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది
అయితే ఆ కథలను చాలామంది దర్శకులు నేరస్తుల కోణంలో చూపిస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ బాధితుల కోణంలో ఎస్ సరస్వతి కథను ఎంచుకున్నారు
తనకు జరిగిన అన్యాయం పై ఓ మహిళ చట్టానికి దొరక్కుండా ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేదే ఎస్ సరస్వతి కథ
ఈ సినిమా కథ మొత్తం సరస్వతి చుట్టూనే తిరుగుతుంది
ఆమెకు జరిగిన అన్యాయం విషయంలో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో న్యాయస్థానం నిందితులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోలేకపోతుంది
ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్ డిజార్డర్ కేస్ స్టడీని అడ్డుపెట్టుకుని ఓ డాక్టర్ సాయంతో ఓ నర్స్ చట్టానికి దొరక్కుండా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతీకారం తీర్చుకునే కథే ఎస్ సరస్వతి మూవీ
ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం
కథేంటంటే?
సినిమా ప్రారంభమే తల్లీకూతుళ్ల అనుబంధంతో మొదలౌతుంది
ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తున్న లక్ష్మికి ( వరలక్ష్మీ శరత్ కుమార్) కూతురు సరస్వతి అంటే ప్రాణం
ఆగస్టు 15 న పుట్టినరోజు నాడు స్కూల్ కి వెళ్ళిన సరస్వతి రాత్రి అయినా ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడి కూతురి కోసం అన్ని చోట్లా వెతుకుతుంది
ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు కూతురు నుంచి ఫోన్ వస్తుంది
తాను ప్రిన్సిపల్ రూమ్ లో ఉన్నట్టు, తనని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టి రేప్ చేసినట్టు చెప్తుంది
లక్ష్మీ పరిగెత్తుకుంటూ స్కూల్ కి వెళ్ళేసరికి కూతురు ప్రిన్సిపల్ రూమ్ లో విగత జీవిగా పడి ఉంటుంది
దాంతో 12 ఏళ్ల తన కూతుర్ని రేప్ చేసిన నిందితులపై కంప్లైంట్ ఇవ్వడానికి లక్ష్మి పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది
అక్కడ పోలీస్ ఆఫీసర్ ( మురళీ శర్మ) ఈ కేసులో ప్రూఫ్ లు అడుగుతాడు
తన కూతురు విషయం బయటికి పొక్కితే సమాజం ఆమెను ఎక్కడ లోకువగా చూస్తుందో అన్న అనుమానంతో తానే తన కూతుర్ని పాతిపెట్టినట్టు చెప్తుంది
పోలీస్ ఆఫీసర్ మురళీ శర్మ లక్ష్మిని తీసుకుని ఆమె సరస్వతిని పాతిపెట్టిన చోటుకు వెళ్తే అక్కడ శవం ఉండదు
దాంతో ఎవిడెన్సులు లేనిదే ఈ కేసులో తానేమీ చేయలేనని ఆ పోలీస్ ఆఫీసర్ కూడా పక్కకు తప్పుకుంటాడు
ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలని ఆమె లాయర్ రామానుజాన్ని (ప్రకాష్ రాజ్) ను ఆశ్రయిస్తుంది
మరి లాయర్ రామానుజం ఆమె కేసును టేకప్ చేస్తాడా?
సరస్వతిని ముగ్గురు నిందితులు రేప్ చేసినట్టు లక్ష్మి దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న లాయర్ రామానుజం సొంత ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటికి వస్తాయి?
అసలు అన్యాయం జరిగింది లక్ష్మికా? సరస్వతికా? అనే విషయాలు మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది?
సినిమా మొదలైన అర్థగంట వరకు ఇదేదో తల్లీకూతుళ్ల మధ్య అల్లిన కథ అనుకుంటాం
కానీ ఎప్పుడైతే లక్ష్మి కూతురు సరస్వతి ముగ్గురు నిందితులు వల్ల మానభంగానికి గురై స్కూల్లో చనిపోతుందో కథ క్రైమ్ రేట్ లోకి టర్న్ తీసుకుంటుంది
దానికి తోడు లక్ష్మి కూతురు శవం మాయం కావడం , స్కూల్లో క్రైమ్ జరిగినట్టు ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోవడం, ఎవిడెన్సులు లేవని పోలీసులు, న్యాయస్థానాలు ఆమెకు న్యాయం చేయలేకపోవడంతో చివరకు లక్ష్మి తనే స్వయంగా నిందితులను హత్య చేయడం వంటి సన్నివేశాలతో కథ చకచకా పరుగులు పెడుతుంది
ఈ కేసులో లక్ష్మి అమాయకురాలు అనీ, కూతురికి జరిగిన అన్యాయం తట్టుకోలేక ఆమె ఈ నేరాలు చేసిందని లాయర్ రామానుజం నమ్మి తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టడంతో కథనం పట్ల ఆసక్తి కలుగుతుంది
ప్రకాష్ రాజ్ కోర్ట్ సన్నివేశాలు బాగుంటాయి
సరైన సాక్ష్యాధారాలు లేవని రేప్ చేసిన ముద్దాయిని విడుదల చేస్తూ నాగపూర్ లో న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన క్షణమే అతడ్ని రెండొందలమంది బాధిత మహిళలు రాళ్లతో కొట్టి చంపిన ఉదంతం ప్రకాష్ రాజ్ కోర్టులో చెప్తూ మహిళల హక్కుల విషయంలో, భద్రత విషయంలో ఒక్కోసారి సాక్ష్యాధారాల కన్నా సత్వర న్యాయమే త్వరితగతిన పని చేస్తుందని అంటాడు
ఇలాంటి కోర్ట్ సీన్లు బాగా పండాయి
దానికి తోడు ప్రకాష్ రాజ్ నటన అడ్వాంటేజ్ అయ్యింది
ప్రకాష్ రాజ్ అసిస్టెంట్ గా చాన్నాళ్లకు కమెడియన్ సప్తగిరి కనిపిస్తాడు
ఫక్తు కమెడియన్ అయిన సప్తగిరి ఇందులో హుందా అయిన పాత్రలో నటించి మెప్పించాడు
అతడు కనిపించేది కాసేపే అయినా చక్కటి హావభావాలు ప్రదర్శించాడు
ఇదిలా ఉండగా ఇంటర్వెల్ ముందు లక్ష్మిని సైకియాట్రిస్ట్ నాజర్ ప్రశ్నించడంతో ఆమె గతం బయటపడుతుంది
దీంతో తరువాత కథేంటో చాలామందికి ఈజీగా అర్థమైపోతుంది
లక్ష్మి గతం తెలిసిన తర్వాత అప్పటిదాకా నడిచిన కథలో చిక్కుముడులు ఒకటొకటిగా విడిపోతాయి
మరోపక్క అప్పటివరకు కథలో ఉన్న పట్టు సడెన్గా వీగిపోతుంది
లక్ష్మి ఆ హత్యలు చేయడం వెనుక అసలు విషయం తెలిసిపోతుంది
దీంతో సెకండాఫ్ స్టోరీ నామమాత్రమే అయిపోయింది
దానికి తోడు సెకండాఫ్ స్లోగా నడుస్తుంది
సరస్వతి చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్ ఎవరనే విషయంలో కానీ , మినిష్టర్ విషయంలో కానీ కొన్ని విషయాలు గందరగోళంగా అనిపిస్తాయి
సరస్వతికి ఓ ముసలవ్వ రివాల్వర్ ట్రైనింగ్ ఇవ్వడం కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది
నిజానికి ఇటువంటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీల్లో ప్రేక్షకుడు ట్విస్టులు వెతుకుతాడు
స్క్రీన్ ప్లే లో గ్రిప్పింగ్ పెరగాలంటే ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు ఉండాలి
అప్పుడే కధనంలో పట్టు పెరుగుతుంది
తరువాయి సన్నివేశాలు చూడటానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది
సరస్వతి మూవీ క్లైమాక్సులో మినహా అటువంటి ఊహించని ట్విస్టులు ఏమీ లేవు
అంతటిపేరు మోసిన లాయర్ రామానుజం కూడా చివరివరకు లక్ష్మి మెంటల్ డిజార్డర్ తోనే ఈ హత్యలు చేసిందని నమ్ముతాడు
అయితే మళ్ళీ క్లైమాక్సులో చిన్న ట్విస్ట్ ఇచ్చి వరలక్ష్మీ శరత్ కుమార్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది
ముగింపు ట్విస్ట్ ఎవరూ ఊహించకపోయినా ఇంకాస్త జస్టిఫికేషన్ ఉండే విధంగా దర్శకురాలు ఆ సన్నివేశాలను మలిచి ఉంటే బాగుండేది
ఎందుకో కాస్త హడావుడి ముగింపు ఇచ్చినట్టు అనిపిస్తుంది
చివరగా తమకు జరిగిన అన్యాయాల పట్ల స్త్రీలు మౌనంగా ఉండరాదని అపర కాళికలై పోరాడాలని సందేశం ఇస్తూ సినిమాని ముగించింది వరలక్ష్మీ శరత్ కుమార్
ఎవరెలా చేశారు?
డిఫరెంట్ షేడ్స్ లో నటించగల చక్కటి నటిగా వరలక్ష్మీ శరత్ కుమార్ తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది
అదేంటో కానీ ఈమెకు ప్రతినాయిక పాత్రలే ఎక్కువగా వచ్చాయి
ఎస్ సరస్వతి లో మాత్రం బాధితురాలి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది
తల్లీకూతుళ్ల బాంధవ్యంలో ఎమోషన్లు పండిస్తూనే తనకు జరిగిన అన్యాయం పై ప్రతీకారం తీర్చుకునే వీరనారి పాత్రలో సహజంగా నటించింది
ఆమె నటన వరకు పెద్దగా లోపాలు లేకపోయినా దర్శకత్వంలో మాత్రం అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి
అయినా వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఇదే మొదటి దర్శకత్వం కాబట్టి బాగానే తీశారు అనుకోవచ్చు
ఇక ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది?
సహజ నటుడు
ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలడు
లాయర్ రామానుజం పాత్రలో కోర్ట్ సన్నివేశాలు చక్కగా పండించాడు
ఇక మురళీ శర్మ కు పోలీస్ ఆఫీసర్ గెటప్ కొట్టిన పిండి
పాత సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ మాదిరే ఇందులో కూడా కనిపిస్తాడు
రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాధిక, ప్రియమణి, తులసి, రఘుబాబుల నటన బాగానే ఉంది
సాంకేతికత
కోర్ట్ సన్నివేశాలు బాగున్నాయి కానీ కోర్ట్ హాల్ మరీ నాసి రకంగా ఉంది
సినిమాలో చూపించిన స్కూల్లోనే కోర్ట్ హాల్ సెట్టింగ్ వేసినట్టున్నారు
అలాంటి బల్లలే వాడారు
తమన్ లాంటి వాడు డ్రమ్ములు బాదినా ఎందుకో ఆ ఎఫెక్ట్ రాలేదనిపిస్తుంది
సినిమాటోగ్రఫీ పర్లేదు
నిర్మాణ విలువలు కూడా పర్లేదు
విశ్లేషణ
కథ కొత్తదేమీ కాదు కానీ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి నచ్చుతుంది . లక్ష్మి, సరస్వతులు వేరు వేరు అని చూపించినంతవరకు కథలో పట్టు బాగుంటుంది..ఒకరకంగా ఫస్టాఫ్ కధనంలో కుతూహలం రేకెత్తిస్తుంది . సెకండాఫ్ లో వచ్చేసరికి కథలో మెయిన్ ప్లాట్ తెలిసిపోవడంతో కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సైక్రియాట్రిస్టు పాత్రలో నాజర్ రంగప్రవేశం చేయడంతో క్యూరియాసిటీ పెరిగింది అనుకునేంతలోనే ఆ పాత్రను హడావుడిగా ముగించారు . చక్కటి నటుడు నాజర్ పాత్రను కొద్దిగా పొడిగించి ఉంటే బాగుండేది . అయినా ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేషన్ తో కొంత క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. దాంతో కథ ఒక ఫ్లో లో సాగిపోతూ మనకి బోర్ అయితే కొట్టదు. అసభ్య ,అశ్లీల సన్నివేశాలు ఏమీ లేవు కాబట్టి నిక్షేపంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ (ప్రైమ్) లో చూడొచ్చు
నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మురళీ శర్మ, రావు రమేష్, సప్తగిరి తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ : ఎడ్విన్
నిర్మాత, దర్శకత్వం: వరలక్ష్మీ శరత్ కుమార్
విడుదల: అమెజాన్ ప్రైమ్
రేటింగ్: 2.75/5
