ఆదివాసీనుంచి ఐఏఎస్ దాకా .. బతుకు పోరాటంలో గెలిచిన ఓ వనిత !
ప్రేమలో ఫెయిల్యూర్ అనీ .. సంసారంలో కలహాలు అనీ.. ఆర్థిక ఇబ్బందులనీ జీవితాలను అంతం చేసుకునే అమ్మాయిలు ఈ మహిళ చేసిన పోరాటాన్ని గమనించండి
ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ఆడపిల్ల ఉరితాడును విసిరి కొట్టి ఆడపులిలా ఎదురుతిరిగిన పరిస్థితి వెనుక కారణాలు ఏంటి ?
పదవ తరగతిలో చదువులకు బ్రేక్ పడిన ఓ ఆడపిల్ల ఐఏఎస్ లక్ష్యాన్ని ఎలా సాధించింది ?
ఇది మాములు విషయం కాదు
ఆమె పోరాటం వెనుక చాల తెగింపు ఉంది
బతికి జీవిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన ఉంది
ఆమె ఎవరో కాదు
సవితా ప్రధాన్
ఎందరో ఆడపిల్లల నేటి కష్టాలకు జవాబు
మధ్యప్రదేశ్ లోని మండి గ్రామంలో సామాన్య ఆదివాసీ కుటుంబంలో జన్మించిన సవిత చేసిన పోరాటం నేటి ఆడపిల్లలకు ఖచ్ఛితంగా స్ఫూర్తి అవుతుంది
ఏడుగురు సంతానంలో మూడవ కూతురు సవిత
తల్లితండ్రులు బీడీ ఆకులు ఏరుతూ , కూలి పనులు చేసుకుంటారు
ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు
స్నేహితులు ఇచ్చిన బ్రేడ్ ముక్కను దాచుకుని తినేది
సవితను కూడా పనిలో పెడదాం అనుకున్నారు కానీ 75 రూపాయలు స్కాలర్ షిప్ , జత బట్టలు ,ఒక పూట జావ కోసం తల్లితండ్రులు ఆ పిల్లను బడిలో వేశారు
ఈ అమ్మాయికి చదువు మీద శ్రద్ద ఎక్కువగా ఉండటంతో కష్టపడి చదువుకుని పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యింది
ఆదివాసీ గూడెంలో పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యింది ఈ పిల్ల ఒక్కతే
ఆడపిల్లను గుండెలమీద కుంపటిగా భావించిన తల్లితండ్రులు తనకన్నా 11 ఏళ్ళు పెద్ద అయిన వ్యక్తికి ఇచ్చి ఆ పిల్ల పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు
అబ్బాయి వాళ్ళు స్థితిమంతులు కావడమే ఈ పెళ్లి వెనుక అసలు కారణం
ఇంకా పై చదువులు చదువుకుంటా అని పెళ్ళికి సవిత ఒప్పుకోకపోతే అబ్బాయి స్థితిమంతుడని బలవంతంగా పెళ్ళిచేసారు
పెళ్ళిచేసుకుని అత్తవారింటికి అడుగుపెట్టిన మొదటి రోజే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి
తర్వాత తెలిసింది వాళ్ళకి కావాల్సింది ఇంటికి కోడలు కాదు పనమ్మాయి అని
భర్త రోజూ తాగొచ్చి కొట్టడం నిత్య కృత్యం అయిపొయింది
భర్త ఇంట్లో లేని సమయంలో అత్త సవితను వేధింపులతో కాల్చుకుతినేది
ఇంట్లో టీవీ చూడకూడదు .. అందరూ తిన్న తర్వాతే మిగిలింది తినాలి
నవ్వకూడదు .. ఎవరివంకా కన్నెత్తి చూడకూడదు
చీర చెంగు ముఖానికి కప్పుకుని తిరగాలి . ఇలా ఆంక్షలు పెట్టేవాళ్ళు
ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న తరుణంలో తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసింది
గర్భవతి అని తెలిసినా కూడా ఇంట్లో తిండి సరిగా పెట్టేవాళ్ళు కాదు
లో దుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్ రూమ్ లో తినేది
తల్లికి ఈ విషయాలు చెబితే బాబో.. పాపో పుడితే అన్నీ సర్దుకుంటాయిలే అని తేలిగ్గా తీసుకుంది
ఇద్దరు బిడ్డలు పుట్టినా వేధింపులు తగ్గకపోవడంతో ఆత్మహత్య చేసుకుందాం అనుకుని బెడ్ రూంలో ఫ్యానుకు చీర బిగించుకుని ఉరి వేసుకోబోతూ కిటికీ వైపు చూస్తే అత్తగారు కిటికీలోనుంచి సినిమా చూసినట్టు చూస్తుంది కానీ ఆపే ప్రయత్నం చేయలేదు
ఆ క్షణానే సవిత ఓ నిర్ణయం తీసుకుంది.. ఆ నిర్ణయమే సవిత జీవితాన్ని మలుపు తిప్పింది
తాను చనిపోతే పిల్లలు అనాధలు అవుతారు
భర్తకు అత్తగారు ఇంకో పెళ్లి చేస్తుంది
చచ్చి సాధించేది ఏముంది ? పిల్లలను అనాథలను చేయడం తప్ప ?
అంతే .. ఆ ఉరి తాడును విసిరి కొట్టింది
ఇంట్లోనుంచి బయటికి వచ్చేసింది
ఓ బ్యూటీ పార్లర్ లో అసిస్టెంట్ గా పనికి కుదురుకుంది
సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పేది
ఇవన్నీ చేస్తూనే తాను కూడా దూర విద్య ద్వారా పై చదువులకు ప్రిపేర్ అయ్యింది
అలా బిఎ పూర్తి చేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యింది
ఏదైనా చిన్న ఉద్యొగం దొరక్కపోతుందా అని పేపర్లు తిరగేస్తుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కన్పించింది
అంతే వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కట్టి రేయింబవళ్లు కష్టపడి చదివింది
24 ఏళ్ళ సవిత మొదటి ప్రయత్నంలోనే పబ్లిక్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యి మున్సిపల్ ఆఫీసర్ అయ్యింది
ప్రస్తుతం సవిత మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు
పోలీసుల సాయంతో మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుని ఎటువంటి ఒడిదుడుకులు లేని జీవితం కొనసాగిస్తున్నారు సవిత
తనలాగా మరే ఆడపిల్ల ఇబ్బందులు పడకూడదని ప్రస్తుతం హిమ్మత్ వాలీ లడ్కియా ( బ్రేవ్ గర్ల్స్) పేరుతొ యూ ట్యూబ్ ఛానెల్ పెట్టి వారిలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సవితా ప్రధాన్
చూసారుగా సవిత జీవిత పోరాటం
సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే గమ్యం యెంత మాత్రం దూరం కాదు
ఆమె జీవితం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి !
పరేష్ తుర్లపాటి