అప్పట్లో షాడో మేనియా అట్లుండేది !

Spread the love

నవ్వకండి..ఇది సీరియస్ మ్యాటర్

1970-80 లలో కుర్రకారును డిటెక్టివ్ సాహిత్యం ఒక ఊపు ఊపింది

ఎంతలా అంటే అప్పట్లో డిటెక్టివ్ పుస్తకాలు మార్కెట్లోకి రావటం ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి

మధు బాబు , గిరిజశ్రీభగవాన్ , కొమ్మూరి సాంబశివరావు లతోపాటు మరికొంతమంది రచయితలూ ప్రత్యేకంగా డిటెక్టివ్ నవలలు రాయడంలో పేరు సంపాదించుకున్నారు

ఎవరి స్టైలు వారిదే

మధుబాబు రాసిన షాడో సంచనాలు సృష్టించింది

షాడో నవల కోసం వేలాదిమంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళు
ఆ వేలాదిమందిలో నేను ఒకడ్ని

విజయవాడ అలంకార్ థియేటర్ ఆపొజిట్ లో MKM బుక్ స్టాల్ లో ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత Madhu Babu V. గారు రాసిన షాడో డిటెక్టివ్ నవలలు అద్దెకిచ్చేవాళ్లు

షాడో బుక్ రిలీజ్ కావటం ఆలస్యం పొద్దున్నే షాప్ షట్టర్ కూడా తెరవకముందే స్వాతిముత్యం కమల్ హాసన్ లా వాలిపోయేవాడ్ని

అప్పట్లో షాడో డిటెక్టివ్ నవళ్లు విపరీతంగా చదివి పూనకాలు తెచ్చుకున్నవాడిలో నేనూ ఒకడ్ని

బుక్ చదవటం అయిపోయేలోపు రెండు చేతివేళ్ళ గోళ్లు పూర్తిగా కొరుక్కోవటం పూర్తయిపోయేది ( టెన్షన్తో) అంచేత నాకు నైల్ కట్టర్ అవసరం పడేదికాదు

సరే ,

ఈ MKM బుక్ స్టాల్ యజమాని ఏజ్ బార్ అయినా కూడా పాత హిందీ సినిమాలో హీరో లెక్క ఫిట్ గా ఉండేవాడు
తర్వాత తెలిసింది ఆయన మిలీట్రీ లో చేసి వచ్చారని !

అందుకని ఆయన దగ్గర భయంతో కూడిన గౌరవం ప్రదర్శించేవాడ్ని

అలా ఓ రోజు MKM బుక్ షాపుకెళ్లి షాడో బుక్ తీసుకుని మిలీట్రీ ఆయన్ని మెల్లిగా కదిలించా

“షాడోలా ఫైటింగ్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి అంకుల్ ? ” అని అమాయకంగా అడిగా

బుక్ షాప్ ఓనర్ ఆశర్యంగా చూసాడు నా వంక

“ఏం చదువుతున్నావ్ బాబూ ? ” తేరుకుని అడిగాడాయన

“టెంత్ కొచ్చా అంకుల్ “

“ఫైటింగ్ నేర్చుకుని ఏం చేస్తావ్ ?”

“భలేవారే అంకుల్..షాడో ఏం చేస్తాడో నేనూ అదే చేస్తా “

ఏమనుకున్నాడో ఏమో “రేయ్ ! ఇంకోడొచ్చాడు..మాట్లాడు..”అని కేకేసాడు

లోపల్నుంచి ఆయన కొడుకు బయటికొచ్చి నా వంక చూసాడు !( అతడు కరాటే లో బ్లాక్ బెల్ట్ ఓనరని తర్వాత తెలిసింది )

తండ్రి జరిగింది చెప్పాడు

“సరే ! నీకు ఫైటింగ్ నేర్పుతా..రేపు ఉదయం ఐదు గంటలకల్లా గాంధీనగర్ వెల్కమ్ హోటల్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది. దాని మేడ పైకి రా ..సరిగ్గా ఐదు గంటలకల్లా వచ్చేయ్ “

ఇంకేం మనం కూడా షాడోలా శత్రువుల గుండెల్లో శతాబ్ది ఎక్స్ప్రెస్ పరిగెట్టించొచ్చు అని ఇంటికెళ్లి పొద్దున నాలుగు గంటలకే అలారం పెట్టుకుని’ షాడో షాడో ‘ అనుకుంటూ పడుకున్నా

చెప్పిన ప్రకారం తెల్లవారుఝామున ఐదు గంటలకు ఎస్బిహెచ్ డాబాపైకి చేరుకున్న నన్ను చూసి మిలీట్రీ ఆయన కొడుకు ఆశర్యపోయాడు

అప్పటికే అక్కడ నలుగురు షాడోలు ఉన్నారు
వాళ్ళు కూడా నాలాగే లేత సొరకాయలు

“ముందు నీకు కరాటే నేర్పుతా..మొదలెడదామా ” అని గాల్లోకి కాళ్ళు చేతులు ఉపటం మొదలెట్టాడు బ్లాక్ బెల్ట్

సరే అని నేనూ కాళ్ళు చేతులూ ఉపటం మొదలెట్టా

ఓ పదినిమిషాలు ఊపిన తర్వాత అతడు దగ్గరకొచ్చి నా చేతులు పట్టుకుని చూసాడు

“చూడు తమ్ముడూ ! లేత సొరకాయ గిల్లితే గోరు దిగుతుందే నీ చేతులు కూడా అలాగే ఉన్నాయ్..లైట్ గా గిల్లితే లీటర్ రక్తం కారేలా ఉంది..ఈ అరచేతులు చూడు..పూరీ పిండిలా ఎంత మెత్తగా ఉన్నాయో..అరచేతులు కత్తుల్లా ఉండాలి..ఇలా సుకుమారంగా ఉంటే కరాటే కాదు కదా కబాడీకి కూడా పనికిరావ్ “అని ఆత్మాభిమానం మీద గిల్లాడు

“మరి షాడో లా అవ్వాలంటే ఏం చెయ్యాలి..”రోషంగా అడిగా

“ఎవడికైనా ఐఏఎస్సో ఐపీఎస్సో అవ్వాలని ఉంటుంది..నువ్వెంట్రా బాబూ షాడో అవ్వాలంటావ్ ?
అని నసుక్కుని ,

ఇదిగో ఇలా రాటు దేలాలి అంటూ ఓ గమ్మేలాలో వేడి ఇసుక తెప్పించి అరచేతి సైడులను కత్తిలా చేసుకుని ఆ ఇసుకలో బాదమన్నాడు

అలాగే బాదా

ముందు ఆ వేడికి గిల గిలాలాడిపోయా
నాల్రోజుల్లో అలవాటు అయిపోయింది

అతడన్నట్టు చేతులు కత్తుల్లా తయారయ్యాయ్

‘బాగా చేస్తున్నావోయ్.. ఇగ ఇంట్లో సొరకాయలు తరగాలంటే కత్తులు అవసరం లే..నీ చేతులు చాలు..ఇలా కంటిన్యూ చేస్తే షాడో కే షాడో ఆవుతావ్ ‘ అని నన్ను మెచ్చుకున్నాడు కూడా

అప్పుడడిగా ,

“అంకుల్..నెక్స్ట్ రివాల్వర్ తో కాల్చటం ఎప్పుడు నేర్పుతారు అని !”

షాక్ అయ్యాడు
ఆ మర్నాటినుంచి అతడు అడ్రస్ లేడు

అట్లుండేది అప్పట్లో మనకు షాడో మేనియా !!

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!