సినిమా హిట్ కొట్టాలంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు , ముంబై హీరోయిన్లు ,భారీ బడ్జెట్లే అవసరం లేదు
సింపుల్ కథతో , అంతకన్నా సింపుల్ బడ్జెట్ తో కొత్తవాళ్లతో కూడా తియ్యొచ్చు
వాళ్ళతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చు
అయితే స్క్రీన్ ప్లే మీద దర్శకుడికి పట్టు ఉండటం చాలా అవసరం
థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను రెండు గంటలపాటు సినిమాలో లీనం చేయించగలిగే టాలెంట్ ఆ దర్శకుడితో ఉంటే చాలు
భారీ తారాగణంతో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాని రెండు మూడేళ్లు షూటింగ్ చేసే దర్శకుల కన్నా తక్కువ బడ్జెట్లో , తక్కువ టైములో ఎక్కువ రిటర్న్స్ అందించే దర్శకుల వల్ల నిర్మాతలకు సుఖం
సిరాయ్ ఆ కోవలోకే వస్తుంది
స్టార్ హీరోలు , భారీ బడ్జెట్ వంటి హడావుడిలు లేకుండా సింపుల్గా మూడు కోట్లు పెట్టి తీసి ముప్పై కోట్ల వసూళ్లు రాబట్టుకున్నారు
వసూళ్ల పరంగా తమిళనాట మంచి కలెక్షన్లు సాధించిన సిరాయ్ తాజాగా ఓటిటి లోకి కూడా అందుబాటులోకి వచ్చింది
అన్నట్టు మూవీ పోస్టర్ చూసి ఇదేదో పూర్తిగా పోలీసోడి కథ అనుకుంటాం
కానీ అసలు కథ వేరే ఉంది
సినిమాకి అదే ప్లస్సు
ఎన్ని దినుసులు వేసినా ముంత మసాలాలో అంత నిమ్మ చెక్క పిండితేనే ఫ్లేవర్ వస్తుంది
ప్రస్తుతం కొన్ని జానర్లలో తీసే సినిమాల్లో ఈ ఫ్లేవర్లు మిస్సయి గిరికీలు కొడుతున్నాయి
ఉదాహరణకు మాంచి హర్రర్ జానర్లో సినిమా కదా అని వెళ్తే ఫుల్ కామెడీ చేసాడనుకోండి
నవ్వు రాకపోగా సినిమా తీసినోడిమీద కోపం వస్తుంది
కాబట్టి సినిమా ఏ జానర్ అయినప్పటికీ ఏ రసాన్ని ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో వాడినప్పుడే సరైన ఔట్పుట్ వస్తుంది
అలాగే సీరియస్ గా సాగుతున్న క్రైమ్ సినిమాలో సడెన్గా ఐటెం సాంగ్ రావడం , హీరో అండ్ కో జూనియర్ నటులచేత వెకిలి కామెడీ చేయించడం , ఘడియ ఘడియకి గ్యాప్ ఫిల్లింగ్ కోసం పాట పెట్టడం వంటి పాత ఫార్ములాలు ప్రస్తుత రోజుల్లో వర్కౌట్ కావు
క్రైమ్ సినిమాలో మొదటినుంచి చివరివరకు సీరియస్నెస్ చెడకుండా ప్రేక్షకుడ్ని కథలో లీనం చేయించగలగాలి
సిరాయ్ లో దర్శకుడు చూపించిన పనితనం అదే
క్రైమ్ నేపథ్యంలో రాసుకున్న కథలో చక్కటి చిక్కటి ఎమోషనల్ రసం పిండి ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించాడు
సిరాయ్ కధేంటి ?
సినిమా ప్రారంభమే 2003 , వేలూరు అనే సబ్ టైటిల్స్ మధ్యలో ఒక ఖైదీని ముగ్గురు ఏఆర్ ఎస్కార్ట్ కానిస్టేబుళ్లు కోర్టుకు తీసుకెళ్తున్న సన్నివేశంతో మొదలౌతుంది
ఆ ఏఆర్ కానిస్టేబుళ్లలో ఒకరు శ్రీనివాస్ ( విక్రమ్ ప్రభు )
అయితే ఆ ఖైదీని బస్సులో తీసుకెళ్తుండగా అతడి అనుచరులు దాడి చేసి అతడ్ని విడిపించుకుని వెళ్తుండగా శ్రీనివాస్ తుపాకీతో కాల్చడంతో సదరు ఖైదీ చనిపోతాడు
ఈ సంఘటనపై పై అధికారులు శ్రీనివాస్ మీద విచారణ కమిటీ వేస్తారు
ఇదిలా ఉండగా అనుకోని పరిస్థితుల్లో జైల్లో ఉన్న అబ్దుల్ రవూఫ్ ( అక్షయ్ కుమార్ ) అనే రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరుపరిచే డ్యూటీ శ్రీనివాస్ మీద పడుతుంది
ఆ డ్యూటీలో భాగంగా జైల్లో ఉన్న అబ్దుల్ రవూఫ్ ను మరో ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో తన కస్టడీలోకి తీసుకుని కోర్టులో హాజరుపరచటానికి బస్సులో బయలుదేరతాడు
ఈ క్రమంలో అబ్దుల్ తప్పించుకుని పారిపోతాడు
దాంతో శ్రీనివాస్ తో పాటు మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా షాక్ అవుతారు
ఆల్రెడీ ఒక ఖైదీని ఎన్కౌంటర్ చేసారని వాళ్ళ మీద విచారణ జరుగుతుంది
ఈ విషయం పై అధికారులకు తెలిస్తే ఉద్యోగాలు కూడా పోతాయని టెన్షన్ పడుతూ కంప్లైంట్ ఇవ్వడానికి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్తారు
ఆశ్చర్యంగా అబ్దుల్ అక్కడ ఉంటాడు
తిరిగి అబ్దుల్ ను తమ కస్టడీలోకి తీసుకుని ఆ రాత్రి వేళ ఓ లారీలో వెళ్తున్న సమయంలో శ్రీనివాస్ అతడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని ఆశ్చర్యపోతాడు
ఇంతకీ అబ్దుల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ?
తప్పించుకుని పారిపోయిన అబ్దుల్ తిరిగి పోలీస్ స్టేషన్లో ఎలా ప్రత్యక్షము అవుతాడు ?
అబ్దుల్ రవూఫ్ చేసిన నేరం ఏంటి ?
అతడికి లవ్ స్టోరీ ఉందా ? అనేవి మిగిలిన కథనంలో తెలుస్తాయి
ఎలా ఉంది ?
సాధారణంగా ఏ సినిమానైనా హీరో తన భుజాన వేసుకుని నడిపిస్తాడు
కానీ ఈ సినిమాని మాత్రం ఓ రెండు క్యారెక్టర్లు తమ భుజాన వేసుకుని నడిపించాయి
ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాకి విక్రమ్ ప్రభు కన్నా ఆ రెండు క్యారక్టర్లే హీరోలు
ఆ ఇద్దరే అబ్దుల్ పాత్ర వేసిన అక్షయ్ అండ్ కళా పాత్రలో నటించిన అనిష్మ
వీళ్ళిద్దరూ ఆ స్థాయిలో నటించకపోతే సినిమా తేలిపోయేది
సినిమా ప్రారంభం చూస్తే మనకు సాధారణ కానిస్టేబుళ్ల జీవితం గురించి చెప్తున్నారేమో అని అనుమానం వస్తుంది
జైల్లో ఉన్న ఖైదీలను ఎస్కార్ట్ పోలీసులు ఏ విధంగా కోర్టులో హాజరు పరుస్తారు అని వివరంగా చూపించారు
దీనికి చాలా తతంగం ఉంటుందని సినిమా చూస్తే అర్ధమౌతుంది
కోర్టుల వారీగా , ఊళ్ళ వారీగా ఖైదీలను న్యాయస్థానాల్లో హాజరుపరిచే డ్యూటీలను ఎస్కార్ట్ పోలీసులకు పై అధికారులు నిర్ణయిస్తారు
వారు ఇచ్చిన డ్యూటీ చార్టులను తీసుకుని జిల్లా జైలుకి వెళ్లి అక్కడి సూపరింటెండెంట్ కి ఇస్తే ఆయన ఒక్కో ఖైదీని వాళ్లకు అధికారికంగా హ్యాండోవర్ చేస్తారు
ఇక అక్కడ్నుంచి ఖైదీలను కోర్టులో హాజరు పరిచి తిరిగి జిల్లా జైలుకి తీసుకు వచ్చే బాధ్యత ఎస్కార్ట్ కానిస్టేబుళ్ళదే
అయితే సాధారణంగా రిమాండ్ ఖైదీలను పోలీస్ అధికారిక వాహనాల్లో కోర్టులకు తరలిస్తారు
కానీ ఈ సినిమాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం అంటే బస్సుల్లో తీసుకెళ్తారు
సినిమాటిక్ లిబర్టీ కోసం దర్శకుడు ఈ విధానాన్ని ఎంచుకున్నాడో ? లేకపోతే నిజంగానే ఖైదీలను అలా బస్సుల్లో , ఆటోల్లో బేడీలు వేసి కోర్టులకు తీసుకెళ్తారో తెలీదు
రెండు రేపులు , మర్డర్ చేసిన ఖైదీని బస్సులో తీసుకెళ్తుంటే అతడి అనుచరులు దాడి చేసి విడిపించుకుపోతున్న సన్నివేశాన్ని సినిమా ప్రారంభంలోనే చూపించారు
నిజంగా ఖైదీలను ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకెళ్తే సాధారణ ప్రజలకు ఇబ్బంది కదా?
ఈ సందేహాలను అలా ఉంచితే ఖైదీలను కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఎస్కార్ట్ కానిస్టేబుళ్ల డ్యూటీని కళ్ళకు కట్టినట్టు చూపించడం బావుంది
దారిపక్కనే డాబాల్లో టీ తాగడం , తిండి తినడం , పొద్దున్నే ఊరికి చేరుకున్న తర్వాత డాబాలో స్నానపానాదులు ముగించి రెడీ అవడం లాంటివి సహజంగా ఉన్నాయి
ఇక వీళ్ళు కోర్టులో హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న రిమాండ్ ఖైదీ అబ్దుల్ రవూఫ్ నటన నెక్స్ట్ లెవెల్
చూస్తే నిజంగానే ఐదేళ్ళబట్టి జైళ్లలో మగ్గుతున్న రిమాండ్ ఖైదీలా అనిపించాడు
అతడి ఫ్లాష్ బ్యాక్ లో పల్లెటూరి నేపథ్యంలో తీసిన సన్నివేశాలు బాగున్నాయి
నేటివిటీకి తగ్గట్టుగా లొకేషన్లు పిక్చరైజ్ చేయడంలో దర్శకుడు పూర్తి శ్రద్ధ పెట్టాడు
పల్లెలో అబ్దుల్ ఇల్లు , ఇంటి అరుగు మీద చిల్లర దుకాణం సహజంగా అనిపిస్తాయి
ఇప్పటికీ పల్లెటూళ్లలో ఇంటి అరుగుమీద చిల్లర దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి
అలాగే కళా ఇంటికి వెళ్ళడానికి వెదురు బొంగులతో గేట్లు ఏర్పాటు చేయడం సహజంగా అనిపిస్తాయి
టేపులతో ప్లే అయ్యే పాత వీడియో కేసెట్లు ఆ రోజులను గుర్తు చేస్తాయి
ఈ అబ్దుల్ కి తల్లి అంటే ప్రాణం , కళా అంటే తన ప్రాణాన్ని మించిన ప్రేమ
కాకపోతే మతం వల్ల అబ్దుల్ పడిన ఇబ్బందులను అక్కడక్కడా దర్శకుడు ప్రస్తావిస్తాడు
ఇదేదో ఒకట్రెండు సందర్భాల్లో కాబట్టి సరిపోయింది
అంతకన్నా ఎక్కువగా మతం మీద ఫోకస్ చేసి ఉంటే సినిమా లక్ష్యం దెబ్బ తినేది
ఒకదశలో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని అడుగుతాడు
రిజిస్టర్లో గన్ వివరాలు నమోదు చేస్తూ’ బుల్లెట్లు ఏవీ ?’ అని అడుగుతాడు
అప్పుడు కానిస్టేబుల్ ‘గన్ లో లోడ్ చేసి ఉన్నాయి సర్ ‘ అంటాడు
ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతూ ‘ అదేంటి ! సర్వీస్ రూల్స్ ప్రకారం బుల్లెట్లు ముందుగానే గన్ లో లోడ్ చేయకూడదు కదా ? ఎందుకు చేసావ్ ?’ అని అడుగుతాడు
దానికి ఆ కానిస్టేబుల్ ‘ అతడు ముస్లిం సార్ ‘ అని సమాధానం చెప్తాడు
దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా ‘ మరి నేను కూడా ముస్లిం నే ..చంపేస్తావా ?’అని అడుగుతాడు
మధురైలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే తనను జైలునుంచి మార్చి వేలూరు జైలుకి షిఫ్ట్ చేసారని అబ్దుల్ ఇంకో సందర్భంలో చెప్తాడు
నిజానికి మతం వల్ల అబ్దుల్ ఇబ్బందులు పడింది అతడి ప్రేమ విషయంలోనే
ఈ అంశాన్ని అంతవరకే పరిమితం చేసి ఉంటే బాగుండేది
దీన్ని కవర్ చేసుకోవడానికి అన్నట్టుగా కోర్టులో ప్రవేశపెడుతున్న సమయంలో తాను నమాజ్ చేసుకుంటానని శ్రీనివాస్ తో చెప్పి అబ్దుల్ అక్కడే కింద నమాజ్ చేసుకుంటాడు
అదే సమయంలో అక్కడే అతడి ప్రియురాలు కళా దేవుడ్ని ప్రార్థిస్తుండటం చూపించాడు
ఈ సన్నివేశం బాగుంది
తర్వాత శ్రీనివాస్ సలహాతో అబ్దుల్ , కళా లు న్యాయమూర్తిని ఆయన ఛాంబర్లో కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పి కాపాడమని ఏడ్చినప్పుడు జడ్జి వాళ్ళిద్దరినీ తన ఎదురుగా కూర్చోబెట్టుకుని ఫైల్స్ తెప్పించుకుని చూసి ఈసారి వాయిదాలో విడుదల చేస్తూ తీర్పు ఇస్తానని చెప్పడం ఎమోషన్ పరంగా వర్కౌట్ అవుతుంది కానీ లాజిక్ పరంగా వర్కౌట్ కాదు
నిర్దోషిగా రుజువు కానంతవరకు నిందితులతో ఏ జడ్జి పర్సనల్ గా తన ఛాంబర్లో ప్రైవేటుగా మాట్లాడడు
ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం
అయితే లాజిక్కును పక్కనబెడితే సినిమాలో ఈ సన్నివేశం బాగా పండింది
ఒకరకంగా సినిమాకి హైలెట్ ఈ సన్నివేశం
ఓవరాల్ గా దర్శకుడు క్రైమ్ ఎపిసోడ్ తో మొదలుపెట్టి మనల్ని కథలోకి ఎలా తీసుకెళ్లాడంటే ఒక రిమాండ్ ఖైదీ , అతడి ప్రియురాలు , లవ్ స్టోరీ , ఎమోషనల్ టచ్ , ఎండింగ్ శుభం కార్డుతో ముగించాడు
మధ్యలో ఎక్కడా వెకిలి కామెడీలు లేవు
లవ్ స్టోరీ కాబట్టి విపరీతమైన పాటలు లేవు
క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ కాబట్టి మితిమీరిన వయొలెన్స్ లేదు
స్క్రీన్ ప్లే అలా సాగిపోతుంది
కాకపోతే ప్రారంభంలో కథ కాసేపు నెమ్మదిగా నడుస్తుంది
ఎవరెలా చేసారు ?
ఈ సినిమాలో మెయిన్ క్యారక్టర్ గా విక్రమ్ ప్రభు నటించినా ఎవరెలా చేసారంటే ముందుగా అబ్దుల్ పాత్ర వేసిన అక్షయ్ కుమార్ , కళా పాత్ర పోషించిన అనిష్మాల నటన గురించే చెప్పుకోవాలి
అసలు ఆ పల్లెటూరిలో చూస్తే వీళ్ళిద్దరూ మరీ చిన్నపిల్లల్లా లేతగా అమాయకంగా కనిపిస్తారు
రిమాండ్ ఖైదీ గా అబ్దుల్ ను చూస్తే అక్షయ్ కుమార్ నిజంగానే గతంలో రిమాండ్ ఖైదీ అయ్యుంటాడు అన్న అనుమానం వస్తుంది
ఆ కుర్రాడి నటన చాలా సహజంగా ఉంది
ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా బాలన్సుడ్ గా నటించాడు
కళా పాత్రలో నటించిన అనిష్మ నిజంగానే అబ్దుల్ ను ప్రేమించిందా అన్నంతగా నటనలో జీవించేసింది
పల్లెటూరి నేపధ్యానికి తగ్గట్టుగా ఆ పిల్ల ముఖంలో అమాయకత్వం , హావభావాలు బాగున్నాయి
ఇప్పుడు విక్రమ్ ప్రభు నటన గురించి చెప్పుకోవాలంటే సాలీడ్ పెర్ఫార్మన్స్ ప్రదర్శించాడు
అతడి ఆహార్యం దృష్ట్యా పోలీస్ గెటప్పుకి బాగా షూట్ అయ్యాడు
ఆ హైటూ , పర్సనాలిటీ చూస్తే అతడ్ని గబుక్కున పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి అనుకుంటాం
సాంకేతికత
నిజానికి ఈ సినిమా తక్కువ బడ్జెతోనే తీసినా సాంకేతికత విషయంలో మాత్రం తక్కువ చేయలేదు
పల్లెటూరి సన్నివేశాలు తీసినప్పుడు ఎక్కడా నేటివిటీ చెడకుండా చక్కగా తీయడంలో ఫోటోగ్రఫీ పనితీరు బావుంది
అలాగే బీజీఎమ్ కూడా పర్లేదు
నిర్మాణ విలువలు కూడా పర్లేదు
క్రైమ్ స్టోరీలో లవ్ ఎపిసోడ్ ని మిక్స్ చేసి జాగ్రత్తగా కథనం నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు
ఎమోషనల్ గా ప్రేక్షకులను ఎంతవరకు తీసుకెళ్లాడో అంతవరకు తీసుకెళ్లాడు
విశ్లేషణ : క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో లవ్ స్టోరీ అండ్ ఎమోషన్స్ చూడటానికి ఇష్టపడేవాళ్ళకు సినిమా నచ్చుతుంది. సినిమాలో ఎక్కడా అశ్లీలం , అసభ్యతా సన్నివేశాలు లేవు కాబట్టి ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు
నటీనటులు : విక్రమ్ ప్రభు , అక్షయ్ కుమార్ , అనిష్మ
దర్శకత్వం : సురేష్ రాజకుమారి
విడుదల : 26-1-2026 ( Z 5 ఓటిటి )
రేటింగ్ : 3 .75 / 5
