తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర రావు నియామకం వెనుక పార్టీ పెద్దల వ్యూహం ఏంటి ?
టి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు
నిజానికి ఈ పదవికి రామచంద్ర రావు మినహా ఈటెల రాజేందర్ ,ధర్మపురి అరవింద్ , రఘునందన్ రావు , రాజాసింగ్ , డీకే అరుణ వంటి హేమాహేమీలు పోటీ పడ్డారు
రాజాసింగ్ అయితే ఏకంగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు కూడా
అయితే పది మంది కౌన్సిల్ సభ్యుల సంతకాల స్థానంలో ముగ్గురు మాత్రమే సంతకాలు పెట్టడంతో ఆయన నామినేషన్ కు బ్రేక్ పడింది
ఇదిలా ఉండగా అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ బీజేపీ అధిష్టానం ఎన్ రామచంద్ర రావు పేరు ఖరారు చేసింది
గడిచిన ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను తప్పించి చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రక్రియలో ఇప్పుడు ఆచితూచి రామచంద్ర రావు పేరును అధిష్టానం ఖరారు చేసిందని పార్టీ వర్గాల్లో టాక్
టి బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు ముందు నుంచీ ప్రచారంలోకి వచ్చినప్పటికీ పార్టీ సంస్థాగత ఎన్నికల నిబంధనల ప్రకారం ఈటెలకు అవకాశం రాకపోవచ్చని కిషన్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఆయన పేరు వెనుకబడిపోయింది
ఇక కిషన్ రెడ్డి మద్దతుదారుడిగా పేరు బడ్డ రఘునందన్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది
రఘునందన్ కూడా అధ్యక్ష పదవికి గట్టి ప్రయత్నాలు చేసారు
కానీ రఘునందన్ కూడా పార్టీలో కొన్ని విషయాల్లో వివాదాస్పదుడు అవడంతో ఆయన అభ్యర్థిత్వం వెనుకబడిపోయింది
ఇక బీజేపీలో ఒంటరి నాయకుడు అయిన రాజాసింగ్ సొంతంగా బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు
కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు
ఈ నేపథ్యంలో సోమవారం ఎన్ రామచంద్ర రావు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది
అధిష్టానం ముందే ఆయన పేరు ఖరారు చేయడంతో లాంఛనంగా జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికలలో రామచంద్ర రావు నియామకం ఖరారు అయిపొయింది
బీజేపీ అధిష్టానం రామచంద్ర రావు పేరును ఖరారు చేయడం వెనుక పక్క వ్యూహం ఉంది
నిజానికి రామచంద్ర రావు నేరుగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు తక్కువ
2015-21 మధ్య కాలంలో ఎమ్మెల్సీ గా పనిచేసిన అనుభవం ఉంది
అన్నిటికన్నా ముఖ్యంగా రామచంద్ర రావుకు ఆరెస్సెస్ నేపథ్యం ఉంది
లా చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లోనే రామచంద్ర రావు ఆరెస్సెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు
బీజేపీ కార్యాలయానికి క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వచ్చేవాళ్లలో రామచంద్ర రావు ముందుంటాడు
పార్టీలో మితవాదిగా సౌమ్యుడిగా రామచంద్ర రావుకు మంచి పేరుంది
పార్టీలో సీనియర్ నాయకులు అందరితో సత్సంబంధాలు ఉండటంతో రామచంద్ర రావు అభ్యర్థిత్వం పట్ల ఎక్కడా పెద్దగా వ్యతిరేకత రాలేదు
మాస్ లీడర్లుగా పేరున్న కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు కేంద్ర మంత్రులు కావడం .. పనివత్తిడితో పార్టీ సమన్వయ బాధ్యతలు చేపట్టలేకపోవడంతో అధిష్టానం రామచంద్ర రావు పేరును తెరమీదకు తీసుకువచ్చింది
ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా వ్యవధానం ఉండటంతో తెలంగాణాలో బీజేపీ సంస్థాగత వ్యవస్థను పటిష్టం చేసుకునే ఆలోచనలో ఉంది
అందుకే పార్టీ కోసం పూర్తి సమయం పనిచేయగల వ్యక్తిగా రామచంద్ర రావు పేరు పరిశీలించింది
ప్రస్తుతానికి రామచంద్ర రావు మాత్రమే పార్టీ కోసం ఫుల్ టైం కేటయించగల పరిస్థితుల్లో ఉన్నారు
మిగిలినవాళ్లది రెండు పడవుల మీద కాళ్ళు కాబట్టి అధిష్టానం వాళ్ళను పక్కనబెట్టింది
ఆలా బీజేపీ అన్ని కోణాల్లో ఆలోచించే రామచంద్ర రావు పేరును ఖరారు చేసిందని పార్టీ వర్గాల్లోనే అనుకుంటున్నారు !
పరేష్ తుర్లపాటి