సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడేవారి కోసం అన్ని భాషల్లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి ..వెళ్లాయి
థియేటర్ రిలీజ్ రోజుల్లో ఒకవేళ పొరపాటున సినిమా చూడటం మిస్ అయితే ఇంక అంతే సంగతులు
ఇప్పుడా ఇబ్బంది లేదు
మనం డిజిటల్ యుగంలోకి వచ్చేసాం
ఒకవేళ థియేటర్లో మిస్ అయినా తీరుబడిగా ఓటిటీలో చూడొచ్చు
పైగా రివ్యూల కాలంలో ఉన్నాం
సమయం లేకనో , సరైన ప్రచారం లేకనో పొరపాటున మనం ఏదైనా సినిమా థియేటర్లలో మిస్ అయినా ఓటిటీ ల్లో చూసే అవకాశం వచ్చింది
ఈ ఓటిటీల్లో ఇంకో సౌలభ్యం కూడా ఉంది
బాగున్నాయని టాక్ వచ్చిన పరభాషా చిత్రాలను కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూడొచ్చు.
కొన్ని అయితే లోకల్ లాంగ్వేజ్ లో కూడా సబ్ టైటిల్స్ అందిస్తున్నాయి
దీనివల్ల ఇతర భాషా చిత్రాలను కూడా చూసే అవకాశం వస్తుంది
ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడుకుందాం
ఈ జానర్ లో తెలుగుతో పాటు మళయాళ ,తమిళ , హిందీలో కూడా మంచి సినిమాలు వచ్చాయి
సాధారణంగా ఏ భాషకు సంబంధించిన చిత్రాలు ఆ భాషకు సంబంధించిన స్థానిక రాష్ట్రాల్లోనే థియేటరిక్ రిలీజ్ అవుతాయి
నిర్మాణ సంస్థలు డబ్బింగ్ చేసి అనువదిస్తే కానీ ఇతర రాష్ట్రాల్లో థియేటర్లలో రిలీజ్ కావు
ఈ ఉపాధ్ఘాతం ఎందుకంటే ,
ఇతర భాషల్లో కూడా కొన్ని మంచి సస్పెన్స్ డ్రామా సినిమాలు ఉన్నాయి
అందులో మళయాళం సినిమాలు కూడా ఒకటి
అందులో తంకమ్ మూవీ ఒకటి
గతంలో ఏ కారణం చేతనైనా చూడలేకపోయినవారికోసం ఈ రివ్యూ
కధేంటంటే ?
కేరళలోని త్రిసూర్ లో బంగారు ఆభరణాలు తయారుచేసే వ్యాపారుల్లో ముత్తు (బిజూ మీనన్ ) కూడా ఒకరు
ఈ ముత్తు తయారుచేసిన ఆభరణాలను ముంబైతో సహా ఇతర రాష్ట్రాల్లో అమ్మే పనిని కన్నన్ (వినీత్ శ్రీనివాసన్ ) చూస్తుంటాడు
వీరి గోల్డ్ వ్యాపారంలో స్మగ్లింగ్ కూడా ఒక భాగం అన్నమాట
విలువైన బంగారం రవాణా అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి తాము ఎక్కడికి వెళ్ళేది ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు
అందుకే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కన్నన్ బంగారాన్ని ఓ బెల్టుకు చుట్టి నడుముకు కట్టుకుని వెళ్తుంటాడు
ఇదిలా ఉండగా ఓ రోజు కన్నన్ కి ముంబైకి బంగారం తీసుకెళ్లే పని పడుతుంది
ఇందుకోసం కోయంబత్తూరు వరకు ముత్తును ,అతడి స్నేహితుడు బిజోయ్ ( వినీత్ తట్టి డేవిడ్ ) లను తీసుకెళ్లి అక్కడ ఇద్దరికీ రూమ్ బుక్ చేసి పార్టీ చేసుకోమని చెప్పి ముత్తు కారు తీసుకుని కన్నన్ ఒక్కడే బయలుదేరతాడు
అయితే అనుకోకుండా తమిళనాడు సరిహద్దులో పోలీసులు కన్నన్ కారును ఆపి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు
ఈ విషయం కన్నన్ ముత్తుకు ఫోన్ చేసి చెప్పడంతో వీళ్ళు ఎలాగోలా డీఎస్పీని మ్యానేజ్ చేసి కన్నన్ ను విడిపిస్తారు
అక్కడ్నుంచి కన్నన్ బస్సులో ముంబై వెళ్ళిపోతాడు
ముత్తు వెనక్కి వచ్చేస్తాడు
సరిగ్గా ఈ సమయంలో కన్నన్ ఓ లాడ్జీలో చనిపోయి ఉన్నాడని ముత్తుకి ముంబై పోలీసుల నుంచి ఫోన్ వస్తుంది
దీంతో షాక్ అయిన ముత్తు కన్నన్ భార్యను , తన స్నేహితుడిని వెంటబెట్టుకుని ముంబై పోలీసులను కలుస్తాడు
అక్కడ ఈ కేసును ఇన్స్పెక్టర్ జయంత్ ( గిరీష్ కులకర్ణి ) దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు
బంగారంతో ముంబై చేరిన కన్నన్ ను ఎవరు హత్య చేస్తారు ?
కన్నన్ తీసుకెళ్లిన బంగారం ఏమైంది ?
కన్నన్ మర్డర్ మిస్టరీని ఇన్స్పెక్టర్ జయంత్ ఛేదిస్తాడా ? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
సినిమా ప్రారంభమే కేరళలోని త్రిసూర్ లో గోల్డ్ ఆభరణాలు తయారుచేయడంలో మొదలౌతుంది
మొదటి అర్ధగంట చూస్తే ఇదేదో రొటీన్ సినిమానేమో అని మనకు అనుమానం వస్తుంది
ఎప్పుడైతే కన్నన్ తమిళనాడు పోలీసుల అదుపులోకి వెళ్తాడో కథలో థ్రిల్ మొదలౌతుంది
మఫ్టీ పోలీసులు కన్నన్ ను స్టేషన్ పక్కనే ఉన్న ఓ గదిలో ఉంచి ఇంటరాగేట్ చేయడం , ముత్తు అండ్ అతడి స్నేహితుడ్ని కూడా స్టేషన్ కు పిలిపించి ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టడంతో స్టోరీ క్రైమ్ జానర్ లోకి టర్న్ అవుతుంది
పైగా ముత్తును హోటల్లో దింపి కారులో ఒక్కడే బయలుదేరిన కన్నన్ తమిళనాడు పోలీసులకు మాత్రం మరొకడితో కూడా కనిపిస్తాడు
కానీ కన్నన్ కారులో తాను ఒక్కడినే ప్రయాణిస్తున్నట్టు చెప్పడంతో కథలో గ్రిప్పింగ్ మొదలైంది
పోలీసులు అనుమానిస్తున్నట్టు వీళ్ళు ముగ్గురూ శ్రీలంకలోని జాఫ్నాకు గోల్డ్ స్మగుల్ చేస్తున్నారేమో అని మనకు కూడా అనుమానం వస్తుంది
కానీ డీఎస్పీని మ్యానేజ్ చేసి బయటపడటంతో ఆ ఎపిసోడ్ కు చిన్న బ్రేక్ ఇచ్చినట్లయింది
అదీ కాసేపే ,
ముంబై చేరుకున్న కన్నన్ లాడ్జీలో అనుమానాస్పదంగా మరణించడంతో ఇన్స్పెక్టర్ జయంత్ టీమ్ ఆధ్వర్యంలో అసలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అయిన క్రమంలో వచ్చిన సన్నివేశాలు మనకు థ్రిల్ పంచుతాయి
ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ అసలు హంతకుడు ఎవరు అయ్యుంటారో అని మనకు ఉత్కంఠత పెరిగిపోతుంది
ముంబై పోలీస్ ఇన్స్పెక్టర్ జయంత్ ఎంటర్ అయినప్పటినుంచి మనం సినిమా చూస్తున్నట్టు అనిపించదు
అపరాధ పరిశోధనలో పోలీసులతో పరుగులు తీస్తున్నట్టు అనిపిస్తుంది
కేరళకు సంబంధించిన కన్నన్ మీద తమిళనాడు పోలీసుల అనుమానంతో మొదలై ముంబై లాడ్జిలో మరణించడంతో కేసు మహారాష్ట్ర పోలీసుల దగ్గరికి వస్తుంది
ఈ మర్డర్ మిస్టరీ విప్పడం అంత తేలికైన పని కాదు ..కన్నన్ ప్రయాణం మొదలెట్టిన కేరళలో మొదలుపెట్టి ,తమిళనాడు టచ్ చేసి ముంబై వస్తే కానీ కేసు చిక్కుముడి వీడదు అని ఇన్స్పెక్టర్ జయంత్ ముత్తును తీసుకుని అన్ని స్పాట్లకు బయలుదేరినప్పుడు మనకు క్యూరియాసిటీ పెరుగుతుంది
ఈ క్రమంలో కన్నన్ స్నేహితుడు అరుళ్ ను అదుపులోకి తీసుకోవడం , కన్నన్ ఫోనులో మాట్లాడిన విక్కీతో జైల్లో ఇంటరాగేట్ చేయడం , ముత్తు దగ్గర లంచం తీసుకున్న డీఎస్పీతో మాట్లాడిన సన్నివేశాలు ,అబ్బాస్ భార్యతో మాట్లాడి అతడిని పట్టుకోవడానికి జయంత్ టీమ్ థియేటర్లో మాటు వేయడం వంటి సన్నివేశాలు రక్తి కట్టాయి
పూర్తిస్థాయి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది
పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో వేస్తున్న అడుగులు మనకు అడుగడుగునా ఆసక్తి కలిగిస్తాయి
ఒక దశలో కన్నన్ స్నేహితుడు ముత్తు మీద కూడా ఇన్స్పెక్టర్ అనుమానపడతాడు
ఇలా స్టోరీ క్లైమాక్స్ వరకు ఇదే గ్రిప్పింగ్ తో నడుస్తుంది
కానీ ఎండింగ్ చూస్తే ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది
మొదట్నుంచీ మర్డర్ మిస్టరీలో సన్నివేశాలను కథకు తగ్గట్టుగా పేర్చుకొచ్చిన దర్శకుడు ఎండింగ్ మరింత క్లారిటీగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది
అలాగే కథనంలో అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి
త్రిసూరు నుంచి కోయంబత్తూరుకు , అక్కడ్నించి తమిళనాడుకు కారు లో ప్రయాణించిన గంటలు లెక్కవేసుకుంటే ప్రాక్టికల్ గా సాధ్యమా ? అనిపిస్తుంది
కన్నన్ కారులో కోయంబత్తూరు నుంచి ముంబై బయలుదేరాడా ? లేదా ఇంకెక్కడికైనా బయలుదేరాడా ? అనేది పూర్తి క్లారిటీ లేదు
కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కథనంలో అవన్నీ కొట్టుకుపోతాయి
దర్శకుడి స్క్రీన్ ప్లే మ్యాజిక్కులో కొన్ని లాజిక్కులు పెద్దగా లెక్కలోకి రావు
స్లో నేరేషన్ పట్టించుకోకుండా ఓపిగ్గా చూస్తే మాత్రం మనకు మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి వస్తుంది
ఎవరెలా చేసారు ?
తంకమ్ మూవీకి ప్రధానంగా నాలుగు క్యారెక్టర్లు ప్రాణం పోశాయి
ముత్తు పాత్ర పోషించిన బిజూ మీనన్ సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒకే రకంగా కనిపిస్తాడు
మధ్యలో అతడి పాత్ర మీద అనుమానం వచ్చినప్పుడు కూడా ఫీలింగ్స్ చెడకుండా పాత్రకు ఊపిరి పోసాడు
కన్నన్ పాత్ర పోషించిన వినీత్ శ్రీనివాస్ మూవీకి మూలం
మొత్తం కథ ఇతడి చుట్టూనే తిరుగుతుంది
అందుకు తగ్గట్టు తన పాత్రకు న్యాయం చేసాడు
ఇక ముత్తు స్నేహితుడు బిజోయ్ పాత్రలో వినీత్ తట్టి డేవిడ్ సీరియస్ గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా చిరు హాస్యపు జల్లులను పంచాడు
ఆ కామెడీ కూడా మనకు ఓవర్ గా అనిపించదు
మరీ సీరియస్ మోడ్ కాకుండా అప్పుడప్పుడు జస్ట్ ఫర్ రిలాక్స్ అన్నట్టుగా అతడి పాత్ర ఉపయోగపడింది
వీళ్ళు కాకుండా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇన్స్పెక్టర్ జయంత్ పాత్ర పోషించిన గిరీష్ కులకర్ణి నటన గురించి
ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పార్టులో ఇన్స్పెక్టర్ జయంత్ లేకపోతే సినిమా లేదు
ముఖంలో అదొకరకమైన గంభీరత , ఎప్పుడూ కూల్ గా ఉండటం , అవసరమైనప్పుడు తనలోని రఫ్నెస్ ని చూపించడం, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఫీలింగ్స్ షేర్ చేయడం చూస్తే ఈయన నిజంగా పోలీస్ ఆఫీసరేమో అని అనుమానం వస్తుంది
అంత సహజంగా పాత్రలో జీవించేసాడు
కన్నన్ భార్యగా నటించిన అపర్ణ బాలమురళి నటన కూడా బాగానే ఉంది
సాంకేతికత :
సినిమాలో హీరో ,హీరోయిన్లు ,డ్యూయెట్లు గట్రా లాంటివి లేకపోయినా టైటిల్స్ అప్పుడు వచ్చిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ బాగుంటుంది
ఓవరాల్ గా సినిమాలో నేపధ్య సంగీతం బాగుంటుంది
సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది కానీ కేరళ అందాలను చూద్దామని ఆశించేవాళ్లకు నిరాశ ఎదురౌతుంది
బహుశా మూవీ క్రైమ్ జానర్ అవడంతో డార్క్ మోడ్ మీద ఫోకస్ పెట్టినట్టున్నారు
మర్డర్ మిస్టరీ స్టోరీని తెర మీద ఉత్కంఠత కలిగేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు
విశ్లేషణ :
మీరు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలను ఇష్టపడతారా ? అయితే ఖచ్చితంగా తంకమ్ మీకు నచ్చుతుంది . కథనం నెమ్మదిగా సాగుతుంది అన్నమాటే కానీ స్టోరీలోకి వెళ్తున్న కొద్దీ మనకు క్యూరియాసిటీ పెరుగుతుంది . క్రైమ్ సినిమా అయినా ఇందులో ఎక్కడా మితిమీరిన వయొలెన్స్ కానీ అశ్లీలత కానీ లేకపోవడంతో ఇంట్లో ఫ్యామిలీతో కలిసి నిక్షేపంగా చూడొచ్చు. కాకపోతే తెలుగు డబ్బింగ్ లేదు . ప్రైమ్ లో మళయాళం వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి .
నటీనటులు : బిజూ మీనన్ , వినీత్ శ్రీనివాసన్ , వినీత్ తట్టి , గిరీష్ కులకర్ణి తదితరులు
దర్శకత్వం : షాహీద్ అరాఫత్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 3.75 / 5
