రాజకీయాలు మనుషుల జీవితాలతో ఆడుకుంటాయని మనకు ఎప్పుడో తెలుసు
కానీ అవే రాజకీయాలు భక్తుల మనోభావాలతో కూడా ఆడుకుంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ వికృత క్రీడకు శ్రీవారి లడ్డును కూడా వాడుకోవడం మారుతున్న రాజకీయాలకు పరాకాష్ట
దురదృష్టవశాత్తు ఏపీలో ప్రస్తుతం అటువంటి నీచ రాజకీయాలు నడుస్తున్నాయి
ఒక వర్గం ఓటు బ్యాంకుకు దగ్గర కావడానికి , ప్రత్యర్థి పార్టీ నాయకుడ్ని ఆ వర్గానికి దూరం చేయడానికి చకచకా పావులు కదుపుతున్నారు
ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాగైనా తమ ఓటు బ్యాంక్ చెదరకుండా ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో ఇంకో పార్టీ నాయకుడు ఉన్నాడు
తప్పు మాది కాదు .. గత పాలకులది అంటున్నారు అధికారపక్షం
కాదు కాదు తప్పు మాది కాదు .. ప్రస్తుత పాలకులదే అంటున్నారు ప్రతిపక్షం
పోనీ వాళ్ళు కొట్లాడుకుంటున్న తప్పు రాజకీయాల్లో సర్వ సాధారణమైన అక్రమ ఆస్తుల గురించో , ప్రాజెక్టుల్లో నొక్కేసిన అవినీతి గురించో కాదు
కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి లడ్డు గురించి
రాజకీయాలు ఎలాగైనా నడవనీ , తమ దేవుళ్ళ జోలికి రాకూడదని కోట్లాదిమంది ఆధ్యాత్మిక వాదులు కోరుకున్నప్పటికీ , వారి నమ్మకాలకు తూట్లు పొడిచే సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి
మతవిశ్వాసాల్లోకి రాజకీయాలు జొరబడ్డాయి
భక్తుల మనోభావాల్లోకి రాజకీయాలు జొరబడ్డాయి
ఆధ్యాత్మిక చింతన లేని నాయకులు తిరుమల కొండల్లో తిష్టవేసుకుని బతికేస్తున్నారు
అత్యంత ధనిక హిందూ దేవుడు వెంకన్న పైన కూడా వారి కన్ను పడింది
పాపపుణ్యాలను నమ్మనివానికి నీతితో పని ఏముంటుంది ? పాపభీతితో పని ఏముంటుంది ?
అందుకే భక్తుల విశ్వాసాలతో , నమ్మకాలతో పని లేకుండా తాము చేయాలనుకున్నది చేస్తున్నారు
ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా వేయికాళ్ల మండపం కూల్చవద్దని చిన జీయర్ స్వామి మొత్తుకుని చెప్పినా వినలేదు
తిరుమల అభివృద్ధిని హిందూ సంఘాలకు , ఆగమ శాస్త్ర పండితులకు , ప్రాచీన వేద శాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న పండితులకు అప్పచెప్పి ఉంటే ఎలా ఉండేదో కానీ ఆగమ శాస్త్రం పట్ల అసలేమాత్రం అవగాహన లేని రాజకీయ నిరుద్యోగులకు కొండమీద పునరావాసం కల్పించడంతో జరగకూడని అనర్దాలు జరుగుతున్నాయి
శ్రీవారి ఆభరణాలు మాయం , పరకామణి చోరీ , అన్యమతస్తుల ప్రచారం , మద్య , మాంసాల విక్రయం వంటి ఎన్నో జరగకూడనివి జరుగుతూనే ఉన్నాయి
ఇంతకీ ఈ పాపంలో తప్పు ఎవరిది ?
పాపం ఎవరిదంటే ఏం చెప్తామ్ ?
తిలా పాపం తలా పిడికెడు
తిరుమలలో జరుగుతున్న తప్పులకు ఎవడు బాధ్యత తీసుకుంటాడు ?
పనిలేని రాజకీయ నిరుద్యోగులు కొండమీద ఐదేళ్లపాటు తిష్ట వేసి అందినకాడికి దోచుకోవడం , తర్వాత తప్పులేమైనా బయటపడితే ఈ పాపం మాది కాదు గత పాలకులది అనే రెడీమేడ్ స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం , అనాదిగా జరుగుతుంది ఇదే కదా?
కానీ ఇప్పటివరకు జరిగిన దోపిడీ ఒక లెక్క
ఇప్పుడు జరుగుతున్న అపచారం ఇంకో లెక్క
పరకామణి చోరీలో మూడొందల కోట్లు నొక్కేసారని తెలిసినా భక్తులు బాధపడలేదు
శ్రీవారి ఆభరణాలు మాయమౌతున్నాయని తెలిసినా భక్తులు బాధపడలేదు
పోతేపోనీ ఆయనకేమి తక్కువ ? అనుకున్నారు
కానీ శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని బయటికి వచ్చిన ప్రచారంతో గుండెలు బద్దలు అయ్యాయి
ఇంతకాలం తాము నమ్మి కొల్చిన ఇంటి దైవం శ్రీవారికి పెట్టిన నైవేద్యాలు ఇవా ?
ఇన్నాళ్లు స్వామి స్వీకరించిన ప్రసాదాలని భక్తితో తాము ఆరగించిన లడ్డూలు ఇవా ?
ఎంత అపచారం ?
ఎంత దుర్మార్గం ?
కోట్లాదిమంది భక్తుల మనసులు బాధతో ఆక్రోశించాయి
తాము విన్నది నిజం కాకూడదని ఆ శ్రీనివాసునికే మొరపెట్టుకున్నారు
ఇన్నాళ్లకు స్వామివారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదనే విషయం సిబిఐ ప్రకటన ద్వారా తెలియడంతో ఒకింత ఉపశమనం పొందారు
ఈ సందర్భంగా లడ్డూ వివాదం గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం
ఒకసారి రీలు వెనక్కి తిప్పితే ,
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేస్తూ, శ్రీవారి ప్రసాదం లడ్డూలో వినియోంచిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని , గత పాలకుల హయాంలో ఈ పాపం జరిగిందని చెప్తూ దోషులను పట్టుకుని చట్టానికి అప్పగించటానికి దర్యాప్తు సంస్థను నియమిస్తున్నట్టు తెలియచేసారు
లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించింది
శ్రీవారికి జరిగిన అపచారం పట్ల కోట్లాదిమంది హిందువులు ఆందోళన వ్యక్తం చేసారు
తమ విశ్వాసాలను గాయపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు
మరోపక్క వైసిపి నేతృత్వంలో పార్టీ నాయకులు ఈ ఆరోపణలను ఖండించారు
ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే ఈ ఆరోపణలు చేస్తుందని విమర్శలను తిప్పి కొట్టారు
కూటమి ప్రభుత్వం నియమించిన అధికారుల దర్యాప్తులో తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ అనే సంస్థ నెయ్యి కల్తీకి పాల్పడిందని గుర్తించారు
ఇదిలా ఉండగా టిడిపి నాయకులు తమపై చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి అంటూ మాజీ టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి , బీజేపీ నాయకుడు ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి ద్వారా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తూ ఈ వివాదంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి నిజానిజాలను వెలికితీయాలని కోరారు
దరిమిలా ఈ వివాదంపై సిబిఐ దర్యాప్తుకు అనుమతిస్తూ సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది
అయితే ఇన్వెస్టిగేషన్ టీమ్ లో సిబిఐ అధికారితో పాటు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో కూడిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని ఆదేశించింది
సిబిఐ సిట్ ఏం చేసింది ?
న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ తమ దర్యాప్తులో కొత్త విషయాలు కనుక్కుంది
ముందుగా అనుకున్నట్టు నెయ్యి కల్తీ తమిళనాడులోని ఏఆర్ డైరీ ఒక్కటే చేయలేదని ,దీనివెనుక ఉత్తరాఖండ్ కు చెందిన భోలెబాబా డైరీ హస్తం ఉందని గుర్తించింది
షుమారు మూడొందల కోట్ల రూపాయల మేర జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణం ఏ ఒక్క వ్యక్తో , సంస్టనో చేసింది కాదు . కొంతమంది వ్యక్తులు , సంస్థలు సిండికేట్ అయి చేసిందని తెలిసింది
షుమారు 15 నెలలపాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ 35 మందిని అరెస్ట్ చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ ను న్యాయస్థానంలో సమర్పించింది
కల్తీ నెయ్యి కుంభకోణంలో ప్రధానంగా టిటిడి ప్రొక్యూర్మెంట్ ముఖ్య అధికారితో పాటు మరో అధికారి పాత్ర కూడా ఉందని తెలిపింది
వీరిలో ఒక అధికారికి ముంబై నుంచి హవాలా ద్వారా 50 లక్షల రూపాయలు రెండు పర్యాయాలు బదిలీ జరిగినట్టు తెలిపింది
మొత్తం కుంభకోణం నడిపించింది ఉత్తరాఖండ్ కు చెందిన భోలెబాబా డైరీ కి చెందిన ఇద్దరు డైరెక్టర్లు అని ఛార్జ్ షీట్ లో పేర్కొంది
భోలెబాబా డైరీ తమ ప్లాంట్ సామర్ధ్యానికి మించి షుమారు 68 లక్షల కిలోల నెయ్యిని టిటిడికి సరఫరా చేసిందని , అది కూడా పామాయిల్ , ఇతర రసాయనాలను వాడి కల్తీకి పాల్పడిందని తెలిపారు
అదే విధంగా లాబ్ పరీక్షల్లో వచ్చిన రిపోర్టుల్లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిందని చెప్పారు
సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న 35 మందిలో టిటిడి మాజీ చైర్మన్లు కానీ , మాజీ ఈఓ లు కానీ లేరు
దీంతో ఈ కేసులో మాజీ టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి , భూమన కరుణాకర రెడ్డిల మీద వచ్చిన ఆరోపణలు లీగల్ గా నిలబడే అవకాశాలు లేవు
ప్రస్తుతం ఏం జరుగుతుంది ?
సిబిఐ సిట్ సమర్పించిన ఛార్జ్ షీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పృష్టంగా చెప్పడంతో కూటమి నేతలు ఇన్నాళ్లు తమపై చేసిన ఆరోపణలు అసత్యాలని తేలిందని విమర్శిస్తూ వైసిపి నేతలు పాప ప్రక్షాళనకు దిగారు
ఈ సందర్భంగా దేవాలయానికి వెళ్లి వస్తున్న మాజీ మంత్రి , వైసిపి నాయకుడు అంబటి రాంబాబును కొంతమంది టిడిపి కార్యకర్తలు అటకాయించడంతో ఘర్షణ జరిగింది .ఈ ఘర్షణలో ఆయన చంద్రబాబు మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసారని తెలియడంతో ఆగ్రహంతో టిడిపి నాయకులు అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టారు
దరిమిలా పోలీసులు అంబటి ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడంతో , న్యాయస్థానం ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది
అలాగే ఇదే వివాదంలో నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు జోగి ఇంటికి కూడా నిప్పు పెట్టారు
ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ అంబటి రాంబాబు , జోగి రమేష్ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
మళ్ళీ సిట్ వేశారు
తాజాగా నెయ్యి కల్తీ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంకో సిట్ ను ఏర్పాటు చేసింది
నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ , సిబిఐ సిట్ నెయ్యి కల్తీ కేసులో పాత్రధారులను మాత్రమే పట్టుకుని అసలు సూత్రధారులను విస్మరించిందని , అందుకే ఈ కేసులో తెర వెనుక ఉండి తతంగం నడిపించిన అసలు సూత్రధారులను కూడా చట్టానికి అప్పగించడం కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు
ముగింపు :
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ చేయడం మహాపరాధం
ఇంతటి అపరాధం చేసినవారు ఏ పార్టీకి చెందినవారు అయినా సరే కఠినంగా శిక్షించబడాల్సిందే
హిందూ మత విశ్వాసాలను నమ్మే , అనుసరించే ఏ భక్తుడైనా ఇదే కోరుకుంటాడు
అందులో ఇంకో ఆలోచనకు తావు లేదు
అయితే అదే సమయంలో ఈ ఇష్యుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామనే దుర్మార్గమైన ఆలోచన కూడా ఏ పార్టీకి మంచిది కాదు
ఒకరకంగా అది కూడా నెయ్యి కల్తీ వంటి అపరాధం కిందికే వస్తుంది
పవిత్రమైన తిరుమలను రాజకీయాల కోసం వాడుకోవడం అన్ని రాజకీయ పార్టీలు మానుకోవాలి
టిటిడిలో రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించే నామినేటెడ్ పదవుల నియామకం విధానానికి స్వస్తి చెప్పాలి
హిందూ మత విశ్వాసాల మీద నమ్మకం ఉన్నవారికి , అనుసరించేవారికి , ఆగమ శాస్త్రం తెలిసిన పండితులకు , ప్రాచీన వేద శాస్త్ర పండితులకు , హిందూ సంఘాలతో కూడిన సంస్థలకు టిటిడి బోర్డులో స్థానం కల్పించి రాజకీయ జోక్యాన్ని జీరో స్థాయికి తీసుకురావాలి
నిజానికి టిటిడి వంటి పెద్ద సంస్థలో నిజాయితీతో పనిచేసే మాజీ ఈఓ ఎమ్ఎస్ఆర్కె ప్రసాద్ గారి లాంటి అధికారులు చాలు
ఆలయ వ్యవహారాలలో అధికారులకు సలహాలు ఇవ్వడానికి ఆగమ శాస్త్ర పండితులు ఉంటే సరిపోతుంది
ఈ రాజకీయ నాయకుల చెత్త బ్యాచును ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేయకుండా నిషేధిస్తే తిరుమలలో అన్ని వ్యవహారాలు దారిలోకి వస్తాయి
ముఖ్యంగా ఆలయ పవిత్రత పూర్తి స్థాయిలో అదుపులో ఉంటుంది
ఏమో భవిష్యత్తులో అదే జరుగుతుందేమో?
ఆ శ్రీనివాసుని లీలలు ఏ రకంగా మలుపులు తీసుకుంటాయో ఎవరికి తెలుసు ?
పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా రోజురోజుకి పెరిగిపోతున్న ఈ పాపాలకు విరుగుడుగా ఏదో ఒకరోజు తిరుమలకు ఈ పాపాత్ములు దూరం అయి ఆధ్యాత్మిక పండితుల ఆధ్వర్యంలో పూర్వపు వైభవం సంతరించుకుంటుందేమో?
తిరుమల కొండలకు వెళ్తుంటే ధర్మో రక్షితి రక్షితః అనే బోర్డులు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి
ధర్మాన్ని ఎవరూ రక్షించనవసరం లేదు
తనని తాను ఎలా కాపాడుకోవాలో ధర్మానికి తెలుసు
ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే

Nice analysis.