ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడొచ్చు..

Spread the love

టూరిస్ట్ ఫ్యామిలీ

హాయిగా అందరితో కలిసిపోయి చేదోడువాదోడుగా ఉండే మంచి కుటుంబాన్ని చూడాలనుకుంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడండి

భార్య భర్త ఇద్దరు కొడుకులు
చిన్న కుటుంబం

కలతలు కల్మషాలు అసలే లేని మంచి కుటుంబం

అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కాలనీలలో మనుషుల మధ్య దూరం పెరిగి ఎవడి లైఫ్ వాడిదే అనే కాన్సెప్ట్ తో జీవితాలు నడుస్తున్న రోజుల్లో ధర్మదాస్ లాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూస్తే మన పక్క ఫ్లాట్లోనో.. మన కాలనీలోనో ధర్మదాస్ లాంటి వాడు ఒక్కడైనా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం

మనం సంఘ జీవులం కాబట్టి మన చుట్టూ ధర్మ దాస్ లాంటి వాళ్ళే ఉండాలని కోరుకుంటాం కానీ మనమే ధర్మ దాస్ ఎందుకు కాకూడదని ఆలోచించం

టూరిస్ట్ ఫ్యామిలీ స్ట్రెయిట్ తమిళ్ సినిమా అయినా తెలుగు డబ్బింగ్ లో చూస్తున్నా భావాలు ఎక్కడా చెడలేదు

తెలుగులో చాలా సినిమాలు చేసింది కాబట్టి ఈ సినిమాలో తల్లి పాత్ర వేసిన సిమ్రాన్ ను గుర్తుపట్టగలిగా..ఇక నటుడు.. దర్శకుడు మిగిలిన సాంకేతిక బృందం గురించి టైటిల్స్ లో చూడటం మినహా పెద్దగా తెలీదు

అయితేనేమి టూరిస్ట్ ఫ్యామిలీలో నటులు కనిపించరు
పాత్రలే కనిపిస్తాయి

గతంలో యూ ట్యూబర్ గా గుర్తింపు పొందిన ఈ దర్శకుడు మొదటి ప్రయత్నంలోనే 10 కోట్లు పెట్టి తీసిన టూరిస్ట్ ఫ్యామిలీ 100 కోట్లు కలెక్షన్ రాబట్టింది

కథ విషయానికి వస్తే శ్రీలంక లో ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపద్యంలో చాలా కుటుంబాలు వలసలు వెళ్లిపోతారు

అలా శ్రీలంక నుంచి రామేశ్వరం వలస వెళ్లిన కుటుంబాల్లో ధర్మ దాస్ కుటుంబం ఒకటి

సిమ్రాన్ అన్న సాయంతో అక్రమంగా సముద్రం దాటి రామేశ్వరంలో ఓ కాలనీలో ఇల్లు చూసుకుని అద్దెకు దిగుతారు

అయితే సరిగ్గా వీళ్లు వచ్చిన రోజే రామేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోతారు

శ్రీలంక నుంచి వలస వచ్చినవాళ్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ధర్మ దాస్ ను అనుమానిస్తారు

ఇంకోపక్క ధర్మ దాస్ కుటుంబం మంచి తనంతో కాలనీ వాసులకు దగ్గర అవుతారు

క్లైమాక్స్ లో పోలీసులు కాలనీలోకి వచ్చి ఇంటింటికీ సెర్చ్ చేసినా ఒక్కళ్ళు కూడా ధర్మా దాస్ గురించి బయటపెట్టరు

ఆఖరికి ధర్మ దాస్ ను గుర్తుపట్టిన కానిస్టేబుల్ కూడా పై అధికారులకు అతడెవరో తెలీదు అంటాడు

దాంతో పోలీసులు వెనక్కి వెళ్ళిపోతారు

అప్పుడు ధర్మ దాస్ కానిస్టేబుల్ ని అడుగుతాడు ,

“నువ్వు నన్ను గుర్తు పట్టినా ఎందుకు వదిలేశావ్?” అని

“నిజానికి నేను ఇక్కడికి వచ్చింది నిన్ను అరెస్ట్ చేయిద్దామనే కానీ ఈ కాలనీలోకి వచ్చాక కాలనీ వాసులు ఒక్కొక్కళ్ళు నీ ఆచూకీని బయటపెట్టకుండా ఇంతమంది నీకు మద్దతుగా మాట్లాడారంటే నీ మంచి తనం వల్లనే అని నాకు అర్థమైంది.. నీలాంటి వాడు సమాజానికి అవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్

ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి

సంపాదన కోసం తండ్రి పక్కింట్లో కారు డ్రైవర్గా చేరి కారు తుడుస్తుంటే చదువు పూర్తయి ఉద్యోగం లేని కొడుకు పడే మనో వేదన కంట తడి పెట్టిస్తుంది

భర్త కష్టాన్ని చూసి భార్య చిన్న కొడుకు చేత లెమన్ జ్యూస్ పంపడం .. ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవడంతో మధన పడుతున్న అన్న మనసును తేలిక చేయడం కోసం తమ్ముడు డాన్స్ చేయడం .. ధర్మ దాస్ కాలనీలో ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటూ మంచి తనంతో అందరి మనసులు గెలుచుకోవడం.. ప్రేమించిన భార్య చనిపోతే పరామర్శించడానికి బంధువులూ ఎవరూ లేరని పక్కింటి పెద్దాయన బాధ పడుతుంటే ధర్మ దాస్ కాలనీ వాసులను అందర్నీ ఒప్పించి ఆవిడకు అంతిమ నివాళులు అర్పించడం.. చర్చిలో దేవుడి ప్రస్తావన వచ్చి తనను కాపాడిన ధర్మ దాసే దేవుడని వ్యసనాల నుంచి బయటపడిన ఓ కుర్రాడు చెప్పడం .. లాంటి సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి

క్లైమాక్స్ అయిపోయి ఎండ్ కార్డ్ పడగానే అరె..సినిమా అప్పుడే అయిపోయిందా ?అని అనుకుంటాం

ఇంతమంచి ఫ్యామిలీ మన పక్కనే ఉంటే ఎంత బాగుణ్ణు అనుకుంటాం

చివరగా టూరిస్ట్ ఫ్యామిలీ లో ఎమోషనల్ సన్నివేశాల్లో కన్ను తడి కాని ప్రేక్షకుడు ఉండడు

బావుంది
జియో హాట్ స్టార్ లో ఉంది
తప్పక చూడండి

పరేష్ తుర్లపాటి ✍️

Rating 4/5


Spread the love

One thought on “ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడొచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!