నమ్మకం!

Spread the love

మా విజయవాడలో మర్డర్ జరగ్గానే నాయకుడ్ని చట్టం నుంచి కాపాడుకునేందుకు నేరం తన మీద వేసుకుని లొంగిపోవటానికి మెరికలాంటి మేక అనుచరుడొకడు రెడీగా ఉండేవాడు

అలా చేయని నేరాన్ని తన మీద వేసుకుని జీవిత ఖైదు అనుభవించి బయటకు వచ్చిన వ్యక్తి నాకు తెలుసు

ఆ రోజేమి జరిగిందంటే
రీలు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి తిప్పితే,

చాన్నాళ్ళ క్రితం నేను పనిమీద విజయవాడ వెళ్ళి గవర్నర్ పేటలో నడుచుకుంటూ వెళ్తుంటే వెనకనుంచి’ నమస్తే అన్నా ‘ అన్న పిలుపు వినిపించి ఆగి ఎవరా అని చూస్తే అతడు నాతో పాటు ఇంటర్ చదివిన మిత్రుడు. కాకపోతే నాకంటే ఒక ఏడాది సీనియర్

“గుర్తుపట్టావా? ” అని నవ్వాడు

నిజానికి నేను అతగాడిని చప్పున గుర్తుపట్టలేదు
ఎందుకంటే పోలికలు పూర్తిగా మారిపోయాయి

కాలేజీలో చదువుకునేటప్పుడు నిటారుగా ఆర్ నారాయణ మూర్తిలా ఉండేవాడు
ఇప్పుడు చూస్తే పాత సినిమాల్లో రాజనాల మాదిరి వొంగిపోయి ఉన్నాడు

కొంచెం దగ్గరికి వచ్చి చూసి చప్పున గుర్తుపట్టా
గుప్పున వాసన కూడా వచ్చింది

తాగి ఉన్నాడని అర్థమైంది

‘ బాగున్నావా?’ అన్నాను

అతడు నవ్వాడు

ఏం మాట్లాడాలో తెలియక మళ్ళీ నేనే ” చాలా రోజులైంది కలిసి.. ఏంటి సంగతులు? ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్?” అనే రొటీన్ ప్రశ్నలు వేశా

‘ మొన్నటి దాకా సెంట్రల్ జైలులో ఉండేవాడ్ని..ఓసారి మనోళ్లని చూసిపోదామని విజయవాడ వచ్చానన్నా ‘ నవ్వుతూనే చెప్పాడు
(తాగినోళ్లకు పని లేకపోయినా మాటిమాటికి నవ్వొస్తుంది కాబోలు)

వాడు చెప్పిన సమాధానం విని ఉలిక్కిపడ్డా

ఎవడినైనా ఏం చేస్తున్నావ్ అంటే ఉద్యోగమో.. వ్యాపారమో చేస్తున్నా అని చెప్తారు.. వీడేంటి సెంట్రల్ జైలులో ఉన్నా అంటాడు.. అక్కడ జాబా? అనుకుని అదే మాట అడిగాను

“ఏంటి సెంట్రల్ జైలు లో ఏవన్నా జాబ్ చేస్తున్నావా? “

వాడు నావంక జాలిగా చూసాడు

“అదేంటన్నా.. పేపర్లో కూడా వచ్చిందిగా.. మర్డర్ కేసులో 14 ఏళ్లు ఏశారు.. మొన్ననే బయటికి వచ్చా” ఆశ్చర్యం గా చెప్పాడు

వామ్మో.. వీడు మర్డర్ కూడా చేసాడా? కాలేజీలో విప్లవ గీతాలు పాడుతున్నప్పుడే అనుకున్నా ఏదో రోజు వీడు గుర్తింపు పొందుతాడని
కానీ ఇలా గుర్తింపు పొందుతాడని అస్సలు ఊహించలేదు

మళ్ళీ వాడే చెప్పాడు ,

“నీకో నిజం చెప్పనా.. అసలా మర్డర్ చేసింది నేను కాదు.. నల్ల సూరి గాడు” అని ఇంకో బాంబు పేల్చాడు

“మరి నిన్నెందుకు లోనేశారు?” అమాయకంగా అడిగా

“నేనే చేశానని లొంగిపోయా”

నాకు డౌట్ వచ్చింది
వీడు తాగి ఉన్నాడు
పైగా చీప్ లిక్కర్ తాగేసాడు
పైగా వీడికి నేను దొరికా
కథలు అల్లేస్తున్నాడు

“ఏంటన్నా? కథలు అల్లేస్తున్నా అనుకుంటున్నావా ? ప్రామిస్.. నాయకుడి కోసం నేను లోపలికెళ్లాను” అని మళ్ళీ నవ్వాడు

చీప్ లిక్కర్ తాగితే ఎదుటి వాడి మనసులో ఏముందో పసిగట్టవచ్చని నేను మొదటిసారి అప్పుడే తెలుసుకున్నా

“అదేంటి? నీ ఫ్యామిలీ ఆర్ధిక పరిస్థితి నాకు తెలుసు.. అలాంటిది చేయని నేరాన్ని మీదేసుకుని నువ్వు లోనకెలితే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో ఆలోచించావా ?” నేను కూడా మాదాల రంగారావులా పిడికిలి బిగించి ఆవేశంగా ప్రశ్నించా

” అన్నా! నెలకు పది వేలు, బియ్యం, పప్పులు టoచనుగా ఇంటికెళ్ళిపోతాయ్.. ఫ్యామిలీ హ్యాపీ.. లోన మనం హ్యాపీ.. బయట నాయకుడు హ్యాపీ ” అని హ్యాపీగా నవ్వాడు

వార్నీ మనుషులు ఇలా కూడా బతికేస్తారా ?

వీడికి మందు పూర్తిగా ఎక్కితే ఇంకేం మాట్లాడుతాడో అనుకుని సరే పనిమీద వెళ్తున్నా ఇంకోసారి తీరుబడిగా బయోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం అని కదలబోయా

“అన్నా” అని ప్రేమగా పిలిచాడు

వాడి ప్రేమకు కరిగిపోయి ఏంటన్నట్టు చూసా

“ఫిఫ్టీ” అన్నాడు

జేబులోంచి ఫిఫ్టీ తీసి వాడి చేతిలో పెట్టా
మాయమైపోయాడు

తర్వాత కొన్నాళ్ళకు తెలిసింది వాడు ఈ భూమ్మీద నుంచే శాశ్వతంగా మాయమైపోయాడని!

పరస్పర నమ్మకాల ఆధారంగా నడిచిన డీల్ ఇది

నాయకుడికి వీడు విశ్వాస పాత్రుడు
వీడికి నాయకుడు దేవుడు

తనను కాపాడినందుకు నాయకుడు వీడి కుటుంబాన్ని కాపాడాడు
తన కుటుంబాన్ని కాపాడినందుకు వీడు నాయకుడ్ని కాపాడాడు

నమ్మకాల్లో ఇదో రకమైన నమ్మకం

ఇందులో వెన్నుపోట్లు ఉండవు
ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తారు

నమ్మకాల్లో డేంజరస్ నమ్మకం ఏంటంటే నమ్మించి మోసం చేయడం

రోజూ ఇంత మేత పడేస్తున్నాడు కదా అని గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది

కానీ వాడు పడేస్తున్న మేత ఎప్పుడో ఒకప్పుడు తనని బలివ్వడానికే అని మేకకు తెలీదు

తెలుసుకునేసరికి మెడ మీద తలకాయ ఉండదు

ఏంటి ఇదంతా చదువుతుంటే మీకు ఇంకేదో గుర్తొస్తుందా?

అబ్బే అలాంటిదేమీ లేదు
ఈ సంఘటనకు తెలంగాణాలో ఈమధ్య జరుగుతున్న ఎపిసోడ్స్ కు ఎటువంటి సంబంధం లేదు !

అదీ సంగతి
పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!