ప్రతి శుక్రవారం ఉదయం ఆరుగంటలకు అతడు ఐదు సంచులలో రొట్టెలు నింపి స్కూల్ గేటు దగ్గర పెడతాడు .. ఎందుకో తెలుసా ?

Spread the love

హృదయాన్ని తాకే బేకర్ కథ.. నిశ్శబ్దంగా సాగే ప్రేమ యాత్ర!

ఇటలీలోని టస్కనీలో ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక బేకరీ ఉంది.

ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు దాని తలుపులు తెరుచుకుంటాయి. ఆ బేకరీ ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ సరిగ్గా తెలియదు.
తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న వీధుల్లో తాజాగా కాల్చిన రొట్టెల సువాసన గుబాళిస్తుంది. అప్పుడప్పుడు ఎవరైనా ఆ దారిలో వెళ్లేవారు వేడి వేడిగా ఉన్న ఒక రొట్టె కొనుక్కుని తమ పనులకు వెళ్తుంటారు.

ఆ బేకరీ యజమాని పేరు మారియో. ఆయనకు ఇప్పుడు 74 ఏళ్లు. ఆయన గత 51 సంవత్సరాలుగా, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, ప్రతి ఉదయం పిండిని కలిపి, రొట్టెలు కాల్చి, వాటిని కౌంటర్ మీద అమరుస్తారు. ఈ పని అంతా ఆయన ఒక్కరే చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా ఆయన్ని “ఇక రిటైర్ కావచ్చు కదా” అని అడిగితే, ఆయన చిరునవ్వుతో “ఉదయాన్నే ఎవరికైనా వేడి రొట్టె అవసరమైతే, నేను ఇక్కడే ఉంటాను” అని సమాధానం ఇస్తారు.

ప్రజలను నిజంగా కదిలించేది ఆయన అంకిత భావం ఒక్కటే కాదు .. ప్రతి శనివారం ఆయన ఎవరికీ చెప్పకుండా ఒక పని చేస్తారు. అది నిజంగా అద్భుతం.

ప్రతి శుక్రవారం ఉదయం 6:00 గంటలకు, మారియో ఐదు సంచుల నిండా రొట్టెలు, ఫోకసియా (Focaccia) బ్రెడ్‌తో నింపి స్థానిక ప్రీ-స్కూల్ గేటు దగ్గర ఉంచుతారు.

ఆ ప్రీ-స్కూల్ పాత భవనం, దాని గోడల నిండా పిల్లల బొమ్మలు ఉంటాయి. ఆయన్ని ఎవరూ చూడరు. కానీ అక్కడి ఉపాధ్యాయులకు మాత్రం తెలుసు. ఈ అనామక బహుమతి ఎవరు ఇస్తున్నారో తెలుసుకోవడానికి చాలా ఏళ్ల క్రితం వారు సెక్యూరిటీ కెమెరాలు చెక్ చేసి ఆ విషయాన్ని కనుక్కున్నారు.

ఒకసారి వారు ఆయన్ని కలిసి ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు మారియో, “ఈ రొట్టెలు ఎదుగుతున్న పిల్లల కోసం ఉంచుతున్నాను .. నేను నా కొడుకును ఐదేళ్ల వయసులో కోల్పోయాను. అతని జ్ఞాపకాలను ఇలా సజీవంగా ఉంచుకుంటున్నాను” అని మాత్రమే అన్నారు.

ఆ రోజు నుంచి, ప్రతి శుక్రవారం పిల్లలు తమకు “మ్యాజిక్ బ్రెడ్” కోసం ఎదురుచూస్తూ ఉండటం మొదలుపెట్టారు . . ఉపాధ్యాయులు వారికి మారియో కథను చెబుతారు. ఆయన పేరు చెప్పకుండా, ఆయనకు గౌరవం ఇస్తూ, వారు ఆయన్ని “హృదయ బేకర్” (The Baker of the Heart) అని పిలుస్తారు.

నెల రోజుల క్రితం, మారియోకు అనారోగ్యం చేసింది.

గత అర శతాబ్దంలో మొదటిసారిగా బేకరీ మూతపడింది. ఆ వార్త గ్రామం మొత్తం పాకింది.

మరుసటి ఆదివారం, 200 మందికి పైగా ప్రజలు ఆయన బేకరీ బయట గుమిగూడారు. ప్రతి ఒక్కరి చేతిలో ఇంట్లో తయారుచేసిన రొట్టె ఉంది. నిశ్శబ్దంగా, బేకరీ లోపల లైట్ వెలుగుతుందని వారు ఎదురుచూశారు.

కొద్దిసేపటికి, మారియో పిండి మరకలు పడ్డ ఏప్రాన్ వేసుకుని బయటికి వచ్చారు. ఆయన కళ్ళల్లో భావోద్వేగం నిండి ఉంది. ఆయన ఒక్క మాట మాత్రమే అన్నారు,

“ఇంత కాలం తర్వాత నన్ను ఎవరూ గుర్తుపెట్టుకోరని అనుకున్నాను. కానీ మీరే నా వేడి రొట్టెలు.”

ఈ కథ కేవలం ఒక బేకరీ లేదా రొట్టెలకు సంబంధించినది కాదు. ఇది మానవ సంబంధాల గురించి, నిశ్శబ్దంగా చేసే త్యాగాల గురించి

చిన్నచిన్న పనులు కూడా పెద్ద ప్రభావం ఎలా చూపిస్తాయో చెప్పే కథ.

మారియో తన బేకరీని కేవలం జీవనోపాధిగా చూడలేదు. అది తన ప్రేమను, జ్ఞాపకాలను పంచుకునే ఒక మార్గంగా మార్చుకున్నాడు.

ప్రతిరోజు మనం చూసే సాధారణ వ్యక్తుల్లో కూడా ఎన్నో అద్భుతమైన కథలు దాగి ఉంటాయని ఈ కథ గుర్తుచేస్తుంది.

మారియో తన కొడుకు జ్ఞాపకార్థం చేసిన పని, పిల్లల గుండెల్లో, గ్రామం ప్రజల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఆయన చేసిన చిన్న పని, ఆయన లేని సమయంలో ఒక పెద్ద సంఘటిత శక్తిగా మారింది. సమాజం ఆయనకు చూపించిన గౌరవం, ఆప్యాయత… ఆయన జీవితపు అత్యంత గొప్ప బహుమతి.

మారియో కథ మనందరికీ ఒక పాఠం నేర్పుతుంది: మనం ఇచ్చేది వస్తువు కావచ్చు, లేదా ప్రేమ కావచ్చు, అది ఎప్పటికీ వృథా కాదు.

అది ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తుంది. ఆ తిరిగి వచ్చేది వస్తువు కాదు, అది మనల్ని గుర్తుపెట్టుకునే హృదయం. అదే అత్యంత విలువైనది.

మారియో తన రొట్టెల ద్వారా ఇచ్చింది కేవలం పోషకాలు కాదు, అది ప్రేమ, జ్ఞాపకాలు, ఆశ. ఈ కథ మన హృదయాలను తాకి, మనలో మంచిని ప్రేరేపిస్తుంది.

రవి వానరసి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!