“సార్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో ఉన్నారు .. మీతో మాట్లాడుతారట”

Spread the love

సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో ఉన్నారు..మీతో మాట్లాడుతారుట ” ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి

 ఫోన్ అందుకున్న వాజ్ పేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు

 ఫోన్ పెట్టేసి కార్యదర్శి వంక చూసి వాజ్ పేయి ,

 “మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం..ఏర్పాట్లు చూడండి ” అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి

సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా ?” నసిగాడు కార్యదర్శి

 వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ ,

 “నిక్షేపంగా ” అన్నారు

 ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది

రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు

సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి ? అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు

కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు !

 ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా..!

ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పారంటే ,

“1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా..1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది

డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు

ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు

ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోన్ లో కోరారు

చివరగా ఆయన ఒక మాట చెపుతూ ” అటల్ జీ..ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి “..అని చెప్పారు

ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే..నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే “..అని వాజపేయి ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు

రాజీకీయాల్లో విలువలు పాటించే నాయకులూ అరుదుగా ఉంటారు

రాజీవ్ గాంధీ దేశ  ప్రధాని హోదాలోనూ .. వాజ్ పేయీ ప్రతిపక్ష నాయకుడి హోదాలోనూ విధానాలపై  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు కానీ వ్యక్తిగత విద్వేషాలకు వారి మధ్య ఎప్పుడూ  తావు ఇవ్వలేదు 

ఇరువురు నేతలు కూడా చక్కటి పార్లమెంటేరియన్ విలువలు పాటించేవారు

పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే  నేటి అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు!

తుర్లపాటి పరేష్ ✍️


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!