ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ తరచూ ఓ డైలాగ్ చెప్తాడు
“నా గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంటుంది ..నెట్ వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది” అనేది ఆ డైలాగ్
ఈ ఒక్క డైలాగ్ తోనే తానేంటో చాలామందికి చెప్పకనే చెప్పాడు అనిపిస్తుంది
నిజానికి ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత తన రాజకీయ జీవితానికి అన్వయించుకుని పలికినట్టున్నారు
ఇదే కాదు ఇలాంటి పంచ్ డైలాగులు చాలా ఉన్నాయి
కొన్ని సన్నివేశాల్లో మనకు ఏసిపి భగత్ సింగ్ కనిపిస్తే మరికొన్ని సన్నివేశాల్లో జనసేన నేత పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు
రాజకీయాల్లోకి రాకముందు పవర్ స్టార్ ఒక లెక్క
రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ మరొక లెక్క అయ్యారు
కానీ రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తున్న పవర్ స్టార్ అసలు లెక్క OG తో మొదలైంది
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో కంటిన్యూ అవుతుంది
ఇన్నాళ్లు అభిమానులు పవర్ స్టార్ లో చూడాలనుకున్నది ఓజీలో చూసారు
ఓజి సినిమా చూసి పవన్ కళ్యాణ్ సైతం రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అని బహిరంగంగానే మధనపడ్డారంటే అసలు విషయం అందరికీ అర్ధమయ్యే ఉంటుంది
ఇన్నాళ్లు అతడిలో దాగి ఉన్న స్పార్క్ ఓజీతో బయటపడింది
అందుకే నూతనోత్సాహంతో ఈవెంట్లో కత్తి పట్టుకుని కలియతిరిగాడు
ఆ ఉత్సాహం ఆయన్ని మళ్ళీ సినిమాల్లోకి వచ్చేయమని ప్రోత్సాహం ఇస్తుంది
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన తర్వాత పవర్ స్టార్ నుంచి మరిన్ని పవర్ ఫుల్ సినిమాలు వస్తాయనిపిస్తుంది
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కధేంటో చూద్దాం
సినిమా ప్రారంభమే సీఎం మీద కాల్పులతో మొదలౌతుంది
ఈ కాల్పులకు ముందు కొంత కథ నడిచింది
అదేంటో తెలుసుకోవాలంటే నల్లమల అడవులకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడేనికి వెళ్ళాలి
అక్షరాస్యత రేటింగ్ తక్కువగా ఉన్న ఆ గూడేనికి చంద్రశేఖర్ రావు (కేఎస్ రవికుమార్ ) స్కూల్ హెడ్ మాస్టర్ గా వస్తారు
బడికి వెళ్లకుండా పనికి వెళ్తున్న గూడెం పిల్లలచేత చదివించాలని ప్రత్యేక శ్రద్ద తీసుకుని గ్రామస్తులను ఒప్పిస్తాడు
అదే గూడేనికి చెందిన చిన్నయ్య అనే అనాధ బాలుడిని చేరదీసి సంరక్షకుడిగా బాధ్యతలు తీసుకుని చదువు చెప్పిస్తూ ఉంటాడు
పేరు లేని అతడికి భగత్ సింగ్ అని నామకరణం చేస్తాడు
చిన్నయ్య తండ్రిని ఉస్తాద్ అని పిలిచేవాళ్ళు కాబట్టి అతడు తనపేరు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకుంటాడు
ఈలోపు చంద్రశేఖర్ రావుకి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం , సీఎం అతడ్ని రాజకీయాల్లోకి రమ్మని ప్రోత్సహించడంతో ఆయన గూడేన్ని వదిలి రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కూడా అవుతాడు
మరోపక్క గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ పెద్దవాడు అయి పాతబస్తీలో ఏసిపి గా విధులు నిర్వహిస్తూంటాడు
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పదవిపైన కన్నేసిన చెదలమర్రి నల్ల నాగప్ప ( పార్తీబన్ ) అతడి అడ్డు తొలగించుకోవాలని కుట్రలు పన్నుతూ ఉంటాడు
ఈ కుట్రలను ఉస్తాద్ భగత్ సింగ్ అడ్డుకుంటూ ఉంటాడు
నల్ల నాగప్ప కుట్రలు ఫలించి సీఎం అవుతాడా ?
సీఎం ను అడ్డుతొలగించుకోవడానికి నల్ల నాగప్ప చేస్తున్న కుట్రలను ఏసిపి భగత్ సింగ్ ఏ విధంగా ఛేదిస్తాడు ?
నల్ల నాగప్పకు, పక్క దేశం టెర్రరిస్టులకు ఉన్న లింక్ ఏమిటి ? అనేది మిగిలిన కధలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
ఓజీతో మొదలైన పవర్ స్టార్ అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఫ్యాన్సుకు కిర్రెక్కిస్తుంది
ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ నుంచి ఫాన్స్ ఏమి కోరుకున్నారో , పవర్ స్టార్ ను ఎలా చూడాలనుకున్నారో అవన్నీ కలిపి ఓ డిష్ లో వేసి అభిమానులకు ఫుల్ మీల్స్ వండి వడ్డించాడు దర్శకుడు హరీష్ శంకర్
ఇప్పుడు చూస్తున పవన్ కళ్యాణ్ ఖుషీ లో చూసిన పవన్ కళ్యాణ్ ఒకరేనా అని అనుమానం కూడా చాలామందికి వస్తుంది
మెడ మీద చేయి తిప్పడం మినహా , బాడీ లాంగ్వేజ్ లో , మేనరిజంలో , డైలాగ్ డెలివరీలో పవన్ కళ్యాణ్ లో స్పృష్టమైన మార్పులు వచ్చాయి
కేవలం ఫాన్స్ కే కాదు సాధారణ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా తన నటనా తీరును మార్చుకున్నాడు .. మలచుకున్నాడు
కొద్దిగా ఒళ్ళు చేసినట్టు అనిపించినా వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ మెరిశాడు
ఈ మూవీలో కథ కన్నా కథనానికి ఎక్కువ మార్కులు పడతాయి
కధనం విషయంలో హరీష్ శంకర్ పక్కా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నాడు
ప్రస్తుతం ,ఫ్లాష్ బ్యాక్ ల మధ్య కధనాన్ని నడిపినా ఎక్కడా లంకె తెగకుండా పర్ఫెక్ట్ ఎడిటింగ్ తో నడిపించారు
ప్రథమార్థంలో పలికించిన ప్రాస డైలాగులు కూడా బాగున్నాయి
కాకపోతే ప్రథమార్థంలో వచ్చిన రాశీఖన్నా ( శ్లోక ) ఎపిసోడ్లు కధనాన్ని సాగతీయడానికి పనికొస్తుందేమో కానీ కధకు అనవసరం అనిపిస్తుంది
మరీ ఒక్క పాటతో పక్కన పడేస్తే ఐటెం సాంగ్ అనుకుంటారేమో అనుకుని రాశీకి ఇంకో రెండు సన్నివేశాలు యాడ్ చేసి ఇంటికి పంపినట్టున్నారు
అయితే అయ్యింది కానీ రాశీ కన్నా ఎపిసోడ్లో చక్కటి సందేశం ఇచ్చి ముగించిన విధానం బాగుంది
అలాగే కామెడీ ట్రాక్ కూడా ఉండాలని భావించి రాశీఖన్నాతో పాటు రాజేష్ ,ప్రవీణ్ అనే సైడ్ కమెడియన్లతో సన్నివేశాలు నడిపించినట్టున్నాడు దర్శకుడు
రావు రమేష్ వంటి చక్కటి నటుడితో కొద్దిగా అతి చేయించినట్టు అనిపించింది
విచిత్రమైన హావభావాలతో ,యాసతో నేరుగా సీఎం ఆఫీసుతోనే మాట్లాడటం ఓవర్ అయ్యింది
సెకండాఫ్ నుంచి ఏసిపి భగత్ సింగ్ ఎంటర్ అవడంతో కధలో సంఘర్షణ పెరుగుతుంది శ్రీలీల రాకతో జోష్ వస్తుంది
అలాగే శ్రీలీల పాత్రను ముగించిన విధానం కంట తడి పెట్టిస్తుంది
ఇక పవన్ కళ్యాణ్ కు భయంకరమైన ఎలివేషన్లు ఇవ్వడం కోసం దర్శకుడు హరీష్ శంకర్ అస్సలు మొహమాటపడకుండా తనకు కావాల్సిన సన్నివేశాలు తీసుకున్నాడు
ప్రపంచం మొత్తాన్ని గడగడా వణికించే పక్కదేశం టెర్రరిస్ట్ పాతబస్తీ ఏసిపి భగత్ సింగ్ పేరు వినగానే గడగడా వణికిపోవడం , ఒక వర్గానికి చెందిన వెయ్యిమందికి పైగా జనాలతో టెర్రరిస్ట్ నాయకుడు సమావేశంలో ఉండగా ఏసిపి ఒక్కడే లుంగీతో వెళ్లి వాళ్ళ లీడర్ని ఢాం ఢాం అంటూ పిస్తోలుతో కాల్చి ,ఇంకోక్కడ్ని ఈడ్చుకెళ్లి జీపులో పడేస్తుంటే టెర్రరిస్టులు భయంతో దిక్కులు చూడటం , టెర్రరిస్టులు అందరి దగ్గరా తుపాకులు ఉన్నా చివరివరకు ఒక్కడు కూడా ఏసిపిని కాల్చలేకపోవడం వంటి సన్నివేశాలు అతిగా ఉన్నాయి అనేకన్నా ఫాన్స్ కోసం హరీష్ శంకర్ చేసిన మ్యాజిక్కు అనుకోవాలి
సరే అభిమానులకు కావాల్సిన మసాలా వండాలంటే లాజిక్కులు వెతక్కూడదు కాబట్టి ఆ విషయాలు కాసేపు పక్కనబెడదాం
కధనంలో భాగంగా పవన్ కళ్యాణ్ తో తనకు కావాల్సిన చోట తనకిష్టమైన డైలాగులు పలికించారు
ఈ డైలాగులు ఇరికించినట్టు కాకుండా సన్నివేశాలకు తగ్గట్టుగా యాప్ట్ గా వాడారు
మైనస్ చలిలో సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను మెచ్చుకోకపోగా మీకు కార్గిల్ యుద్ధం ప్రూఫులు కావాలా ? అని పనిలో పనిగా ఓ రాజకీయ పార్టీ మీద పవన్ నేరుగా సెటైర్ వేసేసారు
ఇంకోచోట పార్తీబన్ తో మాట్లాడుతూ ‘ ఏమన్నావ్ ? నా అభిమానులను వేసేస్తావా ? అసలు నా అభిమానులు ఎంతమంది ఉన్నారో తెలుసా ? లెక్కపెట్టగలవా ?’ అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ కూడా ఫాన్స్ కు కిక్కిస్తుంది
చిరంజీవితో పోలిస్తే డాన్సులో పవన్ కళ్యాణ్ చాలా వీక్ అన్న సంగతి తెలిసిందే
ఆ వీక్ పాయింటును కూడా అధిగమించాలని అనుకున్నారో ఏమో ఇందులో అడిగించుకుని మరీ పవన్ కళ్యాణ్ స్టెప్పులేశారు
“అన్నా ! నీ స్టెప్పులు చూసి చాలా కాలం అయ్యింది అన్నా ..ప్లీజ్ ..ప్లీజ్ అన్నా..నువ్వు స్టెప్పులు వెయ్యాలన్నా ” అని కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ కాళ్ళమీద పడి అడుగుతారు
చిరంజీవికి ,పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో ఇటువంటి ఎలివేషన్లు మాములే కాబట్టి ఈ సన్నివేశం చూస్తే ఆశ్చర్యం వేయలేదు
కానీ అడిగించుకుని మరీ ఎత్తర కాలర్ అంటూ పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూస్తే ఆశ్చర్యం వేసింది
చాలా ఈజ్ తో రిథమిక్ గా డాన్స్ చేసాడు
మాటలు ,పాటలు ,ఫైట్లు ,డాన్సులు ..అభిమానులకు ఇంతకన్నా ఏం కావాలి ?
ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ మాదిరి ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు
సరే ఫాన్స్ అంటే పవన్ కళ్యాణ్ను చూసి ఎటూ ఈలలు కొడతారు
మరి సాధారణ ప్రేక్షకుల సంగతో ?
చాన్నాళ్లకు మన వారాలబ్బాయి మురళీమోహన్ సీఎం పాత్రలో కొద్దిసేపు కనిపిస్తాడు
చిరంజీవి నటించిన మనవూరి పాండవులు సినిమాలో మూగవాడి పాత్ర వేసిన ప్రసాద బాబు గుర్తున్నాడు కదా ?
చాన్నాళ్లకు కొద్దిసేపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మనకు కనిపిస్తాడు
సింధూర పువ్వా అంటూ పాట పాడిన రాంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు
ఈవీవీ సినిమాల్లో అదోరకమైన యాసతో అదరగొట్టిన ఎల్బీ శ్రీరామ్ శ్రీలీల తాతగారిగా కనిపిస్తారు
దాదాపు వెండితెరకు దూరమైన ఈ పాత నటులకు చాన్నాళ్లకు సముచిత పాత్రలు ఇవ్వడం బాగుంది
దర్శకుడు కేఎస్ రవికుమార్ , తమిళ నటుడు పార్తీబన్ , గౌతమి వంటివారిని తీసుకోవడం కూడా మంచి ఛాయిస్
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో ఎవరెలా చేసారంటే వన్ మ్యాన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ పేరునే మొదట చెప్పాలి
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు పూర్తి సమయం కేటాయించలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ ఈయన పార్ట్ టైం కే థియేటర్లను షేక్ చేస్తుంటే ఫుల్ టైం అయితే తమకు పండగే పండుగ అని ఫాన్స్ అంటున్నారు
సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ స్టార్ లో కనిపిస్తున్న ఈ స్పార్క్ ఎవరూ ఊహించనిది
ఓజీలో గ్యాంగ్ వార్ ను నడిపించిన పాత్రలో మెప్పిస్తే ,ఇందులో గ్యాంగ్ వార్ ను మట్టికరిపించిన ఏసిపి పాత్రలో పవన్ మెప్పించాడు
ఇక రాశీఖన్నా కనిపించిన కాసేపు ఒక పాటతో సహా బాగానే చేసింది
సీఎం పాత్ర పోషించిన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఆహార్యం సరిగ్గా సరిపోయింది
మరో తమిళ నటుడు పార్తీబన్ విలన్ గా ముఖంలో క్రౌర్యం బాగా పలికించాడు
రావు రమేష్ కొద్దిగా ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది
శ్రీలీలకు చక్కటి పాత్ర పడింది
ఉన్నంతవరకు బాగానే చేసింది
కానీ ఏ సినిమాలో ఈమెను చూసినా అవే హావభావాలు , చిన్నపిల్లలా అదో రకంగా మాట్లాడుతుండటంతో మోనాటనీ వస్తుంది
మురళీమోహన్ ,ప్రసాద బాబు ,రాంకీ ,గౌతమి , ఎల్బీ శ్రీరామ్ తదితరులు కనిపించింది కొద్దిసేపే అయినా గుర్తుండిపోతారు
అందరూ బాగానే చేసారు
సాంకేతికత
దేవీశ్రీప్రసాద్ ,తమన్ లు ఇద్దరూ కలిస్తే సంగీత సునామీ అవుతుంది
పాటలు ఒకరు ,బీజీఎమ్ మరొకరు పంచుకుని పూర్తి న్యాయం చేసారు
పాటల్లో ఎత్తర కాలర్ పాట బాగుంది
ఆయాంక బోస్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది
ఈ మూవీకి సరైన ఎడిటింగ్ ప్లస్ అయ్యింది
ఆ పరంగా కార్తీక్ శ్రీనివాస్ చక్కటి ఎడిటింగ్ పని తీరు కనపర్చారు
పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో దర్శకుడు హరీష్ శంకర్ విజయం సాధించాడు
విశ్లేషణ
ఇది పవన్ కళ్యాణ్ సినిమా .
కాబట్టి ఎంతటి దర్శకుడైనా సినిమాటిక్ లిబర్టీ ఖచ్చితంగా తీసుకుంటాడు . అందులోనూ సినిమా తీసేటప్పుడే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ,ఆయన ఫాన్స్ ఫాలోయింగును దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకుంటారు . హరీష్ శంకర్ కూడా అలాగే సన్నివేశాలు రాసుకున్నారు . అలాంటి క్రమంలో కొన్ని లాజిక్కులు మిస్ అవుతాయి . ఆ లాజిక్కులు మిస్ అయినా అభిమానులకు ఎలాగూ నచ్చుతుంది . కాకపోతే సాధారణ ప్రేక్షకుల విషయానికి వస్తే చిన్న చిన్న లాజిక్కుల విషయాలను పక్కనబెడితే మూవీ బోర్ ఏమీ కొట్టదు .ఒక ఫ్లో లో సాగిపోతుంది . కథ కన్నా కధనం మనల్ని సినిమాలో లీనం చేస్తుంది . ఫస్టాఫ్ లో ప్రాస డైలాగులు మెప్పిస్తాయి . సెకండాఫ్ లో ఫైటింగులు ఉన్నా మితిమీరిన వయోలెన్సును చూపించలేదు . కాకపోతే సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ సనాతన ధర్మం గురించి చెప్తూనే పేరు చెప్పకుండా పక్కదేశం అంటూ వేరే వర్గాన్ని విమర్శించటానికి సమయం తీసుకున్నాడు. అతడి పొలిటికల్ ఐడియాలజిని ప్రతిబింబిస్తూ కొన్ని డైలాగులను రాసుకున్నారు . తనకున్న పుస్తకాలు చదివే అలవాటును రెండు మూడు సందర్భాల్లో సంభాషణల ద్వారా చెప్పించారు . కాకపోతే ఇవన్నీ కధనంలో కలిసిపోతాయి కాబట్టి మనకు పెద్దగా ఏమీ అనిపించదు . ఓవరాల్ గా సినిమా ఫాన్స్ కు ఫుల్ మీల్స్ , మిగిలినవాళ్లకు మెనూ లో ఏది నచ్చితే అది
నటీనటులు : పవన్ కళ్యాణ్ ,రాశీఖన్నా , శ్రీలీల , రావు రమేష్ , కేఎస్ రవికుమార్ , పార్తీబన్ తదితరులు
నేపధ్య సంగీతం :తమన్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : ఆయాంకా బోస్
నిర్మాత : నవీన్ యెర్నేని
దర్శకత్వం : హరీష్ శంకర్
విడుదల : 19-3-2026
రేటింగ్ : 2.75 / 5
