ఈ మధ్య కాలంలో కామెడీ & ఎంటర్టైన్మెంట్ జానర్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో శ్రీవిష్ణు
గతంలో అతడు పోషించిన సీరియస్ పాత్రలకన్నా ప్రస్తుత కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో మెల్లిగా యు టర్న్ తీసుకుని ఈ జానర్ లో హిట్లు కొడుతున్నాడు
ఇక్కడ అల్లరి నరేష్ కు ,శ్రీవిష్ణుకు చిన్న సారూప్యత ఉంది
గతంలో కామెడీ జానర్ లో హాస్యాన్ని పండించి మెప్పించిన అల్లరి నరేష్ సడెన్గా యు టర్న్ తీసుకుని సీరియస్ పాత్రల్లో సైతం మెప్పించడం మొదలుపెట్టాడు
అలాగే శ్రీవిష్ణు సీరియస్ పాత్రలతో మొదలెట్టి కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ జానర్లో సెటిలై ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు
శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ కు పరాకాష్ట సామజవరగమన మూవీ
కాసేపు హాయిగా నవ్వుకోవాలంటే శ్రీవిష్ణు సినిమాకి వెళ్తే చాలు అన్నంతగా పేరు తెచ్చుకున్నాడు
రాజేంద్రప్రసాద్ ,వీకే నరేష్ ,అల్లరి నరేష్ ల తరహాలో ఇటీవల కాలంలో శ్రీవిష్ణు కూడా తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు
అందుకే టైటిల్స్ లో అతడి పేరు వేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కింగ్ అని ట్యాగ్ లైన్ వేశారు
శ్రీవిష్ణు ఆ ట్యాగ్ లైన్ కు అన్నివిధాలా అర్హుడే
తాజాగా విష్ణు విన్యాసం పేరుతో ఏవో విన్యాసాలు చేయడానికి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు
మరి విష్ణు విన్యాసం ఎలా ఉందో చూద్దాం
కధేంటి ?
ప్రతిభా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న విష్ణుకు ( శ్రీవిష్ణు ) జాతకాల పిచ్చి
వారము , వర్జము చూసుకోనిదే కాలు బయటపెట్టడు
వాస్తు శాస్త్రం ,న్యూమరాలజీ ఖచ్చితంగా ఫాలో అవుతాడు
అందుకే తన లక్కీ నంబర్ ఐదు కాబట్టి తన బైక్ కు ఇంకో మూడు చక్రాలు అదనంగా తగిలించుకుని తిరుగుతుంటాడు
(ఎంత జాతకాల పిచ్చి ఉన్నా టు వీలర్ కి ఐదు చక్రాలు వేసుకుని తిరగడానికి ఏ ద్వీపంలో అనుమతించారో తెలీదు
కాబట్టి హీరో బైకు విషయంలో లాజిక్కులు వెతకొద్దు)
అదేకాదు వాస్తు కోసమని పక్కింటి వాష్ రూమ్ అద్దెకు తీసుకుని మరీ వాడుతుంటాడు
ఇతడి చాదస్తం వల్ల ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు
మరోపక్క అతడి కాలేజీలోనే లెక్చరర్ గా పనిచేస్తున్న మనీషా ( నయన్ సారిక ) విష్ణును ప్రేమిస్తుంది
విష్ణు కూడా ఆమె ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు
సరిగ్గా ఈ పరిస్థితుల్లో మనీషా తన సమస్య గురించి శ్రీవిష్ణుకు చెప్తుంది
ఆమె సమస్య విన్న విష్ణు షాక్ అవుతాడు
ఇంతకీ మనీషా సమస్య ఏంటి ?
జాతకాలను నమ్మే విష్ణు ఆమె సమస్య విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ?
ప్రేమికుల మధ్య వచ్చిన ఈ సమస్య చివరకు ఎలా పరిష్కారం అవుతుంది ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
హీరోకి జాతకాల పిచ్చి ఉండటం , దానివల్ల అతడు ఎలాంటి ఇబ్బందులు పడతాడు అనే కాన్సెప్టుతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ కాన్సెప్ట్ వాడుకుని రాజేంద్రప్రసాద్ ను మాగ్జిమమ్ పిండేసుకుని టన్నుల కొద్దీ హాస్యాన్ని ఎప్పుడో పండించేసాడు
అంతెందుకు ఈ మధ్య వచ్చిన ప్రియదర్శి సినిమా కూడా జాతకాల పిచ్చి లైనులో తీసిందే కదా ?
ఇక ఇందులో కొత్తగా పిండటానికి ఏమీ లేదు
ఒకవేళ పిండినా ఆ ఒరిజినల్ ఫ్లేవర్ రాదు
ఆల్రెడీ మోటరులో నాలుగైదుసార్లు తిప్పి పిండేసుకున్న చెరకు పిప్పినుంచి కొత్తగా రసం ఏం వస్తుంది ? నీరసం తప్ప
ఇక ఆ చెరకు పిప్పికే అంత నిమ్మకాయ చెక్క తగిలించి మరోసారి తిప్పితే నాలుగు బొట్లు రాలుతాయి కానీ తాగేవాడికి అది ఎంతవరకు రుచిస్తుందో తెలీదు
ఈ మూవీ అటువంటి ప్రయోగమే
పోనీ హీరో జాతకాల పిచ్చి సంగతి అటుంచండి
హీరోయిన్ పుట్టినప్పటికే వందలకోట్ల ఆస్తికి వారసురాలు
కానీ ఆ ఆస్తిమీద కన్నేసిన కొంతమంది దాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేస్తారు ?
చివరికి ఏమౌతుంది ?
గతంలో ఇలాంటి లైనులో సినిమాలు చూసారా ?
విష్ణు విన్యాసంలో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఆ సినిమాలు గుర్తుకొస్తాయి
సరే గతంలో వచ్చిన హీరో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ,హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలు మనకు తెలిసినవే కాబట్టి ఈ మూవీలో ఆ పాయింటును కాసేపు పక్కనబెట్టి విశ్లేషణ చేద్దాం
టైటిల్లో ట్యాగ్ లైన్ తగిలించినట్టు శ్రీవిష్ణు నిజంగా ఎంటర్టైన్మెంట్ కింగే
ఈ మూవీ మొత్తాన్ని తన భుజాన వేసుకుని రకరకాల విన్యాసాలు చేసాడు
ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తనదైన శైలిలో శాయశక్తులా ప్రయత్నం చేసాడు
లుక్ పరంగా కూడా బాగున్నాడు
ఫస్టాఫ్ లో మనీషాతో కలిసి విష్ణు చేసిన విన్యాసాలు నవ్విస్తాయి
దానికి తోడు శ్రీవిష్ణుకు జోడీగా నయన సారికను తీసుకోవడం మంచి ఛాయిస్
ఇద్దరిమధ్య పండిన కెమిస్ట్రీ ఈ సినిమాకు బలం
ఇక హీరోకి తోక ఫ్రెండు సత్య ని సరిగా వాడుకోలేదు కానీ , అతడ్ని కూడా పూర్తిగా వాడుకునుంటే కామెడీ ట్రాక్ పరుగులు పెట్టేది
ఒక సన్నివేశంలో సత్య జాతకాల గురువు శ్రీనివాస రెడ్డిని రెండు చెంపలు వాయిస్తాడు
సరిగా గమనిస్తే తెలుగు టీవీ సీరియళ్ల మాదిరి అతడు తన చేతులను గాల్లో అటూఇటూ ఆడించడం తెలుస్తుంది
ఎందుకో ఆ సన్నివేశంలో కృతకత కనిపిస్తుంది
బ్రహ్మజీ విషయం కూడా అంతే ,
ఇందులో ఇతడి పాత్రను చూసినపుడు కూడా అదేదో సినిమాలో పోషించిన లెక్చరర్ పాత్ర గుర్తుకొస్తుంది
ఇంకా చెప్పాలంటే ఆ మూవీలో బ్రహ్మాజీ పోషించిన పాత్ర నవ్వులు పూయించింది
ఇక హీరోయిన్ ఇంట్రడక్షన్ విచిత్రంగా అనిపిస్తుంది
పరిచయం అయిన కాసేపటికే ఆమె విష్ణు చేత సిగరెట్లు తెప్పించుకుని మరీ తాగడం , మందు తాగడం ,ముద్దు అడగడం ఓవర్ గా అనిపిస్తుంది
అసలు ఆమెతో ఆ సన్నివేశాలు ఎందుకు పెట్టారో అర్ధం కాదు
ఫ్లాష్ బ్యాక్ లో హీరో చేసిన ఓ మంచి పని వల్ల అతడిని ప్రేమించడం , ఫ్యాకల్టీ ప్రమోషన్ లో సాయం చేయాలనుకోవడం వరకు బాగానే ఉంది
కానీ ఈ సిగరెట్లు ,మందు ,ముద్దుల గోలేంటి ?
ఆ సన్నివేశాలు లేకపోయినా లవ్ ట్రాక్ ను చక్కగా నడపొచ్చు
ఇక హీరోయిన్ ఫ్యామిలీ చూస్తే గూడ్స్ బండిలో ప్యాసింజర్లు గుర్తుకొస్తారు
పొలోమంటూ లారీలకు లారీల జనాల్ని దించినట్టు అంతమంది కుటుంబ సభ్యులు కనిపిస్తారు
పోనీలే ఆస్తి కోసం అంతమంది చేరారులే అని సరిపెట్టుకోవాలి
జాతకాల పిచ్చి ఉన్న విష్ణు , మనీషా సమస్య తెలిసినా ఆమెను పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోవడం వెనుక ఇంకాస్త బలమైన కారణాన్ని చూపించి ఉండాల్సింది
ఓవరాల్ గా ఫస్టాఫ్ లో విష్ణు కామెడీ టైమింగ్ , రివీల్ చేయని మనీషా సమస్య మనల్ని కొంతవరకు సినిమాలో లీనం చేస్తాయి
కానీ సెకండాఫ్ లో ఆమె సమస్య రివీల్ కావడంతో స్టోరీలో డెప్త్ తగ్గిపోయింది
కాకపోతే ముగింపులో ట్విస్ట్ పేరిట అసలు విషయాలను రివీల్ చేయడం కొంతవరకు ఇంట్రస్టింగ్ గానే అనిపించినా ఇవి గతంలో చాలా సినిమాల్లో చూసేసాం కాబట్టి కొత్తగా థ్రిల్ ఏమీ ఇవ్వదు
ఎవరెలా చేసారు ?
విష్ణు విన్యాసం మొత్తాన్ని తమ భుజాల మీద వేసుకుని విన్యాసాలు చేసింది ఇద్దరే
ఒకరు శ్రీవిష్ణు కాగా ,రెండోది నయన్ సారిక
శ్రీవిష్ణు ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అవుతున్నట్టున్నాడు
పంచ్ డైలాగులు , మీమ్స్ బాగా పేలుస్తున్నాడు
సింగిల్ లైనులో పంచులు పేల్చి నవ్వులు పోయిస్తున్నాడు
ఎక్స్ప్రెషన్స్ లో కానీ ,డైలాగ్ డెలివరీలో కానీ ,బాడీ లాంగ్వేజ్ లో కానీ చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు
ఇక శ్రీవిష్ణుకు జోడీగా వేసిన నయన సారిక చక్కటి పెర్ఫార్మన్స్ చూపించింది
సన్నివేశాలకు తగ్గట్టుగా సింపుల్గా హావభావాలను ప్రదర్శించింది
మందు తాగినా ఓవర్ యాక్షన్లు చేయడాలు లాంటి సన్నివేశాలు లేకపోవడం బిగ్ రిలీఫ్
కామెడీ ట్రాకులో సత్య , బ్రహ్మజీల నటన బాగానే ఉంది కానీ వాళ్ళని పూర్తిస్థాయిలో వాడుకుని ఉంటే బాగుండేది
బహుశా ఆ కామెడీ భారాన్ని కూడా దర్శకుడు శ్రీవిష్ణు మీద పెట్టినట్టున్నాడు
మురళి శర్మ , రాజేష్ , రమణ గోపరాజు ల నటన బాగానే ఉంది
శ్రీకాంత్ అయ్యంగార్ చక్కటి నటుడు
కానీ ఎందుకో ఈ మధ్య ఏ సినిమాలో చూసినా అతడిలో ఒకేరకమైన మూస నటన కనిపిస్తుంది
అతడు ఈ ఒరవడిని మార్చుకోవాలి
సాంకేతికత
రధన్ అందించిన నేపధ్య సంగీతం పర్లేదు
మూవీలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు కాబట్టి ఆ విషయంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు
సాయిశ్రీరాం అందించిన సినిమాటోగ్రఫీ పరిస్థితి కూడా అదే
ఈ సినిమాకి కథ రాసుకున్న దర్శకుడు యదునాధ్ మారుతీరావు మూస కథ మీద కాకుండా సరికొత్త ప్లాట్ లో కధాంశం ఎన్నుకోవాల్సింది
విశ్లేషణ
లాజిక్కులు ,మ్యాజిక్కులు లాంటివి ఏమీ ఆశించకుండా కాసేపు ఎంటర్టైన్ అవుదాం అనుకునేవారికి ఈ సినిమా నిక్షేపంగా నచ్చుతుంది . శ్రీవిష్ణు మార్క్ కామెడీ పంచ్ డైలాగులు , సోషల్ మీడియా మీమ్స్ తరహాలో అప్పుడప్పుడు కనిపించే సన్నివేశాలు చూసి నవ్వుకోవడానికి , ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటిటీ లో ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు
నటీనటులు : శ్రీవిష్ణు , నయన్ సారిక , మురళీశర్మ ,రమణ గోపరాజు ,బ్రహ్మాజీ ,సత్య తదితరులు
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫి : సాయిశ్రీరాం
నిర్మాత : సుమంత్ నాయుడు
దర్శకత్వం : యదునాధ్ మారుతీరావు
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.5 / 5
