80 వ దశకంలో విజయవాడలో దివంగత వంగవీటి మోహన రంగా ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున ప్రభలు నిర్వహించేవారు
ఈ ప్రభలు చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాకుండా రాష్ట్రము నలుమూలల నుంచి ఉదయానికే జనం పోటెత్తేవారు
సాయంత్రం 6 గంటల నుంచి విజయవాడ గాంధీ నగర్లోని జింఖానా మైదానం నుంచి ప్రభలు బయలుదేరతాయని తెలిసినా కూడా ఊళ్ళ నుంచి ఉదయాన్నే వచ్చిన జనం మైదానంలోనే వంటావార్పు చేసుకునేవాళ్ళు
అది కాస్తా సాయంత్రానికి ఇసకేస్తే రాలని జనంతో నిండిపోయేది
ఈ ప్రభల కోసం రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన కళాకారులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను పిలిపించేవారు
దానితో జింఖానా మైదానంలో పండుగ సందడి కనిపించేది
భేతాళ వేషాలు వేసే వాళ్ళ చిత్ర విచిత్ర విన్యాసాలతో మైదానం దద్దరిల్లిపోయేది
ప్రభలకు అలంకరించిన విధ్యుత్ దీపాల తోరణాలతో రాత్రి కూడా పగటిని తలపించేది
మైదానంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు అన్నీ వంగవీటి మోహన రంగా సహచరుడు ధూపాటి నరసన్న చూసుకునేవాడు
ఆ రోజుల్లో ఏ చిన్న పొరపాటు జరక్కుండా ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహించడం అంటే మాములు విషయం కాదు
సరిగ్గా సాయంత్రం 6 గంటలకు వంగవీటి మోహన రంగా కార్ల ర్యాలీతో జింఖానా మైదానానికి చేరుకోవడంతో ఊరేగింపు ప్రారంభం అయ్యేది
వంగవీటి మోహన రంగా మొదటి ప్రభలో ఎత్తైన వేదిక మీద నిలబడి ఉండగా ఊరేగింపు కదిలేది
జింఖానా గ్రౌండ్స్ నుంచి మొదలైన ఊరేగింపు సత్యనారాయణ పురం , గాంధీ నగర్ , గవర్నర్ పేట ల మీదుగా కదిలేది
ఊరేగింపు ఏ తెల్లవారు ఝామునో గవర్నర్ పేటలోని వంగవీటి మోహన రంగా ఇంటిదగ్గరికి వచ్చేసరికి పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చేవాళ్ళు
ఆ బాణ సంచా వెలుగులు ఊరంతా కనిపించేవి
వంగవీటి మోహన రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి కూడా ఒకట్రెండు సంవత్సరాలు ప్రభలు నిర్వహించినట్టు గుర్తు
ఆ తర్వాత విజయవాడలో వంగవీటి కుటుంబం నుంచి దసరా ప్రభలు నిర్వహించలేదు
మళ్ళీ ఇన్నాళ్లకు వంగవీటి మోహన రంగా బావమరిది , రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీను ఆధ్వర్యంలో అక్టోబర్ 4 న విజయవాడ గాంధీ నగర్ నుంచి భారీ ఎత్తున ప్రభలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు!
పరేష్ తుర్లపాటి
