Home » ఎన్కౌంటర్ ఎడిటర్ పింగళి దశరథ రామ్ ను పిలిపించి ఆ మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు ?- పార్ట్ 4

ఎన్కౌంటర్ ఎడిటర్ పింగళి దశరథ రామ్ ను పిలిపించి ఆ మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు ?- పార్ట్ 4

Spread the love

పింగళి దశరథ రామ్ ఎన్కౌంటర్ మ్యాగజైన్ ప్రయాణంలో తనకెదురైన అనుభవాలను కళ్ళకు కట్టినట్టుగా రచ్చబండ కబుర్లలో వివరించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ పేరిట ఇంతకుముందు ఇదే సైట్ లో మూడు భాగాలను పబ్లిష్ చేయడం జరిగింది ( చదవని వారు ఇక్కడ సెర్చ్ చేస్తే ఆ భాగాలు కనిపిస్తాయి )

దానికి కొనసాగింపు ఇప్పుడు జర్నలిస్ట్ మాటల్లోనే ,

“చాలామందికి పింగళి దశరథ రామ్ బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం చేస్తాడనే అపోహలు ఉన్నాయి .. అతడ్ని దగ్గర నుంచి చూసిన నేను చెప్తున్నా .. అవన్నీ అపోహలే .. వాస్తవం కాదు .. నిజానికి పింగళి దశరథ రామ్ బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం చేసుంటే ఈపాటికి హాయిగా సెటిలైపోయేవాడు .. ఓ పార్టీకి చెందిన మనుషులు ఇంటికొచ్చి ఆరు లక్షల రూపాయలు బల్ల మీద పెట్టినప్పుడే తీసుకుని జేబులో పెట్టుకుని ఉంటే అతడి కథ ఇంకోలా ఉండేది .. ప్రింటింగ్ ప్రెస్సులో అప్పులు పెట్టి మ్యాగజైన్ పబ్లిష్ చేసే పరిస్థితి వచ్చేది కాదు .. నాలాంటి వాడికి జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడేవాడు కాదు .. కారుల్లో తిరగాల్సిన వాడు రిక్షాలో తిరిగే పరిస్థితి ఉండేది కాదు .. పింగళి దశరథ రామ్ రాయడం ఆపితే చాలు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడిన పార్టీ నాయకులూ నాకు తెలుసు .. డబ్బు ఆశ చూపారు .. బెదిరించారు.. అయినా లొంగలేదు .. రాయడం మాత్రం ఆపనన్నాడు”

ఓసారి నేను రామ్ ను అడిగా ” నువ్వేం రాస్తున్నావో నాక్కూడా చూపించవు .. పర్లేదు .. కానీ నువ్వు రాసే రాతల్లో ఆ కటువైన పదాలు కానీ , బూతులు లేకుండా కానీ రాయొచ్చు కదా ?” అని అడిగాను

దానికి రామ్ నవ్వి ” గౌరవనీయ మంత్రి గారు ఫలానా ప్రాజెక్టులో వంద కోట్లు లంచంగా స్వీకరించారు అని రాస్తే వాడికెక్కుతుందా ? చదివి నవ్వుకుని పక్కన పడేస్తాడు .. వాడు ప్రజల డబ్బులు దొబ్బేసాడని తెలిసినప్పుడు వెధవ గౌరవాలెందుకివ్వాలి ? రాస్తే గూబ గుయ్ మనేట్టు రాయాలి .. చదివితే వాడి ముఖం పగిలిపోవాలి .. ముచ్చెమటలు పట్టాలి .. ఈ వార్త చదివిన సామాన్యుడికి కూడా మంత్రి గాడి అవినీతి గురించి తెలిసి నరనరాన ఆవేశం పొంగుకుంటూ రావాలి .. అది కదా రాతలకు అర్ధం .. అది కదా జర్నలిజానికి అర్ధం.. ఇది ఆగదు .. చీకటి భాగోతాల మీద ఎన్ కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి వాడు రాజైనా సరే మంత్రి అయినా సరే ” అని నిక్కచ్చిగా చెప్పేసాడు

ఎన్ని చెప్పినా అతను తన ఆశయం నుంచి ఇంచు కూడా పక్కకి జరగడని అరమైంది నాకు

సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి వదిలేసాను

ఇది జరిగిన కొన్ని రోజులకు నాతో మాట్లాడాల్సిన పనుందని నన్ను పిలిపించాడు దశరథ రామ్
వెళ్ళాక చెప్పాడు

“నాదెండ్ల భాస్కరరావు కబురుపెట్టాడు .. సొంతంగా ప్రెస్ పెట్టుకోవడానికి సాయం చేస్తా అన్నాడు ” అని చెప్పాడు

నాకు చాలా సంతోషం వేసింది

పోనీలే ఎవరో ఒకరు సాయం చేస్తే ఈ అప్పుల బాధ తీరి రామ్ కూడా సొంతంగా ఓ ప్రెస్సు ఓనర్ అవుతాడని సంతోషించా

“మంచి పని జరిగింది రామ్ .. ఇక ప్రింటింగ్ ప్రెస్సు వాడి అప్పుల గోల ఉండదు .. నువ్వే ఓ ప్రెస్సు ఓనర్ అవుతావు ” అని సంతోషంగా చెప్పా

” కానీ నేను ఒప్పుకోలేదు ” చెప్పాడు దశరథ రామ్

అతడి సమాధానం విని నేను షాక్ అయ్యా

“అదేంటి రామ్ .. జీవితంలో ఎవరికైనా ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా ? ఎందుకు ఒప్పుకోలేదు ?అసలేం జరిగిందో వివరంగా చెప్పు ?” అనడిగా

దశరథ రామ్ చెప్పిన సంగతులు టూకీగా ,

అప్పటికి నాదెండ్ల భాస్కర రావు ఎన్టీఆర్ నుంచి వేరు కుంపటి పెట్టి ముఖ్యమంత్రి పీఠం కూడా ఎక్కి నెలరోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి అనిపించుకున్న రోజులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎన్ కౌంటర్ మ్యాగజైన్ లో పింగళి దశరథ రామ్ రాసిన ఆర్టికల్స్ నాదెండ్ల దృష్టిలో కూడా పడ్డాయి

అతడిలోని స్పార్క్ ను గుర్తించి కబురు పెట్టాడు
అతడి కష్టాలు తెలుసుకున్నాడు
అతడి శత్రువుల సంగతీ తెలుసుకున్నాడు

అందుకే ” చూడు బాబూ ! నువ్వు వయసులో చాలా చిన్నవాడివి .. ఇంకా ఎంతో భవిష్యత్ చూడాల్సిన వాడివి .. జర్నలిజం ద్వారా నువ్వు వెలుగులోకి తెస్తున్న విషయాలు మామూలువి కాదు .. ఇందుకు చాలా దైర్యం కావాలి .. అయితే నీ ఆర్థిక ఇబ్బందుల గురించి నాకు తెలిసింది .. అందుకే ట్రస్ట్ ద్వారానో , లోను ద్వారానో నీకు సొంత ప్రెస్ ఏర్పాటు చేయిస్తా .. ఇలాగే నిజాలను నిర్భయంగా రాస్తుండు .. నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను కలువు “అని చెప్పారు నాదెండ్ల

కానీ ఆయన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించి వచ్చేసాడు దశరథ రామ్

అలా ఆ అఫర్ ను తిరస్కరించటానికి అసలు కారణం కూడా దశరథ రామ్ చెప్పాడు

“నాలాంటి జర్నలిస్టుకు లీగల్ గా సాయం చేయాలనుకున్న నాదెండ్ల భాస్కర రావు నిర్ణయాన్ని నేను తప్పు పట్టడం లేదు .. కానీ ఆయన సాయంతో నేను ప్రెస్ ఏర్పాటు చేసుకుంటే ఇప్పటిలా రాయలేను .. ఈ స్వేచ్ఛ నాకుండదు .. ఎవరి వత్తిళ్లకో , ఆబ్లిగేషన్లకో లొంగి పనిచేయాల్సి ఉంటుంది.. అది నాకిష్టం లేదు .. అందుకే వద్దని చెప్పి వచ్చేసాను ” అన్నాడు దశరథ రామ్

నేను తల పట్టుకున్నాను

జీవితంలో ఎదగటానికి అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్న లౌక్యం తెలియని మనిషి అని బాధ పడాలో ?
నమ్మిన ఆశయం కోసం దారి తప్పని గొప్ప జర్నలిస్ట్ నా స్నేహితుడు అని సంతోషించాలో నాకు అర్ధం కాలేదు

ఆనాటి నుంచి నమ్మిన ఆశయం కోసం దశరథ రామ్ ఎన్ కౌంటర్ మ్యాగజైన్ ద్వారా పోరాటం చేస్తూనే ఉన్నాడు

చూస్తుండగానే ఎన్ కౌంటర్ మ్యాగజైన్ సర్క్యులేషన్ వంద కాపీల నుంచి 5 లక్షల వరకు పెరిగింది
అలాగే దశరథ రామ్ కు శత్రువులు కూడా పెరిగారు

ఈ పరిస్థితుల్లో శత్రువులు దశరథ రామ్ ను ఎలా టార్గెట్ చేసారు ?
చంపాలనుకునేంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ?
తార్వాతేమ్ జరిగింది ?

తరువాతి భాగంలో …

చూస్తూనే ఉండండి రచ్చబండ కబుర్లు ( గూగుల్ సెర్చ్ లో రచ్చబండ కబుర్లు అని టైపు చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది )
ఈ ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సావ్ , ఫేస్ బుక్ ఐకాన్ల ద్వారా షేర్ చేయొచ్చు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *