తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మంచి (అభివృద్ధి ) పనులలో యాదగిరి గుట్ట దేవాలయ అభివృద్ధి ఒకటి
చాలాకాలం తర్వాత నిన్న యాదగిరి గుట్ట లక్ష్మి నృసింహస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కళ్లకుకట్టినట్టు కనిపించిన కొన్ని మార్పులు గమనించాను
ఇప్పుడు ఆ మార్పుల గురించి విశ్లేషణ చేసుకుందాం
పరిపాలనలో ఒక్కో పాలకుడిది ఒక్కో తీరు ఉంటుంది
ఒక పాలకుడు ఆధునిక సాంకేతికత మీద ఎక్కువగా దృష్టి పెడితే , ఇంకో పాలకుడు నీటిపారుదల పర్యావరణం మీద దృష్టి పెడతాడు . మరొక పాలకుడు అర్బన్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతాడు
ఎవరెన్ని పనులు చేసినా వారి మార్క్ ఒకటి నిలిచిపోతుంది
భవిష్యత్ తరాలు ఆ మార్క్ తోనే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాయి
అభివృద్ధి అంటే రోడ్లు ,నీటిపారుదల మాత్రమే కాదు
మెజారిటీ ప్రజల విశ్వాసమైన ఆధ్యాత్మిక భావనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది
ఈ పరంగా కేసీఆర్ నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నారు
ఆధ్యాత్మిక భావనలను విశ్వసించే ప్రజలలో కేసీఆర్ కూడా ఉన్నారు
అందుకే ఒక పరిపాలకుడిగా దేవాలయాల మీద , వ్యక్తిగా యజ్ఞయాగాదుల మీద దృష్టి సారించారు
ఆయన కోసం చేసుకున్నా ,లోక కళ్యాణం కోసం చేసినా ఫలితం అందరికీ ఉంటుంది
అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆయన చేసిన వ్యక్తిగత యాగాల గురించి కాదు
హిందూ మత విశ్వాసాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యంగా యాదగిరి గుట్ట అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం
ఒకప్పుడు యాదగిరి గుట్ట
ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే యాదగిరి లక్ష్మి నరసింహస్వామి ప్రతిష్టాత్మకమైన ఆలయం
అయితే పేరుకే ప్రతిష్టాత్మక ఆలయం కానీ ఆలనాపాలనా విషయంలో అంతంత మాత్రంగానే ఉండేది
దూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులకు సరైన సౌకర్యాలు ఉండేవి కావు
పైగా ఈ గుట్టకు చేరుకునే మార్గంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటంతో యాత్రికులకు ఇబ్బందిగా ఉండేది
పవిత్రమైన దేవాలయ మార్గంలో ఈ అసాంఘిక శక్తులు ఎంత బలంగా పాతుకుపోయారంటే స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేనంత
తలచినంతనే తమ కోరికలను తీరుస్తాడని నమ్మకంతో ఎంతో దూరాలనుంచి భక్తులు వ్యయప్రయాసల కోర్చి యాదగిరి గుట్టకు వస్తే దారంతా అపరిశుభ్రవాతావరణం , అసాంఘిక కార్యకలాపాల బెడద ఇబ్బంది పెట్టేది
ముఖ్యంగా మహిళా భక్తులు మరింత ఇబ్బంది పడేవారు
కేసీఆర్ కృషి
ఒకసారి యాదగిరి గుట్టను సందర్శించిన కేసీఆర్ దేవాలయ అభివృద్ధికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు
నిర్ణయం తీసుకోవడమే కాదు దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల నిధులను కూడా ప్రకటించారు
దరిమిలా ఆయన తన కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతోనూ , శిల్పి ఆనందసాయితోనూ యాదగిరి గుట్ట అభివృద్ధికి చర్చించారు
ఈ చర్చలలోనే షుమారు 1800 వందల ఎకరాల విస్తీర్ణంలో గుట్టను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు
మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి వెయ్యి కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు
గుట్టలో వెలిసిన స్వయంభు లక్ష్మి నరసింహస్వామి మూలవిరాట్టును టచ్ చేయకుండా విస్తరణ పనులను చేయాలని నిర్ణయం తీసుకున్నారు
ఇందుకోసం శిల్పి ఆనందసాయి దేశంలోని షుమారు 60 ప్రతిష్టాత్మక దేవాలయాలను సందర్శించి నమూనాలు సిద్ధం చేసుకున్నారు
ఈ ఏర్పాట్లను పర్యవేక్షించటానికి తానే స్వయంగా వారానికో ,పదిహేను రోజులకో ఒకసారి యాదగిరి గుట్టకు వస్తానని కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు
యాదగిరి గుట్టను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా యాదాద్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పేరుతో ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటుచేశారు
బంగారు తాపడం
ఒకపక్క ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండగానే ఆలయ శిఖరానికి బంగారు తాపడం వేయించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలనుంచి కేసీఆర్ విరాళాలు అడిగారు
విరాళాలు అడగడమే కాదు ఆయన స్వయంగా షుమారు యాభయ్ లక్షల రూపాయల విలువ చేసే 16 తులాల బంగారాన్ని దేవస్థానానికి అందచేశారు
కేసీఆర్ స్పూర్తితో యాదగిరి గుట్ట దేవస్థానానికి బంగారం విరాళం ఇవ్వడానికి నాయకులు క్యూ కట్టారు
ప్రస్తుతానికి వస్తే ,
ఉప్పల్ రోడ్ తిప్పల్
యాదగిరి గుట్టలో చకచకా జరిగిపోయిన అభివృద్ధిపనులు చూసి సంతోషపడే ప్రతిఒక్కరూ , ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఉప్పల్ దగ్గర రహదారిని చూసి నిరుత్సాహపడుతూ ఉంటారు
ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి దాకా ఫ్లయ్ ఓవర్ల సంగతి దేవుడెరుగు రోడ్డు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది
ఈ అతుకులు గతుకుల గుంతల దారిలో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి
వాహనదారులు ,మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో నరకం అనుభవిస్తూ ఉంటారు
కళ్ళల్లోకి పడే దుమ్ము ధూళితో కింద గోతులు కనిపించక వాటిలో పడి ఎముకల డాక్టర్లకు చూపించుకున్నవాళ్ళు ఎందరో ?
అసంపూర్తిగా కొనసాగుతున్న ఫ్లయ్ ఓవర్ పనులు , రోడ్డుమీద అడ్డదిడ్డంగా పడేసిన నిర్మాణ సామాగ్రి , ఇరుకైన మార్గంలో ఎటునుంచి ఎటు ఏ వాహనం వస్తుందో తెలియక పాదచారులు అగచాట్లు పడుతుంటారు
ఎవరిదాకో ఎందుకు నిన్న మేము కారులో వెళ్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులే పడ్డాం
ఉప్పల్ నుంచి నారపల్లి జంక్షన్ దగ్గరికి రావడానికి ముప్పై నిమిషాలకు పైనే పట్టింది
దానికి తోడు నారపల్లి తర్వాత కూడా రోడ్డు నిర్మాణాలే కావడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది
ఈ రహదారిని చూసిన వారెవరూ హైదరాబాద్ విశ్వనగరం అంటే ఒప్పుకోరు
హైదరాబాద్ మూడువైపులా చక్కటి రహదారులతోను , ఫ్లయ్ ఓవర్లతోనూ చకచకా అభివృద్ధి పనులతో దూసుకుపోతుంటే ఉప్పల్ ఫ్లయ్ ఓవర్ ను మాత్రం పట్టించుకునే నాధుడే లేడు
ఈ విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం స్పృష్టంగా కనిపిస్తుంది
ఈ మధ్యనే మంత్రి కోమటిరెడ్డి గారు ఒక ప్రకటన చేస్తూ దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పూర్తి చేస్తామన్నారు
అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి
యాదగిరి గుట్ట – మార్పులు
హైదరాబాద్ నుంచి షుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరి గుట్టను చేరుకోవాలంటే ట్రాఫిక్ లేకపొతే గంట పడుతుంది
ట్రాఫిక్ పెరిగితే ఇంకో అర్ధగంట ఎక్కువ టైం కలుపుకోవాలి
భువనగిరి దాటిన తర్వాత హైవే నుంచి ఎడమవైపుకు షుమారు ఓ పది కిలోమీటర్లు వెళ్ళాలి
గతంలో ఈ రోడ్డు గుంతలతో ఉండేది
ఇప్పుడు రావడానికి పోవడానికి అనువుగా ఫోర్ లైన్ వేశారు
రోడ్డుకు అనుకుని ఉన్న చెరువును అభివృద్ధి చేసి యాత్రీకులు సేదతీరడానికి గట్టున పార్కులు ఏర్పాటుచేశారు
దానికి అనుకునే శిల్పారామాన్ని కూడా ఏర్పాటు చేసారు
అదే దారిలో వెళ్తుంటే రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వెలిసిన హోటళ్లు ( లాడ్జీలు ) బ్యాంకెట్ హాళ్లు కనిపిస్తున్నాయి
దారిలో సురేంద్రపురి కనిపిస్తుంది
దేశంలో ఉన్న ప్రధాన దేవాలయాల నమూనాలో విగ్రహాలను ఇందులో ఏర్పాటు చేసారు
ఎంట్రీ టికెట్ ధర ఎక్కువగా ఉండటం వల్ల అనుకుంటా జనం లేరు
అక్కడ్నుంచి ముందుకెళితే యాదగిరి గుట్ట దేవాలయం జంక్షన్ వస్తుంది
వాహనాల్లో వెళ్లేవారు ఎడమవైపు వెళ్తే కిందనే ఖాళీ స్థలంలో పార్కింగ్ కనిపిస్తుంది
పార్కింగ్ దోపిడీ
కోట్లు ఖర్చుపెట్టి గుట్టను డెవలప్ చేసిన ప్రభుత్వం పార్కింగ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది
కొండకింద ఫోర్ వీలర్ పార్కింగుకు 50 రూపాయలు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్ కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ,కొండపైన మాత్రం 500 ధర నిర్ణయించడం సహేతుకంగా లేదు
దేవాదాయ శాఖ లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థ అనుకుంటాం కానీ ఈ పార్కింగ్ రేట్లు చూస్తుంటే ఇది కూడా బిజినెస్సే బాసూ అనిపించడంలేదూ
వృద్దులు ,చిన్నపిల్లలు ఉన్నవారు తప్పనిసరిగా వాహనాల్లో కొండపైకి వెళ్లి పార్కింగుకు ఐదు వందలు చెల్లిస్తున్నారు
మిగిలినవారు వాహనాలను కిందనే పార్క్ చేసి కొండమీదకు వెళ్తున్నారు
కొండపైకి ఉచిత బస్సులు
ఇప్పుడే పార్కింగ్ విషయంలో ఆ శాఖను తిట్టుకున్నాం కదా
కానీ అదే శాఖ కొండపైకి భక్తులను తీసుకెళ్లే విషయంలో ఉదారత చూపించింది
కింద పార్కింగ్ ప్రదేశం వద్దకే ప్రతి ఐదు పది నిమిషాలకు ఒక ఉచిత బస్సు వచ్చి భక్తులను ఎక్కించుకుని కొండపైన బస్ స్టాండ్ లో వదిలిపెడుతుంది
కొండపైన ఆలయానికి దిగువన బస్ స్టాండ్ నిర్మాణం అయితే చేసారు కానీ ఫలహార భోజనశాలలు మాత్రం ఏర్పాటుచేసినట్టు లేదు
మొత్తానికి ఒకే ఒక డబ్బా చాయ్ వాలా కనిపించాడు
దూరప్రాంతాలనుంచి వచ్చిన యాత్రీకులు కాఫీ ,టీ తాగాలంటే అతడే గతి
ఇతరత్రా బిస్కట్ ,స్నాక్స్ వంటి స్టాళ్లు కూడా లేవు
జలప్రసాద్ పేరుతో మంచినీటి సౌకర్యం మాత్రం ఏర్పాటుచేశారు
అక్కడే నల్గొండ క్రాఫ్ట్స్ పేరుతో చేతిపనులు వారు చేసిన చెక్కబొమ్మలు ,ఇతర కళాఖండాలు అమ్మే స్టాల్ ఏర్పాటు చేసారు
ధరలు కొద్దిగా ఎక్కువే అనిపించాయి
బ్యాటరీ కార్
బస్సులో కొండపైకి అయితే వచ్చాం కానీ ఆలయ ప్రాంగణానికి రాలేదు
బస్సు దిగిన తర్వాత కొంచం ముందుకెళితే వృద్దులు ,చిన్నపిల్లల కోసం బ్యాటరీ కార్లు ఏర్పాటు చేసారు
అలా అంటున్నారు కానీ అందరినీ ఉదారంగా ఎక్కించుకుని ఆలయ ప్రాంగణంలో దింపుతున్నారు
ఈ విషయంలో వారి సర్వీసును మెచ్చుకోవాలి
ఎవ్వరూ డబ్బులు డిమాండ్ చేయడం లేదు
బ్రేక్ దర్శనం
మేము వెళ్లేసరికి సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది
అభివృద్ధి పెరిగినచోట కార్పొరేట్ స్టైల్ కూడా పెరుగుతుంది కదా
నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రేక్ దర్శనం ఉంది కాబట్టి ఇతర దర్శనాలు ఆపు చేస్తారని తెలిసింది
చాలామందికి ఈ విషయం తెలియక నాలుగు గంటలకు గుడి ఓపెన్ ఉంటుంది కాబట్టి నేరుగా దర్శనం చేసుకుని వెళ్లిపోవచ్చు అనుకుంటారు
కానీ బ్రేక్ దర్శనం వల్ల సాధారణ భక్తులు గంటసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది
కోతుల బెడద
విశాలమైన ప్రాంగణం కాబట్టి గంటసేపు వెయిట్ చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు కానీ కోతుల బెడద విపరీతంగా ఉంది
ఆకలి బాధ తట్టుకోలేక భక్తులు తిని పడేసిన ప్రసాదాల కోసం కోతులు అక్కడనే తిరుగుతుండటంతో భయంతో భక్తులు దూరంగా నిలబడాల్సి వస్తుంది
ఈ విషయంలో దేవస్థాన అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
పంచలు మస్ట్
దూరప్రాంతాలనుంచి వచ్చే చాలామంది భక్తులకు ఈ పంచల నిబంధన గురించి పెద్దగా తెలీదు
కొన్ని దేవాలయాల్లో ఇప్పటికే సాంప్రదాయ దుస్తులతోనే భక్తులను అనుమతిస్తున్నారు
మనకు ముందస్తు సమాచారం ఉంటే పర్లేదు
లేకపొతే ఇబ్బంది అవుతుంది
ఇక్కడ కూడా గతంలో స్వామివారి దర్శనానికి మాములు దుస్తులతోనే అనుమతించేవారు
కానీ ఇప్పుడు సాంప్రదాయ దుస్తుల నిబంధన ఖచ్చితంగా అమలుచేస్తున్నారు
అదికూడా 300 రూపాయల అంతరాలయం దర్శన టికెట్ తీసుకున్నవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది
ఇది ఎంత ఖచ్చితంగా అమలుచేస్తున్నారు అంటే ఆఖరికి ప్యాంటు మీద పంచ చుట్టుకున్నా అనుమతించడం లేదు
పాపం మేము చూస్తుండగానే ప్యాంటు మీద పంచ చుట్టుకున్న ఓ పెద్దాయనను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన అక్కడే అప్పటికప్పుడు దుస్తులు మార్చుకోవడానికి అవస్థలు పడ్డాడు
కాబట్టి అంతరాలయం దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా పట్టు పంచలు తీసుకెళ్లండి
దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా పొరపాటున మర్చిపోతే అక్కడే స్టాల్ లో పంచలు అమ్ముతున్నారు
150 దర్శన టికెట్ కు ,సర్వ దర్శనానికి ఈ నిబంధన వర్తించదు
అన్నట్టు గతంలో దర్శనం టికెట్ 50 రూపాయలు మాత్రమే ఉండేది
ఇప్పుడు 150 మరియు 300 రూపాయల టికెట్లు ఉన్నాయి
దర్శనానికి పట్టిన సమయం
వారం మధ్యలో కాబట్టి జనం తక్కువగానే ఉన్నారు
150 రూపాయల దర్శనానికి పది నిముషాలు పట్టింది
ఉచిత దర్శనానికి ముప్పై నిముషాలు పట్టి ఉండొచ్చు
జ్వాలా నరసింహ స్వామి
స్వామి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు ఎదురుగా రాతి శిల ,పక్కనే విగ్రహాలు కనిపిస్తాయి
రాతి శిల పైన చిన్న దీపం కనిపిస్తుంది
అక్కడ నిలబడి ఉన్న ఉద్యోగిని అడిగితే జ్వాలా నరసింహ స్వామి అని చెప్పాడు
అంతరాలయంలో నేల మీద కూర్చుని ఓ పూజారి గారు భక్తులతో అర్చన చేయించి వీపు మీద తన చేతిలో ఉన్న కర్రతో సుతిమెత్తగా తడుముతున్నాడు
ఎందుకో తెలీదు
బహుశా దీని వెనుక పూజకు సంబంధించిన కారణం ఏదో ఉండే ఉంటుంది
అర్చన ఆరు వందలు
స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మండప ప్రాంగణంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు బంగారు పుష్పాలతో అర్చన చేస్తున్న పూజారి కనిపిస్తారు
ఈ అర్చనకు 600 రూపాయలు చెల్లిస్తే మగవారికి కండువా , ఆడవారికి జాకెట్ ముక్కలు అందచేసి ఆశీర్వదిస్తారు
శిల్పకళ
అంతరాలయం బంగారు రంగు కాంతుల లైట్లతో దేదీప్యమానంగా కనిపిస్తుంది
ఏసీలు కూడా ఉండటంతో లోపల చల్లగా ఉంది
ఆలయం లోపలా ,బయటా ఎటు చూసినా చక్కటి శిల్పాలతో ,రకరకాల ఆకృతులతో చెక్కిన అద్బుతమైన శిల్పకళ మనల్ని అబ్బురపరుస్తుంది
నిజంగా ఈ విషయంలో శిల్పి ఆనందసాయి అభినందనీయుడు
ఆలయ ప్రాంగణం నుంచి కిందికి చూస్తే చుట్టూ పచ్చదనం పరుచుకున్న ప్రకృతి అలరారిస్తుంది
దూరంగా చిన్న గుట్ట మీద కట్టిన కాటేజీలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి
ప్రస్తుతానికి వాహనాల కోసం కొండకిందినుంచి పైకి ,తిరిగి కిందికి ఒకటే మార్గం వేశారు
కిందినుంచి ఫ్లయ్ ఓవర్ మాదిరి మార్గం వేశారు
కానీ రెండు బస్సులు ఒకేసారి ఎదురుబొదురు పడితే కొంత ఇరుగ్గా ఉంటుంది
ఆ మార్గాన్ని ఇంకొంచం వెడల్పుగా వేసి ఉంటే బాగుండేది
ముగింపు
ఏదిఏమైనా గతానికి ,ఇప్పటికీ యాదగిరి గుట్టలో అద్బుతమైన మార్పులు వచ్చాయి
గతంతో పోలిస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఆహ్లాదకరంగా కూడా ఉంది
