ఏపీలో పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందు థియేటర్ల బంద్ అంటూ ఎవరో నలుగురు చేస్తున్న రచ్చ

Spread the love

ఏపీలో పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందు థియేటర్ల బంద్ అంటూ ఎవరో నలుగురు చేస్తున్న రచ్చ టీవీల్లో చూస్తున్నాం కదా!
(ఆ నలుగురిలో నేను లేనంటే నేను లేనని ఆల్రెడీ అల్లు అరవింద్ అండ్ దిల్ రాజు అనబడే ఇద్దరు చెప్పేశారు )

మిగిలిన ఇద్దరి సంగతి తేలేలోపు మూడు దశాబ్దాల క్రితం బెజవాడ సినిమా ముచ్చట్లు ఎలా ఉండేవో గుర్తు చేసుకుందాం

ఎందుకంటే ఏపీలో థియేటర్లన్నీ ఒకెత్తు
విజయవాడ థియేటర్లు ఒకెత్తు

బొమ్మ హిట్టా ఫట్టా అనే ఫస్ట్ టాక్ విజయవాడ థియేటర్ల నుంచే వచ్చేది

బెజవాడ సినిమా ముచ్చట్లు

ఇప్పటితో పోలిస్తే ఓ మూడు దశాబ్దాల క్రితం విజయవాడలో సినీ హీరోల అభిమానసంఘాల సందడి ఎక్కువగా ఉండేది

సినిమా రిలీజ్ ముందు రోజే థియేటర్ దగ్గరికి చేరుకుని తమ అభిమాన హీరో కటౌట్ ఎంత ఎత్తులో ఉండాలో మేనేజ్నెంట్ తో మాట్లాడుకునేవాళ్ళు . పక్క థియేటర్ లో వేరే హీరో కటౌట్ 50 అడుగులు ఉంటే వీళ్ళు తమ హీరో 60 అడుగుల కటౌట్ కి పట్టుబట్టేవాళ్ళు

ఈ పోటీ ఎక్కడిదాకా వెళ్లిందంటే కొండపైన సూపర్ స్టార్ కృష్ణ 150 అడుగుల కటౌట్ పెట్టేదాకా వెళ్ళింది !

ఆ రకంగా అభిమాన సంఘాల మధ్య పోటీ కటౌట్ల దగ్గర్నుంచి మొదలయ్యేదన్నమాట

విజయవాడలో అభిమాన సంఘాల పవర్ తెల్సు కాబట్టి థియేటర్ యాజమాన్యాలు కూడా వాళ్ళు చెప్పినట్టు బుద్దిగా ఫాలో అయ్యేవాళ్ళు

ఆ తర్వాత కటౌట్ కి దండలు వేయడంలో పోటీ పడేవాళ్ళు

పక్క హీరో కటౌట్ కి రెండు దండలు పడితే వీళ్ళ హీరో కటౌట్ కి నాలుగు దండలు పడాల్సిందే

అదృష్టవశాత్తు అప్పట్లో పాలభిషేకాలు పెద్దగా లేవు

కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ అభిమాన సంఘాల హడావుడి అంతా ఇంతా కాదు..ముఖ్యంగా సినిమా హాళ్లు ఎక్కువగా ఉన్న గాంధీనగర్లో అయితే పండుగ వాతావరణం ఉండేది

తమ అభిమాన హీరో పేరుమీద పాంప్లేట్లు వేసి థియేటర్ కి వచ్చిన ప్రతివక్కరికి పంచటమే కాకుండా వీధి వీధి అంతా వెదచల్లేవాళ్ళు

అంతేనా కృష్ణ గారి సినిమాకే అనుకుంటా..ఏకంగా హెలికాప్టర్ నుంచి పాంప్లేట్లు చల్లించారు

వీళ్ళ హవా ఎంతలా ఉండేదంటే థియేటర్ మేనేజ్మెంట్లు..ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు మొదటిరోజు మొదటి ఆటకు వీళ్ళ కోటా కింద కొన్ని టికెట్లు రిజర్వ్ చేసి పెట్టేవాళ్ళు

ఈ అభిమాన సంఘాలకు ఇంత హవా రావటానికి అసలు కారణం ఇంకొంటుంది

అదే హీరోల సపోర్ట్ !

నాకు తెలిసి అప్పట్లో దాదాపు ప్రతి హీరో విజయవాడలో అభిమాన సంఘాలను పెంచి పోషించారు

ఎంతలా అంటే ,

వీళ్ళకి గాంధీనగర్లో ఆఫీసులు కూడా ఉండేంత !

ఆశర్యంగా అనుపిస్తున్నా ఇది నిజం .

ఆలిండియా ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్
అక్కినేని ఫాన్స్ అసోసియేషన్
ఘట్టమనేని ఫ్యాన్స్ అసోసియేషన్
శోభన్
కృష్ణంరాజు
ఇట్లా ఉండేవి
తర్వాత్తర్వాత
చిరంజీవి
నాగార్జున
బాలకృష్ణ
ఇత్యాదుల అభిమాన సంఘాలు కూడా వెలిశాయి

ఈమధ్య ఓ యూ ట్యూబ్ చానల్లో చూసా

విజయవాడలో నాగార్జున ఫస్ట్ సినిమా నుంచి ఫాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్న అభిమానికి ఒంట్లో బాగోలేకపోతే ఈమధ్య నాగ చైతన్య అతడి ఇంటికెళ్ళి పలకరించాడట

అప్పట్లో విజయవాడలో మొదటి రోజు మొదటి ఆట పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఏపీ మొత్తానికి బొమ్మ సూపర్ హిట్టే

అందుకే హీరోలు కూడా విజయవాడ అభిమాన సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు

అప్పట్లో సినిమా వంద రోజులు ఆడితే సూపర్ హిట్.

అందుకోసం ఫ్యాన్స్ సాయంతో టికెట్లు కొట్టి ఒకలిద్దరి హీరోల సినిమాలు వంద రోజులు ఆడించేవాళ్ళని టాక్ కూడా ఉండేది

వందరోజులు ఆడిన సినిమాల శత దినోత్సవ వేడుకలు కూడా విజయవాడలోనే పండుగలా చేసేవాళ్ళు.

విజయవాడ అంటే సినిమాలు
సినిమాలు అంటే విజయవాడ అన్నట్టుగా ఉండేది సందడి

కొసమెరుపు : సూపర్ స్టార్ కృష్ణ తను నటించిన సినిమా మొదటి ఆట మొదటిరోజు విజయవాడ థియేటర్లోనే చూసేవాళ్ళు. అంతేకాదు సినిమా హిట్టా ఫట్టా అని కూడా నిర్మొహమాటంగా చెప్పేవారు !

*
ఒకప్పుడు ఏపీలో కళకళ లాడిన థియేటర్లు ఇప్పుడు వెలవెల బోయి మూత పడటానికీ..కొన్ని ఫంక్షన్ హాళ్లుగా మారిపోవడానికి కారకులు ఎవరు?

కారణాలు ఏమై ఉంటాయి?

అసలు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతుంది?

ఇంకో పోస్టులో చర్చిద్దాం

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!