Home » విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో యువ జర్నలిస్టుకు లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అయ్యిందా ?

విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో యువ జర్నలిస్టుకు లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అయ్యిందా ?

Spread the love

ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే .

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఇద్దరు వ్యక్తులవల్ల పెను మార్పులు సంభవించాయి . వారిలో మొదటివారు నాదెండ్ల భాస్కరరావు కాగా ,రెండోవారు లక్ష్మీపార్వతి . ఇక మూడోవారు అందరికీ తెలిసినవారే ..ఆయనే నారా చంద్రబాబు నాయుడు .

లక్ష్మీపార్వతి ఉదంతం చెప్పుకునేముందు నాదెండ్ల ఉదంతం కూడా చెప్పుకోవాలి .

సినిమా రంగంలో ఎన్టీఆర్ రారాజులా వెలిగారు . ఆంధ్రదేశమంతా ఆయనకు అభిమాన సంఘాలు వెలిసాయి . ఇతర రాష్ట్రాల్లో సైతం ఆయనకు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు .

మరోపక్క వయసు కారణంగా ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో నాదెండ్ల భాస్కరరావు కన్ను ఎన్టీఆర్ మీద పడింది . అప్పట్లో దేశవ్యాప్తంగా ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుంది . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పాతుకుపోయింది . నాదెండ్ల కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేపట్టిన వాడే . కానీ ఆయన గోల్ వేరు . సీఎం కావడం ఆయన లక్ష్యం . తన లక్ష్యానికి ఎన్టీఆర్ ను అస్త్రంగా వాడుకుందామని ఆలోచన చేసారు . ఆలోచన చేయడమే కాదు రాజకీయాల్లోకి వచ్చేందుకు వెంటనే ఎన్టీఆర్ ను ఒప్పించారు . ఈ ఆలోచన ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికింది . తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పునాది పడింది . దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ రూపంలో సవాల్ ఎదురైంది . నాదెండ్ల వెనక నిలబడి ఎన్టీఆర్ ను ఎన్నికల రణ రంగంలోకి దింపారు . ప్రజల నుంచి వారు ఊహించని అద్భుతమైన స్పందన వచ్చింది . ఈ స్పందనను నాదెండ్ల కూడా ఊహించలేదు . ఎటుచూసినా ఎన్టీఆర్ ప్రభంజనమే . ఆ ప్రభంజనంలో నాదెండ్ల స్థానం ఇంకాస్త వెనక్కి జరిగింది .

మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది . మారిన సమీకరణాల దృష్ట్యా నాదెండ్ల తిరిగి మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది . ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది . కాంగ్రెస్ పార్టీ హయాంలో వెలగబెట్టినట్టుగానే మంత్రి పదవి మాత్రమే దక్కింది . దాంతో ఆయనలోని రాజకీయ నాయకుడు మేల్కొన్నాడు . కేవలం మంత్రి పదవి కోసమే అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా దక్కేది . కానీ తాను ఆశించింది సీఎం పదవి . చివరికి అది దక్కింది మాత్రం ఎన్టీఆర్ కి . ఈ పరిణామాలను ఆయన సహించలేకపోయారు .

1984 ఆగస్టు 16 న ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు . అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ధర్మయుద్ధం పేరిట ఉద్యమం చేయడంతో సెప్టెంబర్ 16 నాదెండ్ల రాజీనామా చేయక తప్పలేదు . ఆ రకంగా నాదెండ్ల నెలరోజుల ముఖ్యమంత్రిగా చరిత్రకు ఎక్కారు . ఇది ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎదురైన మొదటి కుదుపు .

ఇక రెండో కుదుపు లక్ష్మి పార్వతి ,చంద్రబాబుల ద్వారా ఆయనకు ఎదురైంది . నాదెండ్ల ఎపిసోడ్లో విజయవంతంగా బయటపడిన ఎన్టీఆర్ చంద్రబాబు చేతిలో మాత్రం విజయం సాధించలేకపోయారు .

1993 లో లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన రాజకీయ జీవితంలోనూ , వ్యక్తిగత జీవితంలోనూ పెను మార్పులు సంభవించాయి . తల్లిని అమితంగా ప్రేమించిన ఎన్టీఆర్ వారసులు లక్ష్మి పార్వతిని తల్లి స్థానంలో ఊహించలేకపోయారు . పార్టీలో కొందరు అన్నగారి నిర్ణయానికి మద్దతు తెలపగా , మరికొంతమంది బయటపడకుండా గుంభనంగా ఉన్నారు .

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి రాక పార్టీలోనూ .. కుటుంబ సభ్యులలోనూ అగ్ని పర్వతంలా రగిలి 1995 లో చంద్రబాబు ఎన్టీఆర్ మీద చేసిన తిరుగుబాటుతో పరాకాష్టకు చేరింది .

ఈ తిరుగుబాటుకు నాంది పడింది ఎక్కడో తెలుసా ?
విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో ,

అదీ ఓ సాయంకాలం దినపత్రిక విలేఖరి అడిగిన ప్రశ్నకు లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే అనూహ్యంగా మారిపోయాయి .ఆఖరికి అల్లుడు చంద్రబాబు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది .

అసలు ఇంతకీ ఆ రోజు విజయవాడలో ఏం జరిగింది ?

ఎన్టీఆర్.. లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత సీఎం భార్య హోదాలో ఆమె విజయవాడ అలంకార్ థియేటర్ కాంప్లెక్స్ లో నల్లి సిల్క్స్ అనే ఓ వస్త్ర దుకాణం షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చారు . ఇదే కాదు రాష్ట్రంలో జరిగిన చాలా కార్యక్రమాల్లో సీఎం ఎన్టీఆర్ తరపున ఆమే అటెండ్ అయ్యేవారు . ఎక్కడ చూసినా సీఎం భార్య హోదాలో లక్ష్మి పార్వతికి రెడ్ కార్పెట్ స్వాగతాలు లభిస్తున్నాయి . అధికారులు , అనధికారులు ,రాజకీయ నాయకులు ఆమె దృష్టిలో పడటానికి పోటీలు పడేవారు .

అలా అప్పటికి ఎన్టీఆర్ వైపు నిలబడిన ఎమ్మెల్యేలు కొంతమంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు .పార్టీలో కీలకమైన నిర్ణయాలు అన్నీ లక్ష్మి పార్వతీ తీసుకుంటుందని అప్పట్లోనే పార్టీలో బహిరంగంగా చెప్పుకునేవాళ్ళు . ఎన్టీఆర్ కూడా పార్టీ విషయాల్లో లక్ష్మి పార్వతి సలహాలు తీసుకునేవారు అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే .

సరే ఇదిలా ఉండగా విజయవాడ వచ్చిన లక్ష్మి పార్వతికి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు .కంకిపాడు ఎమ్మెల్యే దేవినేని నెహ్రు ఆమె పర్యటన ఏర్పాట్లు అన్నీ స్వయంగా చూసుకున్నారు . లక్ష్మీపార్వతి రాక సందర్భంగా భారీ ఎత్తున జనసమీకరణ చేసారు . ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మి పార్వతి గారికి సుస్వాగతం అనే బ్యానర్లు విజయవాడ అంతటా వెలిసాయి . లక్ష్మి పార్వతి రాక సందర్భంగా అలంకార్ థియేటర్ సెంటర్లో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసారు .

ఇంతలో లక్ష్మి పార్వతి రానే వచ్చింది .నల్లి సిల్క్స్ షో రూమ్ వారు ఆమెను సాదరంగా ఆహ్వానించారు . అప్పటికే జనం ఆమె చుట్టూ మూగడంతో కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టమైపోతుంది .

ఆ జనసందోహాన్ని తప్పించుకుంటూ లక్ష్మి పార్వతి షాప్ ప్రారంభోత్సవం చేసి తిరుగు పయనం అవుతుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది .

పోలీస్ బందోబస్త్ ను దాటుకుని ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ లక్ష్మి పార్వతి దగ్గరకు వచ్చాడు . పోలీసులు అతడ్ని నెట్టబోయేలోపు జేబులోనుంచి తన ప్రెస్ ఐడి కార్డు తీసి చూపించాడు .

లక్ష్మి పార్వతి కూడా మీడియాతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది కాబట్టి అతడ్ని దగ్గరకు పిలిచి ఏంటన్నట్టు చూసింది .

ఆ కుర్రాడు ఓ సాయంకాలం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ విలేఖరి .

“మేడం ! మిమ్మల్ని రెండే రెండు ప్రశ్నలు అడుగుతా ప్లీజ్ ” అని రిక్వెస్టింగ్ గా అడిగాడు

” అడగండి ” అంది లక్ష్మి పార్వతి

” మేడం ! మంత్రివర్గంలో మార్పులూ చేర్పులు చేస్తారని తెలిసింది ? క్యాబినెట్లో ఎవరు ఉంటారు ? ఎవర్ని తీసేస్తారు ?”

” అది మేము ఎన్టీఆర్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం “

” మేడం రెండో ప్రశ్న అండ్ ఆఖరి ప్రశ్న ? చంద్ర బాబు గారి పదవి సంగతి ?? ” అని ప్రశ్నార్థకంగా ఆపేసాడు .

లక్ష్మి పార్వతి అతడివంక చూసి చిన్నగా నవ్వూతూ ” అదంతా అధిష్టానం చూసుకుంటుంది .. అధిష్టానం ముందు అందరూ సమానమే ” అని నర్మగర్భంగా సమాధానం చెప్పింది .

“థాంక్యూ మేడం’ అంటూ ఆ కుర్రాడు ఆఫీసుకు వెళ్లి ఆ రెండు ప్రశ్నలూ , లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానాలు రాసి పేపర్ కు పంపించి వెళ్ళిపోయాడు .

పేపర్లో కూడా ఆ వార్త ఎక్కడో చిన్న కాలంలోకి చేరుకుంది .కానీ తాను ఇచ్చిన ఆ వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అవుతుందని ఆ క్షణాన ఆ యువ జర్నలిస్టుకు కూడా తెలీదు .

అది సాయంకాలం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కాబట్టి చాలామందికి ఈ న్యూస్ తెలీదు .కానీ తెలియాల్సిన వాడికి ఆ న్యూస్ చేరింది .వేగుల ద్వారా చంద్ర బాబుకు సమాచారం చేరింది. అప్పటికే విజయవాడలో లక్ష్మీపార్వతి టూర్ వివరాలను ,ప్రజల రెస్పాన్సును , అందులో పాల్గొన్న ఎమ్మెల్యేల వివరాలను ఆయన తెప్పించుకున్నారు . మెల్లిగా పార్టీలో నంబర్ టు స్థానంలో ఆమె పేరుకుపోతుంది అనే విషయం గ్రహించాడు . పార్టీలోనూ , ప్రభుత్వంలోనూ లక్ష్మి పార్వతి మాటే చెల్లుతుందని బాబు పసిగట్టాడు .

అంతే ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు .. నిన్నగాక మొన్న వచ్చి అధిష్టానం అంటే తానేనని పార్టీ కేడర్ కు సంకేతాలు ఇస్తుందా ? మంత్రి వర్గంలో నేనుండాలో లేదో కూడా ఆమే డిసైడ్ చేస్తుందా ? ముఖ్యమంత్రి భార్య హోదాలో ఊళ్ళు తిరుగుతూ పెత్తనాలు చేస్తుందా ? అని పార్టీలో తన ఆంతరంగికుల దగ్గరా , ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల దగ్గరా వాపోయారు .

లక్ష్మి పార్వతిని ఇలాగే వదిలేస్తే ఎన్టీఆర్ ను పూర్తిగా గుప్పిటలో పెట్టుకుని ఆఖరికి ఆయన వారసులను కూడా గెంటేస్తుందని ఫైర్ అయ్యారు .

ఫలితం 1995 లో ఎన్టీఆర్ పై చంద్రబాబు తిరుగుబాటు . ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే

అలా విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో ఓ చిన్న సాయంకాలం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ జర్నలిస్టుతో లక్ష్మి పార్వతి చేసిన చిన్న చిట్ చాట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అయ్యింది .

ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే ఎవరూ ఊహించని విధంగా సంచలనాలు సృష్టిస్తాయి .
(తన పేరు బయటపెట్టొద్దని ఆ జర్నలిస్ట్ కోరినందున అతడి పేరు మెన్షన్ చెయ్యట్లేదు క్షమించాలి )

తరువాతి కధనంలో విజయవాడలో రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలపై వార్తలు రాసినందుకు ఓ యువ జర్నలిస్టును వేటాడిన దుండగులు ఏం చేసారో రచ్చబండ కబుర్లు లో చెప్పుకుందాం !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!