మంచు కన్నప్ప రిలీజ్ కు ముందునుంచీ చాల వివాదాలను ఎదుర్కొంది
మోహన్ బాబు కుటుంబ గొడవలు ఒక పక్కన , కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ దొంగతనం జరగడం మరోపక్క , హిందూ సంప్రదాయాలను .. బ్రాహ్మణులనును హేళన చేసే సన్నివేశాలు ఉన్నాయని సోషల్ మీడియా ట్రోల్స్ ఇంకోపక్క.. మంచు విష్ణును ఊపిరి సలపనివ్వలేదు
మరోవైపు 49 సంవత్సరాల క్రితం బాపు దర్శకత్వంలో సొంత బ్యానర్ గోపీకృష్ణా మూవీస్ నిర్మాణంలో కృష్ణంరాజు నిర్మించి నటించిన భక్త కన్నప్ప సూపర్ హిట్ కొట్టిన నేపథ్యంలో మంచు విష్ణు తీయబోయే కన్నప్ప ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందా లేదా ? అనే సందేహాలు ఇండస్ట్రీలో వినిపించాయి
ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప హిట్ టాక్ నమోదు చేసుకుంది
ఈ సినిమాకు మార్కులు వేయాలంటే ముందుగా దర్శకుడు ముఖేష్ కుమార్ కు వేయాలి
ఎందుకంటే ఆయన మహాభారత్ సీరియల్ తీసిన అనుభవం కన్నప్పలో సృష్టంగా కన్పిస్తుంది
49 సంవత్సరాల క్రితం తీసిన భక్త కన్నప్పతో పోల్చుకుంటే నేటి తరానికి అనుగుణంగా న్యూజీలాండ్ లో షూటింగ్ చేసినప్పటికీ నేటివిటీ పెద్దగా చెడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు
భక్త కన్నప్ప కథ గురించి అందరికీ తెలిసిందే .. అయితే అదే కథను అందివచ్చిన ఆధినిక సాంకేతికత సాయంతో నేటి జనరేషన్ కు తగిన రీతిలో మరింత అందంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు
అయితే దర్శకుడు కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నాడు
మొదటి భాగంలో తిన్నడి బాల్యం .. గూడెం నేపధ్యం .. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు .. నెమలి ( ప్రీతి ముకుందన్ ) తో ప్రేమాయణం .. తిన్నడి నాస్తికత్వం ప్రధాన అంశాలుగా సాగుతుంది
తిన్నడి నాస్తికత్వానికి ఒక కారణం ఉంది .. తన స్నేహితుడిని అమ్మవారికి నరబలి ఇవ్వటాన్ని తిన్నడు వ్యతిరేకిస్తాడు .. దానితో అతడ్ని గూడెం నుంచి వెలివేస్తారు
గూడెం లోని వాయు లింగం మీద కాలముఖుడి కన్ను పడటంతో అసలు స్టోరీ మొదలు అవుతుంది
దీనికి సూచికగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో మోహన్ లాల్ పాత్ర ఎంటర్ అవుతుంది
ఇక సెకండ్ హాఫ్ అంతా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం మీదే దృష్టి పెట్టాడు దర్శకుడు
చకచకా ఒక్కో పాత్రా రంగప్రవేశం చేస్తుంటాయి
అన్నిటికన్నా రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ సినిమాకు హైప్ ఇచ్చింది
ప్రభాస్ కు .. మంచు విష్ణుకు మధ్య సన్నివేశాలు .. సంభాషణలు బాగా పండాయి
నాస్తికుడైన తిన్నడు శివ భక్తుడిగా మారటానికి రుద్ర పాత్రలో ప్రభాస్ తిన్నడితో పలికే సంభాషణలు బావున్నాయి
ఈ విషయంలో ప్రభాస్ గెటప్ కూడా బావుంది
ద్వితీయార్థంలో శివ భక్తుడిగా మారిన తిన్నడు కన్నప్ప అవతారంలో భక్తి .. భావోద్వేగాలను పుష్కలంగా పండించాడు
అక్షయ్ కుమార్ .. కాజల్ అగర్వాల్ ల శివ పార్వతుల పాత్రలు నామమాత్రంగా అనిపించింది
కిరాతుడిగా మోహన్ లాల్ పాత్ర బావుంది
కిరాతుడి రాకతో స్టోరీ ద్వాపర యుగానికి వెళ్లి తిరిగొస్తుంది .. అయినా కధలో భాగంగా ఉండటంతో సింక్ అయ్యింది
అతిధి పాత్రలే అయినా మోహన్ బాబు .. మోహన్ లాల్ పాత్రలు బావున్నాయి
ఇక కన్నప్ప సినిమాకు పాన్ ఇండియా మూవీ అనే ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి అన్ని ఉడ్ ల నుంచి తలా ఒకడ్ని తీసుకొచ్చి పెట్టారు కానీ తిన్నడి తండ్రి పాత్రలో శరత్ కుమార్ నటన ఆశించిన స్థాయిలో లేదు
ఇక ఈ సినిమాలో బ్రాహ్మణులను హేళన పరిచారు అని ఆరోపణలు ఎదుర్కున్న బ్రహ్మానందం చిన్న పాత్రకే పరిమితం అయ్యారు
ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ( ప్రీతి ముకుందన్ ) భక్త కన్నప్పలో వాణిశ్రీతో పోల్చుకుంటే మోడరన్ కాస్ట్యూమ్స్ తో అందచందాలతో నేటి యువతరాన్ని ఆకట్టుకునేలా ప్రదర్శన చేసింది
పాటల విషయానికి వస్తే స్టీఫెన్ రేవస్సీ అందించిన సంగీతం బావుంది .. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మంచి BGM స్కోర్ రాబట్టుకున్నాడు
ఇక భక్త కన్నప్ప షూటింగ్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయ గూడెంలో చిత్రీకరించగా మంచు కన్నప్ప షూటింగ్ న్యూజీలాండ్ లో జరిగింది
ఛాయాగ్రాహకుడు షెల్టన్ చౌ న్యూజీలాండ్ అందాలను మరింత అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు
అంతిమంగా ఈ సినిమా రిలీజ్ కు ముందు నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కున్న మంచు విష్ణు కూడా తిన్నడి పాత్రలోనూ , భక్త కన్నప్ప పాత్రలోనూ చక్కటి పెర్ఫార్మెన్స ప్రదర్శించాడు
ఆఖరికి కన్నప్ప మూవీ మీద నెగిటివ్ ట్రోల్స్ చేసిన తమ్ముడు మంచు మనోజ్ కూడా ఈ సినిమా చూసి చాలా బావుందని రివ్యూ ఇవ్వటం విశేషం !
రేటింగ్ 3. 5 / 5
పరేష్ తుర్లపాటి
Super movie. I watched on 26th June at Cincinnati, US and gave my review on Google. I gave 100% marks to Director Mukesh and performance of Vishnu. Never expected Vishnu to live in the role. Vijayaprakash song if awesome.