ఎక్కడో కొద్దిగా ఉప్పు తేడా కొట్టింది !

Spread the love

ఉప్పు కప్పురంబు కథ కోసం ఎంచుకున్న పాయింట్ చిన్నదే కానీ విభిన్నమైనది !

దర్శకుడు ఓ కొత్త పాయింట్ పట్టుకుని దానికి కొద్దిగా ఎమోషనల్ , కామెడీ అనబడే దినుసులను జోడించి ఓ వంటకం సిద్ధం చేసాడు

సినిమాలో పాత్రల విషయానికి వస్తే ,

సుహాస్ చక్కటి నటుడు .. అతడి అదృష్టం ఏంటో కానీ ఈ మధ్య అతడి సినిమాలు అన్నీ దాదాపు హిట్ అయ్యాయి
అంతేకాదు అతడి సినిమాల్లో మంచి కధలు కూడా పడ్డాయి

కలర్ ఫోటో .. రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాల్లో సుహాస్ పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి

ఇక ఈ సినిమాలో నటించిన కీర్తి సురేష్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది ?
తనకు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించే మహానటి

వీళ్ళు కాకుండా పాత సినిమాలో హీరోయిన్ గా ఇంతింత కళ్ళేసుకుని ఆడిపాడి అందర్నీ మెప్పించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ నటిగా రంగంలోకి దిగిన తాళ్లూరి రామేశ్వరి ఈ సినిమాలో ఉంది

చాన్నాళ్లకు బాబూ మోహన్ ను కూడా ఈ సినిమాలో దింపారు

దర్శకుడు పలావు వండటానికి సరైన దినుసులనే సెలెక్ట్ చేసుకున్నాడు

కానీ ఎక్కడో ఉప్పు ఎక్కువ అవడమో , తక్కువ అవడమో జరిగింది
అదే ఈ సినిమాకి మైనస్

ఇక కథ విషయానికి వస్తే ప్రపంచ పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో అడవులు తరిగిపోతున్న సంగతులు మనకు తెలిసిందే

పొలాలు తరిగిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి కదా

అలాగే భవిష్యత్తులో స్థలాలు తరిగిపోయి ఆఖరికి స్మశానంలో స్థలం కూడా దొరకని పరిస్థితులు వస్తే ఏం జరుగుతుంది ? అనే పాయింట్ ఆధారంగా కథను అల్లుకున్నాడు దర్సకుడు ఐవి శశి

అయితే ఆ పాయింటును సరిగా ఎలివేట్ చేయడంలో దర్శకుడు విఫలం అయినట్టు అనిపిస్తుంది

కథ విషయానికి వస్తే తండ్రి చనిపోవడంతో చిట్టి జయపురం ఊరి పెద్ద బాధ్యతలు అపూర్వ ( కీర్తి సురేష్ ) మీద పడతాయి

ఆవిడ బాధ్యతలు తీసుకున్న సమయంలోనే ఊరికి ఓ విచిత్రమైన పరిస్థితి వస్తుంది

స్మశానంలో భూమికి కొరత ఏర్పడుతుంది
కేవలం నలుగురికి మాత్రమే సమాధి చేయడానికి జాగా ఉంటుంది

ఈ శ్మశానానికి కాటి కాపరి చిన్న ( సుహాస్ )

అపూర్వ అతడితో కలిసి ఈ సమస్య పరిష్కరించడమే అసలు కథ

అయితే అసలు పాయింట్ ఎలివేట్ చేసే క్రమంలో కధలో అవసరం లేని సన్నివేశాలు , కామెడీ ట్రాక్ జొప్పించారు

దానివల్ల ఫస్ట్ హాఫ్ అంతా కీర్తి సురేష్ ఊరి పెద్ద అవడం , రచ్చబండ వద్ద గ్రామస్తులతో సన్నివేశాలతో నిండిపోయింది

స్మశానంలో భూమి కొరత ఉండటంతో ఊళ్ళో చావుకి దగ్గరగా ఉన్నవాళ్ళ వివరాలు సేకరించడం , వాళ్లలో లాటరీ పద్దతి ద్వారా నలుగురిని సెలెక్ట్ చేయడం వంటివి కృతకంగా ఉన్నాయి

మధ్యలో కీర్తి సురేష్ తో అనవసరమైన కామెడీకి కూడా ప్రయత్నించారు

సెకండ్ హాఫ్ లో స్టోరీ కొద్దిగా దారిలో పడుతుంది

తల్లి కోరిక నెరవేర్చడం కోసం చిన్నా చేసే పనితో కథ మలుపు తిరుగుతుంది

ఆఖరి అరగంటలో మాత్రమే సినిమా పూర్తిగా రక్తి కట్టింది

చిన్నా సాయంతో అపూర్వ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం కనుగొన్నారు అన్న పాయింటుతో కథ ముగుస్తుంది

ఇక సాంకేతిక పరంగా సినిమా బావుంది
సంగీతం కూడా బావుంది

ఈ సినిమాలో సుహాస్ , కీర్తి సురేష్ , తాళ్లూరి రామేశ్వరి , బాబూ మోహన్ ప్రధాన పాత్రధారులు కాగా ఐవి శశి దర్శకత్వంలో రాధికా లావు నిర్మించారు

ఫైనల్ గా ఉప్పుకప్పురంబు సినిమా ఓ కామెడీ ఎమోషనల్ డ్రామా గా రూపు దిద్దుకుంది
ఈ సినిమా జులై 4 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది

రేటింగ్ 3 / 5

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!