తెలంగాణా బీజేపీకి మంచి మైలేజీ ఇచ్చిన ‘ బండి ‘
కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ..
తెలంగాణాలో బీజేపీ గురించి చెప్పుకోవాలంటే బండికి ముందు బండికి వెనుక అని చెప్పుకోవాలి
రాజకీయాల్లో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిదాకా ఎదగటం అంటే మాటలు కాదు
అదీ అతి తక్కువ సమయంలో
బండి సంజయ్ కన్నా ముందునుంచి బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు నామమాత్ర పదవులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది
విచిత్రం ఏంటంటే కార్పొరేటర్ గా గెలిచిన బండి రెండు సార్లు కరీం నగర్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు
అయినా అతను నిరుత్సాహపడి తన పోరాటాన్ని ఆపలేదు
ముచ్చటగా మూడోసారి లోక్ సభకు ప్రయత్నించి పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు
ఒకరకంగా బండి సంజయ్ రాజకీయంగా ఎదగటానికి ఎంపీ సభ్యత్వం ఉపయోగపడింది
ఢిల్లీ బీజేపీ అధి నాయకత్వం దృష్టిలో పడ్డాడు
దాంతో అధినాయకత్వం బండి హిస్టరీ బయటికి తీస్తే అతడిది ముందునుంచీ ఆరెస్సెస్ నేపధ్యం అని తెలిసింది
బీజేపీ ఆరెస్సెస్ నేపధ్యం ఉన్నవాళ్ళని ప్రోత్సహిస్తుందని తెలుసుగా
విద్యార్థి దశ నుంచే బండి కరీం నగర్ ఎబివిపి విద్యార్థి సంస్థలో పనిచేసారు
ఇక తెలంగాణా విషయానికి వస్తే ,
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆరెస్ ప్రభంజనంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడిపోయింది.. బీజేపీ ఓ మూలకు చేరింది .. టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది
కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏకచత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు
కొద్దోగొప్పో టీఆరెస్ కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది
రెండోసారి కూడా కేసీఆర్ కే అధికారం అప్పచెప్పారు తెలంగాణా ప్రజలు
కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , బీజేపీ తరపున కే లక్ష్మణ్ పార్టీ ఆఫీసులకు పరిమితం అయ్యారు
ప్రజల్లో పోరాటం చేసే ఉద్యమ కార్యాచరణ ఏదీ లేదు
కేసీఆర్ ధాటికి తట్టుకోలేక కేవలం తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు
ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాయి
ప్రజల్లో మాస్ లీడర్లుగా గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ ను చేస్తే , బండి సంజయ్ ను ఆ పార్టీ తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమించింది
ఇక అక్కడినుంచి వార్ వన్ సైడెడ్ గా ఉన్న పరిస్థితి నుంచి ట్రయాంగిల్ ఫైట్ గా మారింది
మొట్టమొదటిసారిగా కేసీఆర్ నాయకత్వాన్ని ధీటుగా ఎదుర్కునే నాయకులు ప్రజల్లోకి బయలుదేరారు
ఒక పక్క రేవంత్ రెడ్డి , మరోపక్క బండి సంజయ్ కేసీఆర్ ను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసారు
బండి సంజయ్ రాక ముందు తెలంగాణాలో పోరు ప్రధానంగా టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది
టి బీజేపీ చీఫ్ గా బండి వచ్చిన తర్వాత తెలంగాణా బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది
దీనికి కారణం బండి పార్టీ కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లడమే
వంద రోజుల పాదయాత్రతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేసారు
జనంలో బండి పర్యటనలకు అనూహ్య స్పందన రావడం మొదలైంది
తెలంగాణాను మోనోపలీగా పాలిస్తున్న కేసీఆర్ కు సహజంగా ఈ పరిణామాలు మింగుడుపడలేదు
దరిమిలా పద వ తరగతి ప్రశ్నల పత్రాల లీక్ కేసులో బండి ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది
అయినా బండి తగ్గలేదు
అదేరోజు బెయిల్ తెచ్చుకుని గోడకు కొట్టిన బంతిలా ప్రజా క్షేత్రానికి పరుగులు తీసాడు
బండి దూకుడు ఎంతలా ఉందంటే ఢిల్లీ నాయకత్వం దృష్టిలో పడేంత
తెలంగాణాలో బండి సంజయ్ పబ్లిక్ మీటింగులు ఆర్గనైజ్ చేసి మోదీ ని పిలిస్తే ఆ జనసందోహాన్ని చూసి ఆయన బండి భుజం మీద తడుతూ శబాష్ అంటూ అంటూ మెచ్చుకున్నారు
అమిత్ షా అయితే బండికి నేరుగా టచ్ లోకి వచ్చేసారు
దానితో బండికి రాష్ట్ర నాయకులను పట్టించుకునే అవసరం లేకపోయింది
కానీ అదే తరువాత కాలంలో తన నాయకత్వాన్ని మార్చేస్తుందని ఆయన కూడా అనుకోలేదు
ఇక బండి దూకుడుతో తెలంగాణాలో ఒకానొక దశలో ట్రయాంగిల్ ఫైట్ దశ నుంచి బిఆర్ఎస్ .. బీజేపీల మధ్య ద్విముఖ పోరుగా పరిస్థితి మారిపోయింది
సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం బండిని పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పదవీ బాధ్యతలు అప్పగించింది
ఈ పరిణామాలతో బీజేపీ కేసీఆర్ నెత్తిన పాలు పోసిందని అప్పట్లో అందరూ అనుకున్నారు కానీ అసలు పాలు పోసింది రేవంత్ రెడ్డి నెత్తిన అని ఎవరు ఊహించలేకపోయారు
ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఉపయోగించుకున్నారు
బీజేపీ ‘ బండి’ స్లో అయిన సమయంలోనే తన ‘ హస్త’ లాఘవాన్ని చాకచక్యంగా ప్రదర్శించాడు
తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే
తెలంగాణాలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది
బిఆర్ఎస్ , బీజేపీ పార్టీలు ప్రతిపక్షాలుగా మిగిలిపోయాయి
కేంద్ర మంత్రి అయినా కూడా బండి సంజయ్ ప్రజలతో సంబంధాలను వదులుకోలేదు
ఈ మధ్యనే అద్దె ఇంటినుంచి సొంత ఇంటికి మారి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు
ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా కరీం నగర్ నియోజక వర్గంలో స్కూల్ విద్యార్థినిలకు 20 వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టారు
కరీం నగర్లో ఇంత పెద్ద ఎత్తున సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి
త్వరలో నియోజక వర్గ విద్యార్థులకు మోడీ కిట్ పేరిట స్కూల్ బ్యాగ్ , పుస్తకాలు , స్టీల్ వాటర్ బాటిల్ కూడా పంచుతానని ఆయన చెప్పారు
చివరగా బండి సంజయ్ గురించి పిండి కొద్దీ రొట్టె – బండి కొద్దీ బీజేపీ అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు శుభాకాంక్షలు !
పరేష్ తుర్లపాటి