Home » తెలంగాణా బీజేపీకి మంచి మైలేజీ ఇచ్చిన ‘బండి’ ..కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ..!

తెలంగాణా బీజేపీకి మంచి మైలేజీ ఇచ్చిన ‘బండి’ ..కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ..!

Spread the love

రాజకీయాల్లో కొంతమంది తమ పార్టీలకు జీవితాంతం ఊడిగం చేసినా నామమాత్రపు పదవులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది . మరికొంతమందికి ఆ అవకాశం కూడా ఉండదు . చాలామందికి జీవితపు చరమాంకంలో ఏ గవర్నర్ గిరో , నామినేటెడ్ పదవో వరిస్తుంది కానీ అనుభవించటానికి జీవితం ఉండదు . చాలా తక్కువమంది మాత్రమే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాజకీయంగా పైకి ఎగబాకుతారు . అటువంటివారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారు . ఆరెస్సెస్ లో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన మోడీ ఏకంగా భారత దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు . మోడీ కన్నా సీనియర్ అయినా లాల్ కృష్ణ అద్వానీ నామమాత్ర పదవులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది . రాజకీయాల్లో ఎదగాలంటే నాయకత్వ సామర్ధ్యమే కొలమానం అవుతుంది . దానితో పాటు పరిస్థితులు కూడా కలిసిరావాలి . రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన తర్వాత పదవులు రావడం వేరు కెరీర్ ప్రారంభంలోనే ఉన్నత స్థానాలకు ఎదగడం వేరు . అలా అతి పిన్నవయసులోనే ,కెరీర్ ప్రారంభంలోనే రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగినవారు అన్ని పార్టీల్లో ఉన్నారు . అటువంటి వ్యక్తే బండి సంజయ్ .

తెలంగాణాలో బీజేపీ గురించి చెప్పుకోవాలంటే బండికి ముందు బండికి వెనుక అని చెప్పుకోవాలి . ఈయన రాజకీయ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగసింది . రాజకీయాల్లో అతితక్కువ సమయంలోనే కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిదాకా ఎదగటం అంటే మాటలు కాదు . దానికి ఎంతో పోరాట పటిమ కావాలి . అలాగే నాయకత్వ సామర్థ్యం కూడా కావాలి .రాజకీయాల్లో దూకుడుగా మొండిగా కష్టపడేవారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనడానికి బండి సంజయ్ ఒక ఉదాహరణ .

బీజేపీ లో సీనియర్ నాయకులకు కొదవ లేదు . నాలుగైదు దశాబ్దాల నుంచి పార్టీ మారకుండా బీజేపీనే అంటిపెట్టుకున్న నాయకులు ఉన్నారు . తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాకపోయినా , ప్రతిపక్షం లో కూర్చోవాల్సి ఉన్నా కేవలం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పార్టీకి అంకితమై పనిచేస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు . అయినా ఎందువలనో కానీ సంజయ్ కన్నా ముందునుంచి బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు నామమాత్ర పదవులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది .

విచిత్రం ఏంటంటే కార్పొరేటర్ గా గెలిచిన బండి రెండు సార్లు కరీం నగర్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు . స్థానిక ప్రజలు అతడ్ని వార్డ్ వరకే పరిమితం చేసారు . అయినా అతను నిరుత్సాహపడి తన పోరాటాన్ని ఆపలేదు . రాజకీయాల్లో గెలుపు ,ఓటములు సహజం అని నమ్మి ముచ్చటగా మూడోసారి లోక్ సభకు ప్రయత్నించి పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు .
బండి సంజయ్ రాజకీయ జీవితం వార్డ్ స్థాయి నుంచి అమాంతం పార్లమెంట్ స్థాయికి ఎదిగింది . స్థాయి పెరిగిందని ఆయన గర్వం నెత్తికెక్కించుకోలేదు . తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు . ఒకరకంగా బండి సంజయ్ రాజకీయంగా ఎదగటానికి ఎంపీ సభ్యత్వం ఉపయోగపడింది .

అక్కడ్నుంచి బండి పనిచేసుకుంటూ పోయారు . దాంతో ఢిల్లీ బీజేపీ అధి నాయకత్వం దృష్టిలో పడ్డాడు . ఈయనలో ఉన్న పోరాట పటిమను గుర్తించారు . దానికి తోడు సోషల్ మీడియాలో ఈయనకు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ గుర్తించారు . ఎన్నాళ్ళనుంచో తెలంగాణాలో కాషాయ జెండా ఎగరేయాలని ఆరాట పడుతున్న ఢిల్లీ పెద్దలకు బండి సంజయ్ రూపంలో నాయకుడు కనిపించాడు .

దాంతో అధినాయకత్వం బండి హిస్టరీ బయటికి తీస్తే అతడిది ముందునుంచీ ఆరెస్సెస్ నేపధ్యం అని తెలిసింది . బీజేపీ ఆరెస్సెస్ నేపధ్యం ఉన్నవాళ్ళని ప్రోత్సహిస్తుందని అందరికీ తెలిసిందే . బండి సంజయ్ విద్యార్థి దశ నుంచే కరీం నగర్ ఎబివిపి విద్యార్థి సంస్థలో పనిచేసారు .

ఇక తెలంగాణా విషయానికి వస్తే ,

ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆరెస్ ప్రభంజనంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడిపోయింది.. బీజేపీ ఓ మూలకు చేరింది .. టీడీపీ అసలు నామరూపాలు లేకుండా పోయింది . కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏకచత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు . కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడలేక ప్రతిపక్షాలు చతికిలపడ్డాయి . కొద్దోగొప్పో టీఆరెస్ కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది .

రెండోసారి కూడా కేసీఆర్ కే అధికారం అప్పచెప్పారు తెలంగాణా ప్రజలు . రాష్ట్రంలో తనకు ఎదురు లేకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు .

కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , బీజేపీ తరపున కే లక్ష్మణ్ ఆయా పార్టీలు రంగంలోకి దింపినా వీరు కేవలం పార్టీ ఆఫీసులకు మాత్రమే పరిమితం అయ్యారు. ప్రజల్లో పోరాటం చేసే ఉద్యమ కార్యాచరణ ఏదీ లేదు . అడపాదడపా పత్రికా ప్రకటనలు ఇవ్వడం మినహా పెద్దగా పోరాటం చేసింది ఏమీ లేదు . ఒకానొక దశలో కేసీఆర్ ధాటికి తట్టుకోలేక కేవలం తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు .

ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రజల్లో మాస్ లీడర్లుగా గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ ను చేస్తే , బండి సంజయ్ ను ఆ పార్టీ తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమించింది .

ఈ ఇద్దరి నియమాకాలతో అప్పటిదాకా వార్ వన్ సైడెడ్ గా ఉన్న పరిస్థితి నుంచి ట్రయాంగిల్ ఫైట్ గా మారింది . మొట్టమొదటిసారిగా కేసీఆర్ నాయకత్వాన్ని ధీటుగా ఎదుర్కునే నాయకులు ప్రజల్లోకి బయలుదేరారు . ఒక్కసారిగా అటు బీజేపీ క్యాడర్ లోనూ , ఇటు కాంగ్రెస్ క్యాడర్ లోనూ కదనోత్సాహం తొంగి చూసింది . దానికి తోడు ఒక పక్క రేవంత్ రెడ్డి , మరోపక్క బండి సంజయ్ కేసీఆర్ ను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసారు .

బండి సంజయ్ రాక ముందు తెలంగాణాలో పోరు ప్రధానంగా టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది . టి బీజేపీ చీఫ్ గా బండి వచ్చిన తర్వాత తెలంగాణా బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది . ఎలాగంటే చాలాచోట్ల టీఆరెస్ , బీజేపీల మధ్య ముఖాముఖి పోరు నడిచింది .

దీనికి కారణం బండి పార్టీ కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లడమే. వంద రోజుల పాదయాత్రతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేసారు . జనంలో బండి పర్యటనలకు అనూహ్య స్పందన రావడం మొదలైంది .జనంలో ఒక్కసారిగా కదలికను తీసుకొచ్చాడు . ప్రభుత్వ వ్యతిరేకతకు అవసరమైన బలమైన మద్దతు కూడగట్టాడు .

తెలంగాణాను మోనోపలీగా పాలిస్తున్న కేసీఆర్ కు సహజంగా ఈ పరిణామాలు మింగుడుపడలేదు . దరిమిలా పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో బండి ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది . అయినా బండి తగ్గలేదు. అదేరోజు బెయిల్ తెచ్చుకుని గోడకు కొట్టిన బంతిలా ప్రజా క్షేత్రానికి పరుగులు తీసాడు .

బండి దూకుడు ఎంతలా ఉందంటే ఢిల్లీ నాయకత్వం దృష్టిలో పడేంత . కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కొని ధీటుగా నిలబడి పోరాటం చేసే ఒకేఒక వ్యక్తి తమ పార్టీలో ఉన్నాడని గుర్తించింది .

తెలంగాణాలో బండి సంజయ్ పబ్లిక్ మీటింగులు ఆర్గనైజ్ చేసి మోదీని పిలిస్తే ఆ జనసందోహాన్ని చూసి ఆయన బండి భుజం మీద తడుతూ శభాష్ అంటూ మెచ్చుకున్నారు.

అమిత్ షా అయితే బండికి నేరుగా టచ్ లోకి వచ్చేసారు . దానితో బండికి రాష్ట్ర నాయకులను పట్టించుకునే అవసరం లేకపోయింది . కానీ అదే తరువాత కాలంలో తన నాయకత్వాన్ని మార్చేస్తుందని ఆయన కలలో కూడా అనుకోలేదు .

ఇక బండి దూకుడుతో తెలంగాణాలో ఒకానొక దశలో ట్రయాంగిల్ ఫైట్ దశ నుంచి బిఆర్ఎస్ .. బీజేపీల మధ్య ద్విముఖ పోరుగా పరిస్థితి మారిపోయింది .

సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం బండిని పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పదవీ బాధ్యతలు అప్పగించింది . ఈ పరిణామాలతో బీజేపీ కేసీఆర్ నెత్తిన పాలు పోసిందని అప్పట్లో అందరూ అనుకున్నారు కానీ అసలు పాలు పోసింది రేవంత్ రెడ్డి నెత్తిన అని ఎవరు ఊహించలేకపోయారు .

ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఉపయోగించుకున్నారు . బీజేపీ ‘ బండి’ స్లో అయిన సమయంలోనే తన ‘ హస్త’ లాఘవాన్ని చాకచక్యంగా ప్రదర్శించాడు .

తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ,

తెలంగాణాలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది . బిఆర్ఎస్ , బీజేపీ పార్టీలు ప్రతిపక్షాలుగా మిగిలిపోయాయి .

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి అయినా కూడా బండి సంజయ్ ప్రజలతో సంబంధాలను వదులుకోలేదు . ఈ మధ్యనే అద్దె ఇంటినుంచి సొంత ఇంటికి మారి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు .

ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ నియోజక వర్గంలో స్కూల్ విద్యార్థినిలకు 20 వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టారు. కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. త్వరలో నియోజక వర్గ విద్యార్థులకు మోడీ కిట్ పేరిట స్కూల్ బ్యాగ్ , పుస్తకాలు , స్టీల్ వాటర్ బాటిల్ కూడా పంచుతానని ఆయన చెప్పారు .

చివరగా బండి సంజయ్ గురించి పిండి కొద్దీ రొట్టె – బండి కొద్దీ బీజేపీ అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి .

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు శుభాకాంక్షలు !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!