వీరమల్లు రత్నానికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి పవన్ కళ్యాణ్ సిఫార్సు ? రాంగ్ టైం రైట్ డెసిషన్ అవుతుందా ?
రెండు మూడేళ్ళుగా అనేక అవాంతరాల మధ్య షూటింగ్ జరుపుకుని ఈ నెల 24 న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నపాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లుకు ఎ ఎమ్ రత్నం నిర్మాత అన్న సంగతి అందరికీ తెలిసిందే
వీరమల్లుకు ముందు కూడా రత్నం భారీ బడ్జెట్ సినిమాలు తీసి మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నారు
తమిళ్ రీమేక్ సినిమాలను కూడా ఒరిజినల్ తెలుగు సినిమాలకు ధీటుగా వంద రోజులు ఆడించిన చరిత్ర రత్నానికి ఉంది
మేకప్ మ్యాన్ స్థాయి నుంచి భారీ బడ్జెట్ సినిమాలు తీసే స్థాయికి ఆయన ఎదిగారు
కొన్ని దశాబ్దాల పాటు చిత్ర నిర్మాణ రంగంలో దూకుడుగా సినిమాలు తీసిన రత్నం ఆ మధ్య ఆర్థిక నష్టాలతో తాత్కాలికంగా విరామం ప్రకటించారు
మళ్ళీ ఇన్నేళ్లకు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాతో ఆయన తెరపైకి వచ్చారు
అయితే ఆయన దురదృష్టం ఏంటో కానీ వీరమల్లు షూటింగ్ ప్రారంభం నుంచి అనేక అవాంతరాలు ఎదుర్కొంది
సినిమాకు ముందు క్రిష్ ను దర్శకుడిగా అనుకున్నారు
కొన్ని కారణాల వల్ల క్రిష్ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా జ్యోతి కృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు
జ్యోతికృష్ణ దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టగానే కరోనా రూపంలో బ్రేక్ పడింది
కోవిడ్ అనంతరం తిరిగి షూటింగ్ మొదలుపెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడంతో మళ్ళీ బ్రేక్ పడింది
ఏపీలో కూటమి గెలవడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకు తిరిగి షూటింగ్ మొదలుపెట్టి మొత్తానికి ఎలాగోలా షూటింగ్ పుర్తి చేసారు
సినిమా పూర్తి అయిన సంతోషం కూడా అట్టే నిలవలేదు
ఏపీలో థియేటర్ల బంద్ నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది
ఇటువంటి పరిణామాలకు ఇంకో నిర్మాత అయితే ఎప్పుడో చేతులు ఎత్తేసేవాడు
కానీ చిత్ర నిర్మాణ రంగంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన ‘రత్నం’ కాబట్టి తట్టుకోగలిగాడు
ఫైనల్ గా ఈ నెల 24 న సినిమా రిలీజు ఖరారు అయ్యింది
వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా ఏడు సార్లు తన సినిమా ట్రైలర్ చూసారు
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి మాట్లాడుతూ ” ఎ ఎమ్ రత్నం మంచి అభిరుచిగల నిర్మాత .. నేను ఆయన నిర్మించిన చిత్రాలు అన్నీ దాదాపు చూసాను .. చిత్ర నిర్మాణంలో రాజీ పడకుండా మంచి సినిమాలు తీసిన రత్నం నా సినిమాకు కూడా నిర్మాతగా ఉంటె బాగుణ్ణు అని ఎన్నోసార్లు అనుకున్నా .. అది వీరమల్లుతో తీరింది .. ప్రాంతీయ సినిమాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రత్నందే .. తమిళ్ రీమేక్ సినిమాలను కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాలతో సమానంగా ఆడించి కలెక్షన్స్ రాబట్టిన నిర్మాతగా రత్నానికి పేరుంది .. ఇక వీరమల్లు సినిమా విషయంలో కూడా రత్నం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు .. అయినా తట్టుకుని ముందుకే వెళ్ళాడు .. ఇంత చక్కటి సినిమా నిర్మించిన ఎ ఎమ్ రత్నానికి సముచిత పదవి ఇవ్వడం నా ధర్మంగా భావించి ఆయనకు ఎపి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదించాను .. నా సినిమా నిర్మాత కాబట్టి ఆయనకు ఈ పదవి ఇవ్వడం లేదు .. ఇలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను “అన్నారు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల చిన్న విశ్లేషణ చేసుకుందాం
పవన్ కళ్యాణ్ మాట్లాడినదాంట్లో ఆఖరి వాఖ్యాలు ప్రాముఖ్యం వహిస్తాయి
ఎ ఎం రత్నం సీనియర్ నిర్మాత .. చిత్ర పరిశ్రమలో లోటుపాట్లు తెలిసిన వ్యక్తి అనడంలో సందేహం లేదు
ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీసి చిత్ర నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యక్షముగానో , పరోక్షముగానో ఉపాధి కల్పించారు
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయనకు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇవ్వడం సముచితమే
అయితే పదవి కట్టబెడుతున్న సమయం .. సందర్భం మీదనే కొన్ని సందేహాలు వస్తాయి
సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజుకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఈ ప్రకటన చేయడం వైరి పక్షాలకు ఆరోపణలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది
చిత్రంలో నటించిన నటుడు తన చిత్ర నిర్మాతకు సినిమా రిలీజుకు ముందు పదవి కట్టబెడితే ఒకరకంగా నాకిది .. నీకిది అనే క్విడ్ ప్రో ఫార్ములా కింద అన్వయించుకునే ఆస్కారం లేకపోలేదు
రాజకీయాల్లో విలువల గురించి పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ తన నిర్మాత కు ప్రభుత్వ నామినేటెడ్ పదవి కట్టబెట్టడం ఖచ్చితంగా విమర్శలకు దారి తీస్తుంది
ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ ఎ ఎమ్ రత్నానికి పదవి కట్టబెట్టడానికి ఇది సరైన సమయం కాదు !
పరేష్ తుర్లపాటి