వీరమల్లు మూవీ నిర్మాత ఎఎం రత్నానికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సు చేసినట్టు వార్తలు వస్తున్నాయి ? రాంగ్ టైం రైట్ డెషిషన్ అవుతుందా ? ఒకసారి విశ్లేషణ చేసుకుందాం .
రెండు మూడేళ్ళుగా అనేక అవాంతరాల మధ్య షూటింగ్ జరుపుకుని ఈ నెల 24 న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నపాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లుకు ఎ ఎమ్ రత్నం నిర్మాత అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి వేరెవరైనా హీరో అయ్యుంటే అసలు చర్చకు ఆస్కారమే లేదు . కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి హీరో . కాబట్టే పవన్ సిఫార్సుల మీద చర్చ మొదలైంది . పవన్ సిఫార్సు మీద చర్చ కన్నా ముందు ఈ ఎఎం రత్నం బ్యాక్ గ్రౌండ్ ఒకసారి పరిశీలన చేద్దాం .
వీరమల్లుకు ముందు కూడా రత్నం భారీ బడ్జెట్ సినిమాలు తీసి మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నారు . తమిళ్ రీమేక్ సినిమాలను కూడా ఒరిజినల్ తెలుగు సినిమాలకు ధీటుగా వంద రోజులు ఆడించిన చరిత్ర రత్నానికి ఉంది . ఆయన సినీ కెరీర్ కూడా కింది స్థాయి నుంచి మొదలైంది . మేకప్ మ్యాన్ స్థాయి నుంచి భారీ బడ్జెట్ సినిమాలు తీసే స్థాయికి ఆయన ఎదిగారు . సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఫైనాన్షియర్ల పాలిట మినిమం గ్యారంటీ ప్రొడ్యూసర్ అయ్యారు . ఎలా రత్నం సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చాడంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకాన్ని ఇండస్ట్రీలో సంపాదించాడు . వాళ్ళ నమ్మకమే రత్నాన్ని భారీ చిత్ర నిర్మాతగా మార్చివేసింది . దాంతో రత్నం ఇక వెనుతిరిగి చూసుకోలేదు . తెలుగు , తమిళ , హిందీ తదితర భాషల్లో బడ్జెట్ సినిమాలు తీసి హిట్ కొట్టాడు .
కానీ అంతటి హిట్ ప్రొడ్యూసర్ గా పేరున్న రత్నానికి కూడా బ్యాడ్ టైం వచ్చింది . కొన్ని దశాబ్దాల పాటు చిత్ర నిర్మాణ రంగంలో దూకుడుగా సినిమాలు తీసిన రత్నం ఆ మధ్య ఆర్థిక నష్టాలతో తాత్కాలికంగా విరామం ప్రకటించారు . దాంతో చాలాకాలం నుంచి రత్నం సొంత బ్యానర్ నుంచి కొత్త సినిమాలు పట్టాలెక్కలేదు .
మళ్ళీ ఇన్నేళ్లకు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాతో ఆయన తెరపైకి వచ్చారు .అయన బ్యాక్ కం కూడా అట్లాంటి ఇట్లాంటిది కాదు . ఏకంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఓ భారీ చిత్రం చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు . ఆయన ప్రకటనతో ఇండస్ట్రీ పెద్దల దృష్టి రత్నం మీద పడింది . పైగా పవర్ స్టార్ తో ప్లాన్ చేస్తున్నాడంటే భారీగానే ఉంటుందని అంచనాలు పెరిగాయి . ఇటు ఈ కాంబో పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షం ప్రకటించారు . ఒక భారీ ప్రొడ్యూసర్ , ఒక పవర్ స్టార్ చేతుల్లో నుంచి బయటికి వచ్చే వీరమల్లు బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు అప్పుడే పండుగ చేసుకున్నారు .
అయితే రత్నం దురదృష్టం ఏంటో కానీ వీరమల్లు షూటింగ్ ప్రారంభం నుంచి అనేక అవాంతరాలు ఎదుర్కొంది . సినిమాకు ముందు క్రిష్ ను దర్శకుడిగా అనుకున్నారు .కొన్ని కారణాల వల్ల క్రిష్ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా జ్యోతి కృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు . కథ ఇద్దరు దర్శకుల చేతులు మారటంతో మేకింగ్ ఆలస్యం అయ్యింది. చివరికి ఎలాగోలా జ్యోతికృష్ణ దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టగానే కరోనా రూపంలో బ్రేక్ పడింది . కోవిడ్ అనంతరం తిరిగి షూటింగ్ మొదలుపెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడంతో మళ్ళీ బ్రేక్ పడింది .
ఏపీలో కూటమి గెలవడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కాల్షీట్ల సమస్య వచ్చింది . పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ చేయడానికి ఆయన డేట్లు దొరకడం కష్టమైపోయింది . అలా వాయిదాల మీద వాయిదాలు పడి కొన్ని నెలల తర్వాత తిరిగి షూటింగ్ మొదలుపెట్టి మొత్తానికి ఎలాగోలా షూటింగ్ పుర్తి చేసారు .
ఇదిలా ఉంటే సినిమా పూర్తి అయిన సంతోషం కూడా రత్నానికి అట్టే నిలవలేదు . ఏపీలో థియేటర్ యజమానులకు , ప్రభుత్వానికి మధ్య సమస్యలు వచ్చాయి . దాంతో థియేటర్ యజమానులు తాత్కాలికంగా తమ థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్నారు .దాంతో థియేటర్ల బంద్ నేపథ్యంలో ఏపీలో సినిమా రిలీజ్ వాయిదా పడింది . నిజానికి ఇవన్నీ మాములు కష్టాలు కావు . సినిమా కష్టాలు అంటారే అలాంటివి .
ఇటువంటి పరిణామాలకు ఇంకో నిర్మాత అయితే ఎప్పుడో చేతులు ఎత్తేసేవాడు . కానీ చిత్ర నిర్మాణ రంగంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన ‘రత్నం’ కాబట్టి తట్టుకోగలిగాడు . ఫైనల్ గా ఈ నెల 24 న సినిమా రిలీజు ఖరారు అయ్యింది .
ఆలస్యం అయితే అయ్యింది ఈ మూవీ అందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చింది . సాధారణంగా తన సినిమాలకు పోస్ట్ ప్రమోషన్ వర్క్ లో ఇన్వాల్వ్ కాడని ఆయనకు పేరుంది . కానీ వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా ఏడు సార్లు తన సినిమా ట్రైలర్ చూసారు . ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు .
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి మాట్లాడుతూ ” ఎ ఎమ్ రత్నం మంచి అభిరుచిగల నిర్మాత .. నేను ఆయన నిర్మించిన చిత్రాలు దాదాపు అన్నీ చూసాను .. చిత్ర నిర్మాణంలో రాజీ పడకుండా మంచి సినిమాలు తీసిన రత్నం నా సినిమాకు కూడా నిర్మాతగా ఉంటే బాగుణ్ణు అని ఎన్నోసార్లు అనుకున్నా .. అది వీరమల్లుతో తీరింది .. ప్రాంతీయ సినిమాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రత్నందే .. తమిళ్ రీమేక్ సినిమాలను కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాలతో సమానంగా ఆడించి కలెక్షన్స్ రాబట్టిన నిర్మాతగా రత్నానికి పేరుంది .. ఇక వీరమల్లు సినిమా విషయంలో కూడా రత్నం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు .. అయినా తట్టుకుని ముందుకే వెళ్ళాడు .. ఇంత చక్కటి సినిమా నిర్మించిన ఎ ఎమ్ రత్నానికి సముచిత పదవి ఇవ్వడం నా ధర్మంగా భావించి ఆయనకు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదించాను .. నా సినిమా నిర్మాత కాబట్టి ఆయనకు ఈ పదవి ఇవ్వడం లేదు .. ఇలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను “అన్నారు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల చిన్న విశ్లేషణ చేసుకుందాం .
పవన్ కళ్యాణ్ మాట్లాడినదాంట్లో ఆఖరి వాఖ్యాలు ప్రాముఖ్యం వహిస్తాయి . సక్సెస్ ఫుల్ నిర్మాతగా రత్నం పేరు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు . అదే విషయం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం వరకు సబబే . ఎ ఎం రత్నం సీనియర్ నిర్మాత .. చిత్ర పరిశ్రమలో లోటుపాట్లు తెలిసిన వ్యక్తి అనడంలో సందేహం లేదు . ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీసి చిత్ర నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యక్షముగానో , పరోక్షముగానో ఉపాధి కల్పించారు . ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయనకు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇవ్వడం సముచితమే . ఇంతవరకు వివాదం లేదు .
అయితే పదవి కట్టబెడుతున్న సమయం .. సందర్భం మీదనే కొన్ని సందేహాలు వస్తాయి . వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో అయి ఉండవచ్చు . కానీ అంతకన్నా ముందు ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం అన్న విషయం మర్చిపోకూడదు . పదవి రీత్యా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక హోదా ఉంది . విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధికారులతోనో , సీఎం తోనో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది . అవన్నీ పక్కనబెట్టి తన సినిమా ఫంక్షన్లో తన ప్రొడ్యూసర్ కి ప్రభుత్వ నామినేటెడ్ పదవికి ప్రతిపాదించడం లేనిపోని వివాదాలకు దారి తీస్తుంది .
సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజుకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఈ ప్రకటన చేయడం వైరి పక్షాలకు ఆరోపణలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది . చిత్రంలో నటించిన నటుడు తన చిత్ర నిర్మాతకు సినిమా రిలీజుకు ముందు పదవి కట్టబెడితే ఒకరకంగా నాకిది .. నీకిది అనే క్విడ్ ప్రో ఫార్ములా కింద అన్వయించుకునే ఆస్కారం లేకపోలేదు . ఇంత చిన్న లాజిక్ పవన్ కళ్యాణ్ ఎలా మిస్ అయ్యారు ?
రాజకీయాల్లో విలువల గురించి పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ తన నిర్మాత కు ప్రభుత్వ నామినేటెడ్ పదవి కట్టబెట్టడం ఖచ్చితంగా విమర్శలకు దారి తీస్తుంది . నామినేటెడ్ పదవి పొందటానికి రత్నానికి అన్ని రకాల అర్హతలు ఉన్నా సరే ఆ విషయాన్ని ప్రకటించే ప్రక్రియ ఇది కాదు .. వేదిక కూడా ఇది కాదు . ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ ఎ ఎమ్ రత్నానికి పదవి కట్టబెట్టడానికి ఇది సరైన సమయం కాదు !
