అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి ధన్ ఖర్ రాజీనామా చేయడం వెనుక అసలు కారణం అనారోగ్య సమస్యలేనా ? ఇంకేవన్నా కారణాలు ఉన్నాయా ?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ధన్ ఖర్ సోమవారం తొలిరోజు సభకు హాజరయ్యారు
ఎప్పటిలానే సభలో చర్చించాల్సిన అంశాలను సభ్యులకు వివరించారు
అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన జస్టిస్ యశ్వంత్ శర్మ అభిశంసన నోటీసు గురించి ఆయన సభకు వివరించారు
మరోవైపు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అలహాబాద్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన నోటీసు గురించి కూడా సభకు వివరించారు
ఈ సందర్భంగా 50 మంది సభ్యుల సంతకాలు ఉంటే అభిశంసన తీర్మానం ముందుకు తీసుకెళ్లాలనే వాదన ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించినట్టు తెలుస్తుంది
సోమవారం ఈ రెండు తీర్మానాలు ప్రకటించిన తర్వాత కొద్దిసేపటికి ఆయన సభ నుంచి వెళ్లిపోయారు
అంతే , రాత్రికి రాజీనామా లేఖ బయటికి వచ్చింది
ఊహించని ఈ పరిణామానికి పార్లమెంట్ వర్గాలు ఆశర్యపోయాయి
తన రాజీనామా లేఖలో అనారోగ్య కారణాలు చూపినా అసలు కారణం ఇంకేదో ఉందని కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ అనుమానపడుతున్నారు
సోమవారం రాత్రి 7. 30 నిమిషాల వరకు తాను ఉపరాష్ట్రపతిని రెండుమూడు సార్లు కలిశానని అయితే అప్పుడు బావున్న మనిషి హఠాత్తుగా అనారోగ్య కారణాలు చూపి రాజీనామా చేయడం ఏంటి ?
ధన్ ఖర్ రాజీనామా వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని అవి త్వరలో బయటికి వస్తాయని ఆయన అన్నారు
ఇదిలా ఉండగా న్యాయవాది అయిన ధన్ ఖడ్ రాజకీయ ప్రస్థానం ఆదినుంచీ వివాదాస్పద వాఖ్యలతో నడిచింది
ఆమధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు మమత సర్కార్ వ్యవహారాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిలో పడ్డారు
దరిమిలా ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి దక్కింది
అయినా ఆయన వివాదాస్పద వాఖ్యలు మానుకోలేదు
గవర్నర్ వెర్సస్ తమిళనాడు గవర్నమెంట్ కేసులో రాష్ట్రపతి అధికారాలను ప్రశ్నించిన సుప్రీం కోర్ట్ తీరును బహిరంగంగా విమర్శించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు
ఈయన తీరుతో విసుగెత్తిన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రతిపాదించాయి
అలా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడిన తొలి ఉపరాష్ట్రపతి గా ధన్ ఖర్ రికార్డులకు ఎక్కారు
2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉన్నా రెండేళ్ల మూడు వందల నలభై నాలుగు రోజులకే ఆయన రాజీనామా చేసారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు
ఆయన రాజీనామాతో ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ సభను నడిపిస్తున్నారు
అయితే ధన్ ఖర్ రాజీనామా అనారోగ్య కారణాలతో జరిగింది కాదనీ .. ఇదంతా బీజేపీ వేసిన స్కెచ్ అని కొంతమంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు
బీజేపీ నెక్స్ట్ టార్గెట్ బీహార్ అనీ అక్కడ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ఇప్పటినుంచే పావులు కదుపుతోందని వాదనలు వినిపిస్తున్నాయ్
ఆ వ్యూహంలో భాగంగా నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతి పదవికి పంపి బీహార్ లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది వారు అభిప్రాయపడుతున్నారు
అయితే నితీష్ వ్యవహార శైలి తెలిసినవాళ్ళు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు
సొంత రాష్ట్రం అయిన బీహార్ ను నితీష్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లో ఒదులుకోడని అంటున్నారు
బీహార్ లో బలంగా పాతుకుపోయిన నితీష్ రాష్ట్రాన్ని బీజేపీ చేతుల్లో పెట్టి కేంద్రానికి వెళ్లేంత మూర్ఖత్వ పనిచేయడని .. అంతగా కావాలనుకుంటే పొత్తులో భాగంగా ఉపరాష్ట్రపతి పదవి తమ పార్టీకి కేటాయించాలని అడుగుతాడని వారంటున్నారు
ఏదిఏమైనా ఉపరాష్ట్రపతి ధన్ ఖర్ రాజీనామా వ్యవహారం రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతుంది
ఇదిలా ఉండగా రాజకీయ పరిశీలకుల ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ బీజేపీ అధిష్టానం మరో కొత్త వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా తెరమీదకు తీసుకువస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి
మొత్తమ్మీద ప్రస్తుతం రాజకీయ పార్టీల కన్ను బీహార్ మీద పడింది
ఈ రోజు కూడా బీహార్లో ఓటరు కార్డు సవరణ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం జరిగి సభలు వాయిదా పడ్డాయి !
పరేష్ తుర్లపాటి