రిమాండ్ ఖైదీలకు సదుపాయాలు కల్పించడం కరెక్ట్ కాదా ? మిధున్ రెడ్డి విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి ?

Spread the love

ప్రస్తుతం సోషల్ మీడియాలో మిథున్ రెడ్డి అరెస్ట్ కన్నా జైళ్లో అతడికి కల్పిస్తున్న సదుపాయాలపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తుంది

తనకు ఆరోగ్య సమస్యలు ఉన్న కారణాన.. భద్రత పరంగా Y కేటగిరీలో ఉన్నందున .. జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు

మిథున్ రెడ్డి మెడికల్ రిపోర్ట్స్.. ఇతర పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోర్టు వారు అతడికి జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

ఆ ఉత్తర్వుల ప్రకారం మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అనుమతిస్తారు

వెస్ట్రన్ కమోడ్, దిండు, పరుపు, దుప్పటి, కూలర్ మెడిసిన్స్ , కుటుంబ సభ్యులతో ములాఖత్ వంటి సదుపాయాలు కల్పిస్తారు

ఇవన్నీ చట్టపరంగా జరిగిన ఏర్పాట్లే
మిథున్ రెడ్డి వైసీపీ నాయకుడు కాబట్టి జరిగిన ఏర్పాట్లు కావు

అయితే మిథున్ రెడ్డికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది
అదే సమయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

వీటితో పాటు గదిలో ఎయిర్ కండిషన్ , బాడీ మసాజ్, హెయిర్ మాలిష్ లాంటి ఏర్పాట్లు కూడా చేసుంటే బాగుండేది అని సెటైర్లు కూడా వేస్తున్నారు

మరికొంతమంది మిథున్ రెడ్డి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవడమే కాకుండా లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా కూడా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సబబే అని వాదిస్తున్నారు

ఈ రెండు వాదనల మీద ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం

మొదటిది రిమాండ్ ఖైదీలు అంటే నేరగాళ్లు అని అర్థం కాదు

చట్టం కేవలం వాళ్ళని నేరారోపణలు ఎదుర్కుంటున్న నిందితులుగా మాత్రమే భావిస్తుంది

అంటే నేర నిర్ధారణ జరిగి శిక్ష పడేదాకా వారు సాధారణ పౌరుల కిందే లెక్క

చట్టంలో రిమాండ్ ఖైదీల హక్కుల గురించి సృష్టంగా నిర్వచించారు
ఆ మేరకే వారికి జైళ్లో సదుపాయాలు కల్పిస్తారు

ఇవి కాకుండా ఆరోగ్య కారణాలు కానీ, వ్యక్తిగత హొదా రీత్యా కానీ, భద్రత పరంగా కానీ రిమాండ్ ఖైదీలు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కోరవచ్చు

కేసు షీట్ బట్టి, నేర తీవ్రత బట్టి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలా? వద్దా? అనేది న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు

అలాగే గత ఎన్నికల ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైళ్లో పెడితే ఆయన కూడా తన ఆరోగ్య కారణాల రీత్యా.. మాజీ ముఖ్యమంత్రి హొదా రీత్యా, సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పిటిషన్ వేస్తే ఏసీబీ న్యాయమూర్తి ఆయనకు ఇంటి భోజనం , కుటుంబ సభ్యులతో ములాఖత్ వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

విచారణ జరుగుతున్నా సమయంలో న్యాయమూర్తి చంద్రబాబును ఉద్దేశించి ‘ చట్టం దృష్టిలో మీరు కేవలం నేరారోపణలు ఎదుర్కుంటున్న నిందితులు మాత్రమే.. నేరం రుజువు అయ్యేవరకు చట్ట పరిధిలో మీ ప్రత్యేక హక్కులకు ఎటువంటి భంగం కలగదు.. మీకు జైళ్లో సదుపాయాలు బాగోకపోతే న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు ‘ అని సృష్టంగా చెప్పారు

న్యాయమూర్తి వాఖ్యలతో రిమాండ్ ఖైదీల హక్కుల గురించి పరోక్షముగా అందరికీ అర్ధమయ్యే ఉంటుంది

అలాగే ఆ మధ్య నేరం రుజువు అయి శిక్ష పడిన తర్వాత కూడా గాలి జనార్దన రెడ్డి ఆరోగ్య కారణాల రీత్యా జైళ్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు

కానీ కోర్ట్ ఆ పిటిషన్ కొట్టివేసింది
అది సరైన చర్యే
ఒకసారి శిక్ష ఖరారు అయినతరువాత అతడు ఎంతటివాడు అయినా కానీ హోదాతో సంబంధం లేకుండా దోషీగానే పరిగణించబడతాడు

ముగింపు: భారతీయ చట్టాలలో రిమాండ్ ఖైదీలది విచిత్రమైన పరిస్థితి

కొన్నేళ్ల క్రితం భానుచందర్ నిరీక్షణ సినిమా వచ్చింది

అందులో భానుచందర్ ను నక్సలైట్ అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లలో నిర్బంధించి కోర్టుల చుట్టూ తిప్పి నానా హింసలు పెడతారు.. ఆఖరికి అసలు ఉగ్రవాది వేరేవాడు అని ఇతడు అమాయకుడు అని తెలుసుకుని పోలీసులు భానుచందర్ ను విడిచిపెట్టేస్తారు

ఈలోపు అతడి జీవితం సగ భాగం అయిపోతుంది

యండమూరి వీరేంద్రనాధ్ నవల ఆధారంగా తీసిన ఒక సినిమాలో కూడా లాయర్ రావుగోపాలరావు చిరంజీవి పాత్ర ద్వారా ఉరిశిక్షలో ఉన్న లోపాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు ( అఫ్కోర్స్ అది వేరే సబ్జెక్టు అనుకోండి )

సినిమాల్లోనే కాదు రిమాండ్ ఖైదీలుగా సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గి ఆఖరికి నిర్దోషులు గా బయటపడిన వాళ్ళు మన చరిత్రలో కోకొల్లలు

నిర్దోషులుగా బయటపడినప్పటికీ రిమాండ్ కాలంలో పౌర హక్కులను కోల్పోయి సమాజంలో కూడా చిన్న చూపుకు గురి అవుతారు
న్యాయస్థానంలో నిర్దోషిగా బయటపడిన విషయం కన్నా అతడు ఫలానా నేరంలో జైలుకు వెళ్ళాడు అనేదే ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది

సూచనలు: రిమాండ్ ఖైదీలు కేవలం నేరారోపణలు ఎదుర్కుంటున్న నిందితులు మాత్రమే కాబట్టి హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి అతడి వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా విచారణ చెయ్యాలి

సదరు విచారణ ఎదుర్కుంటున్న వ్యక్తులు నేరస్తులుగా నిర్ధారణ కాని కాలం అంతా సాధారణ పౌరుల మాదిరిగానే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి

నేరారోపణ రుజువైతే చట్ట ప్రకారమే శిక్షలు ఉంటాయి కాబట్టి అందులో ఎటువంటి ఆక్సేపణ లు ఉండవు

కానీ విచారణ ఎదుర్కుంటున్న వ్యక్తుల విషయంలో ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!