ప్రస్తుతం సోషల్ మీడియాలో మిథున్ రెడ్డి అరెస్ట్ కన్నా జైళ్లో అతడికి కల్పిస్తున్న సదుపాయాలపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తుంది . ఆయన పార్లమెంట్ సభ్యుడు కావడం ఒక కారణం కాగా , ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు కావడం ఆ చర్చకు మరొక కారణం .
నిజానికి రిమాండ్ ఖైదీలకు వారి హోదాల దృష్ట్యా కల్పించే సదుపాయాలపై చట్టంలో కూడా స్పృష్టంగా ఉంది . అయినా రాజకీయ నాయకుల పార్టీలను బట్టి వాటికి అర్దాలు మారిపోతూ ఉంటాయి .. మార్చేస్తారు కూడా . ఈ చర్చ కేవలం ఒక్క మిధున్ రెడ్డి విషయంలోనే కాదు గతంలో కూడా చాలామంది నాయకుల రిమాండ్ టైం లో కూడా జరిగిందే . గతంలో ఆప్ మంత్రి ఒకరికి జైల్లో కలిపించిన సదుపాయాలపై కూడా పెద్ద చర్చ నడిచింది . విమర్శలకు కూడా దారి తీసింది . రిమాండ్ ఖైదీల విషయంలో నూటికి తొంబై శాతం చట్టప్రకారమే జరుగుతాయి . మిగిలిన పది శాతం అవినీతి అనేది ఎక్కడో ఒకచోట ఒకరిద్దరు అవినీతిపరులైన అధికారులు ఉంటే జరిగే అవకాశం ఉంటుంది .
ఇలా ఉంటే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్న కారణాన.. భద్రత పరంగా Y కేటగిరీలో ఉన్నందున .. జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్ వేశారు . ఆయన మెడికల్ రిపోర్ట్స్.. హోదా ..ఇతర పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోర్టు వారు అతడికి జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు .ఇదంతా చట్టప్రకారం జరిగిన ప్రక్రియే . ఇందులో రాజకీయాలకు అస్సలు తావుండదు .
ఆ ఉత్తర్వుల ప్రకారం మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అనుమతిస్తారు . వెస్ట్రన్ కమోడ్, దిండు, పరుపు, దుప్పటి, కూలర్ , మెడిసిన్స్ , కుటుంబ సభ్యులతో ములాఖత్ వంటి సదుపాయాలు కల్పిస్తారు . ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ చట్టపరంగా జరిగిన ఏర్పాట్లే . మిథున్ రెడ్డి వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు కాబట్టి జరిగిన ఏర్పాట్లు కావు . పార్టీలో హొదానుబట్టి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే దేశంలో జైళ్లన్నిటిలో ఆ సదుపాయాలు పెట్టించినా చాలవు .
అయితే మిథున్ రెడ్డికి జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది . అదే సమయంలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి . హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జైల్లో ఇటువంటి సదుపాయాలు కల్పించడం ఏంటని ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తి పోశాయి . అతడు తన సదుపాయాల విషయంలో జైలు అధికారులను ఇన్ఫ్లుయన్సు చేస్తున్నాడని వారు ఆరోపించారు .
ఇక సోషల్ మీడియాలో వేస్తున్న సెటైర్లకైతే అంతు లేదు . వీటితో పాటు గదిలో ఎయిర్ కండిషన్ , బాడీ మసాజ్, హెయిర్ మాలిష్ లాంటి ఏర్పాట్లు కూడా చేసుంటే బాగుండేది అని వెటకారంగా పోస్టులు పెడుతున్నారు .
మరికొంతమంది మిథున్ రెడ్డి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవడమే కాకుండా లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా కూడా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సబబే అని వాదిస్తున్నారు . ఇదంతా చట్టప్రకారం జరుగుతున్న ప్రక్రియే అయినా కొందరు కావాలని పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆ విమర్శలను తిప్పికొట్టారు .
ఈ రెండు వాదనల మీద ఇప్పుడు ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం .
మొదటిది రిమాండ్ ఖైదీలు అంటే నేరగాళ్లు అని అర్థం కాదు . చట్టం కేవలం వాళ్ళని నేరారోపణలు ఎదుర్కుంటున్న నిందితులుగా మాత్రమే భావిస్తుంది . అంటే నేర నిర్ధారణ జరిగి శిక్ష పడేదాకా వారు సాధారణ పౌరుల కిందే లెక్క . సాధారణ పౌరులకు ఉండే కొన్ని హక్కులు రిమాండ్ ఖైదీలకు కూడా ఉంటాయి . చట్టంలో రిమాండ్ ఖైదీల హక్కుల గురించి సృష్టంగా నిర్వచించారు . ఆ మేరకే వారికి జైళ్లో సదుపాయాలు కల్పిస్తారు . ఇందులో ఒకరికి ఎక్కువ , మరొకరికి తక్కువ సదుపాయాలు కల్పించడం ఉండదు .
ఇవి కాకుండా వయసు రీత్యా కానీ , ఆరోగ్య కారణాలు కానీ, వ్యక్తిగత హొదా రీత్యా కానీ, భద్రత పరంగా కానీ రిమాండ్ ఖైదీలు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కోరవచ్చు . కేసు షీట్ బట్టి, నేర తీవ్రత బట్టి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలా? వద్దా? అనేది న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు . కొన్ని కేసుల్లో న్యాయమూర్తి విచక్షణా అధికారం బట్టి కూడా నిర్ణయాలు ఉంటాయి .
అలాగే గత ఎన్నికల ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైళ్లో పెడితే ఆయన కూడా తన ఆరోగ్య కారణాల రీత్యా.. మాజీ ముఖ్యమంత్రి హొదా రీత్యా, సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పిటిషన్ వేస్తే ఏసీబీ న్యాయమూర్తి ఆయనకు ఇంటి భోజనం , కుటుంబ సభ్యులతో ములాఖత్ వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . చట్టం చంద్రబాబు విషయంలో ఎటువంటి రూల్స్ ఫాలో అయ్యిందో , మిధున్ రెడ్డి విషయంలో కూడా అలాంటి రూల్స్ నే ఫాలో అయ్యింది . అంతేకానీ ఆయన ఫలానా పార్టీ కాబట్టి ఆయనకు ఒక రూలు , ఈయన ఫలానా పార్టీ కాబట్టి ఈయనకు ఇంకో రూల్ ఫాలో అవలేదు .
విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి చంద్రబాబును ఉద్దేశించి ‘ చట్టం దృష్టిలో మీరు కేవలం నేరారోపణలు ఎదుర్కుంటున్న నిందితులు మాత్రమే.. నేరం రుజువు అయ్యేవరకు చట్ట పరిధిలో మీ ప్రత్యేక హక్కులకు ఎటువంటి భంగం కలగదు.. మీకు జైళ్లో సదుపాయాలు బాగోకపోతే న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు .. ఈ విషయంలో మీరు ఏం చెప్పదల్చుకున్నా నేరుగా న్యాయస్థానంలో చెప్పవచ్చు ‘ అని సృష్టంగా చెప్పారు.
న్యాయమూర్తి వాఖ్యలతో రిమాండ్ ఖైదీల హక్కుల గురించి పరోక్షముగా అందరికీ అర్ధమయ్యే ఉంటుంది . అలాగే ఆ మధ్య నేరం రుజువు అయి శిక్ష పడిన తర్వాత కూడా ఆరోగ్య కారణాల రీత్యా జైళ్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గాలి జనార్దన రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు . కానీ కోర్ట్ విచారణ దశలోనే ఆ పిటిషన్ కొట్టివేసింది . చట్టపరంగా అది సరైన చర్యే . అతడి విషయంలో అతడి హోదా కానీ , అంతస్తులు కానీ , ఏవీ పనిచేయలేదు . ఎందుకంటే అతడు రిమాండ్ ఖైదీ కాదు . నేరం నిరూపించబడి శిక్ష పడిన ముద్దాయి . అందుకే ఒకసారి శిక్ష ఖరారు అయినతరువాత అతడు ఎంతటివాడు అయినా కానీ హోదాతో సంబంధం లేకుండా దోషీగానే పరిగణించబడతాడు .
ముగింపు: భారతీయ చట్టాలలో రిమాండ్ ఖైదీలది విచిత్రమైన పరిస్థితి . కొన్నేళ్ల క్రితం భానుచందర్ హీరోగా నటించిన నిరీక్షణ అనే సినిమా వచ్చింది . అందులో భానుచందర్ ను నక్సలైట్ అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లలో నిర్బంధించి కోర్టుల చుట్టూ తిప్పి నానా హింసలు పెడతారు.. ఆఖరికి అసలు ఉగ్రవాది వేరేవాడు అని ఇతడు అమాయకుడు అని తెలుసుకుని పోలీసులు భానుచందర్ ను విడిచిపెట్టేస్తారు . ఈలోపు అతడి జీవితం సగ భాగం అయిపోతుంది . ప్రేమించిన ప్రియురాలితో జీవిత కాలం ఎడబాటు భరించాల్సి వస్తుంది . ఇదంతా కేవలం చేయని నేరానికి రిమాండ్ ఖైదీ పేరుతో అతడు అనుభవించిన శిక్ష . కానీ చట్టప్రకారం చూస్తే అతడు నిర్దోషిగా విడుదల కాబడతాడు. మరి రిమాండ్ ఖైదీ పేరుతో అతడు అనుభవించిన జైలు జీవితానికి పరిహారం ఉంటుందా ? తిరిగి రాని కాలాన్ని తిరిగి అతడి చేతిలో ఏ చట్టం పెట్టగలదు? చేయని నేరానికి జైలు జీవితం అనుభవించి అతడు పడిన మనోవేదనకు ఖరీదు కట్టే చట్టాలు ఉన్నాయా ? నిజానికి అది సినిమా అయినా వాస్తవంలో బయటికిరాని అటువంటి సంఘటనలు ఎన్నో ? తరతరాలనుంచి రిమాండ్ ఖైదీల విషయంలో అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలికి నేరం నిర్దారణ అయ్యేవరకు సాధారణ పౌరుల మాదిరి హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . రిమాండ్ ఖైదీల విషయంలో చట్ట సవరణ చేస్తే భానుచందర్ క్యారక్టర్ లాంటి ప్రపంచానికి తెలియని చాలామంది అమాయకులకు ఉపశమనం కలుగుతుంది . ప్రాధమిక న్యాయం దొరుకుతుంది .
యండమూరి వీరేంద్రనాధ్ నవల ఆధారంగా తీసిన ఒక సినిమాలో కూడా లాయర్ రావుగోపాలరావు చిరంజీవి పాత్ర ద్వారా ఉరిశిక్షలో ఉన్న లోపాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు ( అఫ్కోర్స్ అది వేరే సబ్జెక్టు అనుకోండి )
సినిమాల్లోనే కాదు రిమాండ్ ఖైదీలుగా సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గి ఆఖరికి నిర్దోషులు గా బయటపడిన వాళ్ళు మన చరిత్రలో కోకొల్లలు . నిర్దోషులుగా బయటపడినప్పటికీ రిమాండ్ కాలంలో పౌర హక్కులను కోల్పోయి సమాజంలో కూడా చిన్న చూపుకు గురి అవుతారు . న్యాయస్థానంలో నిర్దోషిగా బయటపడిన విషయం కన్నా అతడు ఫలానా నేరంలో జైలుకు వెళ్ళాడు అనేదే ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది . ఆ మచ్చ నుంచి బయటపడాలంటే కొందరికి జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు .
సూచనలు: రిమాండ్ ఖైదీలు కేవలం నేరారోపణలు ఎదుర్కుంటున్న నిందితులు మాత్రమే కాబట్టి హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి అతడి వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా విచారణ చెయ్యాలి . సదరు విచారణ ఎదుర్కుంటున్న వ్యక్తులు నేరస్తులుగా నిర్ధారణ కాని కాలం అంతా సాధారణ పౌరుల మాదిరిగానే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి .
నేరారోపణ రుజువైతే చట్ట ప్రకారమే శిక్షలు ఉంటాయి కాబట్టి అందులో ఎటువంటి ఆక్షేపణలు ఉండవు .కానీ విచారణ ఎదుర్కుంటున్న వ్యక్తుల విషయంలో ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
