ఎమ్మెల్యేలు , ఎంపీలు , మంత్రులు , ముఖ్యమంత్రులు , ప్రధాని ఇలా హోదాను బట్టి పోలీస్ అని , Z అని, Y అని, ఎస్పీజీ అని రకరకాల కేటగిరీల్లో సెక్యూరిటీలు ఉంటాయి
ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఎవరికీ నొప్పి ఉండదు
అమాత్యులు బయటికి వెళ్తే వంతులవారీగా డ్యూటీలు వేసుకున్న రక్షక భటులు స్థాయికి తగ్గ ఆయుధాలతో నిరంతరం వారిని ఫాలో అవుతుంటారు
కొందరు ప్రోటోకాల్ రీత్యా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీని పొందుతుండగా ,మరికొందరు న్యాయ స్థానాల నుంచి సెక్యూరిటీని పొందుతున్నారు
వీరికయ్యే ఖర్చు కూడా మాములుగా ఉండదు
జీతభత్యాలు ,ఇతర అలవెన్సులు కలుపుకుంటే తడిసి మోపెడు అవుతుంది
సమాచార హక్కు చట్టం ద్వారా విఐపిల రక్షణకు ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
నక్సల్స్ ఉద్యమాలు తీవ్రంగా ఉన్న మూడు నాలుగు దశాబ్దాల క్రితం కూడా ఈ విఐపి సెక్యూరిటీల గోల అంతగా లేదు
అసలు అప్పట్లో ఎమ్మెల్యేలకు గన్ మెన్లు కూడా లేరు
మంత్రులకు , సీఎం లకు మాత్రం పోలీస్ సెక్యూరిటీ ఉండేది
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రం అదనపు ఎస్కార్ట్ వాహనాలు వచ్చేవి
కానీ రోజులు మారడంతో విఐపి సెక్యూరిటీ అనేది ప్రధాన టాస్క్ అయి కూర్చుంది
సరే వీరికి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి సదరు విఐపి ల జేబులకు పడే అదనపు భారం ఏమీ ఉండదు
కానీ సెలెబ్రిటీలకు అలా కాదే
తమ రక్షణ కోసం పెట్టుకునే ప్రతి పైసా వారి జేబులోనుంచే పెట్టుకోవాలి
వారికి అంతంత ఖర్చు పెట్టుకుని సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటారా ?
ఉంటుంది
చేసే వృత్తిని బట్టి , సోషల్ స్టేటస్ ను బట్టి , సంపాదనను బట్టి సొంత సెక్యూరిటీ అవసరం ఉంటుంది
మళ్ళీ ఈ ప్రైవేట్ సెక్యూరిటీలో కొన్ని క్యాటగిరీలు ఉన్నాయి
సెక్యూరిటీ గార్డులు , బాడీ గార్డులు , రివాల్వర్ లైసెన్స్ గన్ మెన్ లు , బౌన్సర్లు తదితరులు ఉంటారు
సెక్యూరిటీ గార్డులు
సాధారణంగా ఈ సెక్యూరిటీ గార్డులకు స్కిల్ తో పెద్దగా పనుండదు
కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార సముదాయాలకు ,గోడౌన్లకు ,ఆఫీసులకు , ఇళ్లకు , అపార్టుమెంట్లకు ఈ సిబ్బందిని నియమించుకుంటాయి
ఒకరకంగా చెప్పాలంటే ఏదో ఆకారం కోసం చాలా సంస్థలు , వ్యక్తులు వీరిని నియమించుకుంటారు
అందుకే వీరి జీత భత్యాలు కూడా నామమాత్రంగా ఉంటాయి
ఇప్పటికీ నెలకు 15 వేలు ఇస్తే రోజుకి పన్నెండు గంటలు పనిచేసే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు
వీరికే కొద్దిగా గెటప్ వేసి నిలబెడితే 25 వేలు కూడా ఇస్తున్నారు
ఆ మధ్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా పాదయాత్రలో షుమారు షిఫ్టుకి 60 మంది చొప్పున మొత్తం 180 మంది సొంత సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నారు
వీరి పని కేవలం జనాల్ని కంట్రోల్ చేయడం వరకే కాబట్టి పెద్దగా స్కిల్ తో పని కూడా ఉండదు
కాకపోతే జగన్ పాదయాత్రలలో ఈ సెక్యూరిటీ సిబ్బంది కూడా అదనపు ఆకర్షణగా నిలిచారు
తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఆ స్థాయిలో సొంత సెక్యూరిటీ గార్డులను నియమించుకుంది బహుశా జగన్ ఒక్కరేనేమో
ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సేవలను నిలిపివేశారు
బాడీ గార్డులు
ముఖ్యంగా సెలెబ్రిటీలు వీరి సేవలను ఎక్కువగా వాడుకుంటారు
పెద్ద హీరోలనుంచి చోటామోటా హీరోలవరకు బాడీగార్డులు లేకుండా బయటికి రావడం లేదు
రక్షణ సంగతి అటుంచితే సోషల్ స్టేటస్ కోసం కూడా వీరు ఈ బాడీ గార్డులను మెయింటైన్ చేస్తున్నారు
టాలీవుడ్ కు చెందిన ఒక చోటా హీరో అయితే ఏకంగా హాలీవుడ్ రేంజులో ఒక విదేశీ బాడీ గార్డును వెంటేసుకుని ఈవెంట్లకు తిరుగుతూ ఉంటాడు
రివాల్వర్ లైసెన్స్ గన్ మెన్లు
ప్రస్తుత మార్కెట్లో వీళ్ళకి బాగా గిరాకీ ఎక్కువ
సెలెబ్రిటీలు సొంత రివాల్వర్ లైసెన్సులు తీసుకున్నా అదనంగా లైసెన్సుడ్ గన్ మెన్లను కూడా తీసుకుంటారు
ఎందుకంటే ఈ లైసెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతితోనే పొందటానికి వీలుపడుతుంది
సదరు లైసెన్స్ పొందిన వ్యక్తులు , సంస్థలు పీరియాడిక్ గా సంబంధిత పోలీస్ స్టేషన్లలో వివరాలు అప్డేట్ చేస్తూ ఉండాలి
రివాల్వర్ కి సంబంధించిన పూర్తి బాధ్యత లైసెన్స్ పొందినవారి మీదే ఉంటుంది
అందుకే ఈ తలనొప్పులు ఎందుకని సెలెబ్రిటీలు రివాల్వర్ లైసెన్స్ పొందిన వ్యక్తులనే తమ బాడీ గార్డులుగా నియమించుకుంటారు
వీరు నెలకు షుమారు 50 వేలు దాకా తీసుకుంటున్నారు
హిట్ లిస్టులో ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణ భయంతో ఇప్పటికీ రివాల్వర్ లైసెన్స్ పొందిన బాడీ గార్డులు లేకుండా బయటికి రాడు
ఆ హీరోగారు కేవలం వీరి కోసమే లక్షలు , లక్షలు ఖర్చు పెడుతున్నాడు
బాడీ గార్డులకు పెట్టే ఖర్చుతో ఆయన ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమా కూడా తియ్యొచ్చు
కానీ వీళ్ళు లేకపోతే ఆయన సినిమాలు తియ్యడం సంగతి అటుంచితే నటించే అవకాశాలు కూడా శాశ్వతంగా పోవొచ్చు
బౌన్సర్లు
ప్రస్తుతం చాలామంది సెలెబ్రిటీలు వీరు లేనిదే బయటికి రావడం లేదు
ముఖ్యంగా సినిమా రంగంలో ఈ బౌన్సర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది
సినీ ఈవెంట్లలో హీరో , హీరోయిన్ల రక్షణ కోసం నిర్వాహకులే బౌన్సర్లను ఏర్పాటు చేస్తారు
అది కాకుండా కొంతమంది సెలెబ్రిటీలు సొంతంగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారు
వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏమీ ఉండవు
ఆఖరికి చేతిలో లాఠీ కూడా ఉండదు
వీరి శరీరమే ఒక ఆయుధం
ఆ శరీరంతోనే భయపెట్టేస్తారు
బార్లు , పబ్బుల యాజమాన్యాలు మందుబాబుల ఆగడాల నుంచి రక్షణ కోసం ఈ బౌన్సర్లను నియమించుకుంటాయి
మందెక్కువైనోడు ఏ మాత్రం తైతక్కలాడినా భుజాన వేసుకుని నిర్దాక్షిణ్యంగా బయటికి విసిరేస్తారు
సినిమా ఫంక్షన్లలో చూడటం మినహా ఈ బౌన్సర్లను బయట ఎక్కడా మనం చూసి ఉండం
కానీ గత ఏడాది మొదటిసారిగా మోహన్ బాబు ఇంట్లో గొడవలతో బౌన్సర్లు ప్రజల దృష్టిలో పడ్డారు
అలాగే పోలీసుల దృష్టిలో కూడా పడ్డారు
మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళడానికి ఆయన తనయుడు మంచు మనోజ్ 30 మంది బౌన్సర్లతో బయలుదేరితే , అతడ్ని లోపలికి రానీకుండా మంచు విష్ణు 40 మంది బౌన్సర్లను కాపలా పెట్టాడు
అప్పుడే ఈ బౌన్సర్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి
హైద్రాబాదులో ఈ బౌన్సర్లకు గిరాకీ ఎక్కువ
ఒక్కోడికి రోజుకి రెండు వేల నుంచి పదిహేను వేల దాకా ఇవ్వాలి
సెలెబ్రిటీలు సొంత రక్షణ కోసం బాడీ గార్డులుగా నియమించుకున్న వాళ్ళకి మినహా మిగిలినవాళ్ళకి నెలంతా పనుండదు
అయినా అంతంత రేట్లు ఎందుకున్నాయని ఓ బౌన్సర్ని ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు
” మార్కెట్లో మిగిలినవారితో పోలిస్తే మా రేటు ఎక్కువే .. కానీ అందుకో కారణం ఉంది . మాములు సెక్యూరిటీ గార్డ్ అయితే రోజుకి ఐదువందలకు కూడా దొరుకుతాడు . కానీ అదే ఐదువందలు మాకు రోజు తిండికే అవుతుంది . ఆశ్చర్యపోతున్నారా ? . అవును .. మాకు ఈ బాడీ ఫిట్నెస్ రావాలంటే తిండికే మేము రోజుకి ఐదు వందలు ఖర్చుపెడతాం . అలా అని తిని కూర్చుంటే ఈ షేప్ రాదు . అందుకే జిమ్ లో చేరి ఫిట్నెస్ కోసం వర్కౌట్లు చేస్తాం . మళ్ళీ దానికో ట్రైనర్ , ఆయన ఖర్చులు కూడా ఉంటాయి . మాములు సెక్యూరిటీ గార్డును , మమ్మల్ని పక్కపక్కన నిలబెట్టి చూడండి.. విషయం మీకే అర్థమైపోతుంది . సెక్యూరిటీ గార్డుకి నెలంతా పని దొరుకుతుంది .కానీ మాకు గిరాకీ ఎప్పుడు ఎలా ఉంటుందో మాకే తెలీదు .. ఒక్కోసారి పెద్ద సినిమా ఫంక్షన్లు జరిగితే సిటీలో ఉండే బౌన్సర్లు మొత్తం సరిపోరు .. అప్పుడు రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా మమ్మల్ని తీసుకోవడానికి వెంటపడతారు . అలాంటి గిరాకీలు తగిలితే మాకు పండగే .. ఒక్కోసారి రోజుల తరబడి పని దొరకదు . అయినా సరే మా తిండి ఆపకూడదు .. జిమ్ వర్కౌట్స్ ఆపకూడదు .. అందుకే మాకు అంత రేటు ” అని చెప్పుకొచ్చాడు
మంచు ఫ్యామిలీ గొడవల్లో బౌన్సర్ల ఆగడాలు అప్పటి హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ దృష్టికి వెళ్లడంతో ఆయన సిటీలో ఉన్న బౌన్సర్ల కోసం ప్రత్యేక నిబంధనలు కొన్ని తీసుకొచ్చారు
అదే విషయం బౌన్సర్ని ” మరి ఇలాంటి గొడవలు అయినప్పుడు పోలీస్ కేసులు అవుతాయి కదా ? అప్పుడు మీ పరిస్థితి ఏంటి ? ” అని ప్రశ్నిస్తే ,
” నిజమే .. మీరన్నట్టు ఒక్కోసారి పోలీస్ కేసులు కూడా అవుతాయి .. కానీ మమ్మల్ని ఆ కేసులనుంచి బయటపడేసే బాధ్యత మమ్మల్ని పనిలోకి తీసుకున్న సెలెబ్రిటీలే చూసుకుంటారు.. మహా అయితే ఓ రెండ్రోజులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి.. అంతేకదా సార్ ” అని నవ్వుతూ చెప్పాడు
వార్నీ మీ పనే బావుంది కదా !
