అవును ..వెనిజులా ప్రెసిడెంటుని రాత్రికి రాత్రే లేపుకుపోయారు .. అసలు ఆ రాత్రి ఏం జరిగింది ?

Spread the love

సమయం శనివారం తెల్లవారు ఝాము ఒంటి గంట కావస్తుంది . ట్రంప్ మాటలను తేలిగ్గా తీసుకున్న వెనిజులా ప్రెసిడెంట్ మదురో అధ్యక్ష భవనంలో ఏసీ వేసుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు . మరికాసేపట్లో వెనిజులా అధ్యక్ష భవనం మీద అతి పెద్ద సైనిక ఆపరేషన్ జరుగుతుందని ఆ క్షణాన ప్రెసిడెంట్ మదురో కి తెలీదు .

మరోవైపు అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాత్రం మేలుకునే ఉండి డెల్టా ఫోర్స్ అండ్ ఎఫ్బిఐ లను వెనిజులా మీదకు సైనిక చర్యకు సమాయత్తం చేస్తున్నాడు . ఆ అర్ధరాత్రి వేళ షుమారు 150 కి పైగా యుద్ధ హెలికాఫ్టర్లు వాయువేగంతో వెనిజులా వైపు దూసుకుపోయాయి . వెనిజులా లో ఎంటర్ అవుతూనే బోలివరీయన్ నావీ , మిలిటరీ అకాడమిల మీద దాడులు చేసాయి .

అక్కడికి దగ్గర్లోనే ఉన్న పోర్ట్ మీద బాంబుల వర్షం కురిపించింది . కారకాస్ కి వెళ్లేముందు మిరాండా ఎయిర్ బేస్ మీద కూడా దాడులు చేసింది . ఫైనల్లీ వెనిజులా కాపిటల్ సిటీ కారకాస్ లోకి ప్రవేశించేముందు విద్యుత్ సరఫరా మొత్తం నిలుపుదల చేసింది .

దాంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు కూడా అర్ధం కాలేదు . చుట్టూ గాఢాంధకారం , పైనుంచి యుద్ధ విమానాలు , హెలికాఫ్టర్ల ద్వారా బాంబుల వర్షం కురుస్తుండటంతో భయపడి దాక్కున్నారు .

కానీ డెల్టా ఫోర్స్ హెలికాఫ్టర్లు నివాసిత ప్రాంతాల జోలికి పోలేదు . చాలా పకడ్బందీగా ప్రెసిడెంట్ మదురో ని టార్గెట్ చేసి పక్కా వ్యూహంతో అధ్యక్ష భవనం మీద దాడులు చేసారు .

ఈ దాడుల్లో వెనిజులా ప్రెసిడెంట్ సెక్యూరిటీని పుర్తిగా తుదముట్టించిన తర్వాత ఫోర్స్ నేరుగా మదురో బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆయన్ను , ఆయన భార్యను అదుపులోకి తీసుకుని బేడీలు వేసి యూఎస్ కు తరలించారు .

ఇదంతా తెల్లవారు ఝామున ఒంటిగంట నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల లోపలే జరిగింది . మదురో ని పట్టుకున్నాం అనే మెసేజ్ వచ్చిన తర్వాతనే ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియచేసాడు .

హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా టాస్క్ ని మూడు గంటల్లోపల పూర్తి చేసింది డెల్టా ఫోర్స్ అర్ధరాత్రి వేళ ఒక దేశ అధ్యక్షుడిని అతని భవనంలోనే బందీగా పట్టుకుని బేడీలు వేసి అమెరికాకు తరలించడం సంచలనం అయ్యింది .

అన్నంత పనీ చేసిన ట్రంపరి తనాన్ని చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి . ఈ ఘటనపై రష్యా , ఇరాన్ వంటి దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా బాహాటంగా విమర్శించగా , కొన్ని దేశాలు ట్రంప్ చర్యను సమర్ధించాయి . మరికొన్ని దేశాలు గోడమీది పిల్లి వాటంలా అనుకూలమూ , వ్యతిరేకమూ కాకుండా స్పందించాయి .

రష్యా అయితే ఏమన్నా ఉంటే అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా తేల్చుకోవాలి కానీ సార్వభౌమాధికారం మీద దాడులు చేయడం ఏంటని ? నిలదీసింది .

ఇంతకీ అసలు గొడవేంటి ?

ట్రంప్ అప్పటికప్పుడు అర్ధరాత్రి మదురో ని బంధించి తీసుకురాలేదు . ఈ గొడవ ఎప్పటినుంచో జరుగుతున్నదే .

ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా అమెరికాకి డ్రగ్స్ తరలిస్తుండటంతో వెనిజులా ప్రెసిడెంట్ ను బంధించి అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ చెపుతున్నప్పటికీ అసలు కారణం ముడి చమురు నిక్షేపాలు అన్న సంగతి ప్రపంచానికి తెలిసిందే .

కాకపోతే మదురో ని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలను ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే చాలా తెలివిగా ఎస్టాబ్లిష్ చేసాడు . అమెరికన్ చట్టాల ప్రకారం ఇది అతి పెద్ద నేరం కాబట్టి వెనిజులా ప్రెసిడెంట్ ను పట్టిచ్చిన వారికీ , ఆచూకీ తెలియచేసిన వారికీ 15 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ప్రకటించాడు . ఆ సమయంలోనే మదురో మీద నార్కోటిక్ యాక్ట్ కింద న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో చార్జిషీట్ పెట్టించాడు .

తర్వాత బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆ రివార్డ్ ను 50 మిలియన్ డాలర్లకు పెంచారు . రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ ఫైలును రీ ఓపెన్ చేసి నార్కోటిక్ టెర్రరిజం కింద ప్రత్యేక విభాగం కిందికి తీసుకువచ్చాడు .

అక్కడ్నుంచి ట్రంప్ పలుమార్లు వెనిజులా ప్రెసిడెంట్ కి వార్నింగ్ ఇచ్చాడు . గత కొద్దికాలం క్రితం వెనిజులా సముద్ర తీరం నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవలను యూఎస్ ఫోర్స్ పట్టుకుని నాశనం చేసాయి .

ఈ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి ప్రపంచ దేశాలకు , ముఖ్యంగా అమెరికాకు డ్రగ్స్ తరలింపులో వెనిజులా అధ్యక్షుడి ప్రమేయం కూడా ఉందని ఆధారాలతో సహా చెప్తూ మదురో ని లొంగిపొమ్మని హెచ్చరించాడు . అయినా మదురో వినకపోవడంతో వెనిజులా నుంచి వెళ్లే చమురు ట్యాంకర్లను సీజ్ చేసాడు .

ఇంతవరకు ట్రంప్ పక్కాగానే ప్లాన్ చేసాడు కదా ,

సో , వెనిజులా అధ్యక్షుడి మీద అమెరికన్ న్యాయ స్థానాల్లో ఛార్జ్ షీట్ దాఖలు అయ్యింది . అతడి తల మీద 50 మిలియన్ డాలర్ల వెల కట్టబడింది . డ్రగ్స్ కేసులో ఆయన్ని లొంగిపొమ్మని ట్రంప్ గత నెలలో ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు .

మదురో ఏం చేసాడు ?

ఇంత జరుగుతున్నా మదురో లైట్ తీసుకున్నాడు . ట్రంప్ వి ఉడుత బెదిరింపులు అనుకున్నాడు . తన మీద ఉచ్చు బిగిస్తుందని తెలిసిన ఏ దేశ అధ్యక్షుడైనా ముందు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడమో , అంతర్జాతీయ దేశాల మద్దతు తీసుకోవడమో చేయాలి .

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి కి , మదురో కి నాయకత్వంలో తేడా అదే . ఎప్పుడైతే రష్యా తన మీద వార్ మొదలుపెడుతుందని తెలిసిందో అప్పుడే క్షణం ఆలస్యం చేయకుండా ఆయన ప్రపంచ దేశాల మద్దతు తీసుకున్నాడు . అలా చేసాడు కాబట్టే కార్తీక దీపం సీరియల్ మాదిరి రష్యా యుద్ధం ఎపిసోడ్ల వారీగా నడుస్తుంది .

ప్రస్తుతానికి వస్తే మదురో ట్రంప్ తో రాజీ అయినా చేసుకోవాలి , యుద్ధానికైనా వెళ్ళాలి .

ఈ రెండూ చేయకుండా డాన్స్ చేసాడు
ఎస్ .. మీరు చదివింది కరెక్టే .

గత డిసెంబర్ నెలలో మదురో ని లొంగిపొమ్మని ట్రంప్ ట్వీట్ పెడితే దానికి రిప్లై గా మదురో వేడుకల్లో డాన్సులు చేస్తూ ,’ ప్రస్తుతం ప్రపంచానికి వార్ కాదు కావాల్సింది .. శాంతి ‘ అంటూ ఎగతాళి క్యాప్షన్ పెట్టాడు .

ఆ డాన్సులు చూసిన ట్రంప్ కి సరిగ్గా ఎక్కడ కాలాలో అక్కడ కాలింది . అయినప్పటికీ పెద్దమనిషి తరహాగా” మిస్టర్ మదురో .. వెంటనే లొంగిపో ” అని శనివారం ఉదయం కూడా ట్వీట్ పెట్టాడు .

కానీ మదురో పట్టించుకుంటేగా ,
తానో పెద్ద ముదురో అనుకున్నాడు . హాయిగా దుప్పటి ముసుగేసుకుని ఇంట్లో పడుకున్నాడు .

నేనిక్కడ నిద్ర మానుకుని అరిచి గీ పెడుతున్నా పట్టించుకోకుండా పడకేస్తాడా ? అని ట్రంప్ పిడికిలి బిగించి డెల్టా ఫోర్స్ కి కనుసైగ చేసాడు .

అంతే అర్ధరాత్రి మదురో ఇంటిమీద వాలిపోయి లేపుకొచ్చేసారు
పనిలో పనిగా ఆయన భార్యని కూడా బండి ఎక్కించారు . నిద్రమత్తు వదిలినతర్వాత కానీ మదురో కి చేతికి వేసిన బేడీలు కనిపించలేదు .

మాములుగా అయితే ఎంతైనా ఒక దేశానికి అధ్యక్షుడు కాబట్టి మదురో కి కొంత ప్రోటోకాల్ ఇవ్వాలి . కానీ ఈయన చేసిన డాన్స్ కళ్ళముందు కనిపించడంతో ట్రంప్ కి బిపి పెరిగిపోయి ప్రోటోకాల్ లేదు ఏం లేదు చైన్ వేసేసి లాక్కొచ్చేయండి అని ఆర్డర్ వేయడంతో ఆ రకంగా మదురో అమెరికా తీసుకురాబడ్డాడు .

పిక్స్ జాగ్రత్తగా గమనించి చూడండి . ఆయనకు దాహం వేసి వాటర్ బాటిల్ అడిగితే ఒక సైనికుడు గొలుసులున్న చేతికే బాటిల్ అందించాడే కానీ చైన్ బ్రేక్ చేసి ఇవ్వలేదు . సరే ఎట్టాగైతేనేమి మదురో ని అమెరికా తీసుకొచ్చి రాజకీయ ఖైదీలను ఉంచే సెల్ లో పడేసారు . ఆ తర్వాత కోర్టులు , విచారణలు మాములే .

అయితే ఈ ఎపిసోడ్ లో ఎవరికీ అర్ధం కానిది ఏంటంటే కేసులో ఛార్జ్ షీట్ పెట్టింది వెనిజులా ప్రెసిడెంట్ మదురో ఒక్కడిమీదే . అలాంటిది భార్యా సహితంగా ఆయన్ని ట్రంప్ అమెరికా ఎందుకు పట్టుకొచ్చాడనేది మిలియన్ డాలర్ల టారిఫ్ ప్రశ్న ?

సరే , ఇక్కడివరకు అమెరికన్ చట్టాల ప్రకారం మదురో ని యూఎస్ కోర్ట్ గుమ్మాలను తొక్కించాడు బానే ఉంది . ఇంత కష్టపడి , ఇంత ప్రయాస పడి , బోలెడు ఖర్చు పెట్టుకుని , 150 యుద్ధ విమానాలను , హెలికాఫ్టర్లను వాడింది కేవలం డ్రగ్ కేసు కోసమేనా ?

ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి .

వెనిజులాలో ఏం జరిగింది ?

కష్ట కాలంలో ఉన్నప్పుడు ప్రతి దేశంలోనూ ఓ విప్లవకారుడో , సంస్కరణవాదో పుట్టుకొస్తాడు . అలా ఓ పదేళ్ల క్రితం వెనిజులాలో కూడా హ్యూగో చావెజ్ రూపంలో ఓ సంస్కరణవాది ఉద్భవించాడు . అప్పటికే వెనిజులా ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతుంది . దీనికి తోడు కొండలా ఉండి ఎంతకీ తరగని ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి .

అది చాలదూ ,

ఇవాళ అగ్ర దేశాలు సైతం కొన్ని చిన్న చిన్న దేశాల మీద ఆధారపడుతున్నాయి అంటే క్రూడాయిల్ నిక్షేపాల వల్లనే కదా . ఆ చమురు నిక్షేపాలు ఇచ్చిన బలుపు తో చావెజ్ కూడా ‘మనదగ్గర ఇన్నన్ని ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి కదా .. వీటిల్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలు తక్కువ ధరకు కొనుక్కుని ప్రపంచ దేశాల్లో అమ్ముకుని లాభాలు గడుస్తున్నాయి.. కాబట్టి ఈ నిక్షేపాలను మనమే సొంతంగా వాడుకుని లాభాలను కూడా మనమే పంచుకుందాం ” అని ఓ కొత్త ఆలోచనకు నాంది పలికాడు .

ఈ ఎఫెక్ట్ అందరికన్నా ముందు అమెరికా మీద పడింది . డాలర్ కి , క్రూడాయిల్ కు ఉన్న ఇంటర్నల్ లింకుల వల్ల ఆర్థికంగా , వాణిజ్యపరంగా కూడా అమెరికాకి ఇది పెద్ద దెబ్బ అయ్యింది . దాంతో ఆ చావెజ్ కు నచ్చచెప్పడానికి అమెరికా అప్పట్లోనే ప్రయత్నించింది .

అయినా సరే ఆయన వినకుండా వచ్చిన లాభాలను నా ప్రజలకే పంచుతా అని ఉచితాలను అలవాటు చేసాడు . తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది అనే నానుడి మాదిరి ఉచితాల దెబ్బకు వెనిజులా కూడా ఢమాల్ అయ్యింది . చేసిన తప్పు తెలుసుకునేసరికి అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది .

ఆ చావెజ్ పోతూ పోతూ ఈ మదురో కి వారసత్వ బాధ్యతలు అప్పగించిపోయాడు . పోనీ నాయకత్వం మారింది కాబట్టి ఈయన ద్వారా ట్రై చేద్దామని యూఎస్ తిరిగి ప్రయత్నించింది . అయినా ఫలితం లేకపోవడంతో ఈయన్ని నిద్రలోనే లేపుకుపోయారు .

ఇప్పుడేం జరుగుతుంది ?

తమ ప్రెసిడెంటుని లేపుకుపోయారు అని తెలియగానే జనాలు ఆవేశంతో వీధుల్లోకి , అట్నుంచి వైట్ హౌస్ మీదికి వచ్చేస్తారని అనుకున్నాడు మదురో . కానీ ఊహించిన స్థాయిలో అలాంటి విప్లవాలు ఏమీ జరగకపోవడంతో ఖంగు తిన్నాడు .

ఈయన్ని లేపుకుపోయారని తెలిసిన వైస్ ప్రెసిడెంట్ ఒకామె తనని తాను వెనిజులాకి ప్రెసిడెంట్ గా ప్రకటించేసుకుని ట్రంప్ మీద పళ్ళు నూరింది . కానీ ట్రంప్ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే వాళ్ళిద్దర్నీ ఎత్తుకుపోయాడనే విషయం వీళ్ళకి తెలీదు .

అఖండ 2 మూవీలో దేశ ప్రతిపక్ష నాయకుడు ఒకడుంటాడు . ప్రధానిని దింపేసి తాను ఎప్పుడు పీఎం అవుదామా అని కాచుకుకూర్చుంటాడు .

ఆ ప్రతిపక్ష నాయకుడితో ‘ మా మాట వింటే నెక్స్ట్ నిన్నే పీఎం ను చేస్తాం’ అని చైనా తోలుబొమ్మలాట ఆడుతుంది . ఆ సినిమా చూశాడో ఏంటో ట్రంప్ కూడా సేమ్ అదే మాదిరి వెనిజులా ప్రతిపక్ష నాయకుడ్ని ఆల్రెడీ మోపు చేసేసాడు .

మళ్ళీ ఆయిల్ నిక్షేపాలు అన్నీ యూఎస్ కంట్రోల్ లోకి వెళ్తాయి . కోర్టులు , విచారణలు అంటూ మదురో అమెరికాలో అన్ని ప్రదేశాలు చుట్టి వస్తాడు . పక్కన భార్య కూడా ఉంది కాబట్టి ఆయనకు ఇబ్బందేం లేదు .

ముగింపు : ఆపరేషన్ వెనిజులా అయిపోయిన తర్వాత ట్రంప్ .. ఎలాన్ మస్క్ తో కలిసి హాయిగా పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాడు .

ఇప్పుడీ డిన్నర్ లో విశేషం ఏముంది ? ఎప్పుడూ వాళ్ళు చేసేదిగా అని మదురోలా తేలిగ్గా కొట్టిపడేయకండి .

ట్రంప్ స్వతహాగా వ్యాపారస్తుడు . లెక్కలు బాగా తెలిసినవాడు . ఆయన తీసుకునే నిర్ణయాలలో దేశాధ్యక్షుడి కోణంలో కన్నా వ్యాపారవేత్త కోణంలోనే ఎక్కువ ఉంటాయి . అందుకే తన పక్కన తోడుగా ఇంకో వ్యాపారస్తుడ్ని పెట్టుకున్నాడు .

ఆ వ్యాపారస్తుడికి ఇండియాలో కార్ల మార్కెట్ బిజినెస్ లో అనుకున్నంత షేర్ రాలేదు . కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇండియా అంటే పెద్దగా ఆబ్లిగేషన్ కూడా లేదు .

కడుపునిండా డిన్నర్ చేసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ” మోడీ నాకు మంచి మిత్రుడే కానీ వాణిజ్యం విషయంలో నా మాట వినడం లేదు .. ఇలా అయితే నేను హర్ట్ అవుతా .. హర్ట్ అయితే టారిఫ్లు పెరుగుతాయి ” అని పరోక్షముగా తన మన్ కి బాత్ చెప్పాడు .

దౌత్యపరంగా ఇదేదో ఆలోచించాల్సిన విషయమే !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!