80 ల్లో అన్ని భాషల్లో సినిమాలు కథా బలంతోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచేవి
రాన్రానూ కధలకు కొరతలు రావడంతో కొంతమంది గ్రాఫిక్కులను నమ్ముకుని సినిమాలు తీస్తుంటే , మరికొంతమంది దర్శకులు కథా లేదూ తొక్కా లేదూ అనుకుంటూ ఏదో ఒక తోచిన కథనంతో సినిమాలు తీసేస్తున్నారు
కానీ అతికొద్దిమంది మాత్రం ఏదో డిఫరెంట్ కథ తయారుచేశాం అని భ్రమ పడి ఇదిగో ఇలాంటి అక్యూజ్డ్ సినిమాలు తీస్తారు
కేవలం కథలో కొత్తదనం ఉంటే సరిపోదు
ఇండియన్ మార్కెట్లో జనాలకు ఇలాంటి కథలు ఎంతవరకు ఎక్కుతాయో ఆలోచించుకోవాలి
పోనీ సినిమాలో విమెన్ ఎంపవర్మెంట్ లాంటి గొప్ప గొప్ప సందేశాలు ఉన్నాయా ? అంటే అవీ లేవు
పైగా సినిమా తీసింది మహిళా దర్శకురాలు
ముందు ముందు మేము ఇలాంటి కథలతో కూడా మీ ముందుకు వస్తాం అన్నట్టుగా శాంపిల్ తీసి వదిలింది
హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటే పాత కథ
హీరోయిన్ , హీరోయిన్లు ప్రేమించుకుంటే నేటి మేటి బ్లాక్ బస్టర్ కథ
అదే అక్యూజ్డ్ మూవీ కథ
అర్థమైందిగా,
అయినా సరే అదేంటో ఈ మూవీకి నెట్ ఫ్లిక్స్ ఓటిటీ లో కూడా మంచి రేటింగ్ వచ్చిందట
స్ట్రైట్ హిందీ మూవీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది
ఇంతకీ కధేంటో చూద్దాం ?
డాక్టర్ గీతికా సేన్ (కొంకణా సేన్ శర్మ ) డాక్టర్ మీరా ( ప్రతిభా రాంటా ) లు సహజీవనం చేస్తుంటారు
డాక్టర్ మీరా ఓ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తూ ఉంటుంది
డాక్టర్ గీతికా ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదాలో ఉంటుంది
ఈ ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో కాపురం చేస్తుంటారు
పిల్లలకోసం ఎవరైనా బేబీని దత్తత తీసుకుందామని కూడా ప్లాన్ చేసుకుంటారు
మరోపక్క డాక్టర్ గీతిక డీన్ ప్రమోషన్ లిస్టులో కూడా ఉంటుంది
ఈ పరిస్థితుల్లో గీతిక మహిళా పేషేంట్ల మీద , జూనియర్ డాక్టర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతుందని హాస్పిటల్ యాజమాన్యానికి కంప్లైంట్లు వస్తాయి
తాను ఎవరి మీదా లైంగిక వేధింపులకు పాల్పడలేదని , ఎవరో కావాలని తన మీద కుట్ర చేస్తున్నారని గీతిక వాదిస్తుంది
అయినా సరే ఆమె ప్రమోషన్ ఆగిపోతుంది
గీతిక వ్యవహారంలో నిజానిజాలు వెలికితీయడానికి హాస్పిటల్ బోర్డు ఇండిపెండెంట్ జర్నలిస్టుని అప్పాయింట్ చేస్తుంది
డాక్టర్ గీతిక నిజంగానే మహిళా పేషేంట్ల మీద , జూనియర్ డాక్టర్ల మీద లైంగిక వేధింపులు చేసిందా ?
గీతిక మీద వరుస కంప్లైంట్లు ఎవరు పెడుతున్నారు ?
ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గీతిక వ్యవహారంలో నిజానిజాలు వెలికి తీసాడా ?
గీతిక మీద వచ్చిన లైంగిక ఆరోపణల గురించి తెలుసుకున్న ఆమెతో సహజీవనం చేస్తున్న మీరా ఏం చేస్తుంది ? అనేది మిగతా కథనంలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
కథ చదివారుగా ,
అసలు ఈ సినిమాలో కథ గురించి పెద్దగా బుర్ర బద్దలుకొట్టుకోవడానికి ఏమీ లేదు
రొటీన్ హీరో హీరోయిన్ల కథకు చిన్న చిన్న మార్పులు చేస్తే అక్యూజ్డ్ సినిమా పుట్టుకొస్తుంది
మాములుగా సినిమాలో హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్ళిచేసుకుంటే అది రొటీన్ కథ అవుతుంది
అదే ఇద్దరు హీరోయిన్లు ప్రేమించి పెళ్ళిచేసుకుంటే అది అక్యూజ్డ్ సినిమా అవుతుంది
ఇప్పుడు రొటీన్ కథలో చిన్న మార్పుల సంగతి ఏంటో చెప్పుకుందాం
సప్పొజ్ హీరో గారు ప్రేమించిన హీరోయిన్ క్యారక్టర్ను బద్నాం చేస్తూ ఓ విలన్ గారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అనుకోండి
అప్పుడేం జరుగుతుంది ?
ఆ ప్రచారాలు చూసీ చూసీ హీరోయిన్ క్యారక్టర్ నిజంగా బ్యాడేమో అని హీరోగారు అనుమానపడే అవకాశాలు ఉన్నాయి కదా ?
మళ్ళీ అప్పుడేం జరుగుతుంది ?
ఇందులో ఎంతవరకు నిజముందో అని హీరో గారు స్వయంగా ఎంక్వైరీ చేస్తారు కదా?
ఆ ఎంక్వైరీలో హీరోయిన్ మంచిదనీన్ను , విలన్ గారు కావాలని ఆమె క్యారక్టర్ బద్నాం చేసాడని తెలుసుకుని అతడికి బుద్ది చెప్తాడు
క్లైమాక్సులో హీరో హీరోయిన్లు చెట్టాపట్టాలు వేసుకుని అలా వెళ్తారు
దాంతో కథ సుఖాంతం అవుతుంది
ఇప్పుడు హీరో స్థానంలో ఇంకో హీరోయిన్ను ఊహించుకోండి
అదెలా కుదురుతుంది?
ఇద్దరూ ఆడవాళ్లే కదా అనుకుంటున్నారా ?
ఆడవాళ్లు అయితేనేమి పెళ్లి చేసుకోకూడదా ? సహా జీవనం చేయకూడదా ? లెస్బియన్లు కాకూడదా ? అన్న రకరకాల పాయింట్లను సుదీర్ఘంగా ఆలోచించుకుని పేపర్ మీద ముందే రాసుకుని మరీ దర్శకురాలు అక్యూజ్డ్ సినిమా తీసింది
తెలివైన పనేంటంటే,
ఇలాంటి లెస్బియన్ కధలను ఇక్కడ ఎంతవరకు ఆదరిస్తారో అని ముందే అనుమానపడి లండన్ నేపథ్యంలో సినిమా చిత్రీకరించారు
అక్కడ ఇలాంటివి కామన్ కాబట్టి గొడవ లేదు
ఇక్కడ కూడా అక్కడక్కడా ఉన్నా , పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత బలంగా పాతుకుపోలేదు
సరే ఆ విషయం ఎలా ఉన్నా ,
దర్శకురాలు ఇద్దరు ఆడవాళ్ళతో కొత్త ప్రయోగం చేసింది
చేస్తే చేసింది
కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది
ఎంతసేపూ ఈ ఆడవాళ్లు ఇద్దరే కనిపిస్తారు
మిగిలిన పాత్రలను నామమాత్రం చేసేసారు
డీన్ ప్రమోషన్ లిస్టులో ఉన్న లేడీ డాక్టర్ గీతిక మీద ఎవరో అజ్ఞాత వ్యక్తి హాస్పిటల్ బోర్డు కి మెయిల్స్ ద్వారా కంప్లైంట్ చేస్తాడు
గీతిక ఆల్రెడీ మీరా అనే ఇంకో లేడీ డాక్టర్ తో రిలేషన్ లో ఉంటుంది . దానికి తోడు ఆమె గతంలో ఇంకో లేడీ సోఫియాతో కూడా రిలేషన్లో ఉండేదని చెప్తారు
కాబట్టి మహిళా పేషేంట్ల మీద ఆమె లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మాట నిజమే అని ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడానికి దర్శకురాలు కొన్ని సన్నివేశాలను ఎస్టాబ్లిష్ చేసుకుని చూపించడం వరకు ఓకే
ఇంతా చేసి ఆ అక్యూజ్డ్ ఎవరో అనేది క్లైమాక్సులో సింపుల్గా తేల్చేసి తుస్సుమనిపించారు
రెండు గంటల క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఇంత సింపుల్ ఎండింగ్ చూసి చాలామంది వీక్ హృదయాలు తట్టుకోలేరు
ఇంకేవన్నా ట్విస్టులు ఉంటాయేమో అని చివరివరకు ఆశగా చూసిన ప్రేక్షకులు ఆశ నిరాశ ఆయే అంటూ దేవదాసు పాటలు పాడుకుని బయటపడాల్సిందే
కష్టపడి సినిమా మొత్తం చూస్తే ఇదేదో లండన్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ల వ్యవహారంలో తీసిన డాక్యుమెంటరీగా అనిపిస్తుందే కానీ పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనిపించదు
ఎవరెలా చేసారు ?
కథ సంగతి ఎలా ఉన్నా ఇందులో నటించినవారిని తప్పుపట్టడానికి లేదు
డాక్టర్ గీతికా సేన్ పాత్రలో నటించిన కొంకణా సేన్ శర్మ అండ్ మీరా పాత్రలో నటించిన ప్రతిభా రాంటా లు యథాశక్తి నటించారు
మిగిలిన పాత్రలు పోషించిన వారిలో చెప్పుకోదగిన విషయం ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు
సాంకేతికత
సాంకేతికత గురించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు
సినిమా మూడొంతులు నాలుగు గోడల మధ్యే నడుస్తుంది
కాస్త రోడ్డుమీదకొచ్చి లండన్ అందాలను చూపించినా ప్రేక్షకుడు మధ్యలో కాసేపు రిలాక్స్ అయ్యేవాడు
సంగీతం యావరేజ్
సినిమా కోసం పెద్దగా ఖర్చు చేయలేదు కాబట్టి నిర్మాణ విలువలు కూడా అలాగే ఉన్నాయి
విశ్లేషణ
ఇద్దరి ఆడవాళ్ళ (లెస్బియన్ల ) మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు . మితిమీరిన వయొలెన్స్ , మోతాదు మించిన అశ్లీలత లేకపోయినప్పటికీ కథా వస్తువు వల్ల ఫ్యామిలీతో కలిసి ఇంట్లో చూడటానికి కొంచం ఇబ్బందిగానే ఉంటుంది
నటీనటులు : కొంకణా సేన్ శర్మ , ప్రతిభా రాంటా తదితరులు
దర్శకురాలు :అనుభూతి కాశ్యప్
విడుదల : 27-2-2026
నెట్ ఫ్లిక్స్ ఓటిటీ (తెలుగు )
రేటింగ్ : 1.5 / 5
