ఇది హనీ కాదు ‘ హాని ‘ .. ఈ హనీ చాలా డేంజర్ గురూ – హనీ మూవీ రివ్యూ

Spread the love

సినిమా టైటిల్ చూస్తే హనీ అని ఉంది.. హనీ అని చదవగానే మనకు చాలా (క)హనీలు గుర్తుకొస్తాయి.. ముందుగా తెలుగులో తేనె అన్న విషయం మనకు చప్పున గుర్తుకొస్తుంది . తేనె పేరు తల్చుకోగానే మనసు తియ్యగా అయిపోతుంది .

తెనెలొలికే తియ్యనైన పలుకులు అంటూ మన ప్రాచీన కవులు తమ వర్ణనలలో తేనె యొక్క మధురిమని గుర్తు చేస్తారు . లేటెస్ట్ కుర్ర కవులు ప్రియురాలి అధరాల మీద తేనె ఒలకబోసి కవిత్వాలు రాసేస్తారు .

రోజూ టీవీల్లో ఆరోగ్య పాఠాలు చెప్పే మంతెన లాంటి వారు తేనె గురించి ఎన్నో సార్లు చెప్పారు . రామ్ దేవ్ బాబా అయితే పతంజలి తేనె వాడండి ..పరిగెత్తండి అని తాను పరిగెడుతూ యాడ్లు కూడా ఇస్తుంటారు ( డీ మార్టులో అందరూ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తారు కానీ ఈయన మాత్రం ఇవ్వడు ) .

ఇంకా లేటెస్ట్ కాలంలోకి వస్తే అవేవో హనీ ట్రాప్ అంట దేశ రహస్యాలు కూడా అమ్మేస్తున్నారు.. చూసారా ఒక్క హనీ ఎన్ని రకాలుగా ఫేమస్సో . సరే ఈ హనీల సంగతి అలా ఉంచితే నవీన్ చంద్ర నటించిన హనీ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిందంటేనూ ఈ హనీ ఎలాంటి హనీ అయ్యుంటుందో అని ఓ లుక్కేసా .

పైగా నవీన్ చంద్ర తేనె నాకుతున్నవాడికి మల్లే నాలుక బయటపెట్టాడు .. ఏ మాటకామాటే చెప్పాలి.. ఇప్పుడున్న నటులలో నవీన్ చంద్ర కూడా చక్కటి నటుడు . విభిన్న పాత్రలను పోషించి తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ఏర్పాటుచేసుకున్నాడు . హీరోగా కూడా చక్కటి పాత్రలు చేసాడు . కానీ అదేంటో కానీ నవీన్ విలన్ పాత్రల్లో భలే సెట్ అవుతున్నాడు .

అందువలన ఈ హనీని కూడా రుచి చూడవలెనని నిశ్చయించుకుని ప్రైమ్ క్లిక్కితిని.. సినిమా చూసిన పిమ్మట టైటిల్ హనీ కాదు’ హాని ‘ అని పెట్టాల్సింది అనిపించింది . మూఢ నమ్మకాలు సొంత కుటుంబాలకే కాదు సమాజానికీ ఎలా ‘ హాని ‘ చేస్తాయో చాలా క్లారిటీగా ,ఉన్నది ఉన్నట్టుగా , హృద్యంగా , ఆలోచింపచేసేలా చెప్పారు .

ఇప్పుడు కధేంటో చూద్దాం

ఆనంద్ ( నవీన్ చంద్ర ) భార్య లలిత (దివ్య పిళ్ళై ) కూతురు మీరా (జయన్ని) , ఒక చిన్న కుటుంబం . ఆనంద్ కి వేపకాయంత వెర్రి లేకపోతే వీళ్ళ జీవితాలు నిజంగా హనీలానే తియ్యగా ఉండేది . పోనీ వెర్రి అయినా ఎలాగోలా సర్దుబాటు చేసుకోవచ్చు . కానీ మూఢ నమ్మకాలు అన్న జబ్బుబారిన పడినవాడికి చికిత్స చేయడానికి ప్రపంచంలోనే వైద్యం లేదు . ఈ ఆనంద్ కూడా అటువంటి మూఢ నమ్మకాల పిచ్చిలో పడతాడు . కష్టపడి ఉద్యోగం చేసుకుని సంపాదించుకోవడం స్థానంలో ఈజీ మనీ సంపాదించాలనే ఆలోచన బయలుదేరుతుంది . తంత్ర పూజల ద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవచ్చని కలలు కంటాడు .

కలలు కంటే కన్నాడు .. ఆ కలలను నిజం చేసుకోవడానికి తాను పనిచేసే ఆఫీసులో కూడా నిమ్మకాయలు , ఎండు మిరపకాయలు లాంటివి పెడుతూ ఉంటాడు . ఇతడి ప్రవర్తన చూసి తోటి ఉద్యోగులు దేహ శుద్ధి చేసి ఇంటికి పంపేస్తారు . భార్య లలిత ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ జాబ్ చేస్తున్నప్పటికీ ఆమె సంపాదన ఇంటి అవసరాలకు సరిపడకపోవడంతో అతడ్ని ఏదైనా మంచి ఉద్యోగంలో స్థిరపడమని పోరుతుంది .

కానీ అతడి ఆలోచన వేరు.. తాంత్రిక విద్యలు నేర్చుకుని నర బలులు ఇచ్చి కోటీశ్వరుడ్ని అయిపోతానని చెప్తుంటాడు.. ఈ తాంత్రిక విద్యలు నేర్పటానికి అతడికి సారంగపాణి ( రాజా రవీంద్ర ) సాయం చేస్తూ పిల్లి మాయ అనే దందాలోకి దించుతాడు .

ఆనంద్ మూఢ నమ్మకాల వల్ల అతడి భార్య , కూతురు ఎటువంటి ఇబ్బందులు పడతారు ? తాంత్రిక పూజలు చేసి ఆనంద్ తన లక్ష్యాన్ని సాధించుకుంటాడా ? ఈ సమస్యకు ముగింపు ఏంటి ? అనేది మిగతా కథలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

సినిమా కోసం రాసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు.. నిజ జీవితంలో రోజూ మనం చూస్తున్నవే , వింటున్నవే..నిజానికి సమాజంలో మన చుట్టూనే నేటికీ ఇలాంటి ఆనంద్ లు ఎంతోమంది ఉన్నారు .

అందుకే సినిమా టైటిల్స్ ప్రారంభంలోనే మూఢ నమ్మకాలకు కూతుర్ని బలి ఇచ్చిన తండ్రి అంటూ మనం రోజూ న్యూస్ పేపర్లలో చూసే వార్తలనే చూపించారు . మనుషులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి కొంతమంది మంత్ర పూజలను ఆశ్రయిస్తే , మరికొంతమంది తంత్ర పూజలను ఆశ్రయిస్తున్నారు . ఈ రెండిటికీ రాళ్లు కొట్టి సంపాదించినదానికీ , రాళ్లు విసిరి సంపాదించినదానికీ ఉన్నంత తేడా ఉంది.. వీటిలో క్షుద్ర పూజలు ప్రమాదకరమైనవి .

రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులు అయిపోవాలన్నా , గుప్త నిధులు దొరకాలన్నా , శత్రువులను నిర్మూలించాలన్నా క్షుద్ర పూజలతో తేలిగ్గా పనైపోతుంది అనుకునే కొన్ని మూఢ నమ్మకాలు నేటి సమాజంలో ఇప్పటికీ ఉన్నాయి . మూఢ నమ్మకాల వల్ల కుటుంబాలకూ , సమాజానికీ కలిగే హాని గురించి ఏ ప్రవచనాకారుడో చెప్పితే జనాలకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు . అదే విషయాన్ని ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే కొందరైనా ఆలోచిస్తారు .

ఈ సినిమా తియ్యడం ద్వారా దర్శక నిర్మాతల ఆలోచన అదే అయ్యుంటుంది . ఎందుకంటే ఈ మూవీలో ఎటువంటి కమ్మర్షియల్ హంగులు లేవు . ఐటెం సాంగులు , హీరో ,హీరోయిన్ల రొమాన్సులు , వెకిలి కామెడీలు , గాల్లో కొట్టుకోవడాలు లేవు .

అన్నీ నేల మీదే ఉంటాయి .. వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఇలాంటి సినిమాల గురించి నలుగురికీ చెప్తే చాలు .

భర్త మూఢ నమ్మకం వల్ల బంగారు భవిష్యత్తు ఉన్న కూతురి జీవితం ఎలా నాశనమైందో కళ్ళకు కట్టినట్టు చూపించారు .. ఆనంద్ గురించి ఏమీ తెలుసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తన జీవితం ఎలా నాశనమైందో అని భార్య లలిత పడిన ఆవేదనను హృద్యంగా చూపించారు .

ముగింపులో లలిత స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చిన మహిళా జడ్జి కూడా ఆమె బాధ విని కన్నీరు పెట్టుకోవడం ప్రేక్షకులకు కూడా కన్నీరు తెప్పిస్తుంది . మూఢ నమ్మకాల కోసం ఆనంద్ చేసే పనులను చూస్తుంటే మనకే ఛీ అనిపిస్తుంది . ఒక్కోసారి వామ్మో అని కూడా అనిపిస్తుంది .

అలా అనిపిస్తేనే సినిమా తీసిన ఉద్దేశ్యానికి సఫలత లభించినట్టు.. ఆ విషయంలో దర్శకుడు విజయం సాధించినట్టే .

ఎవరెలా చేసారు ?

ఈ ఆనంద్ ( నవీన్ చంద్ర ) ఉన్నాడే ..ఒక్కోసారి చూస్తే మెంటలోడా ఏంటి అనిపిస్తుంది . ఇంకొన్ని చోట్ల రేయ్ దుర్మార్గుడా అని అరవాలనిపిస్తుంది . క్లైమాక్సులో భార్య అతడ్ని బాదుతుంటే అస్సలు జాలి వేయదు . ఇలాంటోడ్ని ఇంకో నాలుగు పీకాలి అన్నంత కోపం వస్తుంది .ప్రతి సన్నివేశంలోనూ అతడి ముఖం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంటుంది .

ఒక నటుడికి ఇంతకన్నా ఏమి కావాలి ?
నవీన్ చంద్ర తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు .

ఇక ఆనంద్ భార్య లలితగా నటించిన దివ్య పిళ్ళై నటనకు క్లైమాక్స్ హృదయాలను టచ్ చేస్తుంది. భర్త మూఢ నమ్మకాల వల్ల ఇబ్బందులు పడే సాధారణ ఇల్లాలిగా , కూతురు భవిష్యత్తు కోసం బెంగ పడే తల్లిగా చక్కటి పెర్ఫార్మన్స్ ప్రదర్శించింది .

వీళ్ళ కూతురిగా నటించిన మీరా (జయన్ని) నటన కూడా తక్కువేమీ కాదు
సన్నివేశాలకు తగ్గట్టుగా ముఖంలో భావాలను బాగా పలికించింది .

సారంగపాణి పాత్రలో రాజా రవీంద్ర ఒదిగిపోయాడు .
రవణ పాత్రలో దివి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

సాంకేతికత :

అజయ్ అరసాడ అందించిన సంగీతం పర్లేదు .
నిజానికి ఇటువంటి హర్రర్ నేపధ్యం ఉన్న సినిమాకి ఇంకాస్త బీట్ అవసరం. నగేష్ బన్నెల్ అందించిన సినిమాటోగ్రఫీ యావరేజ్ .

దర్శకుడు కరుణ్ కుమార్ వాస్తవ సంఘటనకు అతిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించారు .

విశ్లేషణ : మాములుగా నరబలులు , క్షుద్రపూజలూ కధాంశం గా ఉన్న సినిమాలు కొంతవరకు ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటాయి . హనీ లో అలా భయపెట్టే సన్నివేశాలు పెద్దగా ఏమీ లేవు . పిల్లి మాయ పేరుతో తాడు కు వేలాడగట్టడం వంటి సన్నివేశాలు చూస్తుంటే కంపరం పుట్టిస్తాయే కానీ భయపెట్టవు. కాబట్టి సినిమా చూడటానికి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు . సాధారణంగా ఇలాంటి సినిమాల్లో మితిమీరిన వయొలెన్స్ , అశ్లీలత , మేకలు కోయడం , నర బలులు ఇవ్వడం ,రక్తం ఏరులై పారడాలు ఉంటాయి . కానీ ఇందులో అలాంటి సన్నివేశాలేమీ లేవు (దివితో ఆనంద్ అఫైర్ మినహా ) కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు .

నటీనటులు : నవీన్ చంద్ర , దివ్య పిళ్ళై , జయన్ని , రాజారవీంద్ర , దివి తదితరులు
దర్శకత్వం : కరుణాకర్
విడుదల : అమెజాన్ ప్రైమ్ ఓటిటీ
రేటింగ్ : 2 .5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!