అందాల తార రేఖ ఈ రోజు 71 సంవత్సరాలు పూర్తిచేసుకుని 72 లో అడుగుపెడుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా ?
ఇప్పటికీ రేఖను చూసినవారెవరూ ఆమె వయసును నమ్మలేరు
బాలీవుడ్ మ్యాగజైన్లు తమ కవర్ పేజీ లో రేఖ ఫోటో వేయడానికి ఇప్పటికీ ఎగబడతారు
అలా అని ఈ అందాల తార పుట్టుకతో గోల్డ్ స్పూన్ పట్టుకుని పుట్టలేదు
అసలు తన పుట్టుక గురించే ఎన్నో అవమానాలు పడింది
సినిమా కెరీర్ ప్రారంభంలోనే బాడీ షేమింగ్ ను ఎదుర్కొంది
ఆమె పుట్టుక గురించి ఇంటాబయటా ఎన్నో హేళనలు విని తట్టుకుంది
సుప్రసిద్ధ తమిళ నటుడు జెమినీ గణేశన్ కు తల్లి పుష్పవల్లికి వివాహ బంధం లేకుండానే పుట్టిన పిల్ల రేఖ
రేఖ తన కూతురని జెమినీ గణేశన్ బయటి ప్రపంచానికి చెప్పకపోవడంతో రేఖ బాల్యమంతా తండ్రి ఎవరో తెలియని దుస్థితిలోనే గడిచిపోయింది
తల్లి పుష్పవల్లి కూడా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది కానీ ఆమెకు పెద్దగా కలిసిరాలేదు
దానితో తన కూతురును సినిమాల్లో దింపాలని ప్రయత్నించింది
కానీ జెమినీ భయానికి రేఖకు కూడా అవకాశాలు రాలేదు
దానితో కుటుంబం గడవటానికి ఎలాగైనా రేఖను సినిమాల్లోకి పంపాలని నిశ్చయించుకుని తన చెల్లిని తోడుగా ఇచ్చి ఆమెను ముంబై పంపింది తల్లి
అప్పటికి రేఖ వయసు 14 ఏళ్ళు
ముంబై .. తెలియని ఊరు .. అంతా కొత్త .. బెంబేలెత్తిపోయింది
రేఖను చూసిన ముంబై సినీ ఇండస్ట్రీ పెద్దలు లావుగా నల్లగా ఉన్న నీకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలా ? అద్దంలో చూసుకున్నావా ? అంటూ యెగతాళి చేసారు
ఎలాగోలా ప్రయత్నాలు చేస్తే 1970 లో సావన్ భాదో అనే సినిమాలో నవీన్ నిశ్చల్ అనే హీరో పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది
లోకల్ మ్యాగజైన్స్ అన్నీ రేఖ ఫోటోలు ప్రచురించి బాడీ షేమింగ్ చేస్తూ ఆర్టికల్స్ రాశాయి
అసలు ధైర్యం చేసి ఈ నల్లమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్న నిర్మాత గొప్పవాడు అంటూ ఎగతాళిగా ఏవేవో రాసారు
రేఖ అవేమీ పట్టించుకోలేదు
వచ్చిన డబ్బులలో కొంత తల్లికి పంపించి కొంత తను ఉంచుకుంది
తండ్రి సాయం లేదు .. తల్లికి రేఖ తప్పితే వేరే సాయం లేదు
ఇలాంటి పరిస్థితుల్లో రేఖ ముంబైలోని ప్రతి ఒక్క స్టూడియో చుట్టూ తిరిగింది
కొంతకాలానికి రేఖ కు జితేంద్ర సరసన నటించే అవకాశం వచ్చింది
ఆ పరిచయంతో జితేంద్రను తన జీవిత భాగస్వామిగా ఉహించుకుంది
కానీ జితేంద్ర వేరే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడంతో మొదటిసారి రేఖ ప్రేమ ఫెయిల్ అయ్యింది
ఆ తర్వాత ఆమె వినోద్ మెహ్రాకు దగ్గరైంది
కానీ వినోద్ మెహరా కూడా ఆమె ప్రేమను అంగీకరించకపోవడంతో రేఖ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి
ఈ పరిస్థితుల్లో 1976 లో అమితాబ్ తో కలిసి దో అంజానే సినిమాలో నటించడంతో రేఖ జీవితమే మారిపోయింది
కెరీర్ మొదట్లో అమితాబ్ ఫేస్ చేసిన బాడీ షేమింగ్ ల గురించి తెలుసుకుంది
అవేమీ పట్టించుకోకుండా ఎవరైతే తనని ఎగతాళి చేసారో వాళ్లనే తన కాల్షీట్ల కోసం పడిగాపులు కాసే పరిస్థితికి తీసుకువచ్చిన అతడి స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుంది
అక్కడ్నుంచి ఆమె అమితాబ్ ఇచ్చిన ప్రతి సలహాను పాటించింది
యెంత సాన్నిహిత్యం ఉన్నా కూడా అమితాబ్ ను పేరు పెట్టి పిలిచేది కాదు .. అమితాబ్ గురించి మాట్లాడాల్సివస్తే వారు అని కానీ ఆయన అని కానీ గౌరవంగా సంబోధిస్తుంది
అమితాబ్ .. రేఖలు ఎన్నో సినిమాల్లో హిట్ పెయిర్ గా నిలిచారు
అమితాబ్ తో పరిచయం తర్వాతనే రేఖ తనను తాను మార్చుకుంది
ఏరోబిక్స్ , ఇతర వ్యాయామాలతో దేహాన్ని నాజూగ్గా చేసుకుంది
ప్రత్యేకంగా మేకప్ కోర్స్ చేసి కొత్త ఫ్యాషన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది
దానితో ఎవరైతే హేళన చేసారో ఆ మ్యాగజైన్లే రేఖ ఫోటోను కవర్ పేజీ లో వేయడానికి ఎగబడ్డారు
దీనితో రేఖలో జీవితంలో ఏదైనా సాదించగలను అనే ఆత్మవిశ్వాసం పెరిగింది
ఇదిలా ఉండగా దురదృస్టవశాత్తు ప్రేమలో ఫెయిల్ అయిన రేఖ పెళ్ళిలో కూడా ఫెయిల్ అయ్యింది
జీవితంలో సెటిల్ అవ్వాలని 1990 లో ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ముఖేష్ అగర్వాల్ ను పెళ్లిచేసుకుంది రేఖ
అయితే వివాహం జరిగిన 7 నెలలకే ముఖేష్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకోవడంతో రేఖ జీవితం వివాదాస్పదం అయ్యింది
దీనితో రేఖ విమర్శల పాలయ్యింది
పెళ్ళికి ముందే ఆమెకు చాలామందితో రిలేషన్ ఉండటంతో ఆవిడే ముఖేష్ చావుకి కారణమని కొన్ని మ్యాగజైన్స్ లో స్టోరీలు కూడా రాసారు
అయితే వీటన్నిటికీ రేఖ తర్వాత వివరణ ఇచ్చింది
తాము హనీమూన్ కి లండన్ వెళ్ళినప్పుడు అతడిలో కొన్ని మానసిక సమస్యలు గుర్తించానని చెప్పారు
తాను సినిమాల్లో నటించడం అతడికి ఇష్టం లేదని , అందుకే సినిమాలు మానేసి ఇంటిపట్టునే ఉండాలని శాసించేవాడు
దానితో తాము విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నామని ఆమె చెప్పారు
అలా రేఖ తన జీవితంలో ప్రేమలోనూ , పెళ్లిలోనూ విఫలమైన మనిషిగా మిగిలిపోయింది
అయినా రేఖ ఇవేమీ పట్టించుకోలేదు
ఆమె జీవితంలో కోరుకున్నది ఒక్కటే
జెమినీ గణేశన్ అందరిలో తాను ఆయన కూతురని ప్రకటించాలని
అయితే రేఖ కోరుకున్న రోజు కూడా తర్వాతి కాలంలో వచ్చింది
1993 లో జెమినీ గణేశన్ కు చెన్నైలో ఫిలిం ఫేర్ అవార్డు ప్రధానం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి
అయితే ఈ అవార్డును తన కూతురు చేతుల మీదుగా ఇప్పిస్తున్నారని ఆయనకు కూడా తెలీదు
రేఖ ఈ అవార్డు జెమినీ గణేశన్ కు ప్రధానం చేస్తారు అని మైకులో వినిపించగానే ఆయన కళ్ళల్లో నీరు ఉబికి వచ్చింది
వెంటనే మైకు అందుకుని ఈ అవార్డు నా కూతురి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని జెమినీ గణేశన్ అందరి ముందు ప్రకటించడంతో రేఖ వెక్కి వెక్కి ఏడ్చింది
తండ్రి ఎవరో చెప్పుకోలేని ఆమె వేదనకు ఆ రోజుతో తెర పడింది
జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను , ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కున్న రేఖకు పూర్తిస్థాయిలో మానసిక సాంత్వన కలిగింది మాత్రం ఆ రోజే
రేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు !
