1980 లలో పింగళి దశరథ రామ్ మొదలెట్టిన ఎన్కౌంటర్ మ్యాగజైన్ వంద కాపీలతో మొదలై చిరకాలంలోనే 5 లక్షల కాపీల సర్క్యులేషన్ కు చేరింది . సర్క్క్యులేషన్ తో పాటు అతనికి శత్రువులు కూడా పెరిగారు . ఆ రోజుల్లో అనతికాలంలో ఐదు లక్షల సర్క్యులేషన్ సాధించడం అంటే గొప్ప విషయమే . అదికూడా వెనుకాముందు ఎటువంటి అండదండలు , ఆర్థిక వనరులు లేని ఒక 25 ఏళ్ళ కుర్రాడు సాధించడం అంటే గొప్ప విషయమే . అతడు రాసే భాష మీద కొందరికి అభ్యంతరాలు ఉన్నా , అసలు విషయం సూటిగా రాసే అతడి తెగువకు పాఠకులు పెరిగారు . స్కూల్ పిల్లలనుంచి రిటైర్ అయిన పెద్దవాళ్ళ వరకు ఎన్కౌంటర్ మ్యాగజైన్ రెగ్యులర్ గా చదివే పాఠకులే .
అంతెందుకు మ్యాగజైన్ కాపీలు అయిపోతే విజయవాడ నుంచి మంగళగిరి , తెనాలి వంటి ప్రాంతాలకు వెళ్లి కొనుక్కుని మరీ చదివిన పాఠకులు కూడా ఉన్నారు . దశరథ రామ్ ఎవరో ? ఎలా ఉంటాడో ? ఎక్కడ ఉంటాడో చాలామందికి తెలీదు . కానీ అతడి మ్యాగజైన్ పేరు చెప్తే మాత్రం చప్పున గుర్తుపడతారు . అందరి ఆశ్చర్యం ఒకటే ..పెద్దపెద్ద మ్యాగజైన్లు కూడా రాయటానికి సాహసం చేయని బడా రాజకీయ నాయకుల చీకటి భాగోతాలను ఈ కుర్రాడు అంత ధైర్యంగా ఎలా బయటపెట్టగలుగుతున్నాడు ? ఏం చూసుకుని ఇతడికి ఇంత గుండె ధైర్యం వచ్చింది ? అందరి మదిలో ప్రశ్నలే ? కానీ ఇతడు మాత్రం రాయడమే నా సమాధానం అన్నట్టుగా రాసుకుంటూపోయేవాడు . పోనీ అలా అని నేటి కొంతమంది ఎర్నలిస్టుల మాదిరి ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసి హాయిగా నాలుగురాళ్లు వెనకేసుకొని కాలం వెళ్లదీశాడా ? అంటే అదీలేదు .
ఆ రాజకీయ పార్టీ .. ఈ రాజకీయ పార్టీ అని లేదు . తప్పు దొరికితే ఎంతటి నాయకుడైనా ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ లోకి ఎక్కాల్సిందే . దీనితో అన్ని పార్టీల్లో అతడికి శత్రువులు పెరిగిపోయారు . దాదాపు ప్రతి రాజకీయ పార్టీ హిట్ లిస్టులో అతడున్నాడు .
ఎన్కౌంటర్ మ్యాగజైన్ లో రాతలు ఆపేయాలని ఓ రాజకీయ పార్టీ నాయకులు అతడి ఇంటికొచ్చి లక్షల రూపాయలు క్యాష్ తీసుకొచ్చి బల్ల మీద పెడితే తీసుకోకుండా విసిరికొట్టాడు . ఓ మాజీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి బ్రహ్మాండమైన ‘ ఆఫర్ ను ‘ ఇస్తే కాలి గోటితో తిరస్కరించాడు . ఆ డబ్బులు తీసుకుని ఉంటేనో .. ఆ మాజీ ముఖ్యమంత్రి ఆఫర్ కు ఒప్పుకుంటేనో దశరథ రామ్ జీవితం వేరుగా ఉండేది . 29 ఏళ్లకే ముగిసిపోయేది కాదు .
చాలామందికి దశరథ రామ్ రాసే భాష మీద అభ్యంతరాలు ఉన్నాయి . నాక్కూడా అనిపించేది కానీ జర్నలిస్టులమని చెప్పుకుంటూ సంస్కారవంతమైన భాష వాడుతూ ఎర్నలిస్టుల అవతారం ఎత్తిన కొంతమందిని చూసిన తర్వాత భాష విషయం ఎలా ఉన్నా రూపాయికి ఆశించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన దశరథ రామ్ లో గొప్ప జర్నలిస్ట్ కనిపించాడు . చక్కటి భాష వాడుతూ ఇష్టమైన రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగే చాలామంది తలపండిన ఎర్నలిస్టులకన్నా , నమ్మిన ఆశయం కోసం ఉన్న విషయాన్ని కటువుగా అయినాసరే సూటిగా రాసే ఈ కుర్రాడు నయం కాదూ .
ఏదో ఒక రాజకీయ పార్టీ పాదాల ముందు అతడు సాష్టాంగ పడి ఉంటే రిక్షాలో బదులు ఖరీదైన కార్లలో తిరిగేవాడు . కార్ల సంగతి అలా ఉంచితే కనీసం సొంత బైక్ కూడా లేదు .
ఏదో ఒక పార్టీకి గట్టిగా బాకా ఊదితే ఓ న్యూస్ ఛానెల్ కి సీఈఓ అయ్యేవాడేమో? . ఏదో ఒక అధికార పార్టీ నాయకుడి బూట్లు నాకితే మీడియా అకాడమీ ఛైర్మన్ హోదాలో ప్రభుత్వ భత్యాలు తీసుకుంటూ దర్జాగా బతికేసేవాడేమో? అధికార పార్టీ సలహాదారుడిగానో , ప్రభుత్వ సలహాదారుడిగానో లక్షల్లో భత్యాలు తీసుకుంటూ విలాసవంతమైన భోగాలు అనుభవించేవాడేమో? నేటి కొంతమంది ఎర్నలిస్టుల మాదిరి అవేమీ చేయడం రాని అర్భక జర్నలిస్ట్ పింగళి దశరథ రామ్ .
నాలుగు రాతలు రాసుకుంటూ పోయాడే కానీ నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే ఆలోచన చేయలేకపోయిన ఆవేశపరుడు దశరథ రామ్ . పోనీ తాతలు , తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయా ? అంటే అవీ లేవు .
జాతీయ పతాక రూపశిల్పి ఈయన తాత పింగళి వెంకయ్య గారే ఆర్థిక ఇబ్బందులతో పాకలో దుర్భర జీవనం గడిపారు . దశరథ రామ్ తండ్రి , పింగళి వెంకయ్య గారి చిన్న కొడుకు అయిన చలపతి రావు గారు కూడా దేశం మీద పిచ్చి ప్రేమతో సైన్యంలో చేరి అక్కడే అసువులు బాసారు . అందరూ దేశ భక్తులే , దేశం కోసం ఏదైనా చెయ్యాలనే తపన ఉన్నవాళ్లే .
అలాగే పిన్న వయసులోనే దశరథ రామ్ మీద జయప్రకాశ్ నారాయణ్ ప్రభావం పడింది. ఇందిర విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు ఆందోళన చేసి జైలుకి కూడా వెళ్ళాడు . అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటంతో ఓ హోటల్లో వెయిటర్ గా కొంతకాలం పనిచేసాడు . కేవలం కుటుంబం గడవటం కోసం వెయిటర్ ఉద్యోగం చేరాడే కానీ ఇది నీ ప్రవృత్తికి సరైనది కాదని అతడి జేబులోని కలం పోరు పెట్టింది . అతడిలో దాగివున్న జర్నలిస్ట్ అంతర్మథనంలో పడ్డాడు .
ఆ సమయంలో వినుకొండ నాగరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న కాగడా మ్యాగజైన్ దశరథ రామ్ దృష్టిని ఆకర్శించింది . వెంటనే అక్కడ జేరిపోయాడు . కాగడా ఎక్కువగా సినిమా గాసిప్స్ రాసేది . అప్పట్లోనే ఆ మ్యాగజైన్ కూడా పాపులర్ అయ్యింది . పేరుకు తగ్గట్టుగా కాగడా పెట్టి వెతికి మరీ సినీ పరిశ్రమలో జరుగుతున్న తెరవెనుక భాగోతాలను బయటపెట్టేది. ఆ మ్యాగజైన్ పాలిటిక్స్ మీద తక్కువ ఫోకస్ పెట్టేది . కానీ రాజకీయ నాయకుల అవినీతిని ఎండగట్టడమే దశరథ రామ్ టార్గెట్ అవడంతో అక్కడ్నుంచి బయటికి వచ్చి సొంతంగా ఎన్కౌంటర్ మ్యాగజైన్ పెట్టాడు . కాగడాలో పనిచేసిన అనుభవం అతడికి కలిసివచ్చింది .
సాదాసీదా గా మొదలైన ఎన్కౌంటర్ మ్యాగజైన్ అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. మ్యాగజైన్ సంచిక మార్కెట్లోకి వస్తుందంటే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. సంచలన మ్యాగజైన్ల మార్కెట్లో కొత్త అధ్యాయం మొదలైంది .
పింగళి దశరథ రామ్ జీవితంలో ఆఖరి రోజు
ఆ రోజు అక్టోబర్ 21 , 1985 వ సంవత్సరం సాయంత్రం . వేరే ఊరి నుంచి వచ్చిన మిత్రుడిని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వస్తానని సత్యనారాయణ పురంలోని ఇంటినుంచి బయలుదేరాడు పింగళి దశరథ రామ్ . కానీ ఆ రోజే తనకి చివరి రోజని ఆ క్షణాన అతడికి తెలియదు . యధాప్రకారంగా తాను ఎప్పుడూ వెళ్లే రిక్షాలోనే బస్ స్టాండుకి వెళ్లి మిత్రుడికి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు .అప్పటికే దుండగులు తనని అంతం చేయడానికి ఫాలో అవుతున్నారని దశరథ రామ్ పసిగట్టలేకపోయాడు . ఇంటినుంచి అతడు బస్ స్టాండ్ చేరుకునేలోపు హత్య చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు . కానీ రోడ్ల మీద జనసంచారం ఉండటంతో దుండగులు నిశ్శబ్దంగా అతడ్ని ఫాలో అయ్యారు .
రాత్రి 7.30 – 8 గంటల మధ్యలో రిక్షా సత్యనారాయణ పురంలోని గిరి వీధి మలుపుకు రాగానే దశరథ రామ్ కు స్పాట్ పెట్టడానికి అదే సరైన ప్లేస్ అని నిర్ణయించుకున్నారు . ఎందుకంటె ఆ మలుపు చీకటిగా ఉండటమే కాకుండా జనసంచారం కూడా తక్కువగా ఉంటుంది . అందుకే చీకట్లో మాటువేసి ఉన్న నలుగురు ఆగంతకులు దశరథ రామ్ ను అటకాయించి ఒకటి కాదు రెండు కాదు కత్తితో ఆ బక్క ప్రాణిని 22 పోట్లు పొడిచారు . ఎంత వేగంగా పొడిచారో అంతే వేగంగా చీకట్లో మాయమైపోయారు .
క్షణాల్లో వార్త ఊరంతా తెలిసిపోయింది . నెత్తురోడుతున్న దశరథ రామ్ ను అదే రిక్షాలో దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు . రిక్షా పోలీస్ స్టేషన్ బయటనే ఆగింది . అప్పటికే అక్కడ జనం పోగయ్యారు . నెత్తుటి మడుగులో దశరథ రామ్ కనిపించడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించండి అని పోలీసులను ప్రాధేయపడ్డారు . అంబులెన్సుకు కబురు పెట్టాం , రాగానే తీసుకెళతాం అనేది పోలీసుల సమాధానం .
గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్సు వచ్చేసరికి దశరథ రామ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి . ఆ రకంగా ఎన్కౌంటర్ పింగళి దశరథ రామ్ జీవితం 29 ఏళ్లకే ముగిసిపోయింది. రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలపై అలుపెరుగని పోరాటం చేసిన ఓ యువ జర్నలిస్ట్ జీవితం రిక్షాలోనే ముగిసింది .
పింగళి దశరథ రామ్ హత్యపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలు చేసాయి . ఈ హత్యపై న్యాయవిచారణ జరిపించాలని పోలీస్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాయి . అంతిమంగా ప్రభుత్వం మీద కూడా వత్తిడి పెరిగింది . పోలీసులు హడావుడిగా దర్యాప్తు చేసి పింగళి దశరథ రామ్ హత్య వ్యాపార తగాదాలు అని తేల్చి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు కోర్టుకు అప్పచెప్పి చేతులు దులుపుకున్నారు . ఈ కేసులోతమకు న్యాయం జరగాలని పింగళి దశరథ రామ్ భార్య న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసారు . కానీ దురదృష్టం ఏంటంటే పింగళి దశరథ రామ్ ఎప్పుడూ వెళ్లే రిక్షా పుల్లర్ కూడా చీకట్లో దుండగుల ముఖాలను సరిగా చూడలేదని , కాబట్టి నిందితులను గుర్తు పట్టలేకపోతున్నాని కోర్టులో సాక్ష్యం చెప్పడంతో ఆరేళ్ళ తర్వాత సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టివేయబడింది . ఏది ఏమైనా ఇన్నేళ్లు అయినా పింగళి దశరథ రామ్ ను , అలాగే ఎన్కౌంటర్ మ్యాగజైన్ ను అభిమానించే పాఠకులు ఇప్పటికీ ఉన్నారు .
ఫైల్ ఫోటో : దశరథ రామ్ పార్థివ దేహం ( ఫోటో క్రెడిట్స్ ఇంటర్నెట్ డెస్క్ )
(ఈ ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ , ఫేస్ బుక్ ఐకాన్ల ద్వారా షేర్ చేయొచ్చు )
