బోయపాటి , బాలయ్య కాంబోలో సినిమాలంటే అభిమానులకు అదో క్రేజు . విడుదలకు ముందే భారీ అంచనాలు పెట్టేసుకుంటారు
ఎందుకంటే బాలయ్యని బోయపాటి వాడినంతగా బహుశా మరే ఇతర దర్శకుడు వాడుకోలేదేమో
బాలయ్యతో హీరో , హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు , ఫ్యామిలీ సినిమాలు , నాలుగు పాటలు .. ఆరు కుస్తీ ఫైట్లతో సింపుల్ గా తీస్తే జనాలకు ఎక్కదని అందరికంటే ముందు క్యాచ్ చేసినవాడు బోయపాటి
అంతే సింహాతో అప్పటిదాకా వెండితెర మీద కనిపించే బాలయ్య ఎంట్రీ ఎలివేషన్ల తీరే మార్చేశాడు
తొడ కొడితే సుమోలు గాల్లోకి లేచే కొత్త ట్రెండ్ సృష్టించాడు
బాలయ్య అడుగేస్తే ఇసుక తుఫానులు , సముద్ర సునామీలు సృష్టించాడు
పీక కోస్తా , అడ్డంగా నరుకుతా వంటి ‘పదునైన’ డైలాగులు చెప్పించాడు
అంతే సింపుల్గా ఈ ఫార్ములా వాడి హీరో బాలకృష్ణ స్థానంలో నట విశ్వరూప బాలయ్యని
తెర మీదకు తీసుకొచ్చాడు
ఫార్ములా వర్కౌట్ అయ్యింది . అభిమానులకు పూనకాలు వచ్చాయి
సింహ నుంచి అఖండ వరకు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త బాలయ్యని పరిచయం చేసాడు
మళ్ళీ ఇందులో కూడా మిగిలిన సినిమాలు ఒక రేంజు . అఖండ ఇంకో రేంజు
సాంఘిక పాత్రల్లో ఆయన్ని చూపిస్తూనే మానవాతీత శక్తులున్న పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య చేత పరకాయ ప్రవేశం చేయించాడు
అఖండలో సరికొత్తగా అఘోరా గెటప్లో ఆయన్ని చూసిన అభిమానులు మూవీని బ్లాక్ బస్టర్ చేసారు
అందుకే ఈ కాంబో అంటే అభిమానులకు అంత క్రేజు
అదే అంచనాలు అఖండ 2 మీద కూడా పెట్టుకున్నారు
అయితే డిసెంబర్ 5 న విడుదల కావాల్సిన సినిమా న్యాయపరమైన లిటిగేషన్ వల్ల వాయిదా పడి డిసెంబర్ 12 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది
మరి ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకుందా?
మొదటిభాగానికి సీక్వెల్ గా వచ్చిన రెండో భాగం కూడా ప్రేక్షకుల మెప్పు పొందిందా ? లేదా ? అనేది సమీక్షిద్దాం
కధేంటంటే :
ఇండో – చైనా వార్ నేపథ్యంలో కథ మొదలౌతుంది
అంతకుముందు అఖండ మొదటి భాగం హైలెట్స్ ఫాస్ట్ ఫార్వార్డ్ మోషన్లో చూపిస్తారు .ఒక రకంగా ఈ ఆలోచన బావుంది . నేరుగా రెండో భాగంలోకి వెళ్లిపోకుండా ఓల్డ్ స్టోరీ హైలెట్స్ చూపించడంతో కొత్తగా వచ్చిన ప్రేక్షకులకు సీక్వెల్ ఇంట్రడక్షన్ అర్ధమౌతుంది
సరే ఇండో – చైనా వార్ లో చైనా ఆర్మీ జనరల్ కుమారుడు మరణించడంతో అతడు ఇండియా మీద పగ పడతాడు
మరోపక్క దేశంలో అల్లర్లు సృష్టించి భారత ప్రధానిని పదవీచ్యుతుణ్ణి చేసి తాను అధికార పీఠం ఎక్కాలని ప్రతిపక్ష నాయకుడు ఠాకూర్ ( కబీర్ దుల్షన్ సింగ్ ) కుట్రలు చేస్తూ ఉంటాడు
అందుకే ఎలాగైనా ఇండియాని నాశనం చేయాలనుకున్న చైనా ఆర్మీ జనరల్ ఇక్కడి ప్రతిపక్ష నాయకుడు ఠాకూర్ ( కబీర్ దుల్షన్ సింగ్ ) తో కలిసి ప్లాన్ చేస్తాడు
ఇద్దరూ కలిసి దేవుడిపై భారతీయులకు ఉన్న బలమైన నమ్మకం మీద దెబ్బ కొట్టాలని కుట్ర పన్నుతారు
ఇందుకు కుంభమేళాను టార్గెట్ చేసుకుంటారు
అందులో భాగంగా భక్తులు , సాధువులు స్నానమాచరించే గంగా నదిలో ప్రాణాంతకమైన కెమికల్ కలిపిస్తారు
దీంతో నదిలో స్నానమాచరించిన భక్తులు కుప్పకూలిపోతారు
ఇది అదనుగా తీసుకుని ప్రతిపక్ష నేత ఠాకూర్ దేవుడనే వాడు ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదంటూ రాద్ధాంతం చేస్తాడు
ఇంకోవైపు డిఆర్డిఓ లో శాస్త్ర వేత్తగా పనిచేస్తున్న అనంతపురం ఎమ్మెల్యే బాల మురళి కృష్ణ కూతురు జనని (హర్షాలీ మల్హోత్రా) భక్తులకు వచ్చిన రోగానికి విరుగుడుగా వాక్సిన్ కనిపెడుతుంది
ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ ఆమెను చంపటానికి ప్రయత్నాలు చేస్తాడు
జనని వారికి దొరక్కుండా తప్పించుకుని పారిపోతుంది
సరిగ్గా ఈ సమయంలో హిమాలయాల్లో ఉన్న అఖండ రంగ ప్రవేశం చేస్తాడు
ఆ తర్వాతేమ్ జరుగుతుంది ?
తప్పించుకుని పోయిన జనని దొరుకుతుందా ?
చైనా ఆర్మీ జనరల్ దుర్మార్గాలను అఖండ ఎలా ఎదుర్కొంటాడు ?
అనంతపురం ఎమ్మెల్యేకి , అఖండకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ? అనేవి మిగతా కధలో తెలుస్తుంది
సినిమా ఎలా ఉంది ?
సినిమా ఎలా ఉందో చెప్పాలంటే ముందు లాజిక్కులు గురించి మాట్లాడుకోవడం ఆపెయ్యాలి
ఎందుకంటే అవి వెతికితే సినిమా చాలామందికి పెద్దగా గతకదు
అవి లేకుండా బోయపాటి మ్యాజిక్ అనుకుని చూస్తే టికెట్ కి మనం పెట్టిన డబ్బులు గుర్తుకు రావు
అయినా ఈ రివ్యూలో లాజిక్కులు , మ్యాజిక్కులు రెండిటిగురించీ చెప్పుకుందాం
మూవీలో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి
అనంతపురం ఎమ్మెల్యే బాల మురళి కృష్ణ గా రెగ్యులర్ పాత్రలో బాలయ్య మనకి కనిపిస్తే అఘోరా పాత్రలో ఆయన అఖండ తాండవం కనిపిస్తుంది
సాధారణంగా అభిమానులు బాలయ్య నుంచి రెండో పాత్రనే ఆశిస్తారు
ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కంటే ఒక అఘోరాకున్న పవర్ అటువంటిది
పైగా ఆ అఘోరాకి బోయపాటి విచ్చలవిడిగా శక్తులు ఇచ్చినప్పుడు ఏమౌతుంది ?
అఖండ తాండవం అవుతుంది
ఆ మహోగ్ర తాండవం చూస్తే అభిమానులకు ఏమొస్తుంది ?
పూనకాలు వస్తాయి
అఖండ 2 లో అదే జరిగింది
దర్శకుడు బోయపాటి కోరుకుంది ఇదేకదా
బాలయ్య అభిమానులూ కోరుకుంది అదేకదా
పైగా టీజర్లోనే బాలయ్య చెప్పేసాడు
ఈ మూవీ కోసం తాను ఆత్మ పెట్టి పనిచేశానని
స్వతహాగా జాతకాలను నమ్మటంతో పాటు దైవ భక్తిపరుడు అయిన బాలయ్య ఆ ఈవెంట్లో మాట్లాడుతూ తనకు సూట్ అయ్యే క్యారెక్టర్ లభించడం అదృష్టమని , అందుకే ఈ సినిమా అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పారు
కాబట్టి ఆయన చెప్పినట్టుగానే అభిమానులకు ఈ మూవీ నచ్చుతుంది
ఇక అభిమానాలను పక్కనబెట్టి సామాన్య ప్రేక్షకుడి దృష్టి కోణంలో చూద్దాం
వీళ్ళకి మ్యాజిక్కులతో పని లేదు
ప్రతి సన్నివేశంలో లాజిక్కులు చూస్తారు
అఖండ వందలాది ఫిరంగులతో ఉన్న చైనా ఆర్మీ మధ్యలోకి ఒంటిచేత్తో త్రిశూలం పట్టుకుని వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు . అదే ఆయుధంతో హెలికాఫ్టర్ రెక్కలు పట్టుకుని ఆపుతాడు. ఒకేసారి పదిమందిని త్రిశూలంతో పైకి లేపి గాల్లో గిరగిరా తిప్పి విసురుతాడు చూశారూ.. ఇందులో మనం లాజిక్కులు వెతుకుతామని బోయపాటికి ఆ మాత్రం తెలీదా ?
అందుకే ఆ పాత్రకు మానవాతీత శక్తులు ఇచ్చాడు
ముందే చెప్పినట్టు సినిమాని సినిమాగా చూస్తే ఈ సన్నివేశాలన్నీ గూస్ బంప్స్ తెప్పించేవే
దానికి తోడు తమన్ బీజీఎమ్ తోడయి , బాలయ్య డైలాగులు మర ఫిరంగుల్లా పేలుతుంటే అభిమానులకు నిలువెత్తు తాండవమే కనిపిస్తుంది
సరే ఈయనకి మానవాతీత శక్తులు ఉన్నాయి కాబట్టి కొంత కన్విన్సింగ్ గానే ఉంది
అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్న బాల మురళి కృష్ణకు కూడా భారీ ఎలివేషన్ ఇచ్చే ప్రక్రియలో చిన్న చిన్న దోషాలు దొర్లాయి
తన నియోజక వర్గంలో గంజాయి బ్యాచ్ వాళ్ళు కొంతమంది అధికారులను కిడ్నాప్ చేస్తే వాళ్లతో ఫైటింగ్ చేయడానికి ఎమ్మెల్యే స్వయంగా బయలుదేరుతాడు
విషయం పెద్దదిగా చూపడానికి కిడ్నాప్ అయినవాళ్లలో పోలీసు అధికారులను కూడా పెట్టడం , డైరెక్ట్ పీఎంఓ నుంచి ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాల గురించి ఫోన్ రావడం కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది
ఇక మూవీ ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు బావున్నాయి
ప్రథమార్థంలో ఇంటర్వెల్ ముందు దాకా మాములు సినిమా చూస్తున్నట్టు అనిపించినా రెండో భాగంలో అఖండ తాండవంతో అభిమానులను ఒక్కసారిగా హై వోల్టేజ్ లోకి తీసుకెళ్లాడు
ఆది పినిశెట్టి పోషించిన తాంత్రికుడి ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి కానీ ఆ పాత్రపైన ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే ఇంకా బాగుండేది
హనుమాన్ , శివుడు , సనాతన ధర్మం , హైందవం మొదలైన వాటి ప్రాముఖ్యం పెంచే విధంగా తీసిన సన్నివేశాలు బాగున్నాయి
చైనా వార్ , ప్రధాని , ప్రతిపక్ష నేత రాజకీయాలను చూస్తున్నప్పుడు ఎందుకో కరెంట్ అఫైర్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది
బహుశా దర్శకుడు ప్రెజెంట్ సినారియోలో సనాతన ధర్మానికి , రాజకీయాలకు లింక్ చేస్తూ సన్నివేశాలు అల్లుకున్నట్టున్నారు
ఎవరెలా చేసారంటే :
అఖండ 2 లో ఎవరెలా చేసారంటే ఇద్దరి గురించి ముందుగా చెప్పుకోవాలి
అనంతపురం ఎమ్మెల్యే బాల మురళి కృష్ణ గా , అఘోరాగా పోషించిన రెండు పాత్రల్లో రెండోదానికే బాలయ్యకి ఎక్కువ మార్కులు పడతాయి
ఎందుకంటే రెండో పాత్రలో ఉన్న పవర్ అటువంటిది
బాలయ్యకు సరిగ్గా మ్యాచ్ అయ్యే క్యారక్టర్ అది
టీజర్లో చెప్పినట్టుగానే అఖండ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసారు
ఆ ఆహార్యం , డైలాగ్ డెలివరీ ఫిట్ అయ్యాయి
బహుశా ఇంకెవరైనా చేసినా ఈ ఫీల్ రాదేమో ?
హీరోయిన్ సంయుక్త గురించి చెప్పుకోవాలంటే హీరో పక్కన తప్పదు కాబట్టి తీసుకొచ్చి పెట్టినట్టున్నారు
ఏదో జాజికాయ పాత్రలో మెరిపించి మమ అనిపించారు
ఎమ్మెల్యే కూతురిగా నటించిన హర్షాలీ నటన బావుంది
కథాపరంగా కూడా స్కోప్ ఉన్న పాత్ర
ఆ చైనా ఆర్మీ జనరల్ ,ఇండియా ప్రతిపక్ష నాయకుడు ,ఇలా ఇద్దరు , ముగ్గురు విలన్లు ఉన్నప్పటికీ వీళ్లందరిలోకి ఆది పినిశెట్టి నటనే బావుందనిపిస్తుంది
సాంకేతికంగా ఎలా ఉంది ?
టెక్నికల్ విషయాల గురించి చెప్పుకోవాలంటే ముందు తమన్ బీజీఎమ్ గురించే చెప్పుకోవాలి
ఎందుకంటే రుద్ర తాండవానికి మ్యూజిక్కే ప్రాణం
జాజికాయ మినహా పాటలు యావరేజ్
శ్లోకాలు మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి
కధలో భాగంగా చక్కటి విజువల్స్ చూపించిన రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ బావుంది
ఖర్చుకు వెనకాడకుండా తీశారు కాబట్టి నిర్మాణ విలువలు కూడా బావున్నాయి
ఓవరాల్ గా లాజిక్కులు వెతక్కుండా మ్యాజిక్కులు చూడాలనుకునేవారికి సినిమా నచ్చుతుంది
నటీనటులు : నందమూరి బాలకృష్ణ , సంయుక్త , ఆది పినిశెట్టి , హర్షాలీ , తదితరులు
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ : సి రామ్ ప్రసాద్
నిర్మాతలు : రామ్ ఆచంట , గోపి ఆచంట
దర్శకత్వం : బోయపాటి శ్రీను
విడుదల : 12 -12 – 2025
రేటింగ్ : 3 / 5
