లడ్డులో ‘నెయ్యి’ లేదు .. దుపట్టాలో ‘పట్టు’ లేదు.. అసలు టిటిడిలో ఏం జరుగుతుంది ?

Spread the love

గత కొన్ని సంవత్సరాల నుంచి టీటీడీ అక్రమార్కులకు నిలయం అయిపోతుంది అన్న సంగతి వార్తల్లో చూస్తూనే ఉన్నాం . ఇదే విషయం మీద ప్రభుత్వాలను ప్రశ్నిస్తే నేరం నాది కాదు గత పాలకులది అనే సమాధానం వస్తుంది .

డాలర్ నుంచి పరకామణి నోట్ల వరకు
లడ్డు నెయ్యి నుంచి పట్టు దుపట్టా వరకు
బ్రేక్ దర్శనాల నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్లాక్ టికెట్ల వరకు
స్వామి ఆభరణాల నుంచి మాన్యాల వరకు

ఒకటా రెండా
ఎక్కడ చూసినా అవినీతి , అక్రమాలే ,

తరచి చూస్తే రోజుకో స్కాం బయటపడుతుంది
కేసులు , విచారణలు షరా మాములే .

అత్యంత ధనిక హిందూ ఆలయంలో అక్రమార్కులందరూ చేరి అందినకాడికి దోచుకుపోతున్నారు. ఏం చేసినా ఆ స్వామి తమను ఏమీ చేయలేడని ఎంత ధైర్యం ? ధనిక ఆలయం సంగతి అటుంచితే కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోవడం లేదా ?

తోటకూర నాడే అన్న సామెతలా మొదటి స్కాం దొరికినప్పుడే కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని వరుస దోపిడీలు జరిగేవా ? ఒకదానివెంట ఒకటి ఏళ్లకు ఏళ్ళు కొత్త మోసాలు బయటపడుతున్నాయి .

టిటిడి అంటే నలుగురు సిబ్బందితో నడిపించే చిన్న కార్యాలయం కాదు . అదొక పెద్ద వ్యవస్థ. దీనికింద ఐఏఎస్ ఆఫీసర్లు మొదలుకుని అటెండర్ల వరకు వందలాదిమంది సిబ్బంది పనిచేస్తున్నారు . సాధారణ పరిపాలన కాకుండా పోలీస్ , విజిలెన్సు సేవలు కూడా ఉంటాయి .

వీరు కాకుండా రాజకీయ పునరావాసం పొందిన నిరుద్యోగులు ట్రస్ట్ బోర్డు లో ఎలానూ ఉన్నారు
వీరందరిపైన ప్రభుత్వ అజమాయిషీ కూడా ఉంది . ఇంతమంది సిబ్బంది , ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న టిటిడిలో రోజుకో అవినీతి , అక్రమాలు బయటికి వస్తుంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు ?

ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వ హయాంలోనే దోపిడీలు జరిగాయని చిల్లర స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం మినహా ఇంతవరకు నేరగాళ్లకు శిక్షలు పడ్డ కేసులు ఎన్ని ? ఇప్పుడు జరిగిన పట్టు స్కాం ని గత ప్రభుత్వం మీద నెట్టేయడానికి కూడా వీలు లేకుండా రెండు ప్రభుత్వాల హయం నుంచి గత పదేళ్లుగా నిక్షేపంగా జరుగుతూనే ఉంది . పదేళ్ళబట్టి మోసం జరుగుతూనే ఉన్నా ఇప్పటివరకు విజిలెన్సు ఎందుకు పసిగట్టలేకపోయింది ?

దోషులు ఎవరు ? తెర వెనుక వారికి అండగా నిలబడుతున్న పెద్ద మనుషులు ఎవరు ?
అన్నీ జవాబు దొరకని ప్రశ్నలే ?

ఇంతకీ ఈ పట్టు స్కాం కధేంటి ?

దేవాలయానికి విరాళాలు ఇచ్చిన దాతలకు , ప్రముఖులకు , పండితులకు వేద ఆశీర్వచనం సమయంలో పట్టు వస్త్రాలతో సన్మానం చేయడం టిటిడిలో అనాదిగా జరుగుతున్న సంప్రదాయం. ఈ దుపట్టాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారుచేసి ఉండాలి .

ఇందుకుగాను పట్టువస్త్రాలు తయారుచేసే కంపెనీలకు టెండర్లు పిలవడం ద్వారా టిటిడి ఆర్డర్ ఇస్తుంది . పదేళ్ల క్రితం చిత్తూరు జిల్లా నగరికి చెందిన విఎస్ఆర్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ టెండర్ దక్కించుకుని టిటిడికి పట్టు వస్త్రం ఒక్కింటికి షుమారు 1400 రూపాయలకు సరఫరా చేసేట్టు అగ్రిమెంట్ కుదుర్చుకుంది .

అయితే టెండర్ నిబంధనల ప్రకారం దుపట్టాలు మేలు రకం మల్బరీ పట్టుతోనే తయారుచేయాలి
దానిమీద తప్పనిసరిగా సిల్క్ మార్క్ హాలోగ్రామ్ ఉండాలి . శాలువా 180 గ్రాముల బరువుతో ఉండి ఓం నమో వెంకటేశాయ అనే నామం కనిపించేలా ఎంబ్రాయిడరీ చేయించాలి . అదే విధంగా అందిస్తామని ఒప్పుకుని 2015 నుంచి ఆ సంస్థ టిటిడికి పట్టు వస్త్రాలు సరఫరా చేస్తూ వస్తుంది .

మోసం ఎలా బయటపడింది ?

దొరికితేనే దొంగలు ..లేకపోతే దొరలు అన్న చందంగా ఈ సంస్థ పదేళ్ళబట్టి యథేచ్ఛగా దోపిడీ చేస్తుంది . సాధారణంగా తయారీ యూనిట్ నుంచి టిటిడి గోదాములకు దుపట్టాలు వచ్చినప్పుడు టిటిడి అధికారులు వాటిలోనుంచి శాంపిల్ తీసి కంచి లోని సిల్క్ ల్యాబ్ లో పరీక్షలు చేస్తారు .

ఆ ల్యాబ్ నుంచి ఈ దుపట్టాలు వంద శాతం మల్బరీ పట్టుతోనే తయారైందని సర్టిఫికెట్ వస్తేనే బిల్లు అవుతుంది . గత పదేళ్ళబట్టి టిటిడి ప్రతి శాంపిల్ ను కంచి ల్యాబ్ కి పంపడం , వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మల్బరీ దుపట్టాలు అని సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూనే ఉంది . క్రమం తప్పకుండా నాణ్యతా సర్టిఫికెట్లు వస్తుండటంతో మరో ఆలోచన లేకుండా అదే కంపెనీకి ఆర్డర్లు ఇస్తూ వచ్చారు .

అయితే ఎందుకో విజిలెన్సు అధికారులకు అనుమానం వచ్చి శాంపిల్ ను ఎప్పుడూ పంపే కంచి ల్యాబ్ కు కాకుండా బెంగుళూరు ల్యాబ్ కి పంపారు . అక్కడ వారికి షాకింగ్ న్యూస్ తెలిసింది .

ఈ దుపట్టాలు మల్బరీ తో తయారవడం సంగతి అటుంచి నాసి రకం పాలిస్టర్ తో తయారు చేస్తున్నట్టు గుర్తించారు . అంటే వంద రూపాయలు కూడా ఖరీదు చేయని పాలిస్టర్ దుపట్టాలను మేలు రకం మల్బరీ పట్టుగా చూపించి ఇన్నేళ్లు గుట్టుగా 54 కోట్లు దోపిడీ చేసేసారు .

విషయం తెలుసుకున్న టిటిడి చైర్మన్ కూడా అవాక్కయ్యారు . వెంటనే సదరు కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులను కోరారు .

సరే విఎస్ఆర్ కంపెనీ దోపిడీ భాగోతం ఇప్పటికైనా వెలుగులోకి వచ్చింది .
అయితే ఇక్కడ స్వామి భక్తులకు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి .

సాధారణంగా టెండర్ నిబంధనలలో సదరు కాంట్రాక్టు ఏడాది వరకు మాత్రమే ఉండేటట్లు అగ్రిమెంట్లు ఉంటాయి . పెర్ఫార్మన్స్ బాగుంటే ఇంకో ఏడాది పెంచుకోవచ్చు . అలా గరిష్టంగా మూడేళ్ళ కాలపరిమితి ఉంటుంది . అలాంటిది గత పదేళ్ల బట్టి ఇదే కంపెనీ ఆర్డర్లు ఎలా పొందగలుగుతుంది ?

మార్కెట్ రేటు ప్రకారం చూసుకున్నా కంపెనీ సరఫరా చేస్తున్న రేటు తక్కువేమీ కాదు
మరి అధిక ధర పెట్టి ఇదే కంపెనీలో దుపట్టాలు కొనేంత ప్రేమ ఎవరికి ఉంది ?

ఈ కంపెనీ కేవలం టిటిడినే మోసం చేయలేదు
కోట్లాది మంది భక్తుల మనోభావాలను మోసం చేసింది .

ఇన్నాళ్లు స్వామి వారి బహుమతిగా తాము పొందిన శాలువాలు నాసిరకంవి అని తెలిసిన దాతల మనసులు ఎలా ఉంటాయి ?

గతంలో బయటపడ్డ స్కాముల్లో కొత్తగా ఇంకోటి చేరింది
ఇది కూడా విచారణలకు వెళ్తుంది .

ఈ సందర్భంగా ఇప్పటివరకు టిటిడిలో బయటపడ్డ దోపిడీల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
ఎందుకంటే విచారణల తీరు ఏ విధంగా ఉందో కొంత తెలుస్తుంది

డాలర్ స్కాం

స్వామివారి పేరుమీద తయారుచేయబడిన బంగారు లాకెట్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని అప్పట్లో టిటిడి విజిలెన్సు కేసులు నమోదు చేసింది .

కల్తీ నెయ్యి కేసు

తిరుమల అనగానే ప్రతి ఒక్క భక్తుడికి స్వామి వారి లడ్డు ప్రసాదం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. తిరుమలని మనసులో ఎంత పవిత్రంగా భావించుకుంటారో స్వామి వారి లడ్డుని కూడా భక్తులు అంతే పవిత్రంగా భావించుకుంటారు . తరతరాలుగా భక్తులకి తిరుమల లడ్డు ఒక ఎమోషన్ , ఒక కనెక్షన్ .

ఆ ప్రసాదం నోట్లో పడగానే ఏదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది
ఇదంతా మూడు దశాబ్దాల కిందటిమాట . అలాంటి స్వామివారి లడ్డు ప్రసాదంలో కూడా అక్రమార్కులు కల్తీ చేసారు .

ముందు లడ్డులో నాసి రకం నెయ్యి వాడారు అనుకున్నారు . తర్వాత నెయ్యి కల్తీ చేసారని తెలిసింది . విచారణలో అది అసలు నెయ్యే కాదని సింథటిక్ రసాయనాలు వాడారని తెలిసింది .

ఇది దుర్మార్గానికి పరాకాష్ట . క్షమించరాని నేరం . ఒకేఒక్క తప్పుతో కోట్లాదిమంది భక్తుల హృదయాలను గాయపర్చారు . ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుంది .

పరకామణి కేసు

భక్తులు స్వామివారికి హుండీలో సమర్పించిన కానుకలను పరకామణిలో లెక్కిస్తారు . ఈ లెక్కింపుకి వచ్చే వ్యక్తులు కేవలం బనీను , పంచెలతో మాత్రమే రావాలి . అంతేకాదు లెక్కింపు వ్యవహారం మొత్తం సిసి కెమెరాల్లో రికార్డ్ అవుతుంది .

అలా ఓ రోజు విజిలెన్సు సిబ్బంది చేసిన తనిఖీల్లో రవి కుమార్ అనే గుమస్తా పట్టుబడ్డాడు . ఇతడు 900 డాలర్లను దొంగతనం చేసి తన పంచె లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాచుకుని వెళ్లబోతుండగా పట్టుకున్నారు .

దాని విలువ ఇండియన్ కరెన్సీలో షుమారు 72 వేలు . ఈ మొత్తం ఒక్క రోజులో అతడు చేసిన దొంగతనం విలువ . అలా సంవత్సరాల తరబడి పరకామణి లో అతడు చేసిన దొంగతనాలకు లెక్కలేదు .

అయితే చోరీ చేసి దొరికిపోయిన రవి కుమార్ ను కేసునుంచి బయటపడేసేందుకు కొన్ని ఆస్తులను తమపేరు మీద రాయించుకుని ఒక పార్టీకి చెందిన నేతలు పైరవీలు చేశారనే ఆరోపణలు రావడంతో విషయం రాజకీయం అయిపొయింది .

కేసులోనుంచి అతడు బయటపడేందుకు వీలుగా లోక్ అదాలత్ లో రాజీ చేయించారు .
ఈ విషయం తెలిసి టిటిడి బోర్డు మెంబర్ హైకోర్టుని ఆశ్రయించడంతో కేసు సీఐడీకి బదలాయించారు.

పరకామణి లో జరిగింది చిల్లర దొంగతనం కాదు కాబట్టే పెద్ద తలకాయలు సైతం ఈ కేసు విషయంలో రంగంలోకి దిగాయి . ఇది ఎంతవరకు పోయిందంటే కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని హత్య చేసేంత వరకు .

అందుకే హైకోర్టు కూడా దొంగతనం కేసులో రాజీ చేసుకుని కేసు క్లోజ్ చేస్తామంటే ఎలా కుదురుతుంది ? అందుకే దీనిపై పూర్తి విచారణ జరగాల్సిందే అని ఉత్తర్వులు ఇచ్చింది .

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరకామణిలో రవి కుమార్ చోరీ చేసిన సొత్తు మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు . పరకామణిలో భక్తుల కానుకలకు భద్రత అలా ఉంది .

లేటెస్టుగా స్వామివారి ప్రసాదంలో వాడే జీడిపప్పు కుంభకోణం కూడా బయటికి వచ్చింది . తప్పుడు పత్రాలతో టిటిడికి జీడిపప్పు సరఫరా చేస్తున్న చెన్నైకి చెందిన రెండు సంస్థలను ఈ మధ్యే బ్లాక్ లిస్టులో పెట్టారు .

చూసారుగా చిట్టా

తిరుమలలో పరిస్థితులను సరిదిద్దకుండా ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కుంభకోణం జరగని రోజు మీడియాకి వార్త అవుతుంది . ఇప్పటికే రాజకీయ పార్టీలు టీటీడీని తమ అవసరాలకు వాడుకుంటున్న సంగతులు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి .

అధికారులకు , రాజకీయ నాయకులకు మధ్య సయోధ్య లేకపోవడం కూడా అనర్దాలకు మూలం. అన్నిటికన్నా ముఖ్యంగా టిటిడికి రాజకీయ నాయకులతో కూడిన నామినేటెడ్ పాలక మండళ్ల నియామకాలు నిలిపివేసి ధార్మిక సంస్థలకో , స్వచ్ఛంద సేవా సంస్థలకో , బాధ్యతలు అప్పచెబితే ఇంతకన్నా మంచి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి .

ఎందుకంటే రాజకీయ పార్టీలతో కూడిన నిరుద్యోగులకు టిటిడి బోర్డులో పునరావాసం కల్పించడం వల్ల తిరుమల పవిత్రత దెబ్బతినడమే కాదు ఇటువంటి అక్రమాలకు అవకాశాలు కూడా ఏర్పడతాయి .

ప్రభుత్వం , హిందూ సంఘాలు ఇప్పటికైనా అలోచించి టిటిడి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!