ఆకుపచ్చని సూరీడు అల్లూరి సీతారామరాజు
గెరిల్లా సాయుధ పోరాటంతో బ్రిటీషర్ల కు చుక్కలు చూపించాడు అల్లూరి
మన్యం ప్రాంతంలో మెరుపు దాడులు , పోలీస్ స్టేషన్ల పేల్చివేత , గిరిజనులతో కలిసి గెరిల్లా పోరాటం లాంటి యుద్ధ తంత్రాలతో బ్రిటిష్ పోలీసులకు వెన్నులో ఒణుకు తెప్పించాడు
రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజు తిరుగుబాటును అణిచివేయడం బ్రిటీషర్లకు సాధ్యం కావడం లేదు.
అల్లూరి యుద్ద విద్యలు, మెరుపుదాడులు, వ్యూహాలు వారికి ఏ మాత్రం కొరకుడు పడడం లేదు. కొన్నాళ్లకు బ్రిటీష్ అధికారులకు అల్లూరి పోరాట ఎత్తుగడలపై ఒక ఐడియా వచ్చింది. అల్లూరి సాయుధ పోరాటాన్ని అణచడానికి మలబార్ స్పెషల్ పోలీసులను దించారు బ్రిటిషర్లు.
కేరళలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగే సాయుధ దాడులను, తిరుగుబాట్లను అణచి వేయడానికి మలబార్ స్పెషల్ పోలీస్ అని ఓ టీమ్‌ను అప్పట్లో ఏర్పాటు చేశారు బ్రిటిషర్లు.
ఈ టీమ్ చాలా క్రూరమైంది, గెరిల్లా యుద్ద విద్యల్లో ఆరితేరింది.
గెరిల్లా యుద్ధంలో ప్రత్యేక అనుభవం ఉన్న మలబార్ స్పెషల్ టీమ్ అల్లూరిని కట్టడి చేయడంలో కొంత సక్సెస్ అయ్యింది కానీ వాళ్లకు కూడా అల్లూరి వార్ స్ట్రాటజీలు అర్థం కాలేదు . అఫ్టారాల్ ఓ ఫోటోగ్రాఫర్ కొడుకు, ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకుడికి అనూహ్యమైన, అపరిచితమైన యుద్ద విద్యలు ఎలా పట్టుబడ్డాయి? ప్రపంచంలో పలు దేశాల్లో యుద్దాలు చేసిన బిట్రీష్ సైనికులకు, గెరిల్లా పోరాటాలపై పట్టున్న మలబార్ స్పెషల్ పోలీసులకు కూడా అర్థంకాని సమర వ్యూహాలు అల్లూరికి ఎలా సొంతమయ్యాయి?
ఈ విషయంలో చరిత్ర మనకు ఎలాంటి గట్టి ఆధారాలను వదిలిపెట్టలేదు. కాని కొన్ని లింక్‌లున్నాయి.
ఏజెన్సీ ప్రాంతంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించడానికి ముందు అల్లూరి సీతారామరాజు దేశమంతా పర్యటించారు . ఆ పర్యటనలో బెంగాల్ కూడా ఉంది
బెంగాల్‌లో అనుశీలన సమితి అని ఓ సంస్థ ఉండేది. దాన్ని స్థాపించినవారు అరవింద్ ఘోష్.
బ్రిటీషర్లపై సాయుధ పోరాటం ఈ సంస్థ లక్ష్యం. అనుశీలన సమితి కార్యకలాపాలు చాలా గోప్యంగా ఉండేవి.
బ్రిటీషర్లకు ఏ మాత్రం అర్థమయ్యేవి కాదు, వారు ఒక సంస్థను ఎదుర్కొంటున్నారా, వంద సంస్థలను ఎదుర్కొంటున్నారో తెలిసేది కాదు.
ప్రపంచంలో పేరెన్నికగన్న ఓ ఎనిమిది యుద్ద పోరాట విద్యలను, గెరిల్లా పద్దతులను ఈ అనుశీలన సమితి అనుసరించేంది. ఈ సమితి సభ్యులు దేశవ్యాప్తంగా సమర యోధులను గుర్తించి, శిక్షణ ఇచ్చేవారు. వీరు అల్లూరిని కాంటాక్ట్ చేశారా లేదా అల్లూరి బెంగాల్‌లో ఉన్నప్పుడు వీరి కాంటాక్ట్‌లోకి వెళ్లారా అన్నది తెలిసే అవకాశం లేదు.
బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించి, కొనసాగిస్తున్న తరుణంలో అల్లూరికి ఓ విషయం అర్థమైంది. తన పోరాటానికి మైదాన ప్రాంత ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించారు.
మైదాన ప్రాంత ప్రజలను పోరాటంలో భాగస్వామ్యం చేయనంత వరకూ సాయుధ పోరాటం ఇక ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదని అల్లూరికి అర్థమైంది.
జనజీవన స్రవంతిలో కలిసిపోయి, మైదాన ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర సమర జ్వాలలను రగిలించాలని తలపోసిన అల్లూరికి బ్రిటీషర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. అల్లూరి సీతారామరాజును కాల్చి చంపింది.
బ్రిటీష్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్లలో ఓ విషయం ఉంటుంది. గడ్డిపోచతో కూడా బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించే శక్తి శ్రీ అరబిందోకి ఉందని రాసుంటుంది.
బ్రిటిష్ వలస పాలకులను తరిమి కొట్టడానికి సాయుధ పోరాటమే సరిఅయిన పద్దతి అని రెండు పదుల వయసులోనే వేల మంది గిరిజనులతో సైన్యాన్ని ఏర్పరచి బ్రిటిష్ పాలకుల గుండెల్లో బాణాలు దింపిన ఈ ఆకుపచ్చ సూరీడు ఉత్తర భారతంలో పుట్టుంటే భగత్ సింగ్ వలె, విదేశాల్లో పుట్టుంటే ఫిడేల్ కాస్ట్రో మాదిరి గొప్ప పోరాట యోధుడుగా కీర్తి గడించేవారు అనడంలో అతిశయోక్తి లేదు.
స్ఫూర్తిదాయక మహా యోధుడి జన్మదిన సందర్భంగా నమస్సులు.
నాగరాజు మున్నూరు