విగ్గు తీసి పక్కన బెడితే
ముఖాన అర మందాన కొట్టుకున్న మేకప్ చెరిపేస్తే
వీళ్లూ మనలాంటి మనుషులే కదా?
సినిమాలో హీరో ఒక్కడే వందమందిని ఒంటిచేత్తో ఫైటింగ్ చేసి నేల కూలుస్తాడు
అదే హారో రియల్ లైఫ్ లో కత్తి చూస్తే వంద మైళ్ళ దూరం పారిపోతాడు
గోడ మీద బల్లిని
పెరట్లో పిల్లి ని చూసినా భయపడే పిరికి మనస్తత్వం ఉన్నవాళ్లు కూడా ఉంటారు
హీరోలేమీ పైనుంచి దిగి రాలేదు ?
మనలోనే , మన మధ్యే తిరిగే అతి మాములు మనుషులే
తెర మీద మనకు కనిపించేవన్నీ అబద్దాలే
దర్శకుడు సృష్టించిన కట్టు కధలే
మరి హీరోలంటే ఎందుకంత క్రేజు ?
సినిమాల్లో హీరో పాత్రని బట్టి రియల్ లైఫ్ లో అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం యెంత అమాయకత్వం ?
సినిమాలో హీరో పాత్ర మందు , సిగరెట్టూ ముట్టదు కాబట్టి నిజ జీవితంలో కూడా తమ హీరో అటువంటి వాడే అనుకోవడం ఎంత అజ్ఞానం ?
హీరో చేతిని తాకితే చాలు
హీరోతో సెల్ఫీ దిగితే చాలు
తమ జన్మ ధన్యమైపోతుందని భావించేవారిది ఎంత గుడ్డి నమ్మకం ?
అసలు ఎవరీ హీరోలు ?
దైవాంశ సంభూతులా ?
నీ కష్టాలు తీర్చడానికి భగవంతుడు పంపిన దూతలా ?
అభిమానపు వెర్రి వేయి తలలు వేసినప్పుడు జరిగేది సంబరాలు కాదు
మిగిలేది విషాద సందర్భాలు
సినిమాల్లో నటించి పేరు , ప్రతిష్టలతో పాటు బోలెడు ఆస్తిపాస్తులు సంపాదించుకున్న హీరోలకు ప్రజాసేవ చెయ్యాలని బుధ్హి పుట్టడం ఒక మాయ రోగం
ఆశర్యకరంగా ఈ రోగానికి బలయ్యేది మాత్రం మూఢ అభిమానులే
తమిళనాడులో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు
ఎంజీఆర్ , కరుణానిధి , జయలలితల శకం నుంచే ఉంది
తమ జాతకాలు కూడా పరీక్షించుకుందామని విజయ్ కాంత్ , కమల హాసన్లు కూడా రాజకీయ పార్టీలు పెట్టారు
రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించారు కానీ ఆరోగ్య కారణాల రీత్యా విరమించుకున్నారు
సినిమాల్లో నటించిన స్టాలిన్ కొడుకు ఇప్పుడు పాలక పక్షము మంత్రి
లేటెస్టుగా తమిళ నటుడు విజయ్ టీవీకే పేరుతొ పార్టీ పెట్టి తమిళనాడు ఎన్నికల బరిలోకి దూకడానికి సిద్ధం అవుతున్నారు
ఈయన పార్టీ పెట్టి రోడ్ షో చేస్తే జనం .. జనం .. ప్రభంజనం
ఈ జన ప్రభంజనం విజయ్ కే కాదు
ఆల్మోస్ట్ ఎన్నికల బరిలోకి దిగిన నటులందరికీ ఉంది
ఈ జన ప్రభంజనం యెంత వరకు ఓట్లుగా మారతాయో ఫలితాలు వస్తే కానీ తెలీదు
ఎందుకంటె ఏపీలో మొదటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ సభలకు కూడా జనం పోటెత్తేవారు
కానీ ఆఖరికి ఫలితాల్లో ఆయన స్థానంలో కూడా ఓడిపోయారు
కాబట్టి సినీ నటుడికి వచ్చే జనం బట్టి అతడి ఛరిష్మా అంచనా వేయడానికి వీలు లేదు
సినీ నటుడి మీద వెర్రి అభిమానం వేరు
రాజకీయాల్లో అంచనాలు వేరు
సరే
ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి తమిళనాడులో తిరుగుతున్నాడు కదా
అలాగే కరూర్ లో బహిరంగ సభకు పోలీసులనుంచి అనుమతి తీసుకున్నాడు
పోలీసులు సభ స్థలం కెపాసిటీ బట్టి పది వేల మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు
కానీ విజయ్ ను చూడటం కోసం వెర్రి అభిమానులు తోసుకు తోసుకు రావడంతో అది కాస్తా 27 వేలకు చేరుకుంది
దాంతో తొక్కిసలాట జరిగి షుమారు 40 మంది అక్కడే మరణించారు
వీరిలో చిన్నారులు 15 మంది ఉన్నారు
ఇంకో వంద మంది దాకా ఐసీయూ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు
ప్రమాదం జరిగిన వెంటనే హీరోగారు విమానంలో చెన్నై వెళ్ళిపోయాడు
ఇంటికి పోయి చనిపోయిన ప్రాణాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఖరీదు కట్టేసాడు
పనిలో పనిగా ఇది తమిళనాడు ప్రభుత్వ వైఫల్యమే అని ఫక్తు రాజకీయ నాయకుడి డైలాగ్ వేసి హాయిగా ఏసీ వేసుకుని పడుకున్నాడు
ప్రభుత్వం మాత్రం ఊరుకుంటుందా ?
ఇదంతా హీరో గారి తప్పే ? మేము విచారణ చేసి శిక్షిస్తాం అనో ప్రకటన పారేసింది
ఇదంతా రాజకీయాలు
ఎవరికీ తెలియనివి కాదు
కానీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత ఏ హీరో తీసుకుంటాడు ?
సినిమాలో అయితే హీరో ఒక పాట పాడితే చనిపోయిన వాళ్ళందరూ లేచి కూర్చుంటారు
కానీ ఇది సినిమా కాదే ?
నిజ జీవితం
ఆ హీరో కూడా మనలాంటి మాములు మనిషే
ఎలాంటి మంత్ర దండాలు లేవు
కాకపోతే సినిమాల్లో మనం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక్కో ప్రాణానికి 20 లక్షలు ఖరీదు కట్టి ఇవ్వగలడు
అంతకన్నా ఏం చేయగలడు ?
అభిమానుల వెర్రి అభిమానాన్ని తన పెట్టుబడిగా మలుచుకుని కోట్ల లాభం ఆర్జించే వ్యాపారాల్లో ఇదో రకం వ్యాపారం అని అభిమానులు ఎప్పుడు తెలుసుకుంటారు ?
హీరోలు పైనుంచి ఊడిపడిన దైవాంశ సంభూతులు అని భావించి కొలిచే వెర్రి అభిమానులు ఉన్నంతవరకు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి !
