Home » ఎన్కౌంటర్ పింగళి దశరధ రామ్ ప్రాణాలు కాపాడటానికి గాల్లో కాల్పులు జరిపిన మరో జర్నలిస్ట్ – పార్ట్ 2

ఎన్కౌంటర్ పింగళి దశరధ రామ్ ప్రాణాలు కాపాడటానికి గాల్లో కాల్పులు జరిపిన మరో జర్నలిస్ట్ – పార్ట్ 2

Spread the love

నిన్న 28-09-2025 న మొదటి భాగంలో పింగళి దశరధ రామ్ తెనాలి అటాక్ నుంచి ఎలా బయటపడ్డాడో కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ అటువంటి ఇంకో ఉదంతం గురించి చెప్పారు .

ఇప్పుడు రెండో భాగం గురించి చెప్పుకుందాం ..అది ఆయన మాటల్లోనే ,

తెనాలి అటాక్ నుంచి తప్పించుకున్న తర్వాత నాలో భయం పెరిగిపోయింది..అనవసరంగా లైఫ్ రిస్క్ తీసుకుంటున్నామా ? అనిపించింది . జర్నలిజం మీద నాకు కూడా ప్యాషన్ ఉంది . సమాజంలో జరుగుతున్న చీకటి భాగోతాలను కలం ద్వారా వెలుగులోకి తేవాలనే తపన ఉంది . మరోపక్క మా మీద ఆధారపడిన కుటుంబాలు గుర్తుకొచ్చాయి . ఇద్దరికీ ఆర్థిక బలం లేదు .ఏదో ఈ మ్యాగజైన్ సర్క్యులేషన్ పెరిగితే కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు జర్నలిజం పవర్ ఏంటో అవినీతిపరులకు తెలియచేసే యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అవ్వొచ్చు అనుకున్నా . కానీ పోయి పోయి బలవంతులతో పెట్టుకుంటున్నాం . వాళ్ళని ఎదుర్కోగలిగే ఆర్థిక , అంగబలాలు రెండూ లేవు .

అదే విషయం దశరథ రామ్ తో చెప్పా

అతడు చిన్నగా నవ్వి ” ఏమున్నా లేకపోయినా మన చేతిలో పెన్ను ఉంది కదా ? అది చాలదూ ? ఇక చావు గురించి అంటావా ? ఇప్పుడో , అప్పుడో ,ఎప్పుడో తప్పదు కదా ” అని సీరియస్ గా తీసుకోలేదు .

ఇది జరిగిన రెండ్రోజులకు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దశరధ రామ్ ఇంటికి కొంతమంది వచ్చారు . ఆ టైం లో నేను , దశరధ రామ్ ఇంట్లోనే ఏదో ఆర్టికల్ రాసుకుంటున్నాం .

కిటికీలోనుంచి దశరధ్ చూసి ” ఆ సన్నాసులు ఇక్కడికి కూడా వచ్చినట్టున్నారు .. విషయమేంటో కనుక్కో ” అన్నాడు .

నేను గేటు తీసుకుని బయటికి వాళ్ళ దగ్గరికి వెళ్లి ” ఎవరు కావాలి ?” అనడిగా .

“రామన్న ?” అన్నాడు వాళ్లలో ఒకడు .

ధైర్యం చేసి “నేనే .. విషయమేంటో చెప్పండి ? అన్నా .

చివరికి వాళ్ళు ఎన్కౌంటర్ మ్యాగజైన్ ఏజెన్సీ తీసుకోవడం గురించి కైకలూరు నుంచి వచ్చారని తెలిసి ఊపిరి పీల్చుకున్నా.. అప్పట్లో మా పరిస్థితి అలా ఉండేది . దినదిన గండం మాదిరి ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి మీద పడుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పనిచేసేవాళ్ళం . మమ్మల్ని కలవటానికి వచ్చేవాళ్లలో ,ఎవరు మిత్రులో ? ఎవరు శత్రువులో తెలీదు .. అని తన అనుభవాల గురించి ఆ జర్నలిస్ట్ చెప్పారు .

ఆయన మాటలకూ అడ్డొస్తూ ,

” మరి ఆ తర్వాత మీకు బెదిరింపులు ఏమీ రాలేదా ?” అనడిగా .
” ఎందుకు రాలేదు ? చాలా జరిగాయి .. చెప్తా .. “అని చెప్పడం మొదలుపెట్టారు .

అప్పటినుంచి దశరధ రామ్ తన ఐడెంటిటీ బయటపెట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు . వార్తా సేకరణలో బయటి వ్యక్తులను కలిసినప్పుడు తన పేరు కుమార్ అనో , సునీల్ అనో చెప్పి పరిచయం చేసుకునేవాడు . పింగళి దశరధ రామ్ మా ఎడిటర్ అని ఆయనే తనపేరు బయటపెట్టకుండా చెప్పేవాడు . పనిమీద సెక్రటేరియట్ వంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా తన అసలు పేరు బయటపెట్టకుండా వేరే ఐడితో వెళ్ళేవాడు . అలా సాధ్యమైనంత వరకు తన ఐడెంటిటీ బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు .

ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఆర్టికల్ మాత్రం దశరధ రామే స్వయంగా రాసేవాడు. అయితే తనేం రాసింది మూడో కంటికి కూడా తెలీదు .. ఆఖరికి నాక్కూడా చూపించేవాడు కాదు . ఎందుకంటే ఎన్కౌంటర్ మ్యాగజైన్ లో కవర్ పేజీ ఆర్థికలే బాగా పేలేది . అందుకనే ఆ ఐటెం లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు .

గవర్నర్ పేటలో చందన బ్రదర్స్ పక్కనే సన్నటి సందులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది .అది కూడా దశరథ రామ్ సొంత ప్రెస్ కాదు . అరువు పద్దతిలో మ్యాగజైన్ అక్కడ ప్రింట్ అయ్యేది. మాములుగా ఇంగ్లీషులో వచ్చిన ఆర్టికల్స్ కొన్ని తెలుగులో ట్రాన్స్ లేట్ చేసి నేను కధనాలు రాసేవాడిని . వాటిల్ని అయినంతవరకు ప్రింటింగ్ ప్రెస్ లో నన్నే ఇచ్చేయమనేవాడు . దశరథ రామ్ ఇవ్వాల్సిన ఆర్టికల్స్ కోసం ముందుగానే కొంత స్పేస్ ఉంచుకునేవారు .

అన్ని పేజీలు ప్రింట్ అయిన తర్వాత ఆఖర్లో తను రాసిన ఆర్టికల్స్ స్వయంగా తానే వెళ్లి ప్రెస్సులో ఇచ్చేవాడు దశరథ రామ్ . దానితో బుక్ బయటికి వస్తే కానీ ఆయన ఏం రాశాడో ? ఎవరి మీద రాశాడో ? ఎవరికీ తెలిసేది కాదు .

ఇదిలా ఉండగా ఓ రోజు సాయంత్రం ఆర్టికల్స్ రాయడం అయిపోయిన తర్వాత దశరధ రామ్ నన్ను పిలిచి ” రాత్రి రెండు గంటలకు మనం రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి .. బండేసుకుని రా అన్నా ” అన్నాడు .

సాధారణంగా దశరధ రామ్ బయటికి వెళ్లాలంటే ఆయన ఉంటున్న వీధిలోనే ఉండే ముసలాయన రిక్షాలోనే వెళ్తాడు . బండి కావలసినప్పుడు మాత్రం నన్ను అడుగుతాడు .

సరే అని రాత్రి రెండు గంటలకు బండి మీద రామ్ ను ఎక్కించుకుని రైల్వే స్టేషన్ కు వెళ్ళా. లోపలికెళ్లిన తర్వాత ప్లాట్ ఫార్మ్ ఆ చివర ఓ మూల వెలుతురు లేని చోట బెంచీలో కూర్చోబెట్టాడు . ముందు నాకు అర్ధం కాలేదు .ట్రైన్ లో ఎవరినన్నా రిసీవ్ చేసుకోవాలంటే కోచ్ లు ఆగే చోట ఉండాలి కదా ? ఇలా మూల చీకట్లో కూర్చుంటే ఎవడన్నా పొడిచి పారిపోయినా దిక్కూ దివాణం ఉండదు.. తెనాలి సంఘటన తర్వాత నాలో భయం ఎక్కువైంది .. ఎంత జర్నలిస్టునైనా నేనూ మనిషినే కదా అనుకుంటూ ,

” ట్రైన్ వస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు .. ఏ కోచో చెప్తే అక్కడికే వెళదాం ” అన్నా.
” వద్దు .. మనం కలవాల్సిన మనిషి ఇక్కడికే వస్తాడు ” అని సైలెంటుగా కూర్చుండిపోయాడు .

చూస్తుండగానే ట్రైన్ ప్లాట్ ఫార్మ్ మీదకు వచ్చింది . చూస్తే కొద్ది దూరంలో తెల్లటి లాల్చీ , పైజామా వేసుకున్న వ్యక్తి మావైపే వస్తున్నాడు . ఆయన రావడం రావడంతోనే ” డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి చూసుకో ” అంటూ ఏవో కొన్ని కాగితాలూ , ఫోటోలు దశరధ రామ్ చేతిలో పెట్టి వడివడిగా వెళ్ళిపోయాడు .

అంతా క్షణాల్లో జరిగిపోయింది . అంతకన్నా పెద్దగా మాటల్లేవు . చీకట్లో లీలగా ఆయన ముఖం చూసి ఉలిక్కిపడ్డా . ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో పని చేసి ఆ మధ్యనే క్యాబినెట్ నుంచి తొలగించబడ్డ మాజీ మంత్రి . దశరథ రామ్ నెట్ వర్క్ తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది . ఏదో విజయవాడలో ఒక చిన్న ఇంట్లో ,చిన్న గదిలో అతడేవో ఆర్టికల్స్ రాస్తున్నాడు అనుకున్నా కానీ , ఆ ఆర్టికల్స్ రాసేముందు తనదగ్గర బలమైన సోర్స్ పెట్టుకుని మరీ రాస్తాడని అప్పుడు నాకు అర్థమైంది . కేవలం ఒకే ఒక్కడు ఇంత చిన్నవయసులో అంతపెద్ద నెట్ వర్క్ ఎలా సాధించగలిగాడు ?

దశరధ రామ్ నిశ్శబ్దంగా ఆ కాగితాలు జేబులో పెట్టుకుని వెళదామా ? అన్నాడు. అంతే , అంతకుమించి ఆ కాగితాలు ఏంటో , ఫోటోలు ఏంటో నాక్కూడా ఏమీ చెప్పలేదు . అటువంటి విషయాలు దశరథ రామ్ ఎంత కాంఫిడెన్షియల్గా ఉంచుతాడో తెలుసు కాబట్టి నేనూ అడగలేదు. కానీ ఆ కాగితాలు , ఫోటోలు త్వరలోనే రాష్ట్రంలో పెను సంచలనాలకు నాంది అవుతాయని అప్పటిదాకా నాక్కూడా తెలీదు .

ఫలితం

గండికోట ఆశ్రమంలో ఎన్టీఆర్ శవ పూజలు అనే బై లైన్ తో ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఆర్టికల్ వచ్చింది . ఈ మ్యాగజైన్ మార్కెట్లోకి రాగానే టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పటికే ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు . ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కవర్ పేజీ ఆర్టికల్ రాయాలంటే చాలా ధైర్యం ఉండాలి . జరగబోయే పరిణామాలకు ముందే సిద్దపడి ఉండాలి . ఆ ఆర్టికల్ పబ్లిష్ అయితే ఏం జరుగుతుందో తెలిసే దశరథ రామ్ అన్నిటికీ సిద్దపడి ఉన్నాడు . ఆ ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత అతడి ప్రాణాలు రిస్క్ లో పడ్డాయి . అప్పటికే అతడ్ని అంతమొందించేందుకు కిరాయి మూకలు రంగంలోకి దిగాయి . నాకు పరిస్థితి అర్ధం అయ్యింది .

ఆ మ్యాగజైన్ సంచిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత నేను రామ్ తో చెప్పా . “పోనీ కొన్నాళ్ళు పోలీసుల ఎస్కార్ట్ అడుగుదామా ? ” అని
“ప్రభుత్వమే వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఈ పోలీసులు మాత్రం ఏం చేస్తారు .. వదిలేయన్నా ? ” అన్నాడు
మళ్ళీ అతడే “నీకంతగా రిస్క్ అనుకుంటే హాయిగా మాములు న్యూస్ పేపర్లో చేరిపోయి హాయిహా టైం కు శాలరీ తీసుకో ? ” అన్నాడు

దశరధ రామ్ లో నాకు నచ్చిన గుణం ఇదే . మంచో చెడో నమ్మిన ఆశయాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్కచేయకుండా ఆచరిస్తాడు . నిజానికి నాకు జీతం ఇచ్చే పరిస్థితి కూడా దశరధ రామ్ కు లేదు . అయినా దశరధ రామ్ లోని కాన్ఫిడెన్స్ , వృత్తిపట్ల అంకిత భావం , ఐడియాలజీ నచ్చి అతడి ఆఫీసులో పనిచేసేవాడిని .

ఎప్పుడైనా ఏజెంట్ల నుంచి కలెక్షన్స్ వస్తే “ఇదిగో ఈ డబ్బులు ఉంచు ” అని తనే నా చేతిలో ఎంతో కొంత పెట్టేవాడు . ఆ తర్వాత నేను వేరే పేపర్ కి మారాను . కానీ దశరధ రామ్ తో టచ్ లోనే ఉన్నాను .

ఓ రోజు దశరధ రామ్ నన్ను పిలిపించి ” మహానాడు జరుగుతుంది కదా .. వస్తావా ? సీఎం ను కలిసి ఇంటర్వ్యూ అడుగుదాం ” అన్నాడు .
నాకు మతిపోయింది .

“తెలిసే మాట్లాడుతున్నావా ? సీఎం ను కలవడం సంగతి అటుంచు ? నిన్నెవరన్నా గుర్తుపడితే దారిలోనే వేసేస్తారు .. వెళ్లొద్దు ” అని హెచ్చరికగా చెప్పాను .
సర్లే అని నన్ను పంపించేశాడు .

ఆ తర్వాత తెలిసింది . దశరధ రామ్ కెమెరా పట్టుకుని సీఎం ఎన్టీఆర్ బస చేసిన సిద్దార్థ కాలేజీ కుటీరానికి ఒక్కడే బయలుదేరి వెళ్లాడని . కుటీరం దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసుకుంటుండగా స్థానిక టిడిపి నాయకుడు దశరధ రామ్ ను గుర్తుపట్టి ” ఎన్కౌంటర్ దశరధ రామ్ వీడే .. వేసేయండ్రా ” అనడంతో కొంతమంది అనుచరులు పొలోమంటూ దశరధ రామ్ ను పట్టుకోవడానికి ముందుకురికారు.

ఈ హడావుడి చూసి మిగిలిన జనం కూడా దశరధ రామ్ ను పట్టుకోవడానికి ముందుకురికారు. అప్పుడు ఎన్టీఆర్ మీటింగ్ ప్రెస్ కవరేజ్ కి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర రావు గారు పరిస్థితి గమనించారు . దశరథ రామ్ కనుక వాళ్ళ చేతికి చిక్కితే బాడీ కూడా దొరకదు . తర్వాతసంగతి తర్వాత ముందు అతడ్ని కాపాడాలి . వెంటనే తనదగ్గరున్న లైసెన్సుడు రివాల్వర్ తో ఆయన గాల్లోకి కాల్పులు జరపడంతో జనాలు చెల్లా చెదురు అయ్యారు . ఈ గ్యాప్ లో కొంతమంది పాత్రికేయులు దశరధ రామ్ ను అక్కడ్నుంచి క్షేమంగా తప్పించారు . అలా దశరధ రామ్ కు రెండో ప్రాణ గండం కూడా తప్పింది అని ఆ జర్నలిస్ట్ చెప్పారు .

ఇంకా ఉంది
అవన్నీ తరువాయి భాగంలో ,

నోట్ : ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఫేస్ బుక్ , వాట్సాప్ ఐకాన్ ల ద్వారా షేర్ చేసుకోవచ్చు .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!