Home » ‘చీకటిలో’శోభిత ధూళిపాళ్ల – మూవీ రివ్యూ

‘చీకటిలో’శోభిత ధూళిపాళ్ల – మూవీ రివ్యూ

Spread the love

ఇదేంటి మూవీపేరు ‘చీకటిలో’ అయితే పక్కన శోభిత ధూళిపాళ్ల అని రాసానేమిటా అని ఆశ్చర్యపోతున్నారా ?

ఎస్ .. దానికో కారణం ఉంది

టైటిల్ చూడగానే సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమైపోతుంది

ఇలాంటి సినిమాని కథానాయిక ఓరియెంటెడ్ గా నడిపించాలంటే అందుకు తగిన హీరోయిన్ ను ఎంచుకోవడం ముఖ్యం

ఈ విషయంలో శోభితని ఎంచుకున్న దర్శకుడి ఛాయిస్ సరైనదే

అలా అని ఈమె ఓ వందో ,రెండొందలో సినిమాల్లో నటించిన సీనియర్ నటి కాదు

గతంలో ఈమె గూఢచారి , మేజర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది

అక్కినేని నాగచైతన్యని పెళ్లిచేసుకున్న తర్వాత శోభిత వార్తల్లోని వ్యక్తి అవుతున్నారు

ఈ మధ్య కాలంలో ఆవిడ సినిమాల అప్డేట్స్ కన్నా వీరిద్దరి ట్రిప్పుల గురించే సోషల్ మీడియాలో ఎక్కువ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి

అందుకే ఈ ‘చీకటిలో’ సినిమా ఎప్పుడు మొదలెట్టారో , ఎప్పుడు పూర్తి చేసారో పెద్దగా బయటికి ప్రచారం కాలేదు

ఓ నాలుగైదు రోజుల క్రితం చూస్తే శోభిత ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో’ మూవీ ఈనెల 23 నుంచి డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని ఓటిటీ నిర్వాహకులు అనౌన్స్ చేసారు

సమాంతరంగా చిత్ర నిర్మాణ సంస్థ కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ వర్క్ చేసింది
సురేష్ బాబు నిర్మాణ సంస్థ నుంచి ఈ సినిమా బయటికి వస్తుండటంతో సహజంగానే కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి

రెండోది ఈ పాత్రకు ధూళిపాళ్లను కాకుండా మరో కొత్త నటిని తీసుకున్నా సినిమాకి అంత బజ్ వచ్చేది కాదు

కథ క్రైమ్ జానర్లో రాసుకోవడం , కథానాయిక శోభిత కావడంతో ఆ జానర్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఓ లుక్కేసారు

ఇప్పుడు ‘చీకటిలో’ ఏం జరిగిందో తెలుసుకుందాం ( కథ )

ఇలాంటి సినిమాలకు కథ గురించి చెప్పడం కూడా కొద్దిగా ఇబ్బందే

లేటెస్టుగా దర్శకులు ఎప్పుడో జరిగిన , ఎక్కడో దొరికిన చిన్న క్రైమ్ వార్త ఆధారంగా కూడా కథ అల్లేసుకుని తెరకెక్కించేస్తున్నారు

ఇది కూడా అంతే

అయినా సరే ఇప్పుడు కథను టూకీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను .

నెల్లూరి సంధ్య (శోభిత ధూళిపాళ్ల ) ఓ న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ అన్నమాట

నేరాలు – ఘోరాలు అనో , అలర్ట్ అనో , క్రైమ్ స్టోరీ అనో , ఏదో ఒక పేరుతో ఇప్పటికీ మన న్యూస్ ఛానల్స్ క్రైమ్ వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాయి

నెల్లూరి సంధ్యది కూడా అలాంటి ఉద్యోగమే

అయితే టీఆర్ఫీల కోసం యాజమాన్యాలు రూల్స్ ను బ్రేక్ చేసి క్రైమ్ కి వల్గారిటీ మిక్స్ చేసి కధనాలు అల్లడం దాదాపు అన్ని ఛానల్స్ లో జరిగే సాధారణ ప్రక్రియే

అలాంటి కథనాలను చదవడం ఇష్టం లేని సంధ్య ఉద్యోగం మానేస్తుంది

తన స్నేహితురాలు , సహచర ఉద్యోగిని బాబీతో (అదితి) కలిసి సొంతంగా పాడ్ కాస్ట్ ఛానల్ పెడుతుంది

ఎంతలేదన్నా ఆమె కధానాయిక కాబట్టి ఓ కథానాయకుడు అమర్ ( విశ్వదేవ్ రాచకొండ ) తో ప్రేమలో పడుతుంది

సరిగ్గా ఈ సమయంలో బాబీని ఎవరో అత్యాచారం చేసి హత్య చేస్తారు
బాబీని హత్య చేసిన హంతకుడ్ని పోలీసులు కనిపెట్టి అరెస్ట్ చేస్తారు

హత్య జరిగింది
హంతకుడు దొరికాడు
కథ అయిపొయింది అనుకుంటున్నారా ?

ఇక్కడే దర్శకుడు ఓ ట్విస్ట్ వదిలాడు

అసలు హంతకుడు అతడు కాదు నేనేనని , దమ్ముంటే తనని పట్టుకోమని ఓ అపరిచిత వ్యక్తి నెల్లూరి సంధ్యకు ఫోన్ చేసి సవాల్ విసరడంతో కథ మొదలౌతుంది

ఇంకేముంది

నెల్లూరి సంధ్య పోలీస్ అధికారి రాజీవ్ తో ( చైతన్య ) కలిసి అసలు హంతకుడి కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది

ఇంతకన్నా చెప్తే సినిమా మీద క్యూరియాసిటీ పోతుంది

పోలీసులతో కలిసి సంధ్య చేసిన ఇన్వెస్టిగేషన్ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ?

బాబీ హత్య తర్వాత అదే తరహా హత్యలు జరగడంతో సీరియల్ కిల్లర్ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో చేసే దర్యాప్తులో కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయా ?

ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన హత్యలకు దీనికీ ఏమన్నా సంబంధం ఉందా ?

అసలు హంతకుడు ఎవరు ? హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? అనేవి మిగిలిన కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

ఏక వాక్యంలో చెప్పాలంటే మూవీ అనుకున్నంత కిక్కేమీ ఇవ్వలేదు

మళయాళ క్రైమ్ సినిమాల మాదిరే ఈ మూవీ కూడా నెమ్మదిగా సాగుతుంది

సమస్య అదికాదు

మళయాళ మూవీలు నెమ్మదిగా సాగినా కధనంలో ఒక్కో ట్విస్ట్ పేర్చుకుంటూ వెళ్లి క్లైమాక్సులో ఒక్క జర్క్ ఇచ్చి ఔరా అనిపిస్తారు

కధనంలో ఊహించని ట్విస్టులు ఉండాలి
తర్వాత ఏం జరగబోతుంది ? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలగాలి
ప్రతి సన్నివేశం గ్రిప్పింగ్ గా ఉండాలి

అంతేకానీ గ్యాప్ ఫిల్లింగ్ మాదిరి కొన్ని సన్నివేశాలను అతికిస్తే కధనం దెబ్బతింటుంది

ముగింపులో హంతకుడెవరో రివీల్ చేయడం మినహా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో గ్రిప్పింగ్ ఏదీ?

బాబీ హత్య జరిగేవరకు రొటీన్ ఫార్ములా ప్రకారమే సినిమా నడిచిందే కానీ ఇంట్రెస్టింగ్ అనిపించే కధనం ఏదీ ?

అసలు ఈ హత్య కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా ? నెల్లూరి సంధ్య చేస్తుందా ? అనే అనుమానాలు అక్కడక్కడా మనకు వస్తాయి

మూవీ పోస్టర్లో శోభితను హైలెట్ చేసినప్పుడే అనుకోవాలి ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని

మాములుగా శోభితకు కూడా కర్తవ్యమ్ విజయశాంతి మాదిరి పోలీస్ పాత్ర ఇచ్చి ఉంటే రొటీన్ సినిమా అయిపోతుందనే ఉద్దేశ్యంతో బహుశా దర్శకులవారు టీవీ యాంకర్ యాంగిల్లో ఆమెను పరిచయం చేసినట్టున్నారు

అదీ ఒకందుకు మంచిదైంది

ఆమెను కూడా పోలీసుల్లో కలపకుండా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కోటాలో పరిశోధన ప్రారంభించడంతో కొత్త పాయింట్ చూస్తున్నట్టు ఉంది

దానికి తోడు పాత్రకు శోభిత కరెక్టుగా సెట్ అవడం ప్లస్ పాయింట్ అయ్యింది

సరే మరీ బొత్తిగా ఆ పోలీస్ రాజీవ్ , జర్నలిస్ట్ సంధ్యలే ఇన్వెస్టిగేషన్ చేస్తే అంత బాగోదు అనుకున్నారేమో ఇంకో ఆఫీసర్ ఆనందిని ( ఇషా చావ్లా ) ను కూడా రంగంలోకి దించారు

ఇన్వెస్టిగేషన్లో కొత్త ట్విస్టులు ఉండాలి కానీ కొత్త క్యారక్టర్ ను దింపితే ఫలితం ఏముంటుంది?

పోనీ ఈ స్పెషలాఫీసర్ రావడం వల్ల కధకు ఏమైనా ప్లస్ ఉందా ? అంటే అదీ లేదు

ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన హత్యలకు , ఈ హత్యలకు ముడిపెట్టి సాగించిన పరిశోధన కొద్దిగా క్యూరియాసిటీ కలిగిస్తుంది

ఏతావాతా మనకు కావాల్సింది ఆ హంతకుడు ఎవరో తెలవడం
క్లైమాక్సులో రివీల్ అయ్యే ఆ ఒక్క అంశమే మనకు కొద్దోగొప్పో థ్రిల్ కలిగిస్తుంది

ఓవరాల్ గా దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఎండింగ్ పాయింట్ ఆధారంగా స్టోరీ బిగిన్ చేసుకున్నట్టు ఉంది

పోనీ ఆ పాయింట్ ఆధారంగా( రచయిత) కథ రాసుకున్నప్పుడు సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్ గా ఉండేలా రూపుదిద్దటంలో దర్శకుడు తడబడ్డాడు

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాకి శోభిత ధూళిపాళ్ల మెయిన్ అస్సెట్

అపరాధపరిశోధనకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్ తో , హావభావాలతో , డైలాగ్ డెలివరీతో పాత్రకు న్యాయం చేసింది

ఆమె స్థానంలో వేరొకరైతే ఫలితాలు ఈమాత్రం కూడా ఉండేవి కాదేమో అనిపిస్తుంది

మిగిలినవాళ్లలో వడ్లమాని శ్రీనివాస్ నటన బాగుంది

ఇషాచావ్లా , చైతన్య , విశ్వనాథ్ రాచకొండ , రవీంద్ర విజయ్ , సురేష్ ల నటన బాగానే ఉంది

సాంకేతికత :

క్రైమ్ సినిమాలకు బీజీఎమ్ తో చాలాపని ఉంటుంది
ఒక్కోసారి ఒక డైలాగ్ కూడా భయపెట్టలేనిది , ఒక శబ్దం పెడుతుంది

ఆ పరంగా శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బాగానే ఉంది

సన్నివేశాలకు తగ్గట్టుగా విజువల్స్ చూపించడంలో సినిమాటోగ్రాఫర్ కొద్దిగా తడబడినట్టు కనిపిస్తుంది

డార్క్ మోడ్ లో ఒక్కోసారి కలర్స్ చేంజ్ అవుతుండటంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది

ఇక దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి విషయానికి వస్తే స్క్రీన్ ప్లే విషయంలో ఆయన ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉంటే బాగుండేది

కధనంలో ప్రేక్షకుడు ఆశించిన స్థాయిలో పట్టు లేకపోవడం మైనస్

కాకపోతే క్రైమ్ కధలో భాగంగా ముగింపులో విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆయన ఇచ్చిన సందేశం మహిళలకు కొంచెం కన్విన్సింగ్ గా ఉంటుంది

విశ్లేషణ : ఇటువంటి సినిమాలు చూడాలంటే క్రైమ్ జానర్ మీద మనకు ఇంట్రెస్ట్ ఉండాలి . హత్యలు జరగడం , హంతకుడు దొరక్కపోవడం , ఇన్వెస్టిగేషన్ నడవటం , ట్విస్టులు ఉండటం , ఫైనల్లీ హంతకులు దొరకడం క్రైమ్ థ్రిల్లర్ మూవీల్లో ఉండే ప్రధాన ముడి సరుకులే. అయితే ఒక్కో దర్శకుడు ఒక్కో రకంగా సీన్స్ ని ఎలివేట్ చేస్తాడు . అది ఎంతవరకు సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగాడు అన్నదానిమీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది . ఈ మూవీని బాగుంది అనీ చెప్పలేం , అస్సలు బాగాలేదు అనీ చెప్పలేం . కానీ మొత్తానికి చూస్తే మూవీలో ఏదో మిస్సైయినట్టు మాత్రం ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లోనే ఓటిటీ లో కాబట్టి ఫ్రీ టైంలో ఓ లుక్కేయవచ్చు

నటీనటులు : శోభిత ధూళిపాళ్ల , విశ్వదేవ్ రాచకొండ , ఇషాచావ్లా , వడ్లమాని శ్రీనివాస్ తదితరులు
నిర్మాత : డి . సురేష్ బాబు
దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి
విడుదల : 23-1-2026 ( అమెజాన్ ప్రైమ్ )
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!